కరువు నివారణ చర్యలేవి? | No actions on drought for irrigation projects | Sakshi
Sakshi News home page

కరువు నివారణ చర్యలేవి?

Published Thu, May 5 2016 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

No actions on drought for irrigation projects

రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుండటం బాధాకరం. తాగునీరు, సాగునీరు లేక రైతులు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. పంటలు ఎండిపోతున్నాయి. తోటలు మాడిపోతున్నాయి. గడ్డిలేక పశువులను చౌక ధరలకు అమ్ముకుంటూ ఆ మూగజీవులను కబేళాలకు తరలించడం హృదయవిదారకం. ట్యాంకర్లతో నీటిని కొని బత్తాయి తోటకు నీరు పోస్తున్న రైతు దంపతుల వెతలు చూసి కళ్లు చెమర్చుతున్నాయి. రైతులు, రైతు కూలీలు వలసబాట పట్టడం దారుణం. కళ్లముందు ఇంత ఉత్పాతాలు జరుగు తున్నా మన పాలకులు ఏం చేస్తున్నారు? కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడగలేరు. ఎందుకంటే అక్కడ మిత్రపక్షం గనుక. తెలంగాణ పాలకులు మన నీటిని ఎగువనే దోచేస్తుంటే తేలుకుట్టిన దొంగల్లా కిమ్మనకుండా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఓటుకు కోట్లు కేసును తిరగతోడి గుక్క తిప్పుకోనీయరే మోనని భయం కారణం కావచ్చు.
 
 ఎంతసేపూ ఇంకుడు గుంతలు తవ్వుకోండి అనటం తప్ప ఇంతగా ఎండలు మండి పోతుంటే, చెరువులు, కాల్వలు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నట్లు? కేంద్రంతో మాట్లాడి అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి రైల్వే ట్యాంకర్లతో విధిగా నీటిని కరువు ప్రాంతాలకు సరఫరా చేయించాలి. రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల నుంచి నీటిని కరువు ప్రాంతాలకు సరఫరా చేయించాలి. ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులు కట్టి మన నదీజలాల్ని దోచుకోకుండా అడ్డుకోవాలి. అప్పట్లో కర్నాటక ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచి మన నీటిని దోచు కుంటుంటే కృష్ణా ట్రిబ్యునల్ వరకు వెళ్లి పరిష్కార మార్గాలను వెతుక్కున్నాం కదా. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మహారాష్ట్రకు తన అను చరులతో వెళ్లి  బాబ్లీ వివాదంలో అరెస్టు అయ్యారు కూడా.
 
 మరి ఆ పోరాట పటిమ, స్ఫూర్తి ఇప్పుడే మయ్యాయి?  ఆనాడు వైఎస్సార్ తలపెట్టిన జలయజ్ఞాన్ని నేడు దారి మళ్లించారు. ఇంకా పోలవరాన్ని పూర్తి చేయలేక పోతున్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేసి రాయలసీమకు మళ్లించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చని ఆ మధ్య ఒక విద్యావేత్త రాశారు. రాజధాని ప్రాంతంలోని సస్యశ్యామలమైన, ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని నిర్జీవ భవనాల కోసం దుర్వినియోగపరిస్తే ఆ ప్రభావం రాష్ట్రాన్ని ఇంకా భ్రష్టు పట్టించకమానదు.
 
 చంద్రబాబు, కరువు కవలపిల్లలు అని జనంలో నమ్మకం ప్రబలుతోంది. ముంచు కొచ్చిన ప్రస్తుత కరువును చూస్తే ఇది నిజమనిపిస్తోంది కూడా. ఆయన పరిపా లనలో గతంలోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడూ అలాగే జరుగుతోంది. ఆయన ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక స్వభావం గురించి చెప్పనవసరం లేదు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత కేంద్రాన్ని నిలదీస్తుంటే తప్పనిసరై కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు తప్పితే ముఖ్యమంత్రి ఈ  అంశంపై ఏమాత్రం బాధ్యత తీసుకోవడానికి సిద్ధ పడక పోవడం దారుణం.
 - అచ్యుత, సామాజిక కార్యకర్త, కవి, కర్నూలు
 మొబైల్:  7675958696
 
 గొంతెండుతోంది
 దాహం దాహం కేకలు/ గొంతెండుతున్న జనం
 అడుగంటిన జలం / మండుతున్న ఎండలు
 ఎండుతున్న బతుకులు / కరువు కోరల కాలం
 చిమ్మిన ఛిద్రమైన గాయం
 బిందెల బొందలో బురదనీళ్లే
 తాగి బతుకీడుస్తున్న ప్రజలు...
 గుక్కెడు నీళ్ల కోసం / నెర్రెలిచ్చిన నాలుక...
 ఇంకిపోయిన మడుగులా మొహం
 చిన్న నీటి తుంపర్ల ఆశలు
 ‘మద్యం’ పొంగిపొరలుతున్న
 రక్తపు రహదారులు...
 పర్యావరణాన్ని ప్రేమించలేనప్పుడు
 పక్షులు పాటలే పాడనప్పుడు
 వృక్షాలనే అడ్డంగా నరికితే...
 నరకయాతనల కేకలు పెట్టాల్సిందే!
 కుళాయిలో కాకుల్లా రాళ్లు కూర్చాల్సిందే!!
 గొంతెండుతోంది.. గొంతెండుతోంది
 అని మేఘాలకై మొహం చూడాల్సిందే
 తంగిరాల సోని, కంచికచర్ల
 మొబైల్: 9676609234

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement