కృష్ణా జలాలు తాగు అవసరాలకే | Krishna waters for drinking water needed only | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలు తాగు అవసరాలకే

Published Tue, Aug 4 2015 1:39 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

కృష్ణా జలాలు తాగు అవసరాలకే - Sakshi

కృష్ణా జలాలు తాగు అవసరాలకే

* కృష్ణా నదీ బోర్డు వర్కింగ్ గ్రూప్ భేటీలో నిర్ణయం
* శ్రీశైలం, సాగర్‌లలో ప్రస్తుత లభ్యత 9.5 టీఎంసీలుగా అంచనా
* తాగునీటి ఎద్దడి దృష్ట్యా ఖరీఫ్‌ను పక్కనపెట్టాలని బోర్డు సూచన..
* ఇరు రాష్ట్రాల అంగీకారం
* రెండు మూడు రోజుల్లో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసే అవకాశం

 
సాక్షి, హైదరాబాద్: ప్రధాన జలాశయాలు అడుగంటిన దృష్ట్యా కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి వినియోగానికే పరిమితం చేయాలని కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ నిర్ణయించింది. సాగు అవసరాలకు నీటిని మళ్లించకుండా చూడాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాలపై ఉంటుందని స్పష్టం చేసింది. తాగునీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకోవాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లో నీరు చేరేవరకు ఖరీఫ్ సాగు అవసరాలను పక్కనపెట్టాలని... ఈ దిశగా రైతులను అప్రమత్తం చేయాలని సూచించింది. కృష్ణాలో ఉన్న కొద్దిపాటి జలాలను తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ఏవిధంగా పంచుకోవాలన్న అంశంపై సోమవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండిత్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు వెంకటేశ్వరరావు, మురళీధర్‌లతో కూడిన వర్కింగ్ గ్రూప్ కేంద్ర జల సంఘం కార్యాలయంలో సమావేశమై చర్చించింది.
 
 కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో లభ్యత ఉన్న జలాలు, అవసరాలను ఇరు రాష్ట్రాల అధికారులు వర్కింగ్ గ్రూప్ దృష్టికి తీసుకెళ్లారు. నాగార్జునసాగర్‌పై ఆధారపడి కుడి కాలువ కింద 12లక్షలు, ఎడమ కాలువ కింద 10లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని... ప్రస్తుతం సాగర్‌లో నీటిమట్టం 510.9 అడుగులకు పడిపోగా, శ్రీశైలంలో 802 అడుగులకు తగ్గిందన్న అంశాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కల్పించుకున్న బోర్డు చైర్మన్.. నీటి లోటును దృష్టిలో పెట్టుకుని తాగునీటి అవసరాలకే పరిమితమవ్వాలని సూచించారు. రెండు ప్రాజెక్టుల్లో వినియోగించుకోగలిగే నీరు కేవలం 9.5టీఎంసీల మేరకే ఉన్న దృష్ట్యా ఖరీఫ్ అవసరాలకు ఈ నీటిని మళ్లించరాదని చెప్పారు. దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.
 
 అవసరాన్ని బట్టి శ్రీశైలం నుంచి..
 ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లో వాడుకునేందుకు అవకాశమున్న 9.5 టీఎంసీలను తాగునీటి కోసం అవసరాన్ని బట్టి విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులను కాపాడాలంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించకూడదని... శ్రీశైలంలో 785 అడుగుల వరకు వెళితే 8 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని అంచనా వేశారు. రాయలసీమ, జంట నగరాలు, నల్లగొండ, కోస్తా జిల్లాల తాగునీటి అవసరాలకు ఈ నీటిని వినియోగించుకునేందుకు వీలుగా ఇరు రాష్ట్రాలు చర్చించుకుని షెడ్యూల్‌ను ఖరారు చేసుకోవాలని సూచించారు.
 
 తొలి విడతగా రెండుమూడు రోజుల్లో శ్రీశైలం నుంచి నీటి విడుదల చేయాలని ఇరు రాష్ట్రాలు బోర్డు సమక్షంలో నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఈ సమావేశంలో బోర్డు వెబ్‌సైట్ రూపకల్పనపైనా చర్చ జరిగింది. బోర్డు వెబ్‌సైట్‌లో ఎలాంటి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి, ఇరు రాష్ట్రాలు ఏయే అంశాలను అందులో చేర్చాలన్న దానిపై బోర్డు చైర్మన్ పలు సూచనలు చేశారు. ఈ నెల చివరి నాటికి ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవాలని బోర్డు భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement