► ఇరు రాష్ట్రాలకు సెప్టెంబర్‌లో నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు నిర్ణయం
► 12 టీఎంసీలను ఎడమ కాల్వ కింద ఖరీఫ్ అవసరాలకు వాడనున్న రాష్ట్రం
► మరో 3 టీఎంసీలు నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు...
► అక్టోబర్‌లో ఖరీఫ్‌కు 15, నవంబర్‌కు మరో 7 టీఎంసీలు కోరిన తెలంగాణ
► తర్వాతి సమావేశంలో ఈ కేటాయింపులపై నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో లభ్యతగా ఉన్న జలాలను ఇరు రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేటాయించింది. సెప్టెంబర్ అవసరాలకుగాను తెలంగాణకు 15 టీఎంసీలు, ఏపీకి 36 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్రిసభ్య కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తూ శనివారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. శుక్రవారం జరిగిన కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శనివారం బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావులతో కూడిన త్రిసభ్య కమిటీ ఇక్కడి జలసౌధ కార్యాలయంలో సమావేశమైంది.
ఈ భేటీలో మారోమారు ఇరు రాష్ట్రాలు తమ అవసరాలను బోర్డు ముందుంచాయి. వచ్చే మూడు నెలల వరకు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఖరీఫ్ కోసం 31 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 6 టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.1 టీఎంసీలు అవసరమవుతాయని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఇందులో తక్షణమే ఖరీఫ్ అవసరాలకు 12 టీఎంసీలు అవసరం కానుండగా అక్టోబర్‌లో 15 టీఎంసీల మేర అవసరం ఉంటుందని తెలిపింది. అలాగే నల్లగొండ, హైదరాబాద్ తాగునీటికి సెప్టెంబర్‌లో 3 టీఎంసీలు అవసరమవుతాయని విన్నవించింది. తెలంగాణ వినతులపై సానుకూలంగా స్పందించిన బోర్డు సెప్టెంబర్ అవసరాలకు 15 టీఎంసీలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అక్టోబర్‌లో అవసరమయ్యే 15 టీఎంసీలు, నవంబర్‌కు అవసరమయ్యే 7 టీఎంసీలపై తర్వాతి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొనగా ఇందుకు తెలంగాణ అంగీకరించింది.
మరోవైపు సెప్టెంబర్ వరకే మొత్తంగా 47 టీఎంసీలు కేటాయించాలని ఏపీ కోరింది. ఇందులోసాగర్ కుడి కాల్వకు 10 టీఎంసీలు, ఎడమ కాల్వకు 4, కృష్ణా డెల్టాకు 12, గాలేరి-నగరికి 6, హంద్రీనీవాకు 5, తెలుగుగంగకు 5, చెన్నై తాగునీటి సరఫరాకు 5 టీఎంసీలు అవసరమవుతాయని బోర్డు దృష్టికి తెచ్చింది. అయితే ఒకే నెలలో ఆ స్థాయిలో నీటి కేటాయింపు చేయాలేమన్న బోర్డు... మొత్తంగా 36 టీఎంసీలు కేటాయించేందుకు అంగీకరించింది. ఈ నీటిలో కృష్ణా డెల్టాకు 10 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వకు 10, ఎడమ కాల్వకు 2, హంద్రీనీవాకు 4, శ్రీశైలం కుడి కాల్వ, తెలుగుగంగ, చెన్నై తాగునీటికి కలిపి 10 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.