
శ్రీశైలంలో నీటి విడుదల నేటి నుంచే
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వర్కింగ్ గ్రూప్ సమావేశం నిర్ణయించింది.
⇒ 4.3 టీఎంసీలు విడుదల
⇒ ఏపీ, తెలంగాణకు చెరో 2 టీఎంసీలు
⇒ నిర్ణయం తీసుకున్న కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వర్కింగ్ గ్రూప్ సమావేశం నిర్ణయించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని మంగళవారం నుంచే విడుదల చేయాలని, పది రోజులపాటు కొనసాగించాలని నిర్ణయించారు. 4.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని, ఈ నీటిని ఇరు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని, ఆ తర్వాత అవసరాల మేరకు మరోసారి నిర్ణయానికి రావాలన్న కృష్ణా బోర్డు సూచనకు ఏపీ, తెలంగాణ అంగీ కారం తెలిపాయి.
దీంతో 2 రాష్ట్రాల్లో తాగునీటి సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం లభించినట్లయ్యింది. కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూపు సోమవారం కేంద్ర జల సంఘం కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి బోర్డు చైర్మన్ ఎస్.కె.జి.పండిట్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ చీఫ్ ఇంజనీర్(ఇంటర్‌స్టేట్) రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోకి వచ్చిన నీరు, వినియోగం, ప్రాజెక్టుల్లో నిల్వలపై చర్చించారు. సాగర్ కుడి కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలు కావాలని ఏపీ కోరింది. పట్టణాలు, గ్రామాల్లో నీటిఎద్దడి తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. తమ తాగునీటి అవసరాలకూ తక్షణమే 5 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. జంట నగరాలు, నల్లగొండ జిల్లాలో ప్రజలు తాగునీరు దొరక్క అల్లాడుతున్నారని వెల్లడించింది.
ఆవిరి, సరఫరా నష్టాలు.. 2.3 టీఎంసీలు
ఇరు రాష్ట్రాల అవసరాలను విన్న బోర్డు శ్రీశైలంలో 785 అడుగుల మట్టం వరకు తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకోవచ్చని తెలి పింది. కేవలం 8 టీఎంసీలే తాగునీటికి వాడుకోవచ్చని వివరించింది. నీటినంతా ఒకేసారి పంచలేమని స్పష్టం చేసింది. తొలివిడతగా 4.3 టీఎంసీల నీటిని విడుదల చేద్దామని ప్రతిపాదించింది. ఇందులో 0.3 టీఎంసీల నీటిలో ఆవిరి, సరఫరా నష్టాలున్నా, మిగతా 4 టీఎంసీల్లో ఒక్కో రాష్ట్రానికి 2 టీఎంసీల చొప్పున సాగర్ నుంచి తీసుకోవాలని సూచిం చింది. దీనిపై ఏపీ తొలుత కొంత తటపటాయించినా.. తర్వాత అంగీకరించింది.