సూర్యాపేట: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదని, నీళ్లు ఉన్నంత కాలం జల విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తీర్మానంపై జగదీశ్‌రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి అవగాహన కార్యక్రమంలో తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలన్నది ఏపీ ప్రభుత్వం తీర్మానిస్తే అమలుపరిచేంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరు. విద్యుత్ ఉత్పత్తి మా హక్కు. దీన్ని ఆపమనే హక్కు ఏ కమిటీకి, కమిషన్‌లకు లేదు. తెలంగాణ రాష్ట్ర హక్కులు ఏమిటో.. కృష్ణా నదిలో మా వాటాలో ప్రతి నీటి చుక్కను ఎలా వాడుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాగా తెలుసు’ అని అన్నారు.
రైతులు ఎక్కడైనా రైతులేనని, సముద్రం పాలయ్యే నీళ్లను ఈ పద్ధతిలో వాడుకోండి అంటూ కేసీఆర్ విజ్ఞతతో చెబితే ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా పోతోందని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ముమ్మాటికీ అక్రమమేనని, దుర్మార్గంగా పోతిరెడ్డిపాడును వెడల్పు చేసే ప్రయ త్నంలో నిజం లేదా అని ఏపీ సర్కార్‌ను ప్రశ్నించారు. రాజకీయ చతురత తోటే కేసీఆర్ మహా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా కాని పరిష్కారాన్ని కేసీఆర్ స్వల్ప వ్యవధిలో తేల్చిపడేశారని, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సులభతరమైందని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిని అతిథులుగా చూసుకోవాలని చెప్పారన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై .వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కమిషనర్ రామానుజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు ఆపించండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొనసాగి స్తున్న ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను తక్షణమే ఆపించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. ఇప్పటికే ఆర్డీఎస్ కింద తెలంగాణకున్న వాటాలో యాభై శాతం దక్కడం లేదని, ఈ పరిస్థితుల్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులపై చర్యలు తీసుకొని కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును కాపాడాలని విన్నవించింది. ఈ మేరకు బుధవారం బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. లేఖతో పాటు ఆర్డీఎస్ కుడికాల్వ పనులకు సంబంధించిన ఫొటోలను జత చేశారు. బోర్డు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను ఏపీ కొనసాగిస్తోందని లేఖలో ఫిర్యాదు చేశారు. ఏపీ చేపడుతున్న ఆ పనులను జూన్ 19న జరిగిన కేబినెట్ సమావేశం తీవ్రంగా తప్పుపట్టిందని, రాష్ట్ర పునర్ విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ చేపడుతున్న నిర్మాణ పనులను ఆక్షేపించిందని తెలిపారు. కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్-2 అవార్డు అమల్లోకి రాకుండానే చేపడుతున్న ఈ పనులను ఆపేలా బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టిందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment