Srisailam electricity
-
ఇక శ్రీశైలం పవర్‘ఫుల్’
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: మూడేళ్ల కింద ఘోర అగ్నిప్రమాదంలో కాలిపోయిన 900 (6*150) మెగావాట్ల శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం.. ఎట్టకేలకు పూర్తి స్థాపిత సామర్థ్యాన్ని మళ్లీ అందిపుచ్చుకుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో లభ్యతగా ఉన్న జలాలతో శనివారం నాలుగో యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించగా.. సాయంత్రం 5.07 గంటలకు 145 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకున్నట్టు తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. టీఎస్ జెన్కో హైడల్ డైరెక్టర్ వెంకటరాజం పర్యవేక్షణలో కేంద్రం సీఈ సూర్యనారాయణ, ఎస్ఈ (ఓఅండ్ఎం) ఆదినారాయణ, ఎస్ఈ రవీంద్రకుమార్, సద్గుణ కుమార్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 900 మెగావాట్ల భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 యూనిట్లుండగా, 2020 ఆగస్టు 20న జరిగిన అగ్నిప్రమాదంలో యూనిట్లన్నీ కాలిపోయాయి. నాలుగో యూనిట్ మినహా మిగిలిన యూనిట్లను గతంలోనే పునరుద్ధరించారు. నాలుగో యూనిట్‌కి సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో పునరుద్ధరణలో జాప్యం జరిగింది. కేరళలోని ఓ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి కొత్త ట్రాన్స్ఫార్మర్ను తయారు చేయించడానికి రెండేళ్లు పట్టింది. గతేడాది ఫిబ్రవరిలో ట్రాన్స్ఫార్మర్ను బిగించి నాలుగో యూనిట్‌కు మరమ్మతులు పూర్తి చేశారు. అయితే, ఈ యూనిట్‌కి సంబంధించిన సర్జ్‌పూల్‌లో ఓ భారీ గేటు విరిగి పడిపోవడంతోపాటు మరికొన్ని గేట్లు వరద ఉధృతికి దెబ్బతినడంతో అప్పట్లో విద్యుదుత్పత్తి సాధ్యం కాలేదు. సర్జ్‌పూల్ నీళ్లలో 75 మీటర్ల అడుగున ఉన్న గేటును బయటకు తీసే క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో అప్పట్లో ఉత్పత్తిని వాయిదా వేశారు. గత వేసవిలో జలాశయంలో నిల్వలు అడుగంటిపోయాక గేటును బయటకు తీసి మరమ్మతులు చేశారు. ప్రస్తుతం జూరాల నుంచి భారీ స్థాయిలో వరద వస్తుండటంతో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. విచారణ నివేదిక ఏమైంది? 2020 ఆగస్టు 20న శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు ఇంజనీర్లతో సహా మొత్తం 9 మంది మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదంపై టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ మూడేళ్లు గడిచినా విచారణ నివేదికను సమర్పించలేదు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా, ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. -
శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిని ఎవరూ ఆపలేరు: జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదని, నీళ్లు ఉన్నంత కాలం జల విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తీర్మానంపై జగదీశ్‌రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి అవగాహన కార్యక్రమంలో తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలన్నది ఏపీ ప్రభుత్వం తీర్మానిస్తే అమలుపరిచేంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరు. విద్యుత్ ఉత్పత్తి మా హక్కు. దీన్ని ఆపమనే హక్కు ఏ కమిటీకి, కమిషన్లకు లేదు. తెలంగాణ రాష్ట్ర హక్కులు ఏమిటో.. కృష్ణా నదిలో మా వాటాలో ప్రతి నీటి చుక్కను ఎలా వాడుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాగా తెలుసు’ అని అన్నారు. రైతులు ఎక్కడైనా రైతులేనని, సముద్రం పాలయ్యే నీళ్లను ఈ పద్ధతిలో వాడుకోండి అంటూ కేసీఆర్ విజ్ఞతతో చెబితే ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా పోతోందని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ముమ్మాటికీ అక్రమమేనని, దుర్మార్గంగా పోతిరెడ్డిపాడును వెడల్పు చేసే ప్రయ త్నంలో నిజం లేదా అని ఏపీ సర్కార్‌ను ప్రశ్నించారు. రాజకీయ చతురత తోటే కేసీఆర్ మహా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా కాని పరిష్కారాన్ని కేసీఆర్ స్వల్ప వ్యవధిలో తేల్చిపడేశారని, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సులభతరమైందని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిని అతిథులుగా చూసుకోవాలని చెప్పారన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై .వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కమిషనర్ రామానుజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు ఆపించండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొనసాగి స్తున్న ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను తక్షణమే ఆపించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. ఇప్పటికే ఆర్డీఎస్ కింద తెలంగాణకున్న వాటాలో యాభై శాతం దక్కడం లేదని, ఈ పరిస్థితుల్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులపై చర్యలు తీసుకొని కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును కాపాడాలని విన్నవించింది. ఈ మేరకు బుధవారం బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. లేఖతో పాటు ఆర్డీఎస్ కుడికాల్వ పనులకు సంబంధించిన ఫొటోలను జత చేశారు. బోర్డు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను ఏపీ కొనసాగిస్తోందని లేఖలో ఫిర్యాదు చేశారు. ఏపీ చేపడుతున్న ఆ పనులను జూన్ 19న జరిగిన కేబినెట్ సమావేశం తీవ్రంగా తప్పుపట్టిందని, రాష్ట్ర పునర్ విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ చేపడుతున్న నిర్మాణ పనులను ఆక్షేపించిందని తెలిపారు. కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్-2 అవార్డు అమల్లోకి రాకుండానే చేపడుతున్న ఈ పనులను ఆపేలా బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టిందని గుర్తు చేశారు. -
శ్రీశైలం విద్యుత్‌ను 50:50 శాతం వాడుకోవాలని నిర్ణయం
-
జోరుగా జల విద్యుదుత్పత్తి
సాక్షి, అమరావతి: ‘గత కొద్ది రోజులుగా కృష్ణా నదికి వరద పోటెత్తుతుండడంతో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జోరందుకుంది. ఇది ఎంతో శుభ పరిణామం’ అనిరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆగస్టు రెండో వారంలోనే కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా జల విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయడం ఇటీవల కాలంలో అరుదైన ఘటనగా పేర్కొన్నారు. దీనిపై మంత్రి ఆదివారం విద్యుత్ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి చర్చించిన విషయాలను ఇంధన శాఖ మీడియా సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి విలేకరులకు వివరించారు. శ్రీశైలంలో ఈ ఏడాది 715 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయొచ్చని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే నాగార్జునసాగర్‌లోనూ జలవిద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. కాగా, జల విద్యుత్ యూనిట్ రూ.1.6కే ఉత్పత్తి అవుతున్నందున ఖరీదైన విద్యుత్ కొనుగోలు నిలిపివేస్తామన్నారు. రైతులకు 9 గంటలు పగటి పూట ఉచిత విద్యుత్ సరఫరావల్ల వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. ‘ఖరీఫ్’కు పక్కా ప్రణాళిక కాగా, ఖరీఫ్ సీజన్లో విద్యుత్ డిమాండ్ 185 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశముందని.. దీనిని తట్టుకునేందుకు వీలుగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సమావేశంలో వివరించారు. వర్షాలు కురవడంతో ఈనెల తొలి వారంలో విద్యుత్ డిమాండ్ రోజుకు 30 మిలియన్ యూనిట్ల మేర తగ్గిందని, ఫలితంగా విద్యుత్ సంస్థలకు రూ.100 కోట్లకు పైగా ఆదా అయ్యే అవకాశముందని వివరించారు. శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం ఉండడంతో రానున్న పది రోజుల్లో 165 మిలియన్ యూనిట్ల వరకు జల విద్యుదుత్పత్తి చేయగలమని ఏపీ జెన్కో ఎండీ బి. శ్రీధర్ మంత్రి బాలినేనికి వివరించారు. ఒకవేళ కృష్ణానదీ యాజమాన్య బోర్డు రాష్ట్రానికి 100 టీఎంసీలు కేటాయిస్తే ఏపీ జెన్కో దాదాపు 550 మిలియన్ యూనిట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. మొత్తంగా రూ.114.4 కోట్ల వ్యయం (యూనిట్ రూ.1.60 చొప్పున)తో శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి 715 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని వివరించారు. ఇంతే మొత్తంలో థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటే రూ.329 కోట్లు (యూనిట్ రూ.4.60 చొప్పున) ఖర్చవుతుందని శ్రీధర్ తెలిపారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ ట్రాన్స్‌కో జేఎండీలు కేవీఎన్ చక్రధర్‌బాబు, పి.ఉమాపతి, సీఎండీలు నాగలక్షి్మ, హెచ్. హరనాథరావు తదితర అధికారులు పాల్గొన్నారు. -
శ్రీశైలం విద్యుత్ చెరిసగం
తెలంగాణ, ఏపీలకు కృష్ణా బోర్డు సూచన సాక్షి , హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేసే నీటిని వినియోగించుకొని చేస్తున్న విద్యుదుత్పత్తిలో రెండు రాష్ట్రాలకు సమాన వాటా దక్కుతుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు 9 టీఎంసీల మేర నీటి విడుదల చేసేందుకు బోర్డు అంగీకా రం తెలిపింది. గతవారం జరిగిన బోర్డు వర్కిం గ్ గ్రూప్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నీటి విడుదల మార్గదర్శకాలు, విద్యుదుత్పత్తిలో వాటా తదితర అంశాలను పేర్కొంటూ బోర్డు సభ్య కార్యదర్శి ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా లేఖలు రాశారు. లేఖలో పేర్కొన్న మేరకు.. 2 టీఎంసీలు నల్లగొండ జిల్లా, మరో 2 టీఎంసీలు గుంటూరు, ప్రకాశం జిల్లాలు, మిగిలిన 5 టీఎంసీల్లో రాయలసీమ తాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం ఎగువ నుంచి తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా 2 టీఎంసీలు, శ్రీశైలం కుడి గట్టు కాల్వల ద్వారా 3 టీఎంసీలు విడుదల చేసుకోవచ్చని తెలిపా రు. అయితే విద్యుత్ పంచుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా విధివిధానాలు ఖరారు చేయని దృష్ట్యా, విద్యుదుత్పత్తిలో చెరిసగం పంచుకోవాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు ఆదేశించింది. ఈ వాటా తాత్కాలిక నిర్ణయాలు మాత్రమేనని, ఇవి ఈ ఏడాదికే పరిమితమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాల ఆధారంగా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని సూచించింది. నీటి విడుదలకు సంబంధించి రోజూవారీ విడుదలపై ఇరు రాష్ట్రాలు సంయుక్త ప్రకటన రూపొందించి సంబంధిత అధికారుల సంతకాలతో బోర్డుకు సమర్పించాలని ఆదేశించింది. 30న గోదావరి బోర్డు సమావేశం.. ఇక గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఈ నెల 30న జరగనుంది. ఈ మేరకు బోర్డు చైర్మన్ ఎంఎస్ అగర్వాల్ ఇరు రాష్ట్రాల ఈఎన్సీలకు సోమవారం లేఖలు రాశారు. బోర్డు సమావేశ ఎజెండాను ఈ నెల 26న ఖరారు చేస్తామని అందులో పేర్కొన్నారు.