జోరుగా జల విద్యుదుత్పత్తి | Hydroelectric power generation initiative | Sakshi
Sakshi News home page

జోరుగా జల విద్యుదుత్పత్తి

Published Mon, Aug 12 2019 4:13 AM | Last Updated on Mon, Aug 12 2019 4:13 AM

Hydroelectric power generation initiative - Sakshi

సాక్షి, అమరావతి: ‘గత కొద్ది రోజులుగా కృష్ణా నదికి వరద పోటెత్తుతుండడంతో శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి జోరందుకుంది. ఇది ఎంతో శుభ పరిణామం’ అనిరాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆగస్టు రెండో వారంలోనే కుడి గట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా జల విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయడం ఇటీవల కాలంలో అరుదైన ఘటనగా పేర్కొన్నారు. దీనిపై మంత్రి ఆదివారం విద్యుత్‌ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రి చర్చించిన విషయాలను ఇంధన శాఖ మీడియా సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి విలేకరులకు వివరించారు.

శ్రీశైలంలో ఈ ఏడాది 715 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయొచ్చని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే నాగార్జునసాగర్‌లోనూ జలవిద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. కాగా, జల విద్యుత్‌ యూనిట్‌ రూ.1.6కే ఉత్పత్తి అవుతున్నందున ఖరీదైన విద్యుత్‌ కొనుగోలు నిలిపివేస్తామన్నారు. రైతులకు 9 గంటలు పగటి పూట ఉచిత విద్యుత్‌ సరఫరావల్ల వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు.  

‘ఖరీఫ్‌’కు పక్కా ప్రణాళిక 
కాగా, ఖరీఫ్‌ సీజన్లో విద్యుత్‌ డిమాండ్‌ 185 మిలియన్‌ యూనిట్లకు చేరే అవకాశముందని.. దీనిని తట్టుకునేందుకు వీలుగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ సమావేశంలో వివరించారు. వర్షాలు కురవడంతో ఈనెల తొలి వారంలో విద్యుత్‌ డిమాండ్‌ రోజుకు 30 మిలియన్‌ యూనిట్ల మేర తగ్గిందని, ఫలితంగా విద్యుత్‌ సంస్థలకు రూ.100 కోట్లకు పైగా ఆదా అయ్యే అవకాశముందని వివరించారు. శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం ఉండడంతో రానున్న పది రోజుల్లో 165 మిలియన్‌ యూనిట్ల వరకు జల విద్యుదుత్పత్తి చేయగలమని ఏపీ జెన్కో ఎండీ బి. శ్రీధర్‌ మంత్రి బాలినేనికి వివరించారు.

ఒకవేళ కృష్ణానదీ యాజమాన్య బోర్డు రాష్ట్రానికి 100 టీఎంసీలు కేటాయిస్తే ఏపీ జెన్‌కో దాదాపు 550 మిలియన్‌ యూనిట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. మొత్తంగా రూ.114.4 కోట్ల వ్యయం (యూనిట్‌ రూ.1.60 చొప్పున)తో శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రం నుంచి 715 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని వివరించారు. ఇంతే మొత్తంలో థర్మల్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటే రూ.329 కోట్లు (యూనిట్‌ రూ.4.60 చొప్పున) ఖర్చవుతుందని శ్రీధర్‌ తెలిపారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ ట్రాన్స్‌కో జేఎండీలు కేవీఎన్‌ చక్రధర్‌బాబు, పి.ఉమాపతి, సీఎండీలు నాగలక్షి్మ, హెచ్‌. హరనాథరావు తదితర అధికారులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement