Hydro-electric power
-
చకచకా పోలవరం జలవిద్యుత్ కేంద్రం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు జలాశయం పనులను ఇప్పటికే కొలిక్కి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. జలవిద్యుత్కేంద్రం పనులనూ వేగవంతం చేసింది. ఇందులో కీలకమైన ప్రెజర్ టన్నెళ్ల తవ్వకాలు ప్రారంభమైన నాలుగు నెలల్లోనే 150.3 మీటర్ల పొడవు తొమ్మిది మీటర్ల వ్యాసంతో కూడిన ఒక టన్నెల్‌ను పూర్తిచేసింది. మరో టన్నెల్ తుదిదశకు చేరుకుంది. మిగిలిన పది టన్నెళ్ల పనులను వేగవంతం చేసింది. గోదావరి నుంచి ఏటా మూడు వేల టీఎంసీల జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. ఈ ప్రవాహమంతా పోలవరం ప్రాజెక్టు మీదుగానే ధవళేశ్వరం బ్యారేజీకి చేరుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. దీని ప్రధాన ఆనకట్ట ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్‌కు ఎడమ వైపున 960 మెగావాట్ల సామర్థ్యంతో ప్రభుత్వం జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇక్కడ నీటి లభ్యత అధికంగా ఉన్నందువల్ల హిమాలయ నదులపై ఏర్పాటుచేసిన జలవిద్యుత్కేంద్రాలకు దీటుగా పోలవరం జలవిద్యుత్కేంద్రంలో కరెంట్ ఉత్పత్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. చౌకగా అందుబాటులోకి వచ్చే ఈ విద్యుత్ రాష్ట్ర విద్యుత్ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేస్తుందని.. పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. పోలవరంలో జలవిద్యుదుత్పత్తి ఇలా.. ► పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఒక్కో యూనిట్లో 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లలో 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ► ఇక్కడ 35.52 మీటర్ల నీటి మట్టం నుంచి నీటిని ప్రెజర్ టన్నెళ్ల ద్వారా పంపిస్తారు. ► ఈ టన్నెళ్లకు చివరన తక్కువ వ్యాసంతో ఇనుప పైపులను తొడిగి.. భూ ఉపరితలానికి ఆరు మీటర్ల దిగువన వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను ఏర్పాటుచేస్తారు. ► ప్రెజర్ టన్నెళ్ల వైపు నీటిని మళ్లించడానికి వీలుగా 206 మీటర్ల పొడవున 294 మీటర్ల వెడల్పుతో జలాశయం నుంచి అప్రోచ్ చానల్ తవ్వుతారు. అధిక ఒత్తిడితో ఎత్తు నుంచి నీరు పడినప్పుడు వర్టికల్ కెప్లాన్ టర్బైన్లు వేగంగా తిరగడంవల్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది. ► టర్బైన్ల నుంచి దిగువకు వచ్చిన నీటిని టెయిల్ రేస్ చానల్ ద్వారా ఈసీఆర్‌ఎఫ్‌కు దిగువన నదిలోకి కలుపుతారు. ► ఈ వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను భోపాల్‌కు చెందిన బీహెచ్ఈఎల్ సంస్థ తయారుచేస్తోంది. ఇవి ఆసియాలోనే అత్యంత పెద్దవి. శరవేగంగా సాగుతున్న పనులు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం గోదావరి గట్టుకు అవతల ఎడమ వైపున ఉన్న కొండలో 21,39,639 క్యూబిక్ మీటర్లు తవ్వారు. ఈ కొండ తవ్వకం పనులను దాదాపుగా పూర్తిచేశారు. కొండలో ప్రెజర్ టన్నెళ్ల తవ్వకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పూర్తయిన టన్నెళ్లకు సిమెంట్ లైనింగ్ చేసి.. టర్బైన్లను అమర్చడానికి కసరత్తు చేస్తున్నారు. వీటికి వంద మెగావాట్ల సామర్థ్యంతో కూడిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లను అమర్చనున్నారు. -
జోరుగా జల విద్యుదుత్పత్తి
సాక్షి, అమరావతి: ‘గత కొద్ది రోజులుగా కృష్ణా నదికి వరద పోటెత్తుతుండడంతో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జోరందుకుంది. ఇది ఎంతో శుభ పరిణామం’ అనిరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆగస్టు రెండో వారంలోనే కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా జల విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయడం ఇటీవల కాలంలో అరుదైన ఘటనగా పేర్కొన్నారు. దీనిపై మంత్రి ఆదివారం విద్యుత్ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి చర్చించిన విషయాలను ఇంధన శాఖ మీడియా సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి విలేకరులకు వివరించారు. శ్రీశైలంలో ఈ ఏడాది 715 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయొచ్చని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే నాగార్జునసాగర్‌లోనూ జలవిద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. కాగా, జల విద్యుత్ యూనిట్ రూ.1.6కే ఉత్పత్తి అవుతున్నందున ఖరీదైన విద్యుత్ కొనుగోలు నిలిపివేస్తామన్నారు. రైతులకు 9 గంటలు పగటి పూట ఉచిత విద్యుత్ సరఫరావల్ల వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. ‘ఖరీఫ్’కు పక్కా ప్రణాళిక కాగా, ఖరీఫ్ సీజన్లో విద్యుత్ డిమాండ్ 185 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశముందని.. దీనిని తట్టుకునేందుకు వీలుగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సమావేశంలో వివరించారు. వర్షాలు కురవడంతో ఈనెల తొలి వారంలో విద్యుత్ డిమాండ్ రోజుకు 30 మిలియన్ యూనిట్ల మేర తగ్గిందని, ఫలితంగా విద్యుత్ సంస్థలకు రూ.100 కోట్లకు పైగా ఆదా అయ్యే అవకాశముందని వివరించారు. శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం ఉండడంతో రానున్న పది రోజుల్లో 165 మిలియన్ యూనిట్ల వరకు జల విద్యుదుత్పత్తి చేయగలమని ఏపీ జెన్కో ఎండీ బి. శ్రీధర్ మంత్రి బాలినేనికి వివరించారు. ఒకవేళ కృష్ణానదీ యాజమాన్య బోర్డు రాష్ట్రానికి 100 టీఎంసీలు కేటాయిస్తే ఏపీ జెన్కో దాదాపు 550 మిలియన్ యూనిట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. మొత్తంగా రూ.114.4 కోట్ల వ్యయం (యూనిట్ రూ.1.60 చొప్పున)తో శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి 715 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని వివరించారు. ఇంతే మొత్తంలో థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలంటే రూ.329 కోట్లు (యూనిట్ రూ.4.60 చొప్పున) ఖర్చవుతుందని శ్రీధర్ తెలిపారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ ట్రాన్స్‌కో జేఎండీలు కేవీఎన్ చక్రధర్‌బాబు, పి.ఉమాపతి, సీఎండీలు నాగలక్షి్మ, హెచ్. హరనాథరావు తదితర అధికారులు పాల్గొన్నారు. -
పీఏబీఆర్‌లో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
► ఏపీ జెన్కో డీఈ రఫి అహమ్మద్ వెల్లడి కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం)లోని ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఏపీ జెన్ కో డీఈ రఫి అహమ్మద్, డ్యాం డీఈ పక్కీరప్పలు సోమవారం తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికి డ్యాం నుంచి 800 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రెండు టరై్బన్లు ఉన్నాయి. అందులో ఒక దానిలో మాత్రమే ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు జెన్కో డీఈ తెలిపారు. గంటకు 4000 యూనిట్ల విద్యుత్‌ను తయారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్ళే లైన్‌కు కలుపుతామన్నారు. డీఈ పక్కీరప్ప మాట్లాడుతూ డ్యాంలోకి హెచ్చెల్సీ ద్వారా 850 క్యూసెక్కులు నీరు వస్తోందన్నారు. అందులో నుంచి విద్యుత్ ఉత్పత్తికి 800 క్యూసెక్కులు, మూడు తాగునీటి ప్రాజెక్టులకు 50 క్యూసెక్కుల వరకు నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 2.334 టీఎంసీల నీరు నిల్వ ఉందని వివరించారు. -
నీటివసతులున్నా నిర్లక్ష్యం
డొంకరాయి (వై.రామవరం) : రాష్ట్రాన్ని విద్యుత్ కొరత వేధిస్తోంది. ఈనేపథ్యంలో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని సాధ్యమైనంత మేరకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ ఎందుకోగానీ డొంకరాయిలోని ఏపీ జెన్కో జలవిద్యుత్ కేంద్రం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దానికి కావాల్సిన నీటివనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. డొంకరాయి విద్యుత్ కేంద్రంలో 4.10.1983న ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక్కడ 25 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. డొంకరాయి నదికి పైన ఉన్న సీలేరులో అదే నదిపై ఉన్న ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రంలో 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అదే నదిపై ఉన్న డొంకరాయి జల విద్యుత్ కేంద్రంలో ఒకే ఒక్క టర్బైన్ ద్వారా 25 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ఈ జలవిద్యుత్ కేంద్రం పవర్ కెనాల్ ద్వారా విడుదలయ్యే నీటితో నడుస్తున్న ఖమ్మంజిల్లాలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో 440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. డొంకరాయి నది ప్రమాద స్థాయిని మించి పారుతున్నప్పుడు డ్యాం గేట్ల ద్వారా వృథాగా నీరును వదిలేస్తున్నారు. దీంతో పల్లపు ప్రాంతాలైన చింతూరు మండల లోతట్టు గ్రామాలు జలమయం అవుతున్నాయి. ఆ నీటిని సద్వినియోగం చేసుకొని విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. సామర్థ్యం పెంచాలి డొంకరాయిలో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంపొం దించాలి. దీనివల్ల విద్యుత్ కొరత తీరడంతోపాటు, ఏపీ జెన్కో సంస్థకు అధిక ఆదాయం వస్తుంది. కంచం పద్మ , బొడ్డగండి 1 ఎంపీటీసీ, వై.రామవరం మండలం ఉపాధి పెరుగుతుంది డొంకరాయిలోని ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి సామర్థ్యం పెంచడం వలన ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. తక్షణమే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలి. ముర్ల దేవి, బొడ్డగండి 2 ఎంపీటీసీ, వై.రామవరం మండలం -
తెలంగాణకు కరెంట్ గండాలు
పీపీఏల రద్దు... సీజీఎస్ కోటా కత్తిరింపు అందుబాటులోకి రాని జలవిద్యుత్ విద్యుత్ కొనుగోళ్లలో ఇబ్బందులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు విద్యుత్ గండాలు ఒకదాని వెనక మరొకటి వచ్చిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దుకు చేస్తున్న యత్నాలు మొదలుకుని కేంద్ర విద్యుత్ ప్లాంట్ల (సీజీఎస్) కోటా కత్తిరింపు, విద్యుత్ కొనుగోళ్లకు వస్తున్న ఇబ్బందులు, లైన్ల ఏర్పాటులో ఎదురుకానున్న సమస్యలు... వెరసి తెలంగాణకు విద్యుత్ కష్టాలు తప్పవని అర్థమవుతోంది. ఏడాది వరకు విద్యుత్ కష్టాలు తప్పవని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో విద్యుత్ కష్టాలు ఎక్కువ కాలమే కొనసాగనున్నాయని అర్థమవుతోంది. మరోవైపు వర్షాలు లేకపోవడంతో జల విద్యుత్ కేంద్రాల రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. వర్షాలు ఇప్పటికిప్పుడు భారీగా కురిసినప్పటికీ ఎగువన ఉన్న కర్ణాటకలోని అలమట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండాలి... శ్రీశైలం రిజర్వాయర్‌కు నీరు చేరాలి. అప్పుడే జల విద్యుత్ ఉత్పత్తి సాగే అవకాశం ఉంది. వేలాడుతున్న పీపీఏల రద్దు కత్తి! ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతి లేని ప్లాంట్లతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి పీపీఏలు కొనసాగితే తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ సరఫరా అవుతుంది. పీపీఏలు లేకపోతే ఎక్కడి విద్యుత్ ప్లాంట్లు అక్కడే ఉండిపోతాయి. తద్వారా ఎవరి విద్యుత్‌ను వారు వాడుకోవాల్సిందే. ఫలితంగా తెలంగాణ కేవలం థర్మల్ ప్లాంట్లనుంచే ఏకంగా 541 మెగావాట్ల విద్యుత్‌ను (13 మిలియన్ యూనిట్లు) కోల్పోవాల్సి వస్తుంది. పీపీఏల రద్దు అనే కత్తి ఇంకా వేలాడుతూనే ఉందన్నమాట. ప్రస్తుత కోటా ప్రకారమే విద్యుత్ సరఫరా జరగాలని ఎస్ఆర్పీసీ ఆదేశించినప్పటికీ జల విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం లేదు. దీనిపై ఎస్ఆర్పీసీకి పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. దీనివల్ల విద్యుత్ వినియోగం అధికంగా ఉండే సమయాల్లో (సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు) ఆంధ్రప్రదేశ్ నుంచి జల విద్యుత్ కోటా తెలంగాణకు దక్కడం లేదు. సీజీఎస్ కోటా సవరింపు...సీజీఎస్ కోటాను కేంద్రం సవరిస్తూ తెలంగాణకు 52.12 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 47.88 శాతం కేటాయించింది. దీంతో 50 - 65 మెగావాట్ల విలువైన విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది. లైన్ల ఏర్పాటుకు తిప్పలు... అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు కొత్తగా లైన్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఛత్తీస్‌గఢ్ మీదనే ఆధారపడాల్సి ఉంది. లైన్ల ఏర్పాటుకు ఏడాదికిపైగా పడుతుందని అంటున్నారు. కొత్తగా వచ్చే ఏడాది వరంగల్ జిల్లాలోని కేటీపీపీ నుంచి 600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. పెరిగే డిమాండుతో పోలిస్తే ఇది చాలా తక్కువని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్యాసు దెబ్బకు 97 మెగావాట్లు ఫట్ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో గెయిల్ గ్యాసు బ్లో అవుట్ దెబ్బ కాస్తా విద్యుత్ ఉత్పత్తిపై పడింది. లీకేజీ అయిన గెయిల్ ప్రధాన ట్రంకు లైను నుంచి నేరుగా ల్యాంకో ప్లాంటుకు గ్యాసు సరఫరా అవుతోంది. ఈ ప్లాంటుకు ఇప్పటివరకు రోజుకు 0.72 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాసు (ఎంసీఎండీ) సరఫరా అయ్యేది. తాజా బ్లో అవుట్‌తో ఇది నిలిచిపోయింది. ఫలితంగా 140 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా జీవీకే, రిలయన్స్, ఆంధ్రప్రదేశ్ గ్యాసు పవర్ కంపెనీ (ఏపీజీపీసీఎల్), స్పెక్ట్రమ్... మొత్తం నాలుగు గ్యాసు ఆధారిత ప్లాంట్లకు ఇదే లైను ద్వారా కొద్ది మొత్తంలో గ్యాసు సరఫరా అవుతోంది. ఇది కూడా తాజా ఘటనతో నిలిచిపోయింది. ఫలితంగా మరో 40 మెగావాట్ల విద్యుత్ నష్టపోయినట్టు ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే గ్యాసు బ్లో అవుట్ దెబ్బకు మొత్తం 180 మెగావాట్ల విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు నష్టపోవాల్సి వచ్చింది. ఈ గ్యాసు ప్లాంట్లతో పీపీఏ అమలులో ఉన్నాయి. ఇందులో తెలంగాణ వాటా 97 మెగావాట్లు కాగా ఆంధ్రప్రదేశ్ వాటా 83 మెగావాట్లు.