తెలంగాణకు కరెంట్ గండాలు | power cuts problems to telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణకు కరెంట్ గండాలు

Published Mon, Jun 30 2014 2:10 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

తెలంగాణకు కరెంట్ గండాలు - Sakshi

తెలంగాణకు కరెంట్ గండాలు

 పీపీఏల రద్దు... సీజీఎస్ కోటా కత్తిరింపు

  •  అందుబాటులోకి రాని జలవిద్యుత్
  •  విద్యుత్ కొనుగోళ్లలో ఇబ్బందులు

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు విద్యుత్ గండాలు ఒకదాని వెనక మరొకటి వచ్చిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దుకు చేస్తున్న యత్నాలు మొదలుకుని కేంద్ర విద్యుత్ ప్లాంట్ల (సీజీఎస్) కోటా కత్తిరింపు, విద్యుత్ కొనుగోళ్లకు వస్తున్న ఇబ్బందులు, లైన్ల ఏర్పాటులో ఎదురుకానున్న సమస్యలు... వెరసి తెలంగాణకు విద్యుత్ కష్టాలు తప్పవని అర్థమవుతోంది. ఏడాది వరకు విద్యుత్ కష్టాలు తప్పవని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. 

తాజా పరిణామాల నేపథ్యంలో విద్యుత్ కష్టాలు ఎక్కువ కాలమే కొనసాగనున్నాయని అర్థమవుతోంది. మరోవైపు వర్షాలు లేకపోవడంతో జల విద్యుత్ కేంద్రాల రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. వర్షాలు ఇప్పటికిప్పుడు భారీగా కురిసినప్పటికీ ఎగువన ఉన్న కర్ణాటకలోని అలమట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండాలి... శ్రీశైలం రిజర్వాయర్‌కు నీరు చేరాలి. అప్పుడే జల విద్యుత్ ఉత్పత్తి సాగే అవకాశం ఉంది.
 
వేలాడుతున్న పీపీఏల రద్దు కత్తి!

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతి లేని ప్లాంట్లతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి పీపీఏలు కొనసాగితే తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ సరఫరా అవుతుంది. పీపీఏలు లేకపోతే ఎక్కడి విద్యుత్ ప్లాంట్లు అక్కడే ఉండిపోతాయి. తద్వారా ఎవరి విద్యుత్‌ను వారు వాడుకోవాల్సిందే. ఫలితంగా తెలంగాణ కేవలం థర్మల్ ప్లాంట్లనుంచే ఏకంగా 541 మెగావాట్ల విద్యుత్‌ను (13 మిలియన్ యూనిట్లు) కోల్పోవాల్సి వస్తుంది.

పీపీఏల రద్దు అనే కత్తి ఇంకా వేలాడుతూనే ఉందన్నమాట. ప్రస్తుత కోటా ప్రకారమే విద్యుత్ సరఫరా జరగాలని ఎస్‌ఆర్‌పీసీ ఆదేశించినప్పటికీ జల విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం లేదు. దీనిపై ఎస్‌ఆర్‌పీసీకి పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. దీనివల్ల విద్యుత్ వినియోగం అధికంగా ఉండే సమయాల్లో (సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు) ఆంధ్రప్రదేశ్ నుంచి జల విద్యుత్ కోటా తెలంగాణకు దక్కడం లేదు. సీజీఎస్ కోటా సవరింపు...సీజీఎస్ కోటాను కేంద్రం సవరిస్తూ తెలంగాణకు 52.12 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 47.88 శాతం కేటాయించింది. దీంతో 50 - 65 మెగావాట్ల విలువైన విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది.  
 
లైన్ల ఏర్పాటుకు తిప్పలు...
అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు కొత్తగా లైన్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా  ఛత్తీస్‌గఢ్ మీదనే ఆధారపడాల్సి ఉంది. లైన్ల ఏర్పాటుకు ఏడాదికిపైగా  పడుతుందని అంటున్నారు. కొత్తగా వచ్చే ఏడాది వరంగల్ జిల్లాలోని కేటీపీపీ నుంచి 600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. పెరిగే డిమాండుతో పోలిస్తే ఇది చాలా తక్కువని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.   
 
గ్యాసు దెబ్బకు 97 మెగావాట్లు ఫట్
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో గెయిల్ గ్యాసు బ్లో అవుట్ దెబ్బ కాస్తా విద్యుత్ ఉత్పత్తిపై పడింది. లీకేజీ అయిన గెయిల్ ప్రధాన ట్రంకు లైను నుంచి నేరుగా ల్యాంకో ప్లాంటుకు గ్యాసు సరఫరా అవుతోంది. ఈ ప్లాంటుకు ఇప్పటివరకు రోజుకు 0.72 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాసు (ఎంసీఎండీ) సరఫరా అయ్యేది. తాజా బ్లో అవుట్‌తో ఇది నిలిచిపోయింది. ఫలితంగా 140 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

అదేవిధంగా జీవీకే, రిలయన్స్, ఆంధ్రప్రదేశ్ గ్యాసు పవర్ కంపెనీ (ఏపీజీపీసీఎల్), స్పెక్ట్రమ్... మొత్తం నాలుగు గ్యాసు ఆధారిత ప్లాంట్లకు ఇదే లైను ద్వారా కొద్ది మొత్తంలో గ్యాసు సరఫరా అవుతోంది. ఇది కూడా తాజా ఘటనతో నిలిచిపోయింది. ఫలితంగా మరో 40 మెగావాట్ల విద్యుత్ నష్టపోయినట్టు ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే గ్యాసు బ్లో అవుట్ దెబ్బకు మొత్తం 180 మెగావాట్ల విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు నష్టపోవాల్సి వచ్చింది. ఈ గ్యాసు ప్లాంట్లతో పీపీఏ అమలులో ఉన్నాయి. ఇందులో తెలంగాణ వాటా 97 మెగావాట్లు కాగా ఆంధ్రప్రదేశ్ వాటా 83 మెగావాట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement