Andhra Pradesh Electricity Regulatory Commission (APERC)
-
కరెంట్ కోసం కొత్త టారిఫ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీ ఈఆర్సీ) టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ కింద ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి కోసం థ్రెషోల్డ్ లిమిట్ రెగ్యులేషన్–2023ని రూపొందించింది. ఈ మేరకు విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 63 ప్రకారం.. కొత్త నిబంధనలతో డ్రాఫ్ట్ రెగ్యులేషన్‌ను కమిషన్ తయారు చేసింది. దీనిపై ఎవరికైనా సూచనలు, అభ్యంతరాలుంటే ఈ నెల 29లోగా తమ ప్రధాన కార్యాలయానికి మెయిల్ ద్వారా తెలియజేయాలని కోరింది. ఈ గడువు ముగిసిన తర్వాత డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ఖరారు చేస్తామని కమిషన్ తెలిపింది. ఈ రెగ్యులేషన్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఏపీ ఈఆర్సీ పేర్కొంది. రెండుసార్లు అడిగిన కేంద్రం విద్యుత్ మంత్రిత్వ శాఖ 2021 మార్చి 15న ఒక లేఖ విడుదల చేసింది. ఇందులో ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ అభివృద్ధి కోసం టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్(టీబీసీబీ)ని ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేసింది. టీబీసీబీ ద్వారా ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్‌లను అందించడానికి గరిష్ట పరిమితిని తెలియజేయాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఆగస్టు 21న ఏపీ ఈఆర్సీకి మరో లేఖ పంపింది. వీటిని పరిగణలోకి తీసుకుని 2020–21 నుంచి 2023–24 వరకు నాలుగు ఆర్థి క సంవత్సరాల్లో ఏపీ ట్రాన్స్‌కో స్టేట్ ట్రాన్స్మిషన్ యుటిలిటీకి మంజూరైన పెట్టుబడి అనుమతులను కమిషన్ పరిశీలించింది. ఆమోదించిన 23 ప్రాజెక్ట్‌లలో 10 ప్రాజెక్ట్‌లు (43.5 శాతం) అమలు జరిగినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ టారిఫ్‌ను తగ్గించడం, జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాల్లో ట్రాన్స్మిషన్ సేవల కోసం ఇప్పటికే అమలులో ఉన్న టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాజెక్ట్‌లను పరిగణనలోకి తీసుకోవడం, ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధిలో పోటీని ప్రోత్సహించే పవర్ మార్గదర్శకాల అభివృద్ధి కోసం కొత్త డ్రాఫ్ట్ రెగ్యులేషన్‌ను కమిషన్ తీసుకువస్తోంది. -
విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెంపు
సాక్షి, అమరావతి: ఇటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూనే అటు డిస్కమ్‌లకు ఆర్థిక భరోసా కల్పిస్తూ 2022–23 రిటైల్ విద్యుత్ సరఫరా ధరలను సవరించి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కొత్త చార్జీలను ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న కేటగిరీల స్థానంలో కొత్తగా ఒకే గ్రూపు కింద ఆరు శ్లాబులను తెచ్చి గృహ విద్యుత్ వినియోగదారులపై అధిక భారం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం తిరుపతిలో వెల్లడించారు. అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా సగటున 3.26 శాతం పెరిగిన చార్జీల కారణంగా మూడు డిస్కమ్‌లకు ఏటా దాదాపు రూ.1,400 కోట్ల రాబడి అదనంగా సమకూరనుంది. ఏప్రిల్ 1వతేదీ నుంచి ఈ చార్జీలు అమలులోకి రానున్నాయి. కామన్ టెలిస్కోపిక్ విధానం డొమెస్టిక్ కేటగిరీలో ఉన్న మూడు గ్రూపులను కామన్ టెలిస్కోపిక్ బిల్లింగ్ సిస్టమ్‌తో ఒకే గ్రూపుగా కమిషన్ తాజాగా విలీనం చేసింది. ఈ విధానంలో వినియోగదారుడు తక్కువ స్లాబ్‌లో చేసిన వినియోగానికి సంబంధిత తక్కువ స్లాబ్ టారిఫ్‌లో బిల్ వేస్తారు. పేద గృహ వినియోగదారుల కోసం 0–30 యూనిట్ల కొత్త స్లాబ్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల యూనిట్లు పెరిగినప్పటికీ స్లాబుల ప్రకారమే బిల్లు పడుతుంది. కమర్షియల్ 2 కేటగిరీ కింద ఉన్న మైనర్, మేజర్ సబ్ కేటగిరీలను విలీనం చేయడంతో నెలకు 50 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వినియోగదారులకు ఎనర్జీ ఛార్జీలు తగ్గుతాయి. గృహ విద్యుత్ టారిఫ్‌ను స్వల్పంగా పెంచినా వీరిలో 90 శాతం మంది సగటు సరఫరా వ్యయం యూనిట్ రూ.6.98 కంటే తక్కువ టారిఫ్‌లోకి వస్తారు. 75 యూనిట్ల వరకు వినియోగానికి సంబంధించి టారిఫ్ ఇప్పటికీ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువగా ఉంది. దీని పరిధిలోకి వచ్చే వినియోగదారుల సంఖ్య మొత్తం గృహ వినియోగదారుల సంఖ్యలో 50 శాతం ఉంటుంది. వీరికి డిస్కమ్‌లు కొనుగోలు ధర కంటే తక్కువకే విద్యుత్‌ను సరఫరా చేస్తాయి. కామన్ గ్రూపు వల్ల స్వల్పంగానే పెంపు ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్ల విద్యుత్ వాడితే మొదటి 30 యూనిట్ల వరకూ యూనిట్‌కు రూ.1.90, తర్వాత 45 యూనిట్లకు యూనిట్‌కు రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.4.50, అనంతరం 100 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.6.0, చివరి 25 యూనిట్లకు యూనిట్‌కు రూ. 8.75 చొప్పున పడుతుంది. ఆ విధంగా వినియోగదారునికి బిల్లు మొత్తం రూ.1235.75 అవుతుంది. ఇదే బిల్లు పాత విధానం ధరల ప్రకారం అయితే మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.65, తర్వాత 50 యూనిట్లకు రూ.3.35, ఆ తర్వాత 100 యూనిట్లకు రూ.5.40, చివరి 50 యూనిట్లకు రూ.7.10 చొప్పున పడుతుంది. ఈ లెక్కన మొత్తం బిల్లు రూ.1,195 వస్తుంది. అంటే కొత్త చార్జీల ప్రకారం పెరుగుతున్న బిల్లు రూ.40.75 మాత్రమే. పరిశ్రమలకు ‘టైమ్ ఆఫ్ డే’ రాయితీలు టీఓడీ చార్జీలు పగలు 0.75 పైసలు తగ్గించడం ద్వారా పగటిపూట మాత్రమే పనిచేసే అధిక శాతం పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయి. పౌల్ట్రీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లకు రాయితీ టారిఫ్, ఆక్వా, పౌల్ట్రీ హేచరీలకు టీఓడీ నుంచి మినహాయింపునిచ్చారు. 2 కిలోవాట్ కంటే తక్కువ, 2 కిలోవాట్ కంటే ఎక్కువ కనెక్టెడ్ లోడ్ కలిగిన మతపరమైన ప్రదేశాలను దృష్టిలో ఉంచుకుని టారిఫ్‌ను కిలోవాట్‌కు ప్రస్తుతం ఉన్న రూ.4.80 నుంచి రూ.3.85కు మండలి తగ్గించింది. గోశాలలకు వర్తించే టారిఫ్‌ను కూడా ఇదే ప్రకారం కుదించారు. గ్రిడ్ సపోర్ట్ చార్జీలు.. గ్రిడ్ సపోర్ట్ చార్జీలను పునరుద్ధరించాలని డిస్కమ్‌లు కోరగా కిలోవాట్‌కి రూ.15 నుంచి రూ.50 వరకు విధించడం ద్వారా సంబంధిత విద్యుదుత్పత్తిదారులకు ఊరట కల్పించారు. ఓ కేటగిరిలోని పారిశ్రామిక వినియోగదారులపై ఓల్టేజ్ సర్‌చార్జీ విధించాలన్న డిస్కమ్‌ల ప్రతిపాదనను మండలి అంగీకరించలేదు. రాష్ట్రంలో మొదటిసారిగా 132 కేవీ కంటే 220 కేవీ ఓల్టేజీ వినియోగదారులకు 0.5 పైసలు తక్కువ టారిఫ్‌ను మండలి నిర్ణయించింది. పంపిణీ వ్యాపారం సర్దుబాటు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్‌కు సంబంధించి విద్యుత్ పంపిణీ వ్యాపారం సర్దుబాటు ఖర్చులను రూ.3,368, రూ.609 కోట్లుగా మండలి నిర్ణయించింది. అయితే 2022–23లో వినియోగదారుల నుంచి రూ.2,910.74 కోట్ల కంటే తక్కువ మొత్తం మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఆగస్టు 1 నుంచి ఈ వసూలు మొదలవుతుంది. సరఫరా వ్యాపారం సర్దుబాటు ఖర్చులకు సంబంధించి 3వ నియంత్రణ కాలానికి రూ.492 కోట్లుగా మండలి నిర్ణయించింది. అయితే ఏపీ ట్రాన్స్‌కోకు రానున్న పాయింట్ ఆఫ్ కనెక్షన్ (పీఓసీ) ఛార్జీల నుంచి దీన్ని సర్దుబాటు చేయాలని ఆదేశించడం ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చర్యలు తీసుకుంది. అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు పోర్టల్ వినియోగదారులు అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకునేందుకు పంపిణీ సంస్థల వెబ్సైట్లలో సౌకర్యాన్ని కల్పించాలని మండలి ఆదేశించింది. పైలట్ ప్రాజెక్ట్‌లకు రూ.3 కోట్లు విద్యుత్ పొదుపు ఉపకరణాలు, సౌర విద్యుత్తుతో వ్యవసాయం మొదలైన ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టడానికి నెలలోగా తమ బకాయిల నుంచి రూ.కోటి చొప్పున ఏపీసీడ్కోకు మూడు డిస్కంలు మొత్తం రూ.3 కోట్లు విడుదల చేయాలని మండలి ఆదేశించింది. అందరికీ ఆమోదయోగ్యంగానే నిర్ణయం తిరుపతి రూరల్: వినియోగదారులకు ఊరట కల్పించటంతోపాటు డిస్కంలకు ఆర్థిక భరోసా కల్పించేలా విద్యుత్ టారిఫ్‌లను ఆమోదించినట్లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయూ సెనెట్ హాలులో ఆయన విద్యుత్ టారిఫ్ విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయ అవసరాలు, ధరల ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి టారిఫ్ ప్రకటించినట్లు తెలిపారు. గతంలో ఉన్న మూడు రకాల శ్లాబ్‌లను ఎత్తివేసి అందరికీ ఉపయోగపడేలా కొత్తగా కామన్ టెలిస్కోపిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఫంక్షన్ హాళ్లు తెరవకున్నా గతంలో నెలకు కిలోవాట్‌కు విధించిన రూ.100 కనీస చార్జీల్ని ఎత్తివేశామన్నారు. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు యూనిట్‌కు రూ.6.70 ధరను కొనసాగిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామ్‌సింగ్, రాజగోపాల్‌రెడ్డి, డిస్కమ్‌ల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్ధనరెడ్డి, సంతోషరావు పాల్గొన్నారు. -
కొత్త విద్యుత్ టారిఫ్ ప్రకటించిన ఏపీఈఆర్సీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) సోమవారం కొత్త విద్యుత్ టారిఫ్‌లను ప్రకటించింది. 500 యూనిట్లలోపు గృహవినియోగదారులకు టారిఫ్ రేట్లను పెంచలేదు. 500 యూనిట్లకు పైబడిన వారికి యూనిట్ ధరను రూ.9.05నుంచి 9.95కు పెంచింది. ప్రతి నెలకు ఆ నెలలోని విద్యుత్ వినియోగంపైనే ఈ వర్గీకరణ ఉండేందుకు ఏపీఆర్సీ ఆమోదం తెలిపింది. ఇక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకుగాను రూ.8,353.58కోట్లను విద్యుత్ సంస్థలకు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 18శాతం ఎక్కువ సబ్సిడీ పెరిగింది. సబ్సిడీ పెంచడంతో అదనంగా 18లక్షల మంది వ్యవసాయదారులకు లబ్ది చేకూరనుంది. 500 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా కోసం రూ.1707.07 కోట్లను సబ్సిడీ రూపంలో విద్యుత్ సంస్థలకు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. -
ఫీ‘జులుం’ఇక సాగదు
సాక్షి, కడప ఎడ్యుకేషన్: ఉన్నత స్థానాలు అధిరోహించాలి. బంగారు భవితకు బాటలు చేయాలి. కానీ కన్నవారి కలల సాకారానికి ప్రభుత్వ కళాశాలలు అంతగా లేవు. అరకొరగా ఉన్నా వాటిలో కూడా అధ్యాపకుల కొరతతోపాటు మౌలిక వసతుల కొరత వేధిస్తున్నాయి. ఈ రెండింటి సమస్యల నడుమ ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు నలిగిపోవాల్సిందే. ఈ వ్యవహారమంతా ప్రభుత్వానికి తెలిసినా కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల యాజమాన్యానికి మేలు చేకూర్చేందుకే ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ కళాశాలల్లోని సమస్యలను పరిష్కరించడంలో అంతగా చొరవ చూపడం లేదంటూ మేధావులు, విద్యావంతులు తçప్పుబడుతున్నారు. వీటన్నింటిని గమనించిన తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి బోధన అందించాలనే ఉద్దేశంతో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలను ఆశ్రయిస్తే దానిని వారు అదనుగా తీసుకుని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు రకరకాల కోర్సుల పేరుతో అడ్డు అదుపు లేకుండా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు ఫీజుల భారం మోయలేక ఇళ్లు, ఒళ్లు గుళ్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిక ఫీజుల భారంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల ఊబిలో పడి మానసిక వేదనతో విలవిల్లాడుతున్నారు. పిల్లలను చదివించలేకపోతున్న పేదల వేదనను ప్రజా సంకల్పయాత్రలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన ఆయన కార్పొరేట్ ఫీజులను క్రమబద్ధీకరించే వ్యవస్థను తీసుకొస్తానని ప్రకటించారు. అందుకు కమిషన్‌ను నియమించి నేరుగా ముఖ్యమంత్రికి నివేదికను అప్పగించే నియంత్రణ వ్యవస్థను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఫీజులను తగ్గించడమే కాకుండా కళాశాలలకు మెరుగైన వసతుల కల్పనకు రెగ్యులేటర్ కమిషన్‌ద్వారా తానే సమీక్షిస్తానంటూ ప్రకటించడంపై పేద, మధ్య తరగతి కుంటుబాలతోపాటు మేధావులు, సామాన్యులు సైతం హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్లో ఫీజులుం ఇలా ... జిల్లాలో 80కి పైగా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 20 వేలకు పైగా విద్యార్థులు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరిపై ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యం వివిధ రకాల కోర్సుల పేరుతో ఫీ‘జులుం’ ప్రదర్శిస్తున్నారు. జిల్లా పరిధిలోని పలు కార్పొరేట్ కళాశాలల్లో ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. ఎంపీసీ 18 వేలు, ఏఐఈఈఈ ఐసీ బ్యాచ్ రూ. 24 వేలు, జెడ్ఎఫ్టీసీకి రూ. 32, బైపీసీ నీట్ ఐసీ బ్యాచ్ రూ. 24 స్పార్కు బ్యాచ్ 32, ఐఐటి స్పార్క్ రూ. 60 వేలు, ఎన్‌వన్ 20 బ్యాచ్ రూ. 25 వేలు, నీట్ 40 వేలు, నీట్ ఎన్40 బ్యాచ్‌కు 80 వేలు ఇలా ఫీజులను వసూలు చేస్తున్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీలకు సంబంధించి రూ. 12 వేల నుంచి 18 వేల వరకు ఉన్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులకు కళ్లెం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల దోపిడీతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడంతో ఫీజుల దోపిడీకి నియంత్రణ లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల తగ్గింపు, ప్రమాణాల పెంపు, ప్రైవేట్ టీచర్ల స్థితిగతులు మెరుగుపరిచేందుకు రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం హర్షణీయం. – రాహుల్, ప్రొద్దుటూరు. పేదలకు ఊరట ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చాలా మంచి నిర్ణయం. ప్రస్తుతం విద్యావ్యవస్థ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఒకటో తరగతికి రూ.80వేలు పైనే ఫీజులు ఉన్న పాఠశాలలు ప్రతి పట్టణంలోనూ ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చాలామంది పల్లెలలో చిన్నారులను చదివించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ జగన్ నిర్ణయం ఇలాంటి వారికి ఊరట కలిగిస్తుంది. – సుకన్య, బద్వేలు ప్రభుత్వ బడులు నిర్వీర్యం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయి. గత నాలుగేళ్లలో జిల్లాలో 500కు పైగా పాఠశాలలు మూత పడ్డాయి. చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు కల్పించకపోవడంతో చాలామంది ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరుతున్నారు. ఇలాంటి దుస్థితి మారుస్తామని వైఎస్ జగన్ ప్రకటన చేశారు. నిర్వీర్యమైన పాఠశాలలకు తిరిగి పునర్జీవం వస్తుంది. – పవిత్ర, మామిళ్లపల్లె, కలసపాడు మండలం విద్య వ్యాపారంగా మారింది... నేటి సమాజంలో విద్య వ్యాపారంగా మారింది. అడ్మిషన్ ఫీజు, పుస్తకాలు, స్టడీమెటీరియల్, రికార్డులు వీటితోపాటు ఫీజులను ఇలా పలు రకాల పేరుతో విద్యార్థుల నుంచి డబ్బులను వసూలు చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ ఫీజుల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేస్తామనటం అభినందనీయం. – అంబటి, రాజశేఖర్‌రెడ్డి, ఆలంఖాన్‌పల్లె, కడప. అందరికీ అందుబాటులో విద్య... ప్రస్తుత తరుణంలో కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల భారం మోయలేని విధంగా తయారైంది. తల్లిదండ్రులు కార్పొరేట్ మోజులో పడి అప్పులు చేసి చదివిస్తున్నారు. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కార్పొరేట్ యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిటీని నియమిస్తామనటంతో అందరికీ విద్య అందుబాటులోకి వస్తుంది. – చెంచిరెడ్డి, రిటైర్డు హెడ్మాస్టర్ జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నాం ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటను మేము స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్న కార్పొరేట్ విద్యా వ్యవస్థ స్థానంలో కామన్ విద్యా విధానం తీసుకరావాలి. అప్పుడు మాత్రమే సామాన్యలు తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించడానికి వీలుంటుంది. – ఖాజారహ్మతుల్లా, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు. చదువు మీది..భరోసా మాది..! వైవీయూ : పేదరికం కారణంగా ఫీజులు చెల్లించలేక ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కావద్దని దివంగత ముఖ్యమంత్రి డాక్టర వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా లక్షలాది విద్యార్థులు ఉన్నతవిద్యకు నోచుకోగా.. ఆయన మరణానంతరం ఈ పథకాన్ని పాలకులు క్రమేణా నీరుగార్చారు. ప్రస్తుత ప్రభుత్వం సరిగా నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. గతంలో సెమిస్టర్‌కు 75 శాతం ఉండాలని పేర్కొనగా.. ప్రస్తుతం ప్రతినెలా 75 శాతం హాజరు ఉండాలంటూ ఇలా రకరకాల నిబంధనలు పెట్టడం వలన విద్యార్థులు చాలా మంది ఈ పథకానికి దూరమవుతున్నారు. జననేత జగన్ హామీతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థులు పడుతున్న బాధలు విన్నారు.. మీకు నేను ఉన్నానంటూ వారికి ఫీజుల భారం తగ్గిస్తామని ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ పథకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోలో సైతం చేర్చి తన నిబద్ధతను చాటుకున్నారు.ఈ నిర్ణయం పట్ల విద్యార్థిలోకం హర్షం వ్యక్తం చేస్తోంది. వైఎస్ఆర్ హయాంలో.. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసే సమయంలో పేద విద్యార్థుల కష్టాలను తెలుసుకుని ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉన్నత, సాంకేతిక విద్య చేరువై లక్షలాది మంది విద్యార్థులు వైద్యులుగా, ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా రాణించారు. టీడీపీ పాలనలో.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిబంధనలతో కోత పెట్టారు. మరోవైపు కళాశాలలకు ఫీజులు పెంచడానికి అనుమతులిచ్చేశారు. లక్షల్లో ఫీజు ఉంటే వేలల్లో మంజూరు చేస్తుండటంతో మిగిలిన భారం విద్యార్థులపై పడుతోంది. వైఎస్ జగన్ వాగ్దానమిదీ.. పేద విద్యార్థుల చదువుకు పూర్తి ఖర్చు భరిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. నవరత్నాల్లో భాగంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. కళాశాల ఫీజుతో పాటు భోజనం, వసతి కోసం రూ.20వేలు ఇస్తామన్నారు. జగన్ మాటిస్తే తప్పరని, అన్నమాటపై భరోసా ఉంటుందని విద్యార్థి లోకం విశ్వసిస్తోంది. కొండంత భరోసా.. విద్యార్థులకు ఉన్నత చదువును అందించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేస్తామని జగనన్న ప్రకటించడం సంతోషంగా ఉంది. దీంతో పాటు వసతి, భోజనం కోసం రూ.20 వేలు ఇస్తామనడం గొప్ప నిర్ణయం. దీని వలన పేద విద్యార్థులందరూ కూడా ఉన్నతవిద్యవైపు వస్తారు. – ఎం. అరుంధతి, ఎంఎస్సీ జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్, వైవీయూ భవిష్యత్‌పై ఆశలు.. పేద విద్యార్థులు ఉన్నతవిద్య సులువుగా చదువుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో ఫీజురీయింబర్స్‌మెంట్ సరిగా రాక ఇబ్బందులు పడ్డాం. వైఎస్ జగన్ ప్రకటించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మా భవిష్యత్‌పై ఆశలు నిలుపుతోంది. – ఎస్. గురువయ్య, పీజీ విద్యార్థి, బద్వేలు -
చంద్రబాబు గిమ్మిక్కులు చూసి మోసపోవద్దు
సాక్షి, ప్రొద్దుటూరుటౌన్ : చంద్రబాబు గిమ్మిక్కులు చూసి ప్రజలు మోసపోవద్దని ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లె పంచాయతీ అమృతానగర్‌లోని వైఎస్ విగ్రహం వద్ద ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చకుండా మళ్లీ ఎన్నికలు రెండు నెలల్లో వస్తున్నాయని మభ్యపెట్టే పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రెండేళ్ల క్రితమే వైఎస్ జగన్మోహన్రెడ్డి పింఛన్‌ను రూ.2వేలు ఇస్తానని ప్రకటించారని, తాను కూడా రూ.2వేలు ఇస్తానని చంద్రబాబు ప్రకటిస్తారని చెప్పారన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా తాను అమృతానగర్‌కు వచ్చానన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే ఈ కాలనీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆనాడు చెప్పానని, అయితే దురదృష్టవశాత్తు అధికారంలోకి రాలేకపోయామన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి తనను, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని పిలిపించి టీడీపీ ప్రభుత్వం అమృతానగర్ను అభివృద్ధి చేయకుండా ఎంత నిర్లక్ష్యం చేసిందో వివరించారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 3,640 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి కచ్చితంగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్నారు. రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తా అమృతానగర్ను రూ.150 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాదెడ్డి పేర్కొన్నారు. ఇది కూడా విడతల వారీగా కాకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నిధుల విడుదల చేసే తొలి సంతకంతో ఈ మొత్తాన్ని తీసుకొస్తానని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు తప్పక నమ్మాలని తెలిపారు. టీడీపీకి ఎందుకు ఓట్లు వేయకూడదో తాను చెబుతానని, చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అయినా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు అంతటి మోసగాడు ఎవరూ లేరన్నారు. ఓట్ల కోసం ప్రజలను ఎన్నో విధులుగా మభ్యపెడుతున్నారని, వీటన్నింటినీ ప్రజలు గమనించాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే జిల్లాతోపాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసుకోవాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అమృతానగర్ ప్రజలు ఫ్యాన్ గుర్తుకు తప్ప వేరే పార్టీకి ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు.సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
అవసరం లేకున్నా విద్యుత్ కొనుగోళ్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని ప్రభుత్వమే చెబుతోంది. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ జెన్కో ప్లాంట్ల విద్యుత్ సామర్థ్యం తగ్గించి, ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేస్తోంది. యూనిట్‌కు ఏకంగా రూ.6.20 చెల్లిస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య రూ.21 కోట్ల విలువైన 35.11 మిలియన్ల యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది. కేవలం తమవారి ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు 15 రోజులుగా సాగుతున్న ఈ తంతులో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆంక్షలు విధించింది. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీకి చెందిన ఖమ్మం మాజీ ఎంపీ ఒకరు, మరో రాజకీయ ప్రముఖుడు.. ఈ ఇద్దరికి సంబంధించిన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఆ ఒప్పందం మేరకే జెన్కో ప్లాంట్లలో ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తి తగ్గించి, బహిరంగ మార్కెట్లో అధిక ధర వెచ్చించి విద్యుత్ కొనుగోళ్లకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. యూనిట్ రూ.4కే జెన్కో విద్యుత్ జెన్కో ప్లాంట్ల నుంచి యూనిట్ విద్యుత్ కేవలం రూ.4కే లభిస్తుంది. కానీ ఈ ప్లాంట్లలో ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తి తగ్గిస్తున్న ప్రభుత్వం.. ప్రైవేటు సంస్థల నుంచి యూనిట్‌కు ఏకంగా రూ.6.20 వరకు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేస్తోంది. బహిరంగ మార్కెట్లో మరే ఇతర రాష్ట్రాల పోటీ లేకున్నా అంత రేటు పెట్టి కొనుగోలు చేయడంపై విద్యుత్‌రంగ వర్గాలనే విస్మయ పరుస్తోంది. విద్యుత్ సంస్థల గణాంకాలు పరిశీలిస్తే.. ఈ నెల 7వ తేదీ మొదలు 11 రోజుల్లో రూ.21,76,82,000 వ్యయం కాగల విద్యుత్ కొనుగోళ్లు చేసినట్లు లెక్కతేలింది. కొనాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో ప్రస్తుతం సగటున 175 నుంచి 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. గత నాలుగేళ్ళుగా అటు ఇటూగా ఇదేవిధమైన డిమాండ్ కొనసాగుతోంది. ఈ డిమాండ్‌కు తగ్గ విద్యుత్ రాష్ట్రంలో అందుబాటులో ఉంది. ఎన్టీపీసీ (ఇబ్రహీంపట్నం), రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ–ముద్దనూరు), దామోదరం సంజీవ య్య థర్మల్ (కృష్ణపట్నం) విద్యుత్ కేంద్రాలకు 5,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అంటే రోజుకు 120 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభించే వీలుంది. ఈ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4 లోపే ఉంటుంది. దీనికితోడు 1,797 మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉంది. ప్రస్తుతం నీళ్ళు లేవనుకున్నా మాచ్‌ఖండ్, సీలేరు నుంచైనా రోజుకు 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభించే అవకాశం ఉంది. కేంద్ర విద్యుత్ వాటా 52 మిలియన్ యూనిట్లు అందుతుంది. ఇవి కాకుండా పీపీఏలున్న స్వతంత్ర విద్యుత్ సంస్థలు (ఐపీపీలు) 10 ఎంయూలు, పవన విద్యుత్ 13 ఎంయూలు, సౌరవిద్యుత్ 10 మిలియన్ యూనిట్లు అందుబాటులో ఉంది. ఇవన్నీ కలుపుకుంటే రాష్ట్రంలో విద్యుత్ లభ్యత 225 మిలియన్ యూనిట్లు ఉంటుంది. డిమాండ్ (185 ఎంయూ) కన్నా రోజుకు 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగులు ఉండే వీలుంది. జెన్కో ప్లాంట్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగితే మిగులు సాధ్యమేనని విద్యుత్ సంస్థలే ఏపీఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ, అవసర నివేదికల్లో (ఏఆర్ఆర్) పేర్కొన్నాయి. అయినప్పటికీ, అవసరం లేకపోయినా ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేస్తోంది. బొగ్గు కొరత కారణంగా జెన్కో ఉత్పత్తి తగ్గిందని, ఆర్టీపీపీ కొత్త ప్లాంట్‌కు బొగ్గు లింకేజీ ప్రక్రియ పూర్తవ్వలేదని జెన్కో వర్గాలు చెబుతున్నాయి. అయితే బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని కోల్ ఇండియా చెబుతుండటం గమనార్హం. దీన్నిబట్టి. ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు గాను ఉద్దేశపూర్వకంగానే జెన్కో ఉత్పత్తి తగ్గిస్తున్నారని స్పష్టమవుతోంది. -
తెలంగాణకు విద్యుత్ ఆపేద్దాం!
సీఎస్‌తో సమావేశంలో అధికారులు సాక్షి, అమరావతి: తెలంగాణకు విద్యుత్ నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉన్నతాధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. ఏపీకి రావాల్సిన బకాయిలపై అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిశ్చయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ నేతృత్వంలో వెలగపూడిలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ వివాదాలపై చర్చించారు. -
రూ.2 వేల కోట్ల బాదుడు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల బాదుడుకు రంగం సిద్ధమైంది. మరో రెండురోజుల్లో కొత్త టారిఫ్ ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఈ మేరకు చేపట్టిన కసరత్తు దాదాపు పూర్తయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రజలపై సుమారు రూ. 2 వేల కోట్ల అదనపు విద్యుత్ చార్జీల భారం పడే వీలుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచడం ఇది రెండోసారి. 2015-16లో రూ. 941 కోట్ల భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం మోపింది. టారిఫ్ ప్రతిపాదనల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.783 కోట్ల మేరకు చార్జీల పెంపును తొలుత ప్రతిపాదించాయి. అయితే పరోక్ష పద్ధతిలో మరో రూ.1,217 కోట్లు రాబట్టాలని ఆ తర్వాత నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2016-17లో 66,839 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభ్యత ఉంటుందని, విద్యుత్ డిమాండ్ 57,565 మిలియన్ యూనిట్లు ఉండొచ్చని డిస్కమ్‌లు అంచనా వేశాయి. 9,274 మిలియన్ యూనిట్ల మేర మిగులు విద్యుత్ ఉంటుందని, ఇందులో 7,142 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తామని తెలిపాయి. మొత్తం మీద 2016-17లో రూ.5,148 కోట్ల మేర ఆర్థిక లోటు ఉంటుందని పేర్కొన్నాయి. ఇందులో రూ.4,365 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇస్తుందని, మిగిలిన రూ. 783 కోట్లు వినియోగదారుల నుంచి రాబట్టాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. అయితే ప్రభుత్వం సబ్సిడీలో భారీగా కోత పెట్టింది. కేవలం రూ.3 వేల కోట్లతో సరిపెట్టింది. దీంతో ఆర్థికలోటు ఏకంగా రూ. 2,148 కోట్లకు పెరిగింది. కొత్త టారిఫ్ ఖరారులో భాగంగా ఈఆర్సీ సూచనల నేపథ్యంలో వచ్చే ఏడాదిలో ప్రజల నుంచి రూ.2వేల కోట్లు అదనంగా రాబట్టుకునేం దుకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. గ్రూపుల విధానంతో పేదలపై దొంగ దెబ్బ ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు చేసి, ఆ భారాన్ని తమపై వేస్తున్నారన్న భావన ప్రజల్లో నాటుకుపోయింది. ఇటీవలి ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే వ్యక్తమైంది. దీన్ని గుర్తించిన విద్యుత్ సంస్థలు దొడ్డిదారిలో జనంపై భారం వేసేందుకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం టెలిస్కోపిక్ విధానం అమలులో ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి గ్రూపుల పద్ధతిని తెరమీదకు తెస్తున్నారు. టెలిస్కోపిక్ విధానంలో.. ఓ గృహ వినియోగదారుడు నెలకు 200 యూనిట్లు వాడాడనుకుంటే తొలి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45, 51 నుంచి 100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.2.60, 101 నుంచి 200 యూనిట్ల వరకు రూ.3.40 చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రూపుల విధానాన్ని ప్రవేశపెట్టి ఏడాది విద్యుత్ వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకుని చార్జీలు వసూలు చేయనున్నారు. దీనివల్ల నెలకు 50 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే (పేదవర్గాలు) వారిపై భారం పడనుంది. అంటే ఏడాదికి సగటున 600 యూనిట్లు వాడే వినియోగదారుడు ఒక్క యూనిట్ ఎక్కువ (601) వాడినా తదుపరి ఏడాది నుంచి ఎక్కువ టారిఫ్ (రూ.2.60)లోకి వెళుతుండటంతో ఆ మేరకు నెలసరి బిల్లు భారీగా పెరగనుంది. ఎలాగంటే ప్రస్తుతం నెలకు 0-50 యూనిట్ల వాడకానికి రూ.72.50 (50ఁ1.45) బిల్లు చెల్లిస్తున్నారు. ఏడాదిలో ఒక్క యూనిట్ ఎక్కువ వాడటం వల్ల ఆ వినియోగదారుడు తదుపరి టారిఫ్‌లోకి వెళ్లి నెలసరి బిల్లు రూ.130 (50ఁ2.60)కి కానుంది. అంటే నెలకు అదనంగా రూ.57.50 చెల్లించాల్సి వస్తుందన్నమాట. రాష్ట్రంలో 50 యూనిట్ల వరకు వాడేవారి సంఖ్య 1.6 కోట్ల వరకు ఉంది. గ్రూపుల విధానం వల్ల ప్రస్తుత ఏడాదిలో 601 యూనిట్లు అంతకుమించి (తదుపరి గ్రూపు 2,400 యూనిట్లు) విద్యుత్‌ను వినియోగించిన దాదాపు 40 లక్షల మంది పేదవర్గాలపై వచ్చే ఆర్థిక సంవత్సరంలో దొడ్డిదారి విద్యుత్ చార్జీల ప్రభావం పడనుంది. -
నిలదీద్దాం రండి
ఏప్రిల్ నుంచి ప్రజలపై విద్యుత్ పిడుగు నెలకు రూ.40 కోట్ల భారం పెంపుపై నేడు, రేపు {పజాభిప్రాయ సేకరణ వినియోగదారులు మౌనంగా ఉంటే బాదుడే విశాఖపట్నం: వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. డిస్కంలు ఈ మేరకు ఆదాయ, వ్యయ నివేదికలను ఏపీఈఆర్సీకి అందజేశాయి. ఇక చార్జీలు పెంచడమే తరువాయి. ఈ నేపథ్యంలో తాము పెంచబోయే చార్జీలపై అభిప్రాయాలు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్సీ) సోమ, మంగళవారాల్లో ప్రజల ముందుకు రానుంది. దీనివల్ల చార్జీల పిడుగును ప్రశ్నించే అవకాశం వినియోగదారులకు కలుగుతోంది. ప్రభుత్వాన్ని నిలదీసే సరైన వేదిక దొరుకుతోంది. ఇప్పుడు కూడా మనకెందుకులే అని మౌనం వహిస్తే తర్వాత విద్యుత్ బిల్లులు తడిసిమోపెడవుతాయి. ఇదో వేదిక 2015-16 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీల పెంపుపై 23వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలోని డాక్టర్ వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో ప్రజాభిప్రాయ సేకరణకు ఏపీఈఆర్సీ, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) అధికారులు సిద్ధమవుతున్నారు. అభిప్రాయాలను వెల్లడించే ప్రజలు ఎక్కువగా వస్తే 24వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ కూడా అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అధికారుల నుంచి సంతృప్తికర సమాధానం రాకపోతే మార్చి 4వ తేదీ ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకూ హైదరాబాద్‌లోని ఏపీఈఆర్సీ కోర్టు హాల్లో జరిగే అభిప్రాయ సేకరణలోనూ వినియోగదారులు తమ వాదాన్ని వినిపించే అవకాశం ఉంది. మనకు మినహాయింపు తప్పనిసరి అభిప్రాయ సేకరణకు ముందు విద్యుత్ టారిఫ్ వివరాలను వినియోగదారులకు అధికారులు వెల్లడిస్తారు. ఇవి రాష్ట్రం మొత్తం అన్ని డిస్కంలలో దాదాపుగా ఒకేలా ఉంటాయి. విశాఖ జిల్లా ఈపీడీసీఎల్ పరిధిలో ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో హుద్‌హుద్ తుపాను విశాఖను కుదిపేసింది. జనం ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో చార్జీల భారం నుంచి ఉత్తరాంధ్రకు మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది. నెల నెలా ఎంతిస్తున్నాం జిల్లాలో 11 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిలో 8.27 లక్షల మంది గృహ వినియోగదారులున్నారు. వీటిలో 0-100 యూనిట్లు వాడే వారు 5.03లక్షల మంది, 101యూనిట్లు ఆపైనవాడే గృహ వినియోగ దారులు 3.24 లక్షల మంది ఉన్నారు. వందయూనిట్ల వినియోగించే వినియోగదారులు నెలకు 2.85కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీని వల్ల రూ.5.50 కోట్ల ఆదాయం వస్తుంది. 101 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించే వినియోగదారులు నెలకు 6.4కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీని వల్ల రూ.25కోట్ల ఆదాయం వస్తుంది. ఎల్టీ సర్వీసులు కలిగిన వారి నుంచి రూ.65కోట్ల ఆదాయం వస్తుంటే, హెచ్‌టీ సర్వీసులున్న వారి నుంచి రూ.170కోట్ల ఆదాయం వస్తుంది. ఈ విధంగా నెలకు విశాఖ సర్కిల్‌కు రూ.235 కోట్ల ఆదాయం వస్తుంది. అదనపు భారం ఇలా.. ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీలు పెంచనున్నారు. కేటగిరీ వారీగా 10 నుంచి 15 శాతం చార్జీలు పెంచాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా 100 యూనిట్లు దాటి వినియోగించే వారిపై ఎక్కువ చార్జీ పడనుంది. ఈ లెక్కన నెలకు రూ.40 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. అంటే 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.480 కోట్ల అదనపు భారం జిల్లా విద్యుత్ వినియోగదారులపై పడబోతోంది. -
‘విద్యుత్ మండలి’ చైర్మన్‌గా భవానీ ప్రసాద్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కొత్త చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీ జెన్కో, ట్రాన్స్ కో ఎండీ విజయానంద్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులు కొత్త చైర్మన్‌ను అభినందించారు. ఈ సందర్భంగా భవానీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై గురుతర బాధ్యత పెట్టిందని, అందరి సహకారంతో ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. విద్యుత్ చార్జీల భారం లేకుండా ఉండేలా కృషి చేస్తానని అన్నారు. -
పీఎల్ఎఫ్ తక్కువగా ఉంటే పెనాల్టీ వేయొచ్చు
స్పెక్ట్రమ్ పిటిషన్‌ను కొట్టేసిన ఈఆర్సీ హైదరాబాద్: ఒప్పందం కంటే ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) తక్కువగా వచ్చినందున ప్రోత్సాహ రహితం (డిస్-ఇన్సెంటివ్-పెనాల్టీ) వసూలు చేసే అధికారం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తేల్చిచెప్పింది. 5, నవంబర్ 2002 నుంచి 16 డిసెంబర్ 2013 మధ్యకాలంలో 68.49 శాతం ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 68.5 శాతం కంటే తక్కువగా వచ్చినందున రూ.25.61 కోట్ల పెనాల్టీని డిస్కంలు వసూలు చేశాయి. దీంతో ఇలా వసూలు చేసేందుకు వీలులేదని పేర్కొంటూ స్పెక్ట్రమ్.. ఏపీఈఆర్సీని ఆశ్రయించింది. అయితే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) మేరకు నిర్దేశించుకున్న 68.49 శాతం పీఎల్ఎఫ్ కంటే తక్కువగా వస్తే పెనాల్టీ వేసే అవకాశం ఉందని ఈఆర్సీ స్పష్టంచేస్తూ.. స్పెక్ట్రమ్ పిటిషన్‌ను కొట్టివేసింది. -
మా దారి మాదే!
ఈఆర్సీ ఆదేశాలు బేఖాతర్ చేసిన ఏపీ సర్కారు.. కుట్ర దాగుందన్న అనుమానాలు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) అమల్లో ఉన్నట్టేనన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) తాజా ఆదేశాలపై ఏపీ సర్కారు మం డిపడుతోంది. ఏపీఈఆర్సీ ఉనికినే తాము గుర్తించడం లేదని, దాని ఆదేశాలను పాటించబోమని తేల్చి చెబుతోంది. ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ఈఆర్సీ.. ఏకంగా విధాన నిర్ణయాలు ఎలా తీసుకుంటుందని ప్రశ్నిస్తోంది. ఏపీ జెన్కో ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తెలంగాణకు ఇచ్చేది లేదని రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త ఈఆర్ సీ ఏర్పాటుకు ఇప్పటికే చర్యలను ప్రారంభించినట్లు తెలిపా యి. ఏపీఈఆర్సీ తాజా ఆదేశాలపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొన్నటివరకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామన్న ఈఆర్సీ.. అత్యవసరంగా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నాయి. అప్పుడు చెప్పలేదేం?: పీపీఏలను రద్దు చేసుకుంటామని ఏపీ జెన్కో దరఖాస్తు చేసుకున్న సమయంలో కానీ, పీపీఏలు ఉన్నాయా.. లేదా? అని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అడిగినప్పుడు కానీ... ఎందుకు సమాధానం చెప్పలేదని ఏపీఈఆర్సీపై ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది. అసలు సీఈఏ కమిటీ సమావేశాలకే రాని ఏపీఈఆర్సీకి దాని నివేదిక ఆలస్యమవుతుందని ఎలా తెలిసిందని, ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తోంది. విభజన చట్టంలో ఏపీఈఆర్సీ తమకే దక్కుతుందని ఎక్కడా పేర్కొనలేదని ఏపీ వర్గాలు అంటున్నాయి. విభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే మినహా ప్రస్తుత ఏపీఈఆర్సీ.. మరో నాలుగు నెలల తర్వాత.. అంటే వచ్చే జనవరి 2 తర్వాత రద్దవుతుందని వాదిస్తున్నాయి. సీఈఏ కమిటీ దృష్టికి ఈఆర్సీ నిర్ణయం! మరోవైపు ఏపీఈఆర్సీ జారీ చేసిన తాజా ఆదేశాలను సీఈఏ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోం ది. పీపీఏలకు ఈఆర్సీ అనుమతి లేకపోయినప్పటికీ చెల్లుబాటులో ఉన్నట్టేనన్న ఈఆర్సీ నిర్ణయాన్ని కమిటీ దృష్టికి తేవ డం ద్వారా.. తెలంగాణకు సానుకూలంగా కమిటీ నిర్ణయం తీసుకుంటుందని రాష్ర్ట ఇంధన శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విద్యుత్ వివాదాలపై కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు గురువారమే(ఈ నెల 14న) సీఈఏ కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంది. నివేదికకు ముందుగానే ఈఆర్సీ ఆదేశాలు జారీకావడం తమకు కలిసొచ్చే అంశమని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
ఏపీఈఆర్సీ ఆదేశాలు అమలయ్యేలా చూడండి
కేంద్రానికి తెలంగాణ లేఖ సాక్షి, హైదరాబాద్: విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు అమల్లో ఉన్నట్టేనన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖకు తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి మంగళవారం లేఖ రాశారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర విభ జన అనంతరం ఆరు నెలలపాటు ఏపీఈఆర్సీనే రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉంటుందని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏపీఈఆర్సీ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఏపీ మాత్రం ఏపీఈఆర్సీని గుర్తించబోమని, ఆ ఆదేశాలు తాము పాటించమని పేర్కొంటోందని ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహార శైలి విభజన చట్టానికి భిన్నంగా ఉందని వివరించారు. అందువల్ల ఏపీఈఆర్సీ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణకు 53.89 శాతం విద్యుత్తు వచ్చేలా చూడాలని కోరారు. తెలంగాణలో విద్యుత్తు కోతల అంశాన్ని ఈ లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
రాష్ట్ర విభజనతో ఉనికి కోల్పోయిన ఏపీఈఆర్సీ
ఏపీ జెన్కోను ఎవరూ ఆదేశించజాలరు: పరకాల సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి ప్రస్తుతం ఎలాంటి అధికారాలు, గుర్తింపూ లేవని ఆ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఒప్పందాలను అమలు చేయాలని ఏపీ జెన్కోను ఎవరూ ఆదేశించజాలరని మంగళవారం ఆయన వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాలుగా వేరుపడిన తర్వాత ఎవరికి వారు ఈఆర్సీలు ఏర్పాటు చేసుకున్నారని.. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏర్పడిన ఏపీ ఈఆర్సీ ఇప్పుడు తన ఉనికిని కోల్పోయిందని పేర్కొన్నారు. విభజనకు ముందునాటి ఒప్పందాల్లో 31 పీపీఏలు ఉన్నాయని వాటిని గౌరవిస్తామన్నారు. -
విద్యుత్ కొనుగోలుకు అనుమతివ్వండి
ఈఆర్సీని కోరిన తెలంగాణ డిస్కంలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ లోటును పూడ్చుకునేందుకు రానున్న 25 ఏళ్ల పాటు ఏటా వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని తెలంగాణ డిస్కంలు కోరాయి. ఈ మేరకు ఈఆర్సీకి తెలంగాణ డిస్కంలు శనివారం దరఖాస్తు చేసుకున్నాయి. దీర్ఘకాలానికి ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా లైన్లను ఏర్పాటుచేసేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. అయితే, విద్యుత్ కొనుగోలు బిడ్డింగ్ ద్వారా చేయాలా? లేక అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) ద్వారానా అన్నది నిర్ణయించాల్సి ఉంది. ఎంఓయూ ద్వారా కొనుగోలుకు అనుమతించాల్సిందిగా ఈఆర్సీని ప్రభుత్వం అభ్యర్థించే అవకాశముంది. కానీ, బిడ్డింగ్ ద్వారానే కొనుగోలు చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ స్పష్టం చేస్తోంది. ఆగస్టు 30 నాటికి కృష్ణపట్నం రెడీ: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో 800 మెగావాట్ల కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ తొలి యూనిట్ ఆగస్టు 30 నాటికి సిద్ధం కానుంది. దాంతో ఆగస్టు 30 నుంచి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి ప్రారంభించాలని శనివారం జరిగిన ఏపీసీపీడీసీఎల్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే, 200 మెగావాట్ల రెండో యూనిట్‌ను సెప్టెంబర్ 30 నాటికి గ్రిడ్‌కు అనుసంధానించాలని తీర్మానించారు. అయితే, కృష్ణపట్నం ప్లాంట్ ఒప్పందం మేరకు తెలంగాణ వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని ఈ సమావేశంలో తెలంగాణ డిస్కంల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయన్నారు. మీ ఆదేశాలు పాటించడం లేదు: సీలేరు ప్లాంట్ నుంచి విద్యుత్‌ను తెలంగాణకే ఇవ్వాలని గోదావరి జల నియంత్రణ బోర్డు చైర్మన్ మహేంద్రన్ రెండు రోజుల కిందట ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆ ఆదేశాలు జారీ అయి 48 గంటలు దాటినప్పటికీ తమకు విద్యుత్ ఇవ్వడం లేదని తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి సురేష్ చంద్ర శనివారం గోదావరి జల నియంత్రణ బోర్డుకు ఫిర్యాదు చేశారు. చైర్మన్ ఆదేశాలను వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
తెలంగాణకు కరెంట్ గండాలు
పీపీఏల రద్దు... సీజీఎస్ కోటా కత్తిరింపు అందుబాటులోకి రాని జలవిద్యుత్ విద్యుత్ కొనుగోళ్లలో ఇబ్బందులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు విద్యుత్ గండాలు ఒకదాని వెనక మరొకటి వచ్చిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దుకు చేస్తున్న యత్నాలు మొదలుకుని కేంద్ర విద్యుత్ ప్లాంట్ల (సీజీఎస్) కోటా కత్తిరింపు, విద్యుత్ కొనుగోళ్లకు వస్తున్న ఇబ్బందులు, లైన్ల ఏర్పాటులో ఎదురుకానున్న సమస్యలు... వెరసి తెలంగాణకు విద్యుత్ కష్టాలు తప్పవని అర్థమవుతోంది. ఏడాది వరకు విద్యుత్ కష్టాలు తప్పవని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో విద్యుత్ కష్టాలు ఎక్కువ కాలమే కొనసాగనున్నాయని అర్థమవుతోంది. మరోవైపు వర్షాలు లేకపోవడంతో జల విద్యుత్ కేంద్రాల రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. వర్షాలు ఇప్పటికిప్పుడు భారీగా కురిసినప్పటికీ ఎగువన ఉన్న కర్ణాటకలోని అలమట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండాలి... శ్రీశైలం రిజర్వాయర్‌కు నీరు చేరాలి. అప్పుడే జల విద్యుత్ ఉత్పత్తి సాగే అవకాశం ఉంది. వేలాడుతున్న పీపీఏల రద్దు కత్తి! ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతి లేని ప్లాంట్లతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి పీపీఏలు కొనసాగితే తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ సరఫరా అవుతుంది. పీపీఏలు లేకపోతే ఎక్కడి విద్యుత్ ప్లాంట్లు అక్కడే ఉండిపోతాయి. తద్వారా ఎవరి విద్యుత్‌ను వారు వాడుకోవాల్సిందే. ఫలితంగా తెలంగాణ కేవలం థర్మల్ ప్లాంట్లనుంచే ఏకంగా 541 మెగావాట్ల విద్యుత్‌ను (13 మిలియన్ యూనిట్లు) కోల్పోవాల్సి వస్తుంది. పీపీఏల రద్దు అనే కత్తి ఇంకా వేలాడుతూనే ఉందన్నమాట. ప్రస్తుత కోటా ప్రకారమే విద్యుత్ సరఫరా జరగాలని ఎస్ఆర్పీసీ ఆదేశించినప్పటికీ జల విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం లేదు. దీనిపై ఎస్ఆర్పీసీకి పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. దీనివల్ల విద్యుత్ వినియోగం అధికంగా ఉండే సమయాల్లో (సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు) ఆంధ్రప్రదేశ్ నుంచి జల విద్యుత్ కోటా తెలంగాణకు దక్కడం లేదు. సీజీఎస్ కోటా సవరింపు...సీజీఎస్ కోటాను కేంద్రం సవరిస్తూ తెలంగాణకు 52.12 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 47.88 శాతం కేటాయించింది. దీంతో 50 - 65 మెగావాట్ల విలువైన విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది. లైన్ల ఏర్పాటుకు తిప్పలు... అదనపు విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు కొత్తగా లైన్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఛత్తీస్‌గఢ్ మీదనే ఆధారపడాల్సి ఉంది. లైన్ల ఏర్పాటుకు ఏడాదికిపైగా పడుతుందని అంటున్నారు. కొత్తగా వచ్చే ఏడాది వరంగల్ జిల్లాలోని కేటీపీపీ నుంచి 600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. పెరిగే డిమాండుతో పోలిస్తే ఇది చాలా తక్కువని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్యాసు దెబ్బకు 97 మెగావాట్లు ఫట్ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో గెయిల్ గ్యాసు బ్లో అవుట్ దెబ్బ కాస్తా విద్యుత్ ఉత్పత్తిపై పడింది. లీకేజీ అయిన గెయిల్ ప్రధాన ట్రంకు లైను నుంచి నేరుగా ల్యాంకో ప్లాంటుకు గ్యాసు సరఫరా అవుతోంది. ఈ ప్లాంటుకు ఇప్పటివరకు రోజుకు 0.72 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాసు (ఎంసీఎండీ) సరఫరా అయ్యేది. తాజా బ్లో అవుట్‌తో ఇది నిలిచిపోయింది. ఫలితంగా 140 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా జీవీకే, రిలయన్స్, ఆంధ్రప్రదేశ్ గ్యాసు పవర్ కంపెనీ (ఏపీజీపీసీఎల్), స్పెక్ట్రమ్... మొత్తం నాలుగు గ్యాసు ఆధారిత ప్లాంట్లకు ఇదే లైను ద్వారా కొద్ది మొత్తంలో గ్యాసు సరఫరా అవుతోంది. ఇది కూడా తాజా ఘటనతో నిలిచిపోయింది. ఫలితంగా మరో 40 మెగావాట్ల విద్యుత్ నష్టపోయినట్టు ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే గ్యాసు బ్లో అవుట్ దెబ్బకు మొత్తం 180 మెగావాట్ల విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు నష్టపోవాల్సి వచ్చింది. ఈ గ్యాసు ప్లాంట్లతో పీపీఏ అమలులో ఉన్నాయి. ఇందులో తెలంగాణ వాటా 97 మెగావాట్లు కాగా ఆంధ్రప్రదేశ్ వాటా 83 మెగావాట్లు. -
పీపీఏలలో అసలు దోషి ఈఆర్సీయేనా?
అనుమతి కోసం 2009 లోనే దరఖాస్తు ఇప్పటివరకు స్పందించని ఈఆర్సీ హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దు అంశంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అసలు దోషా? పీపీఏల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా ఈఆర్సీ మిన్నకుండిపోవడమే ఇప్పుడీ రాద్ధాంతానికి కారణమవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీజెన్కోకు చెందిన 6,551 మెగావాట్ల సామర్థ్యం కలిగిన వివిధ విద్యుత్‌ప్లాంట్లతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు 22 డిసెంబర్ 2009లో కొత్తగా పీపీఏలు కుదుర్చుకున్నాయి. ఈ ప్లాంట్లతో గతంలో కుదుర్చుకున్న పీపీఏలు 2002లో రద్దు అయ్యాయి. అనంతరం ఏడేళ్లపాటు వేచిచూసి చివరకు 2009లో పీపీఏలు కుదుర్చుకున్నాయి. ఈ పీపీఏల అనుమతి కోసం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి వెంటనే సమర్పించాయి. అయితే, ఇప్పటివరకు ఈఆర్సీ అనుమతి ఇవ్వలేదు. వీటితో పాటు ప్రస్తుతం నడుస్తున్న 2374 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో 8 విద్యుత్ ప్లాంట్లతో కూడా డిస్కంలతో జెన్కో పీపీఏలు కుదుర్చుకుంది. వీటి అనుమతి కోసం కూడా 2009లోనే ఈఆర్సీకి దరఖాస్తులు వెళ్లాయి. వీటికి కూడా ఈఆర్సీ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా నిర్మాణంలో ఉన్న మరో 3210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లకు కూడా పీపీఏల అనుమతి కోసం 2010 నవంబర్ 22న జెన్కో, డిస్కంలు దరఖాస్తు చేశాయి. వీటిపై కూడా ఈఆర్సీ మౌనం దాల్చింది. కనీసం పీపీఏలు తమకు అందినట్టు పత్రికల్లో ప్రకటన ఇవ్వడం, ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు, బహిరంగ విచారణ చేపట్టే కనీస చర్యలను ఈఆర్సీ తీసుకోలేదు. ఫలితంగా ఇప్పుడు పీపీఏల రద్దు అంశం కాస్తా రెండు రాష్ట్రాలమధ్య కొత్త వివాదానికి దారితీసే పరిస్థితులు నెలకొన్నాయి. తమ పీపీఏలను ఆమోదించాలని ఈఆర్సీని జెన్కో వర్గాలు వ్యక్తిగతంగా కలసి విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా, జెన్కోకు చెందిన వివిధ విద్యుత్ ప్లాంట్లతో డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏలకు అధికారిక ముద్ర పడలేదని ‘సాక్షి’ ముందే హెచ్చరించింది. ‘పీపీఏలకు లభించని అధికారిక ముద్ర’ అనే శీర్షికన ఒక వార్తను కూడా సుమారు ఆరు నెలల క్రితం సాక్షి ప్రచురించింది. అనుమతి లేకపోవడం వల్ల ఇబ్బందులు తప్పవని కూడా ఆ వార్తలో ‘సాక్షి’ హెచ్చరించింది. పీపీఏలు రద్దయితే మార్కెట్లో విక్రయించాల్సిందే పీపీఏ రద్దు విషయంలో కొత్త చర్చ మొదలయ్యింది. ఆంధ్రప్రదేశ్ సర్కారు చర్యల నేపథ్యంలో ప్రస్తుత పీపీఏలు రద్దయితే కొత్త పీపీఏలు కుదుర్చుకోవడం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఇందుకు విద్యుత్ చట్టాలు, కేంద్ర విద్యుత్‌శాఖ ఆదేశాలు అడ్డువస్తాయనే ఆందోళన ఇరు రాష్ట్రాల ఇంధనశాఖల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ ప్రసుత్త పీపీఏలు రద్దయితే మళ్లీ కొత్తగా ఏ రాష్ట్రంలోని డిస్కంలతో ఆ రాష్ట్ర జెన్కో పీపీఏలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, పీపీఏలు కుదుర్చుకోవడం సాధ్యం కానందువల్ల ఇతర ప్రైవేటు విద్యుత్ ప్లాంట్లతో పోటీపడి మార్కెట్ ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు విద్యుత్‌ను విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జెన్కోల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. పీపీఏల రద్దుకు అనుమతించండి: ఈఆర్సీని మళ్లీ కోరిన ఏపీజెన్కో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పం దాల (పీపీఏ) రద్దుకు అనుమతించాలని ఏపీఈఆర్సీని ఏపీ జెన్కో మరోసారి కోరింది. ఈ మేరకు ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీరు శనివారం ఈఆర్సీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు డిస్కంలు కూడా పీపీఏల రద్దుకు ముందుకొచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. మరోవైపు ఏపీఈఆర్సీ చైర్మన్, సభ్యులతో ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ శనివారం సమావేశమయ్యారు. పీపీఏలకు ఈఆర్సీ అనుమతి లేకపోతే అమల్లో లేనట్టేనన్న అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పును వారి దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. -
అమర్‌రాజాకూ చుక్కెదురు
హైదరాబాద్: అమర్‌రాజా బ్యాటరీస్‌కు ప్రైవేట్ విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇచ్చేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిరాకరించింది. చిత్తూరు జిల్లాలో కంపెనీకి చెందిన ప్లాంటు వరకు సొంతంగా (ప్రైవేటుగా) విద్యుత్ పంపిణీ చేసుకుంటామని... ఇందుకోసం లెసైన్సు ఇవ్వాలని కంపెనీ కోరింది. అయితే ఇలాంటి లెసైన్సును జారీ చేయడం వల్ల గుత్తాధిపత్యం ఏర్పడుతుందని ఈఆర్సీ అభిప్రాయపడింది. ఈ ప్రాంతానికి అవసరమైన విద్యుత్‌ను ఎస్పీడీసీఎల్ నుంచే కొనుగోలు చేస్తామన్న అమర్‌రాజా వాదనను ప్రస్తావిస్తూ.. ఎలాగూ ఎస్పీడీసీఎల్ నుంచే ప్రస్తుతం కూడా విద్యుత్ కొనుగోలు చేస్తున్నందున ప్రత్యేకంగా లెసైన్సు అవసరం లేదని కమిషన్ అభిప్రాయపడింది. అమర్‌రాజా దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జీఎంఆర్ సంస్థ చేసుకున్న దరఖాస్తును కూడా ఈఆర్సీ ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే. -
200 యూనిట్లు దాటితే బిల్లు బాంబే
ఇళ్లకు భారీ షాక్.. విద్యుత్ చార్జీల వడ్డనకు ఈఆర్సీ ప్రతిపాదనలు * 50 యూనిట్లలోపు వారికి 50 పైసల భారం * వాణిజ్య సంస్థలకు 29 పైసల పెంపు * కొత్త ప్రభుత్వాల అనుమతికై ఎదురుచూపులు * తెలంగాణలో రూ.2,500 కోట్లు, సీమాంధ్రలో రూ.3,500 కోట్ల బాదుడు సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ చార్జీల వడ్డనకు రంగం సిద్ధమయ్యింది. ఇరు ప్రాంతాల ప్రజలపై మొత్తం రూ.6 వేల కోట్ల భారాన్ని మోపేందుకు ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ ప్రజలపై రూ.2,500 కోట్ల భారం పడనుండగా, సీమాంధ్ర ప్రజలకు రూ.3,500 కోట్ల షాక్ తగలనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రతిపాదనలను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ముందుంచనున్నారు. అధికారం చేపట్టిన వెంటనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చార్జీలపై నిర్ణయం తీసుకోనున్నారుు. ప్రభుత్వాలు అనుమతించిన వెంటనే కొత్త విద్యుత్ చార్జీలపై ఈఆర్సీ ఆదేశాలు వెలువడతాయి. జూన్ నెల నుంచే ఈ చార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. ఈఆర్సీ ప్రతిపాదనలను పరిశీలిస్తే.. తాజా పెంపు గృహ వినియోగదారులపై పెను భారం మోపనుంది. 50 యూనిట్లలోపు వినియోగించే పేద వినియోగదారులకూ షాక్ కొట్టనుంది. ఇక నెలకు 200 యూనిట్లు దాటితే బిల్లు బాంబులా పేలిపోనుంది. 200 యూనిట్లు దాటి వినియోగిస్తే... మొదటి 200 యూనిట్లకు యూనిట్‌కు రూ 5.56 చొప్పున చెల్లించాల్సి రానుంది. ఇక వాణిజ్య సంస్థలకు సంబంధించి యూనిట్‌కు 29 పైసల చొప్పున పెంపుదల ఉండనుండగా... పరిశ్రమలకు 29 పైసల నుంచి రూ.2.41 వరకూ చార్జీలు పెరగనున్నాయి. వాస్తవానికి గత ఏప్రిల్ 1 నుంచే కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్, ఆ తర్వాత రాష్ట్ర విభజన వల్ల గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా రెండు రాష్ర్ట ప్రభుత్వాలకు ఈ మేరకు విడివిడిగా ఈఆర్సీ ప్రతిపాదనలు పంపనుంది. సీమాంధ్రపైనే అధిక భారం! విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల వారీగా పడనున్న విద్యుత్ చార్జీల భారం లెక్క తేలిం ది. తెలంగాణలోని వినియోగదారులపై రూ.2,500 కోట్ల భారం పడనుండగా, సీమాంధ్రలోని వినియోగదారులపై రూ.3,500 కోట్ల భారం పడనుంది. సీమాంధ్రలో గృహ కనెక్షన్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని ఇంధనశాఖ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ప్రాంతంలో సీపీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లు సేవలు అందిస్తున్నాయి. సీమాంధ్రలో ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లు విద్యుత్ పంపిణీ చేపడుతున్నాయి. అయితే సీమాంధ్రలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకూ సీపీడీసీఎల్ విస్తరించి ఉంది. ఈ రెండు జిల్లాల పరిధిని ఎస్‌పీడీసీఎల్‌లోకి చేర్చారు. దీంతో ఈ రెండు జిల్లాల్లోని ఉచిత విద్యుత్, ఇతర వర్గాల సబ్సిడీ భారాన్ని సీమాంధ్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుం దని లెక్కకట్టారు. ఉచిత విద్యుత్‌తో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న సబ్సిడీ కింద తెలంగాణ ప్రభుత్వం రూ.2,800 కోట్లు చెల్లించాల్సి రానుంది. కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా కలుపుకుని సీమాంధ్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.3,200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని లెక్కకట్టారు. క్రాస్ సబ్సిడీతో తెలంగాణకు తగ్గిన భారం! వాస్తవానికి ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తెలంగాణలోనే అధికం. మొత్తం 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లలో తెలంగాణలోనే 18 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అయినప్పటికీ సబ్సిడీ భారం తక్కువగా ఉంది. పరిశ్రమలు క్రాస్ సబ్సిడీ కింద చెల్లిస్తున్న మొత్తం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అదేవిధంగా ఇక్కడ వాణిజ్య వినియోగదారులు అధికంగా ఉన్నారు. వీరు కూడా క్రాస్ సబ్సిడీ కింద మిగిలిన వర్గాల చార్జీల భారాన్ని భరిస్తున్నారు. తెలంగాణలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థల కనెక్షన్లు ఎక్కువగా ఉండటంతో క్రాస్ సబ్సిడీ ఆదాయం ఎక్కువగా ఉండి ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ భారం తగ్గిందన్నమాట. 200 దాటితే ఇల్లు గుల్లే: కొత్త చార్జీల నేపథ్యంలో నెలకు 200 యూనిట్లు దాటి విద్యుత్‌ను వినియోగిస్తే బిల్లు పెద్ద షాకివ్వడం ఖాయం. ఎందుకంటే 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ ఎక్కువగా వాడినా మొదటి 200 యూనిట్ల వరకు యూనిట్‌కు 5.56 చొప్పున వసూలు చేయనున్నారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 200 యూనిట్లు వినియోగిస్తే... పెరగనున్న చార్జీల మేరకు (మొదటి 50 యూని ట్లకు యూనిట్‌కు రూ.3.10 చొప్పున, 51-100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.75 చొప్పున, 101-150 వరకు యూనిట్‌కు రూ.5.38 చొప్పున, 151-200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.5.94 చొప్పున) మొత్తం రూ.908.50 చెల్లించాల్సి ఉంటుంది. 201 యూనిట్లు వినియోగిస్తే మాత్రం ఏకంగా (మొదటి 200 యూనిట్లకు యూనిట్‌కు రూ.5.56 చొప్పున రూ.1112తో పాటు ఒక యూనిట్‌కు రూ. 6.69 మేరకు మొత్తం రూ.1118.69 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక యూనిట్ అదనంగా వాడినందుకు ఏకంగా రూ. 210.19 అదనంగా చెల్లించాల్సి రానుంది. మొత్తం బిల్లుకు సర్వీసు, ఇతర చార్జీలు అదనం. -
విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె
విశాఖ ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద సిబ్బంది ఆందోళన సీలేరు విద్యుదుత్పత్తి కేంద్రాలు మూత విశాఖపట్నం , న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జిల్లాలోనూ విద్యుత్ ఉద్యోగులు ఆదివారం మెరుపు సమ్మెకు దిగారు. ట్రాన్స్‌కో, జెన్కో, విద్యుత్ పంపిణీ సంస్థల సిబ్బంది విధులను బహిష్కరించారు. జెన్కో ఉద్యోగులంతా సీలేరు జలవిద్యుత్ కేంద్రం మెయిన్‌గేటు వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఈ విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలోని మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి. నాలుగింట 505 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖ మహారాణిపేటలోని ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద ఆ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ ఇ.గణపతి మాట్లాడుతూ పేరివిజన్ కమిషన్ (పీఆర్సీ) అమలు విషయంలో ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. 2014 నూతన వేతన సవరణ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పనిభారం తగ్గించేందుకు అదనపు పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పరిమితి లేకుండా వైద్యఖర్చులు చెల్లించాలన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దని కోరారు. అనంతరం ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ సత్యనారాయణ, ఉప కన్వీనర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. మాచ్‌ఖండ్ సిబ్బంది ఆందోళన ముంచంగిపుట్టు : ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కారించాలంటూ ఆదోళన చేశారు. పీఆర్సీని అమలు చేయాలని జలవిద్యుత్ కేంద్రం కార్మిక, ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఈ కార్యలయం ఎదుట ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీ, ఐఆర్ సమస్యను ప్రభుత్వం అమలు చేయకుంటే అత్యవసర సేవలు స్తంభింప చేస్తామని హెచ్చరించారు. -
జూన్ 2 వరకూ ఆగండి
- విద్యుత్ చార్జీలపై అప్పుడే నిర్ణయం వద్దు - నేడు ఈఆర్సీకి లేఖ రాయనున్న ప్రభుత్వం - రెండు రాష్ట్రాలకు వేర్వేరు చార్జీలు నిర్ణయించాల్సిందేనా? - అదే జరిగితే చార్జీల వ్యవహారం మళ్లీ మొదటికే సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలపై నిర్ణయం వెలువరించేందుకు జూన్ 2 వరకూ ఆగాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కి ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఈ మేరకు సోమవారం ఈఆర్సీకి ఇంధనశాఖ లేఖ రాయనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో 2014-15 ఆర్థిక సంవత్సరపు విద్యుత్ చార్జీలపై నిర్ణయం తీసుకునేందుకు కొత్త ప్రభుత్వాలు వచ్చే వరకూ వేచిచూడాలని ఈఆర్సీని కోరనుంది. ఫలి తంగా విద్యుత్ చార్జీల వ్యవహారం జూన్ 2 వరకూ నిలిచిపోనుంది. అయితే, ఇది కాస్తా కొత్త గందరగోళానికి దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పాటుకానున్నాయి. దీంతో రెండు వేర్వేరు విద్యుత్ చార్జీలను ప్రకటించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చే అవకాశం ఉందని విద్యుత్‌రంగ నిపుణులు అంటున్నారు. ఇదే జరి గితే.. మళ్లీ కొత్తగా చార్జీల పెంపునకు విద్యుత్ సంస్థ ల నుంచి ప్రతిపాదనలు తీసుకుని ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించిన అనంతరమే చార్జీలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మూడు నెలలు పడుతుంది. దీంతో చార్జీల వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చినట్టు అవుతుంది. వాస్తవానికి 2014 -15 ఆర్థిక సంవత్సరపు విద్యుత్ టారిఫ్ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇది వాయిదా పడింది. ఎన్నికలు ముగిసిన తర్వాత విద్యుత్ చార్జీలపై ఆదేశాలు జారీచేయవచ్చునని ఈఆర్సీకి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈఆర్సీ మరోసారి ప్రభుత్వ అనుమతిని కోరింది. అయితే, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నందువల్ల జూన్ 2న కొత్త ప్రభుత్వాలు వచ్చాకే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఈఆర్సీకి స్పష్టంచేయాలని సర్కారు నిర్ణయించింది. ఈఆర్‌సీనే వద్దంటే...! ప్రస్తుతం ఉన్న ఈఆర్సీ రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలల వరకు మాత్రమే కొనసాగనుంది. ఆరు నెలల తర్వాత రెండు వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరుగా ఈఆర్సీలు ఏర్పాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఈఆర్సీ తమ రాష్ట్రానికి విద్యుత్ చార్జీలు నిర్ణయించకూడదని... తెలంగాణ ఈఆర్సీ ఏర్పడిన తర్వాత నిర్ణయించుకుంటామని ఎవరైనా అభ్యంతరాలు లెవనెత్తితే ఈ ప్రక్రియ కాస్తా మరో కొత్త సమస్యకు దారితీయనుంది. ఇప్పటికే ఈఆర్సీ వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ విద్యుత్‌రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో ఈఆర్సీ నిర్ణయాన్ని ఏకంగా తెలంగాణ ప్రభుత్వమే వ్యతిరేకిస్తే.. జూన్ 2 తర్వాత మరో ఆరు నెలల పాటు విద్యుత్ చార్జీల వ్యవహారం అలాగే నిలిచిపోతుంది. అయితే, ప్రభుత్వం వ్యతిరేకించినా.. చట్టంలో ఉన్న వెసులుబాటు ప్రకారం ఈఆర్సీ సుమోటాగా చార్జీలను నిర్ణయిస్తే అది కాస్తా మరో కొత్త చర్చకు, గందరగోళానికి దారితీసే ప్రమాదమూ లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వినియోగదారులకు ‘డబుల్ షాక్’!
గత ఏడాది చార్జీలు కొత్తవాటితో కలిపి వసూలు ఏపీఈఆర్సీ రెగ్యులేషన్‌లో మార్పులు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు ఇక నుంచి ‘డబుల్ షాక్’ తగలనుంది. పాత ఏడాదిలో వసూలు చేయాల్సిన మొత్తం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయాల్సిన మొత్తం చార్జీలను కలిపి ఒకేసారి వినియోగదారుడు నుంచి రాబట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) రెగ్యులేషన్-2005లో మార్పులు చేయనున్నారు. ఈ మార్పులపై అభిప్రాయాలను 15వ తేదీలోగా సమర్పించాలని ఈఆర్సీ కోరింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను ప్రతి ఏటా నవంబర్ ఆఖరున ఈఆర్సీకి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పిస్తాయి. అయితే, ఇవి ముందస్తుగా వేసిన అంచనాలు కావడంతో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. అంటే గ్యాసు, బొగ్గు ధరలు పెరగడం, కొత్త పన్నులు పడటం మొదలైన కారణాల వల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఈ తేడా మొత్తాన్ని గతంలో ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసేవారు. అయితే, సర్దుబాటు చార్జీలపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో దీనిని ఈఆర్సీ రద్దుచేసింది. అయితే, ఈ తేడా మొత్తాన్ని తాజా విధానంలో గతేడాది చార్జీలను మరుసటి ఏడాదిలోనే వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఇదే విధానంలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 2 వేల కోట్ల మేరకు సర్దుబాటు చార్జీలను 2014-15 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసేందుకు డిస్కంలు ఇప్పటికే సిద్ధపడ్డాయి. ఇందుకు అనుగుణంగా ఈఆర్సీ రెగ్యులేషన్‌లో కూడా మార్పులు రానుండటంతో డిస్కంలకు పంట పండనుంది. అయితే, 2013-14 ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చార్జీలను వసూలు చేయమన్న ప్రభుత్వ విధానానికి ఇది విరుద్ధంగా ఉందని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో రూపంలో మూడు నెలలకు ఒకసారి వసూలు చేయాల్సిన సర్దుబాటు చార్జీలను ఒకేసారి ఏడాదికి ఒకసారి వసూలు చేయడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. -
పంటకు,ఇంటికి లంకె కుదరదు!
సాక్షి, హైదరాబాద్: ఇంటి బిల్లుకు, పంట బిల్లుకు లంకె వేయడం కుదరదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తేల్చిచెప్పింది. ఈ మేరకు ఈఆర్సీ రెగ్యులేషన్స్-2004లో సవరణలు చేసింది. పంట బిల్లు చెల్లించలేదని ఇంటికి విద్యుత్ కనెక్షన్ తొలగించడం కుదరదని స్పష్టంచేసింది. ఇందుకు అనుగుణంగా 2004లోని రెగ్యులేషన్స్‌ను మార్పులు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయ కనెక్షన్లకు 2004 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలుచేశారు. ప్రతినెలా రూ.20 చొప్పున సర్వీసు చార్జీలను చెల్లించాలని పేర్కొన్నారు. అయితే, ఈ మొత్తాన్ని కూడా ఆయన హయంలో ఏనాడూ వసూలు చేయలేదు. వైఎస్ మరణం తర్వాత వ్యవసాయ కనెక్షన్లకు సర్వీసు చార్జీని రూ.20 నుంచి రూ.30కి పెంచారు. అంతేకాకుండా 2004 నుంచి వసూలు చేయని మొత్తాన్ని కూడా చెల్లించాలని పేర్కొంటూ రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంటి బిల్లుకు లంకె పెట్టి వ్యవసాయ సర్వీసు చార్జీలను చెల్లించాలని డిస్కంలు బిల్లులు జారీచేయడం మొదలుపెట్టాయి. పాత సర్వీసు చార్జీలను చెల్లించనివారి ఇంటి విద్యుత్ కనెక్షన్లు తొలగించాయి. ఇది సరికాదంటూ గతంలో అనేకసార్లు ‘సాక్షి’ సవివరంగా వార్తలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ కనెక్షన్లకు సర్వీసు చార్జీలను చెల్లించని పక్షంలో అదే వినియోగదారుడికి చెందిన ఇతర విద్యుత్ కనెక్షన్లు తొలగించరాదని పేర్కొంటూ ఈఆర్సీ తాజాగా ఆదేశాలు జారీచేసింది. అయితే, తాజా ఆదేశాలతో వ్యవసాయ కనెక్షన్లు తొలగించే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ చట్టాన్ని డిస్కంలు కచ్చితంగా అమలుచేసేలా ఈఆర్సీ దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. కాగా.. విద్యుత్ చట్టం-2003 ప్రకారం కూడా వినియోగదారునికి బకాయి ఉన్న విషయాన్ని రెండేళ్లలోపు తెలియచేసి, వాటిని వసూలు చేసుకునే అవకాశం ఉంది. కానీ, బకాయి ఉన్న విషయాన్ని తెలపకుండా బిల్లు వసూలు చేయకూడదు.