ఏప్రిల్ నుంచి ప్రజలపై విద్యుత్ పిడుగు
నెలకు రూ.40 కోట్ల భారం
పెంపుపై నేడు, రేపు {పజాభిప్రాయ సేకరణ
వినియోగదారులు మౌనంగా ఉంటే బాదుడే
విశాఖపట్నం: వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. డిస్కంలు ఈ మేరకు ఆదాయ, వ్యయ నివేదికలను ఏపీఈఆర్‌సీకి అందజేశాయి. ఇక చార్జీలు పెంచడమే తరువాయి. ఈ నేపథ్యంలో తాము పెంచబోయే చార్జీలపై అభిప్రాయాలు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ) సోమ, మంగళవారాల్లో ప్రజల ముందుకు రానుంది. దీనివల్ల చార్జీల పిడుగును ప్రశ్నించే అవకాశం వినియోగదారులకు కలుగుతోంది. ప్రభుత్వాన్ని నిలదీసే సరైన వేదిక దొరుకుతోంది. ఇప్పుడు కూడా మనకెందుకులే అని మౌనం వహిస్తే తర్వాత విద్యుత్ బిల్లులు తడిసిమోపెడవుతాయి.
ఇదో వేదిక
2015-16 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీల పెంపుపై 23వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలోని డాక్టర్ వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో ప్రజాభిప్రాయ సేకరణకు ఏపీఈఆర్‌సీ, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) అధికారులు సిద్ధమవుతున్నారు. అభిప్రాయాలను వెల్లడించే ప్రజలు ఎక్కువగా వస్తే 24వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ కూడా అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అధికారుల నుంచి సంతృప్తికర సమాధానం రాకపోతే మార్చి 4వ తేదీ ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకూ హైదరాబాద్‌లోని ఏపీఈఆర్‌సీ కోర్టు హాల్‌లో జరిగే అభిప్రాయ సేకరణలోనూ వినియోగదారులు తమ వాదాన్ని వినిపించే అవకాశం ఉంది.
మనకు మినహాయింపు తప్పనిసరి
అభిప్రాయ సేకరణకు ముందు విద్యుత్ టారిఫ్ వివరాలను వినియోగదారులకు అధికారులు వెల్లడిస్తారు. ఇవి రాష్ట్రం మొత్తం అన్ని డిస్కంలలో దాదాపుగా ఒకేలా ఉంటాయి. విశాఖ జిల్లా ఈపీడీసీఎల్ పరిధిలో ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో హుద్‌హుద్ తుపాను విశాఖను కుదిపేసింది. జనం ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో చార్జీల భారం నుంచి ఉత్తరాంధ్రకు మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది.
నెల నెలా ఎంతిస్తున్నాం
జిల్లాలో 11 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిలో 8.27 లక్షల మంది గృహ వినియోగదారులున్నారు. వీటిలో 0-100 యూనిట్లు వాడే వారు 5.03లక్షల మంది, 101యూనిట్లు ఆపైనవాడే గృహ వినియోగ దారులు 3.24 లక్షల మంది ఉన్నారు. వందయూనిట్ల వినియోగించే వినియోగదారులు నెలకు 2.85కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీని వల్ల రూ.5.50 కోట్ల ఆదాయం వస్తుంది. 101 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించే వినియోగదారులు నెలకు 6.4కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీని వల్ల రూ.25కోట్ల ఆదాయం వస్తుంది. ఎల్‌టీ సర్వీసులు కలిగిన వారి నుంచి రూ.65కోట్ల ఆదాయం వస్తుంటే, హెచ్‌టీ సర్వీసులున్న వారి నుంచి రూ.170కోట్ల ఆదాయం వస్తుంది. ఈ విధంగా నెలకు విశాఖ సర్కిల్‌కు రూ.235 కోట్ల ఆదాయం వస్తుంది.
అదనపు భారం ఇలా..
ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీలు పెంచనున్నారు. కేటగిరీ వారీగా 10 నుంచి 15 శాతం చార్జీలు పెంచాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా 100 యూనిట్లు దాటి వినియోగించే వారిపై ఎక్కువ చార్జీ పడనుంది. ఈ లెక్కన నెలకు రూ.40 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. అంటే 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.480 కోట్ల అదనపు భారం జిల్లా విద్యుత్ వినియోగదారులపై పడబోతోంది.
నిలదీద్దాం రండి
Published Sun, Feb 22 2015 11:40 PM | Last Updated on Mon, Apr 8 2019 7:51 PM
Advertisement
Advertisement