రూ.2 వేల కోట్ల బాదుడు! | The stroke of Rs 2 billion! | Sakshi
Sakshi News home page

రూ.2 వేల కోట్ల బాదుడు!

Published Thu, Mar 24 2016 1:07 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

రూ.2 వేల కోట్ల బాదుడు! - Sakshi

రూ.2 వేల కోట్ల బాదుడు!

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల బాదుడుకు రంగం సిద్ధమైంది. మరో రెండురోజుల్లో కొత్త టారిఫ్ ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఈ మేరకు చేపట్టిన కసరత్తు దాదాపు పూర్తయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రజలపై సుమారు రూ. 2 వేల కోట్ల అదనపు విద్యుత్ చార్జీల భారం పడే వీలుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచడం ఇది రెండోసారి. 2015-16లో రూ. 941 కోట్ల భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం మోపింది.  టారిఫ్ ప్రతిపాదనల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.783 కోట్ల మేరకు చార్జీల పెంపును తొలుత ప్రతిపాదించాయి.

అయితే పరోక్ష పద్ధతిలో మరో రూ.1,217 కోట్లు రాబట్టాలని ఆ తర్వాత నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2016-17లో 66,839 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభ్యత ఉంటుందని, విద్యుత్ డిమాండ్ 57,565 మిలియన్ యూనిట్లు ఉండొచ్చని డిస్కమ్‌లు అంచనా వేశాయి. 9,274 మిలియన్ యూనిట్ల మేర మిగులు విద్యుత్ ఉంటుందని, ఇందులో 7,142 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తామని తెలిపాయి. మొత్తం మీద 2016-17లో రూ.5,148 కోట్ల మేర ఆర్థిక లోటు ఉంటుందని పేర్కొన్నాయి. ఇందులో రూ.4,365 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇస్తుందని, మిగిలిన రూ. 783 కోట్లు వినియోగదారుల నుంచి రాబట్టాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. అయితే ప్రభుత్వం సబ్సిడీలో భారీగా కోత పెట్టింది. కేవలం రూ.3 వేల కోట్లతో సరిపెట్టింది. దీంతో ఆర్థికలోటు ఏకంగా రూ. 2,148 కోట్లకు పెరిగింది. కొత్త టారిఫ్ ఖరారులో భాగంగా ఈఆర్‌సీ సూచనల నేపథ్యంలో వచ్చే ఏడాదిలో ప్రజల నుంచి రూ.2వేల కోట్లు అదనంగా రాబట్టుకునేం దుకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రానున్నాయి.

 గ్రూపుల విధానంతో పేదలపై దొంగ దెబ్బ
 ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు చేసి, ఆ భారాన్ని తమపై వేస్తున్నారన్న భావన ప్రజల్లో నాటుకుపోయింది. ఇటీవలి ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే వ్యక్తమైంది. దీన్ని గుర్తించిన విద్యుత్ సంస్థలు దొడ్డిదారిలో జనంపై భారం వేసేందుకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం టెలిస్కోపిక్ విధానం అమలులో ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి గ్రూపుల పద్ధతిని తెరమీదకు తెస్తున్నారు. టెలిస్కోపిక్ విధానంలో.. ఓ గృహ వినియోగదారుడు నెలకు 200 యూనిట్లు వాడాడనుకుంటే తొలి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45, 51 నుంచి 100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.2.60, 101 నుంచి 200 యూనిట్ల వరకు రూ.3.40 చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రూపుల విధానాన్ని ప్రవేశపెట్టి ఏడాది విద్యుత్ వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకుని చార్జీలు వసూలు చేయనున్నారు. దీనివల్ల నెలకు 50 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే (పేదవర్గాలు) వారిపై భారం పడనుంది.

అంటే ఏడాదికి సగటున 600 యూనిట్లు వాడే వినియోగదారుడు ఒక్క యూనిట్ ఎక్కువ (601) వాడినా తదుపరి ఏడాది నుంచి ఎక్కువ టారిఫ్ (రూ.2.60)లోకి వెళుతుండటంతో ఆ మేరకు నెలసరి బిల్లు భారీగా పెరగనుంది. ఎలాగంటే ప్రస్తుతం నెలకు 0-50 యూనిట్ల వాడకానికి రూ.72.50 (50ఁ1.45) బిల్లు చెల్లిస్తున్నారు. ఏడాదిలో ఒక్క యూనిట్ ఎక్కువ వాడటం వల్ల ఆ వినియోగదారుడు తదుపరి టారిఫ్‌లోకి వెళ్లి నెలసరి బిల్లు రూ.130 (50ఁ2.60)కి కానుంది. అంటే నెలకు అదనంగా రూ.57.50 చెల్లించాల్సి వస్తుందన్నమాట. రాష్ట్రంలో 50 యూనిట్ల వరకు వాడేవారి సంఖ్య 1.6 కోట్ల వరకు ఉంది. గ్రూపుల విధానం వల్ల ప్రస్తుత ఏడాదిలో 601 యూనిట్లు అంతకుమించి (తదుపరి గ్రూపు 2,400 యూనిట్లు) విద్యుత్‌ను వినియోగించిన దాదాపు 40 లక్షల మంది పేదవర్గాలపై వచ్చే ఆర్థిక సంవత్సరంలో దొడ్డిదారి విద్యుత్ చార్జీల ప్రభావం పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement