కూటమి సర్కారు వైఫల్యాలకు జగనే కారణమనడం దారుణం
చంద్రబాబు స్క్రిప్‌్టనే షర్మిల చదువుతున్నారు
వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ధ్వజం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై రూ.6 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపి, అందుకు వైఎస్ జగనే కారణమని చెప్పడం కూటమి దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆయన శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పచ్చ పత్రికలు విద్యుత్ చార్జీల పెంపు సమాచారాన్ని ప్రజలకు తెలియజేయకుండా, తిరిగి వైఎస్ జగన్‌పైనే ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.
వరదలు సహా అనేక ఇతర అంశాల్లో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమై, అన్నింటికీ వైఎస్ జగనే కారణమన్నట్లుగా చెబుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్‌్టనే షర్మిల చదువుతున్నారని అన్నారు. కేసులు పరిష్కారం అయ్యే వరకు షేర్ల బదిలీ జరగదని, అయినా ఆమె ఉద్దేశపూర్వకంగానే జగన్‌ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు పంటల బీమా, ఇతర సౌకర్యాలు తొలగించి రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు.
రైతులు రుగ్మతతో అత్మహత్య చేసుకుంటున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. అన్నదాతకు ఏ మేలూ చేయరని స్పష్టంచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందించామని, ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూ్యరెన్స్ వంటి పథకాలతో ఆదుకున్నామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీని మరింతగా బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ ఇన్‌చార్జిల సూచనలను తీసుకుని జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన వారికే పదవులు లభిస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment