విద్యుత్ సర్దుబాటు చార్జీలపై భగ్గుమన్న ప్రజానీకం
ప్రతిపక్ష నేతగా బాదుడే.. బాదుడు.. అని గగ్గోలు పెట్టారు?
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రూ.6,072 కోట్ల భారం మోపారు
కూటమి ప్రభుత్వ దొంగదెబ్బపై రాష్ట్రవ్యాప్తంగా జనాగ్రహం
విజయవాడ అలంకార్ సెంటర్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా
ఏపీఈఆర్‌సీ ‘సర్దుబాటు’ ఉత్తర్వుల దహనం
ఒక్కో ఇంటిపై 44 శాతం భారం
మేం అధికారంలోకి వస్తే ఐదేళ్లు విద్యుత్ చార్జీలు పెంచబోమని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాలకే సర్దుబాటు చార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై రూ.6,072 కోట్ల భారాన్ని మోపారు. దీనివల్ల ప్రస్తుతం వస్తున్న బిల్లులపై ఒక్కో ఇంటికి అదనంగా 44 శాతం భారం పడుతుంది. అది కూడా ఏకంగా 15 నెలలు వసూలు చేస్తారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్ చార్జీలపై భారాన్ని ఉపసంహరించుకోవాలి.
– దుంపల ప్రభాకరరావు,విశ్రాంత పోస్టల్ ఉద్యోగి, తాటితూరు, భీమిలి మండలం
గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెరిగితే ఊరూరు తిరిగి ‘బాదుడే... బాదుడు...’ అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు... తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రకటించారు. ‘కేంద్ర ప్రభుత్వ సోలార్ ఆధారిత విద్యుత్ పథకంతో అనుసంధానం చేసుకుని ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తాం. బిల్లుల భారం తగ్గిస్తాం. అదనపు విద్యుత్‌ను ప్రజల నుంచి కొనుగోలు చేస్తాం...’ అని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.
కానీ, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సర్దుబాబు చార్జీల పేరుతో ప్రజలపై రూ.6,072 కోట్ల బాదుడుకు సిద్ధమయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా విజయవాడ అలంకార్ సెంటర్‌లోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సీపీఎం ఆధ్వర్యాన శనివారం ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సర్దుబాటు చార్జీలకు అనుమతిస్తూ ఏపీఈఆర్‌సీ జారీచేసిన ఉత్తర్వులను దహనం చేశారు.
– సాక్షి నెట్‌వర్క్
బాదేస్తున్నారు బాబూ..!
ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు ప్రజలపై నాటి ప్రభుత్వం విపరీతమైన భారాలు మోపుతోందని బాదుడే.. బాదుడు.. అంటూ ఊరూరా తిరిగారు. ఇప్పుడు అధికారం వచ్చిన వెంటనే ఆయన కూడా ప్రజలను బాదుతున్నారు. గత ప్రభుత్వం తప్పు చేసిందని పలు ఒప్పందాలను రద్దు చేస్తున్న చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ప్రజలపై అదనపు ఇంధన చార్జీల రూపంలో భారం పడుతుంటే ఎందుకు రద్దు చేయడం లేదు.
– డి.రామశేషయ్య, రిటైర్డ్ టీచర్, కర్నూలు
నాడు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు
యూనిట్‌కు అత్యధికంగా 1.58 పైసలు పెంచడం దారుణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండగా 1999లో తెచ్చిన విద్యుత్ సంస్కరణలపై వామపక్షాల ఉద్యమం సందర్భంగా బషీర్‌బాగ్‌లో ఆందోళనకారులపై అన్యాయంగా కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు. ఆ ఘటనలో పోలీసుల లాఠీ దెబ్బలకు నేను తీవ్రంగా గాయపడ్డాను. చందబ్రాబు గతాన్ని మళ్లీ గుర్తుచేస్తున్నారు.
– కె.నాంచార్లు, రైతు కూలీ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు
మద్యం తప్ప అన్నీ ప్రియమే..
రాష్ట్రంలో నేడు మద్యం తప్ప అన్ని వస్తువుల ధరలు ప్రియమే. ఎన్నికల సమయంలో ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల బాగోగులను విస్మరించింది. విద్యుత్ చార్జీలు పెంచుతున్న సీఎం చంద్రబాబు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.
– ఎస్‌కే రెహనుమా, నెల్లూరు
మాట మార్చేశారు
విద్యుత్ చార్జీల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్నారు. ఇప్పుడు మాట మార్చేచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ధరలపై నియంత్రణ లేదు. సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేశారు. సామాన్యుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని పాలన సాగించాలి.
– అంబటి సుజాత, మాజీ సర్పంచ్, అరిణాం అక్కివలస
ప్రభుత్వమే భరించాలి
సర్దుబాటు చార్జీల పేరిట ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వమే భరించాలి. ఇప్పటికే నిత్యావసర ధరలతో సామాన్యుడి జీవనం కష్టంగా మారింది. సరిగా పంటలు పండక, పనులు లేక ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయలేదు. కానీ విద్యుత్ చార్జీలు పెంచేశారు.
– రాజేశ్వరి, గృహిణి, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment