Andhra Pradesh: చంద్రబాబు ప్రభుత్వం హై ఓల్టేజ్‌ షాక్‌ | Chandrababu Naidu govt high voltage shock to Public | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: చంద్రబాబు ప్రభుత్వం హై ఓల్టేజ్‌ షాక్‌

Published Wed, Dec 11 2024 4:55 AM | Last Updated on Wed, Dec 11 2024 8:37 AM

Chandrababu Naidu govt high voltage shock to Public

గృహ వినియోగదారులపై 25 నుంచి 55% వరకూ అదనంగా వడ్డింపు

నవంబర్‌ బిల్లులో రూ.6 వేల కోట్లకు పైగా కరెంట్‌ చార్జీల వాతలు

వచ్చే నెల నుంచి పడనున్న మరో రూ.9,412.50 కోట్ల భారం

చార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు

అధికారంలోకి రాగానే రూ.15,485.36 కోట్ల చార్జీల బాదుడు

అదనంగా పెరిగిన విద్యుత్‌ చార్జీలు చూసి నివ్వెరపోతున్న వినియోగదారులు

పేద, మధ్య తరగతి, చిరు వ్యాపారులకు కూటమి సర్కారు వరుస షాక్‌లు

వాడకం తక్కువగా ఉండే శీతకాలంలోనే ఇంత షాక్‌లిస్తే..ఇక రానున్న నెలల్లో కరెంట్‌ మంటలే!

సాక్షి, అమరావతి: ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలను పెంచం.. పైగా తగ్గిస్తాం.. నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఐదు నెలలకే మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్‌ షాక్‌లు ఇస్తోంది. సూపర్‌ సిక్స్‌ హామీలను తుంగలో తొక్కినట్లుగానే విద్యుత్‌ చార్జీలపై చేసిన వాగ్దానాన్ని మరచి ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. 

విద్యుత్తు చార్జీల మోత మోగిస్తూ హై వోల్టేజీ షాకులిస్తున్నారు. రూ.15,485.36 కోట్ల చార్జీల బాదుడుకు తెర తీశారు. విద్యుత్తు వాడకం తక్కువగా ఉండే శీతకాలంలోనే బిల్లులు ఇలా పేలిపోతుంటే ఇక తరువాత నెలల్లో ఏ స్థాయిలో షాక్‌లు ఉంటాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఓవైపు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్‌ను దూరం చేసి బిల్లులతో బాదేస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర వర్గాలపై పెనుభారం మోపింది.

నివ్వెరపోతున్న వినియోగదారులు..
ఈ నెల 2వ తేదీ నుంచి మీటర్‌ రీడింగ్‌ తీసి విద్యుత్తు సిబ్బంది ప్రజలకు అందిస్తున్నారు. వాడిన దానికి మించి విద్యుత్‌ బిల్లులతో షాక్‌లకు గురి చేస్తున్నారు. అదనంగా వసూలు చేస్తున్నారని గ్రహించి గగ్గోలు పెడుతున్నారు. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.6,072.86 కోట్ల భారాన్ని గత నెల విద్యుత్‌ వినియోగం నుంచి వినియోగదారులపై ప్రభుత్వం వేస్తోంది. సర్దుబాటు చార్జీ ప్రతి యూనిట్‌కు సగటున రూ.1.27గా నిర్ణయించిన ఏపీఈఆర్‌సీ దీనిని 15 నెలల్లో వసూలు చేయాలని  సూచించడంతో ప్రతి నెలా వినియోగదారులపై ఈ సర్దుబాటు భారం యూనిట్‌కు సగటున రూ.0.63 చొప్పున పడుతోంది.

వచ్చే నెల నుంచి మరింత మోత..
ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.6,072.86 కోట్లకే ప్రజలపై ఇంత భారీగా చార్జీల భారం పడుతుంటే వచ్చే నెల నుంచి కూటమి ప్రభుత్వం విద్యుత్‌ వినియోగదారుల మీద మరో పిడుగు వేయనుంది. రూ.9,412.50 కోట్ల చార్జీల వసూలుకు డిస్కమ్‌లు సిద్ధమవుతున్నాయి. 

డిసెంబర్‌ నెల వినియోగం నుంచి అంటే జనవరి మొదటి వారం నుంచి వచ్చే విద్యుత్‌ బిల్లుల్లో ఈ చార్జీలను ప్రభుత్వం వసూలు చేయనుంది. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుంటే దానికి తోడు విద్యుత్‌ చార్జీల బాదుడుతో సామాన్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా మనుబోలులో నివసించే గడ్డం రమణారెడ్డికి నవంబరులో రూ.1,620 విద్యుత్‌ బిల్లు రాగా ఈ నెల ఏకంగా రూ.2,541 బిల్లు వచ్చింది. గత నెలతో పోలిస్తే 56 శాతం అదనంగా పెరిగి రూ.921 అధికంగా బిల్లు రావడంతో ఆయన లబోదిబోమంటున్నారు. 

నవంబర్,డిసెంబరు నెలల బిల్లులు 

చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెలో అద్దె ఇంట్లో నివసించే రమేష్‌కు ప్రతి నెలా రూ.300 – రూ.400 మధ్య కరెంట్‌ బిల్లు వస్తుంది. అక్టోబర్‌లో రూ.363 వచ్చింది. నవంబర్‌లోనూ రూ.385కి మించలేదు. అలాంటిది ఈ నెల ఏకంగా రూ.679 రావడంతో షాక్‌ తిన్నాడు. 

వైఎస్సార్‌ కడప జిల్లా ఎర్రగుంట్లలోని ప్రకాశ్‌నగర్‌ కాలనీలో అద్దె ఇంట్లో నివసించే కత్తి రామక్క నలుగురు సంతానం అనారోగ్యంతో బాధపడుతున్నారు. చిరు వ్యాపారంతో ఆమె కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఎస్సీలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని వర్తింపచేయడంతో ఐదేళ్లుగా ఆమెకు కరెంటు బిల్లు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం రాలేదు. కూటమి ప్రభుత్వం రాగానే  కరెంటు బిల్లు కట్టాలంటూ విద్యుత్‌ శాఖ అధికారులు ఇంటి వద్దకు వచ్చారు. రూ.3,464 బిల్లు కట్టాలని, 2018 నుంచి బకాయిలు చెల్లించాలని హెచ్చరిస్తూ కరెంట్‌ కట్‌ చేయడంతో అంధకారంలో మగ్గిపోతోంది. 

విద్యుత్‌ ఛార్జీలు పెంచనన్నారుగా బాబు 

16/08/2023: టీడీపీ విజన్‌ డాక్యుమెంట్‌– 2047 విడుదల సందర్భంగా విద్యుత్‌ చార్జీలు పెంచం.. వీలైతే తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు 



మా ఇంటికి వైఎస్సార్‌ సీపీ హయాంలో ఉచిత విద్యుత్తు అందించారు. 200 యూనిట్ల లోపే వినియోగిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌ నుంచి బిల్లు కట్టమని విద్యుత్‌ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. 
⇒ కన్నేపల్లి కుమారి (ఎస్సీ సామాజిక వర్గం), సిటిజన్‌ కాలనీ, గాంధీ గ్రామం, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లా (02 వీఎస్సీ 803)



కర్నూలులోని బుధవారపేటలో అద్దె ఇంట్లో నివసించే ప్రైవేట్‌ ఉద్యోగి అజయ్‌కి (సర్వీస్‌ నెంబర్‌ 8311102106824) గత నెలలో విద్యుత్‌ బిల్లు రూ.688 రాగా ఈ నెలలో ఏకంగా రూ.1,048 రావడంతో గుండె గుభిల్లుమంది. ఆ కుటుంబంపై ఒక్క నెలలోనే రూ.360 అదనపు ఆర్థిక భారం పడింది. 


ఈ నెల నుంచి పెరిగిన విద్యుత్‌ బిల్లుల బాదుడు స్పష్టంగా కనిపిస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో 88 యూనిట్లకు రూ.348.97 బిల్లు రాగా ప్రస్తుతం 91 యూనిట్లకు రూ.463.91 బిల్లు వచ్చినట్లు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన కె.సూర్యకాంత్‌ తెలిపారు. అదనంగా వాడిన మూడు యూనిట్లకు రూ.114.94 బిల్లు ఎక్కువగా రావడంతో ఆయన షాక్‌ తిన్నాడు. 

ఉచిత విద్యుత్తు ఇచ్చిన వైఎస్‌ జగన్‌
వైఎస్సార్‌ సీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు  ఉచితంగా అందించిన విద్యుత్‌ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ కూటమి సర్కారు బలవంతపు వసూళ్లకు దిగుతోంది. రూ.లక్షలు.. వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టలేని పేదల కరెంట్‌ కనెక్షన్లను విద్యుత్‌ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్‌ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. 

పాత బకాయిల పేరుతో విద్యుత్తు సిబ్బంది కరెంట్‌ మీటర్లు తొలగించి తీసుకుపోతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని తేల్చి చెబుతుండటంతో పేదలు తీవ్ర షాక్‌కు గురవుతున్నారు. తాటాకు ఇళ్లు, రేకుల షెడ్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. 

దాదాపు 250 కుటుంబాలు నివసించే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం హరిజనవాడలో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్‌శాఖ సిబ్బంది బిల్లులు జారీ చేయడంతో స్థానికులు ఇటీవల నిరసనగా దిగారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉండగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించారు. 

గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తుతో రూ.2,361.95 కోట్ల మేర లబ్ధి చేకూరగా 4,57,586 ఎస్టీ కుటుంబాలకు రూ.483.95 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మొత్తం 19,86,603 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.2,845.90 కోట్ల మేర ఉచిత విద్యుత్తు ద్వారా మేలు చేశారు.

‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న బి.శివాజీ. విజయవాడలోని కానూరులో ఉంటారు. ఆయన ప్రతి నెలా దాదాపు రూ.600 విద్యుత్‌ బిల్లు చెల్లిస్తుండగా ఈ నెల రూ.813 బిల్లు వచ్చింది. దాదాపు 35 శాతం అదనంగా చార్జీలు పడటంతో శివాజీ గగ్గోలు పెడుతున్నాడు. ఇంత భారం మోపితే కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నాడు. పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అడిగేవారే లేరా? అని నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నాడు.


విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన ఏ.సహిల్‌కు ఈ నెల (నవంబర్‌ వినియోగం)రూ.1,321 బిల్లు వచ్చింది. గత నెల ఇదే సర్వీసుకు ఆయన చెల్లించిన బిల్లు రూ.861 మాత్రమే. అంటే ఈ నెల బిల్లులో ఏకంగా 53 శాతం అదనంగా భారం పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement