200 యూనిట్లు దాటితే బిల్లు బాంబే
ఇళ్లకు భారీ షాక్.. విద్యుత్ చార్జీల వడ్డనకు ఈఆర్‌సీ ప్రతిపాదనలు
* 50 యూనిట్లలోపు వారికి 50 పైసల భారం
* వాణిజ్య సంస్థలకు 29 పైసల పెంపు
* కొత్త ప్రభుత్వాల అనుమతికై ఎదురుచూపులు
* తెలంగాణలో రూ.2,500 కోట్లు, సీమాంధ్రలో రూ.3,500 కోట్ల బాదుడు
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ చార్జీల వడ్డనకు రంగం సిద్ధమయ్యింది. ఇరు ప్రాంతాల ప్రజలపై మొత్తం రూ.6 వేల కోట్ల భారాన్ని మోపేందుకు ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ ప్రజలపై రూ.2,500 కోట్ల భారం పడనుండగా, సీమాంధ్ర ప్రజలకు రూ.3,500 కోట్ల షాక్ తగలనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ప్రతిపాదనలను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ముందుంచనున్నారు. అధికారం చేపట్టిన వెంటనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చార్జీలపై నిర్ణయం తీసుకోనున్నారుు. ప్రభుత్వాలు అనుమతించిన వెంటనే కొత్త విద్యుత్ చార్జీలపై ఈఆర్‌సీ ఆదేశాలు వెలువడతాయి.
జూన్ నెల నుంచే ఈ చార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. ఈఆర్‌సీ ప్రతిపాదనలను పరిశీలిస్తే.. తాజా పెంపు గృహ వినియోగదారులపై పెను భారం మోపనుంది. 50 యూనిట్లలోపు వినియోగించే పేద వినియోగదారులకూ షాక్ కొట్టనుంది. ఇక నెలకు 200 యూనిట్లు దాటితే బిల్లు బాంబులా పేలిపోనుంది. 200 యూనిట్లు దాటి వినియోగిస్తే... మొదటి 200 యూనిట్లకు యూనిట్‌కు రూ 5.56 చొప్పున చెల్లించాల్సి రానుంది.
ఇక వాణిజ్య సంస్థలకు సంబంధించి యూనిట్‌కు 29 పైసల చొప్పున పెంపుదల ఉండనుండగా... పరిశ్రమలకు 29 పైసల నుంచి రూ.2.41 వరకూ చార్జీలు పెరగనున్నాయి. వాస్తవానికి గత ఏప్రిల్ 1 నుంచే కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్, ఆ తర్వాత రాష్ట్ర విభజన వల్ల గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా రెండు రాష్ర్ట ప్రభుత్వాలకు ఈ మేరకు విడివిడిగా ఈఆర్‌సీ ప్రతిపాదనలు పంపనుంది.
సీమాంధ్రపైనే అధిక భారం!
విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల వారీగా పడనున్న విద్యుత్ చార్జీల భారం లెక్క తేలిం ది. తెలంగాణలోని వినియోగదారులపై రూ.2,500 కోట్ల భారం పడనుండగా, సీమాంధ్రలోని వినియోగదారులపై రూ.3,500 కోట్ల భారం పడనుంది. సీమాంధ్రలో గృహ కనెక్షన్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని ఇంధనశాఖ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ప్రాంతంలో సీపీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌లు సేవలు అందిస్తున్నాయి. సీమాంధ్రలో ఈపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌లు విద్యుత్ పంపిణీ చేపడుతున్నాయి.
అయితే సీమాంధ్రలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకూ సీపీడీసీఎల్ విస్తరించి ఉంది. ఈ రెండు జిల్లాల పరిధిని ఎస్‌పీడీసీఎల్‌లోకి చేర్చారు. దీంతో ఈ రెండు జిల్లాల్లోని ఉచిత విద్యుత్, ఇతర వర్గాల సబ్సిడీ భారాన్ని సీమాంధ్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుం దని లెక్కకట్టారు. ఉచిత విద్యుత్‌తో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న సబ్సిడీ కింద తెలంగాణ ప్రభుత్వం రూ.2,800 కోట్లు చెల్లించాల్సి రానుంది. కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా కలుపుకుని సీమాంధ్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.3,200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని లెక్కకట్టారు.
క్రాస్ సబ్సిడీతో తెలంగాణకు తగ్గిన భారం!
వాస్తవానికి ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తెలంగాణలోనే అధికం. మొత్తం 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లలో తెలంగాణలోనే 18 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అయినప్పటికీ సబ్సిడీ భారం తక్కువగా ఉంది. పరిశ్రమలు క్రాస్ సబ్సిడీ కింద చెల్లిస్తున్న మొత్తం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అదేవిధంగా ఇక్కడ వాణిజ్య వినియోగదారులు అధికంగా ఉన్నారు. వీరు కూడా క్రాస్ సబ్సిడీ కింద మిగిలిన వర్గాల చార్జీల భారాన్ని భరిస్తున్నారు. తెలంగాణలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థల కనెక్షన్లు ఎక్కువగా ఉండటంతో క్రాస్ సబ్సిడీ ఆదాయం ఎక్కువగా ఉండి ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ భారం తగ్గిందన్నమాట.
200 దాటితే ఇల్లు గుల్లే: కొత్త చార్జీల నేపథ్యంలో నెలకు 200 యూనిట్లు దాటి విద్యుత్‌ను వినియోగిస్తే బిల్లు పెద్ద షాకివ్వడం ఖాయం. ఎందుకంటే 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ ఎక్కువగా వాడినా మొదటి 200 యూనిట్ల వరకు యూనిట్‌కు 5.56 చొప్పున వసూలు చేయనున్నారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 200 యూనిట్లు వినియోగిస్తే... పెరగనున్న చార్జీల మేరకు (మొదటి 50 యూని ట్లకు యూనిట్‌కు రూ.3.10 చొప్పున, 51-100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.75 చొప్పున, 101-150 వరకు యూనిట్‌కు రూ.5.38 చొప్పున, 151-200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.5.94 చొప్పున) మొత్తం రూ.908.50 చెల్లించాల్సి ఉంటుంది. 201 యూనిట్లు వినియోగిస్తే మాత్రం ఏకంగా (మొదటి 200 యూనిట్లకు యూనిట్‌కు రూ.5.56 చొప్పున రూ.1112తో పాటు ఒక యూనిట్‌కు రూ. 6.69 మేరకు మొత్తం రూ.1118.69 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక యూనిట్ అదనంగా వాడినందుకు ఏకంగా రూ. 210.19 అదనంగా చెల్లించాల్సి రానుంది. మొత్తం బిల్లుకు సర్వీసు, ఇతర చార్జీలు అదనం.