EPDCL
-
విద్యుత్ ధరలపై ఆచితూచి అడుగులు
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ధరలపై పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొనుగోలు వ్యయం పెరుగుతున్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇంధన శాఖ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నాయి. తద్వారా విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో విద్యుత్ కొనుగోలు జరిగిన ఖర్చునే ఈ ఆర్థిక సంవత్సరం (2021–22)లో కూడా వర్తింపజేయాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ)కి పంపిణీ సంస్థలు (ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్) ప్రతిపాదనలు సమర్పించాయి. హెచ్చుతగ్గులతో ప్రమేయం లేకుండా.. పంపిణీ సంస్థలు దీర్ఘకాలిక, స్పల్పకాలిక కొనుగోలు ఒప్పందాల ద్వారా ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంటాయి. ఇలా కొనే విద్యుత్ ధరలు ఒక్కో సంస్థకు ఒక్కో విధంగా ఉంటాయి. పలు ఉత్పత్తి సంస్థలు యూనిట్ ధరను రూ.5.54 వరకూ నిర్ణయించి అమ్ముతున్నాయి. హైడల్ విద్యుత్ యూనిట్ రూ.1.58 పైసలకే లభిస్తుంది. కానీ.. దీని లభ్యత చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను ఎక్కువ ధర చెల్లించైనా సమకూర్చుకుని వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత డిస్కంలపై ఉంది. ఈ నేపథ్యంలో హెచ్చుతగ్గులతో ప్రమేయం లేకుండా ఎక్కడ విద్యుత్ దొరికితే అక్కడ కొనుగోలు చేస్తున్నాయి. 23న ఏపీ ఈఆర్సీ విచారణ ఇలా కొన్న విద్యుత్ సగటు వ్యయం ఈపీడీసీఎల్ యూనిట్ రూ.4.51గా, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.4.53గా నిర్ధారించాయి. తాము కొంటున్న విద్యుత్ ధరలను సంస్థల వారీగా కూడా డిస్కంలు ఏపీ ఈఆర్సీకి నివేదించాయి. ఈ మొత్తం కొనుగోలు ఖర్చులకు 2021–22 ఏడాది కూడా అనుమతించాల్సిందిగా మండలిని కోరాయి. డిస్కంలు సమర్పించిన లెక్కలు, ప్రతిపాదనలపై మార్చి 23న ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో ఏపీ ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఈ లోగా ఎవరైనా తమ అభ్యంతరాలను, సూచనలను ఏపీ ఈఆర్సీ ఈ మెయిల్ commn& secy@aperc.inకు పంపవచ్చు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుని మండలి విచారణ చేపడుతుంది. -
ఇక స్మార్ట్ సబ్స్టేషన్లు!
► అదో విద్యుత్ సబ్‌స్టేషన్. అక్కడ ఉద్యోగులెవరూ లేరు. అక్కడి నుంచి ఆ ప్రాంతంలోని గృహాలకు, దుకాణాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ► ఆ సబ్‌స్టేషన్ పరిధిలోని ఒక వీధిలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. సమాచారం ఇద్దామంటే సబ్‌స్టేషన్‌లో ఎవరూ లేరు. అయినా సంబంధిత విద్యుత్ సిబ్బంది వెంటనే అక్కడకు వచ్చి మరమ్మతులు ప్రారంభించారు. ... ఇందుకు కారణం సదరు సబ్‌స్టేషన్ నుంచి ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడమే. ఉద్యోగులు, సిబ్బంది లేకుండా సమాచారం ఎలా వెళ్లిందనేగా మీ అనుమానం? ఆ సబ్‌స్టేషన్.. స్మార్ట్ సబ్‌స్టేషన్. ఉద్యోగులు, సిబ్బంది అవసరం లేకుండానే విద్యుత్ సరఫరాలో సమస్య, అధిక లోడు, తక్కువ లోడు ఇలా ఏ సమాచారమైన వెంటనే తెలియజేసేలా సబ్‌స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల సబ్‌స్టేషన్‌ను పూర్తి స్థాయి ఆటోమేషన్ సబ్‌స్టేషన్ (స్మార్ట్ సబ్‌స్టేషన్)గా తీర్చిదిద్దనుంది. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం అంతా కంట్రోల్ రూమ్ నుంచే.. వాస్తవానికి ఇప్పటికే గిడిజాల వద్ద 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఉంది. ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్ స్మార్ట్ సబ్‌స్టేషన్‌గా మారనుంది. ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సబ్స్టేషన్లను స్మార్ట్ సబ్స్టేషన్లుగా మార్చేందుకు సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం రూ.334.51 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను కూడా ఆహ్వానించింది. గిడిజాల సబ్‌స్టేషన్‌ను స్మార్ట్ సబ్‌స్టేషన్‌గా మార్చేందుకు రూ.50 లక్షల మేర వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ సబ్‌స్టేషన్‌లో ఇక ఉద్యోగులెవరూ ఉండరు. పెదవాల్తేరు సబ్‌స్టేషన్‌లోని స్కాడ్ కంట్రోల్ రూమ్ నుంచే నడవనుంది. గిడిజాల సబ్‌స్టేషన్ పరిధిలోని విద్యుత్ పంపిణీ, ఇబ్బందులు ఇలా సమాచారమంతా ఆన్లైన్ ద్వారానే స్కాడ్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. తదనుగుణంగా ఇక్కడి నుంచే కార్యకలాపాలను నియంత్రించే వీలు కలగనుంది. మరింత నాణ్యమైన సేవలు.. ఈపీడీసీఎల్ పరిధిలోని సబ్స్టేషన్లను ఆటోమేషన్ కిందకు మార్చాలని భావిస్తున్నాం. ప్రయోగాత్మకంగా గిడిజాల సబ్‌స్టేషన్‌లో అమలు చేయనున్నాం. ఇందులో వచ్చే ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. స్మార్ట్ సబ్‌స్టేషన్‌లో ఎక్కడా ఉద్యోగుల అవసరం ఉండదు. అంతా రిమోట్ ద్వారానే నిర్వహించే వీలు కలుగుతుంది. వినియోగదారులకు కూడా మరింత నాణ్యమైన సేవలు అందుతాయి. – కె.సంతోషరావు, సీఎండీ, ఈపీడీసీఎల్ -
కంచే చేను మేసేస్తోంది!
సాక్షి, అమరావతి: కంచే చేను మేసిన చందాన ఉద్యోగులే సంస్థ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఉన్నతాధికారులు సైతం వారి అవినీతి వ్యవహారాలకు కొమ్ముకాస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)కు రావాల్సిన ఆదాయానికి కొందరు ఉద్యోగులు గండికొడుతున్నారు. వారు చేసింది తప్పని పలు విచారణల్లో తేలినా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఏపీ ట్రాన్స్‌కో వరకూ ఫిర్యాదులు వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు కూపీలాగే పనిలో పడ్డారు. ప్రతి డీడీకి సమర్పించుకోవాల్సిందే! ► విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సీజీఎం స్థాయి అధికారి ఒకరు సీఎండీ పేషీలోని ఒక అటెండర్ బంధువుకు చెందిన వాహనాన్ని అద్దెకు తీసుకుని వాడుకుంటున్నారు. నిజానికి ట్రావెల్ వాహనాన్ని వినియోగించాల్సి ఉన్నా.. అలా చేయలేదు. సంస్థ నుంచి బిల్లు రూపంలో నగదు తీసుకుంటూ అటెండర్ బంధువుకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. ► ఏలూరు ఆపరేషన్ సర్కిల్లోని భీమవరం డివిజన్లో విద్యుత్ సర్వీస్ కోసం సంస్థ పేరు మీద వినియోగదారులు డీడీ తీయాలంటే తన సంతకం తప్పనిసరంటూ ఓ అధికారి నిబంధన విధించారు. ప్రతి డీడీకి కొంత మొత్తాన్ని తనకు లైన్మేన్లు చెల్లించడమన్నది ఆనవాయితీగా మార్చారు. ► తణుకు సబ్ డివిజన్లో భవనాలపై ఉన్న పెంట్ హౌస్‌కు విద్యుత్ సర్వీస్ ఇచ్చేందుకు ఇదే ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ► నిడదవోలు డివిజన్ ఉండ్రాజవరం మండలంలో ఓ అధికారి.. అపార్ట్మెంట్లకు విద్యుత్ సర్వీస్ ఇవ్వడంలో అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులు రావడంతో ఇటీవలే విజిలెన్స్ విచారణ జరిపించారు. ఇలా అనేక చోట్ల సంస్థకు రావాల్సిన ఆదాయాన్ని ఉద్యోగులు, అధికారులు పక్కదారి పట్టిస్తున్నట్టు ట్రాన్స్‌కో విజిలెన్స్‌కు సమాచారం అందింది. త్వరలోనే చర్యలు డిస్కంకు నష్టం చేకూర్చేలా ప్రవర్తించిన ఏ ఉద్యోగిపైనైనా సరే తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అటువంటి వారిపై విచారణ జరుగుతోంది. కొందరు తప్పు చేసినట్టు రుజువైనప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. వారి ప్రమేయం పైనా ఆరా తీస్తున్నాం. త్వరలోనే మా వైపు నుంచి చర్యలుంటాయి. –ఏపీ ట్రాన్స్ కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు. తప్పు చేశాడని తేలినా.. శ్రీకాకుళానికి చెందిన జి.సత్యవతి తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ పొందేందుకు రూరల్ సెక్షన్‌ను సంప్రదించారు. ఆమె ఇంటికి విద్యుత్ సర్వీస్ ఇవ్వాలంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలతో కలిపి మొత్తం రూ.1,04,000 ఖర్చవుతున్నా అక్కడి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్(ఏఈఈ) బి.నాగేశ్వరరావు ఆమె నుంచి అనధికారికంగా రూ.లక్ష తీసుకుని కేవలం రూ.8,900కే ప్రతిపాదనలిచ్చారు. సంస్థ అవసరానికి వాడుకునేందుకు పక్కన ఉంచిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలతో పని పూర్తిచేశారు. ఈ వ్యవహారంపై శ్రీకాకుళం రూరల్ ఏడీఈ విచారణ జరిపి ఎస్ఈకి నివేదిక ఇచ్చారు. ఎస్ఈ మరోసారి డివిజనల్ ఇంజనీర్ స్థాయి అధికారితో విచారణ జరిపించారు. ఆయన విచారణలోనూ ఏఈఈ నేరం రుజువైంది. ఈ మొత్తం నివేదికను విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉండే చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం)కు ఎస్ఈ పంపించారు. తప్పు చేసిన ఇంజనీర్‌పై చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. సీజీఎం నుంచి ఎలాంటి ఆదేశాలూ వెలువడలేదు. -
ఈపీడీసీఎల్‌లో ఏం జరుగుతోంది..?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పది కాదు.. ఇరవై కాదు 720 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నప్పుడు పర్యవేక్షణ ఎలా ఉండాలి.? ఎలా పడితే అలా భూగర్భ కేబుళ్ల పనులు చేస్తుంటే నియంత్రించకుండా ఏం చేస్తున్నారు.? పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంటే కనీసం పట్టించుకోరా.? అత్యంత ప్రతిష్టాత్మకమని చెప్పినా నిర్లక్ష్యం వహిస్తే ఎలా.? అసలు ఈపీడీసీఎల్‌లో ఏం జరుగుతోందంటూ సీఎండీ దొరపై చీఫ్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్ శాఖలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ అమరావతిలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ముఖ్య అధికారులు, ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు(ఏపీడీఆర్పీ) కింద చేపడుతున్న భూగర్భ కేబుల్ ఏర్పాటు పనుల ప్రస్తావన సమయంలో పై వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో తొలిసారిగా అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్వర్క్ ప్రాజెక్టు విశాఖలో తొలిసారిగా ప్రారంభించాం. ప్రపంచ బ్యాంకు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనుల్ని ఎలా చెయ్యాలి, కానీ.. మీరెలా చేస్తున్నారంటూ’ సీఎండీ దొరపై సీఎస్ దినేష్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.720 కోట్ల విలువైన భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులపై ఈపీడీసీఎల్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటాన్ని తప్పుబట్టారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో చాలా చోట్ల నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ఇష్టమొచ్చినట్లు అడ్డగోలుగా పనులు చేస్తున్నా పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎండీగా ఉండి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో నిబంధనలు, ప్రమాణాలు పాటించేలా ప్రతి పనినీ పర్యవేక్షించాలని అధికారులను చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ సూచించారు. -
వెలుగుల శాఖలో బదిలీల పర్వం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఆ సంస్థలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 20 శాతం మందిని మాత్రమే బదిలీ చేయాలని మార్గదర్శకాలు అందాయి. బదిలీకి అర్హులైన వారి జాబితాను ఈపీడీసీఎల్ ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డి సిద్ధం చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలను బదిలీల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో రెండేళ్ల పదవీ కాలం పూర్తిచేసిన వారిని పట్టణ ప్రాంతాలకు బదిలీ చేస్తారు. అర్హుల జాబితా విడుదల క్షేత్రస్థాయి ఉద్యోగుల నుంచి ఇంజినీరింగ్ అధికారుల వరకు మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులు, 3నుంచి ఐదేళ్లుగా ఒకేచోట పని చేస్తున్న వారు, ఐదేళ్లుగా ఒకేచోట ఉన్న వారి జాబితాలను వేర్వేరుగా రూపొందించారు. గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఏరియాల వారీగా వివిధ స్థాయిల్లో జాబితాలను సిద్ధం చేశారు. ఈ జాబితాలపై రెండు రోజులపాటు అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలించిన తరువాత అర్హుల జాబితా విడుదల చేస్తారు. తరువాత ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో సంబంధిత ఉద్యోగులు తమకు కావాలి్సన ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పిస్తారు. వెబ్ ఆప్షన్లకు వచ్చేనెల 4వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అనంతరం బదిలీ ఉత్తర్వులు ఇస్తారు. బదిలీ పొందిన వారంతా వచ్చేనెల 22వ తేదీలోగా పాత స్థానాలను వదిలి కొత్త స్థానాల్లో చేరాల్సి ఉంటుంది. ఇదిలావుంటే ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకుల బదిలీలపై సస్పెన్స్ వీడలేదు. కీలకంగా పనిచేస్తున్న మూడు గుర్తింపు సంఘాల వారికి మాత్రమే బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాల కోసం వివిధ సంఘాల నేతలు ఎదురుచూస్తున్నారు. ఉద్యోగుల వారీగా.. సాధారణ బదిలీల్లో ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ఎస్ఈ వివిధ స్థాయి ఉద్యోగులను బదిలీ చేస్తారు. అకౌంట్స్ విభాగంలో జూనియర్ అకౌంట్స్ అధికారి, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్లను బదిలీ చేస్తారు. ఇంజినీరింగ్ విభాగంలో సబ్ ఇంజినీర్లను, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ విభాగంలో ఫోర్‌మెన్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేయవచ్చు. కాగా బదిలీ మార్గదర్శకాల మేరకు తయారు చేసిన జాబితాలో 8 మంది జేఏఓలు, 31 మంది సీనియర్ అసిస్టెంట్లు, 38 మంది జూనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు టైపిస్టులు, 18 మంది సబ్ ఇంజినీర్లు, ముగ్గురు ఫోర్మెన్లు ఉన్నారు. వీరిలో సీనియార్టీ ప్రకారం వారు కోరుకున్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు. -
సగం మందికే ఎల్ఈడీ వెలుగులు!
భ్రాంతిగా మారిన ఎల్ఈడీ కాంతి ఇంటికి రెండిస్తామని చెప్పిన ప్రభుత్వం శతశాతం పంపిణీ చేస్తామన్న ఈపీడీసీఎల్ మూలకు చేరిన బల్బులకు అతీగతీ లేదు బల్బులకు ముఖం చాటేస్తున్న ఈఈఎస్ఎల్ శ్రీకాకుళం టౌన్: విద్యుత్ వాడకాన్ని తగ్గించుకునేందుకు ప్రతి ఇంటికీ ఎల్ఈడీ బల్బులను సబ్సిడీపై పది రూపాయలకే అందిస్తున్నామని చెప్పుకున్న ప్రభుత్వం ఆ మేరకు లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. విద్యుత్ బిల్లులు తగ్గుతాయన్న ఆశతో వినియోగదారులు ఇంట్లో ఉన్న బల్బులను తీసేసి ఎల్ఈడీలను అమర్చుకోవడానికి సిద్ధపడ్డారు. ప్రతీ ఇంటికి రెండు బల్బులను తప్పనిసరి చేస్తే విద్యుత్ వినియోగం పెద్దెత్తున తగ్గుతోందని అధికారులు అంచనా వేశారు. అందులో భాగంగా జిల్లాలో విద్యుత్ వినియోగదారులందరికీ తన ఇంట్లో ఉన్న బల్బులకు తోడు రెండునెలల పాటు విద్యుత్ వినియోగానికి చెల్లిస్తున్న చార్జీల బిల్లులను అందజేయడంతో పాటు 20 రూపాయలు చెల్లిస్తే గ్రామంలోనే ఎల్ఈడీ బల్బులు అందజేస్తామని ప్రటనలు ఇచ్చారు. అకారణంగా బల్బులు పాడైతే తిరిగి వాటిని బిల్లు చెల్లించే చోట అందజేస్తే కొత్తవి ఇస్తామని ప్రకటించారు. ఈ మాటలు నమ్మిన వినియోగదారులు పెద్ద ఎత్తున ఎల్ఈడీ బల్బులకు క్యూ కట్టారు. అయితే జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఎల్ఈడీ విద్యుత్ దీపాల పంపిణీ కార్యక్రమంలో ఇంకా లక్షన్నర కుటుంబాల దరి చేరలేక పోయింది. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ గణాంకాల ప్రకారం 6.44 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి తోడు గత ఏడాది కొత్తగా 32 వేల కనెక్షన్లను మంజూరు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు మరో 12 వేల కొత్త కనెక్షన్లు మంజూరయ్యాయి, మొత్తం గృహ వినియోగదారుల సంఖ్య 6.90 లక్షల వరకు చేరింది. కాని ఇంతవరకు తొలివిడతలో 5.32 లక్షల మందికి ఒక సర్వీసుకు రెండు బల్బుల వంతున గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 10.65 లక్షల బల్బులను సరఫరా చేశారు. ఈ ఏడాది మార్చిలో రెండో విడత కింద 19,128 మంది లబ్థిదారులకు 38,256 బల్బులను మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా లక్షన్నర కుటుంబాలకు ఎల్ఈడీ బల్బులను సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంది. దీనికితోడు ఎల్ఈడీ బల్బులు సరఫరా చేసిన ఈఈఎస్ఎల్ సంస్థ ఇప్పుడు ముఖం చాటేస్తుండడంతో కొత్త సమస్య తలెత్తుతోంది. గతంలో పంపిణీ సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏకారణం చేతనైనా బల్బు వెలగక పోతే వాటిని తిరిగి సంస్థ తీసుకుని కొత్తవి ఇస్తారని గతంలో ప్రభుత్వంతోపాటు సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఈపీడీసీఎల్ సంస్థ కార్యాలయంలో బిల్లులు చెల్లించే స్థలాల్లో వీటిని తిరిగి తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. కాని అలాంటి కౌంటర్లు ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా.. వారు ఏమీ చేయలేని స్థతిలో నిట్టూరుస్తున్నారు. మూడున్నర లక్షల బల్బులు అవసరం జిల్లాకు ఇంకా మూడున్నర లక్షల ఎల్ఈడీ బల్బులు అవసరమవుతోందని గుర్తించి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయానికి గతంలో లేఖలు రాశాం. రెండో విడత కేవలం 32 వేల బల్బులే పంపిణీ అయ్యాయి. మిగిలిన రెండున్నర లక్షల బల్బులు ఇంకా సరఫరా కావాల్సిఉంది. ఈఈఎస్ఎల్ సంస్థ ప్రతినిధులను ఇప్పటికే పలుమార్లు సరఫరా కోసం సంప్రదించాం. ఇంకా బల్బులు రాక పోవడంతో పంపిణీ సాధ్యం కాలేదు. – డి.సత్యనారాయణ, ఎస్ఈ, తూర్పు విద్యుత్ పంపిణీసంస్థ(ఆపరేషన్స్) -
ఈపీడీసీఎల్ సీఎండీగా నాయక్
విజయనగరం నుంచి విశాఖకు బదిలీ సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా విజయనగరం జిల్లా కలెక్టర్ ముదావత్ ఎం.నాయక్ నియమితులయ్యారు. ఇంతకుముందు సీఎండీగా పని చేసిన రేవు ముత్యాలరాజు ఈ నెల 22న నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జి సీఎండీగా జిల్లా జాయింట్ కలెక్టర్ నివాస్‌ను నియమించారు. ఆయన ఆ బాధ్యతలు చేపట్టకముందే.. రెగ్యులర్ సీఎండీగా నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2005 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నాయక్ గుంటూరు జిల్లా చిలకూరిపేటలోని సుగాలి కాలనీలో జన్మించారు. -
ఒకరు కాదు..ముగ్గురు!
అనుకున్నదే జరుగుతోంది. ‘సాక్షి’ కథనం నిజమవుతోంది. జిల్లా కలెక్టర్ యువరాజ్ కేంద్ర సర్వీసులకు వెళ్లడం ఖాయమైంది. ఆయనతోపాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులకు స్థానచలనం ఖాయమని తెలుస్తోంది. ఖాళీ అవుతున్న కలెక్టర్ పోస్టులోకి జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మారనున్నారు. అలాగే ఈపీడీసీఎల్ సీఎండీగా ఉన్న ముత్యాలరాజు నెల్లూరు కలెక్టర్‌గా వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ రెండు కీలక పోస్టుల్లోకి కొత్తగా ఎవరు వస్తారన్నది ఇంకా వెల్లడి కాలేదు. తాజా మార్పులపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. సాక్షిప్రతినిధి, విశాఖపట్నం: జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ ఎన్.యువరాజ్ మార్పు ఖాయం కావడంతో ఆయన స్థానంలో జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ పదోన్నతిపై నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా పనిచేసిన ప్రస్తుత కలెక్టర్ యువరాజ్ సతీమణి జానకి ఏడాదిన్నర క్రితం నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. యువరాజ్–జానకీ దంపతులను స్టేట్ క్యాడర్ నుంచి కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునేందుకు కేంద్రం ఆసక్తి చూపింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది. నెల్లూరు కలెక్టర్‌గా పనిచేస్తున్న జానకీ ఇప్పటికే అక్కడ విధుల నుంచి రిలీవ్ కాగా అదే బాటలో త్వరలో యువరాజ్‌ను కూడా రిలీవ్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు యువరాజ్ స్థానంలో ఎవరిని నియమించాలన్న సందిగ్ధంలో సర్కార్ ఉంది. ఐటీడీఏ పీవో హరినారాయణ పేరు తొలుత ప్రాథమికంగా పరిశీలనలోకి వచ్చింది. అయితే త్వరలో జీవీఎంసీ ఎన్నికలు జరగనుండడం.. సుమారు రూ.2,250 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖలో పెద్ద ఎత్తున అభివద్ధి కార్యక్రమాలు పట్టాలెక్కనున్న తరుణంలో జీవీఏంసీతో పాటు అటు జిల్లాపై అవగాహన ఉన్న వారినే ఇక్కడ కలెక్టర్‌గా నియమిస్తే రెండు విధాలుగా మేలు జరుగుతుందన్న ఆలోచనకు వచ్చిన ప్రభుత్వం, ఆ దిశగా అన్వేషణ మొదలెట్టింది. గతంలో జేసీగా పనిచేసి..ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్‌గా ఉన్నందున జిల్లాపై అవగాహన ఉన్న ప్రవీణ్ కుమార్ వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. కాగా జాయింట్ కలెక్టర్‌గా జిల్లాకు వచ్చిన ప్రవీణ్‌కుమార్ హుద్‌హుద్ తుఫాన్ తర్వాత తొలుత గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అయితే కొద్దికాలానికే తిరిగి జీవీఎంసీ కమిషనర్‌గా పోస్టింగ్ పొందారు. గత ఏడాదిన్నరగా జీవీఎంసీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇదే జిల్లాలో ఆయనకు కలెక్టర్‌గా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం సముఖంగా ఉన్నట్టు తెలిసింది. మరో పక్క ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా గత ఏడాదిన్నరగా పనిచేస్తున్న ఆర్.ముత్యాలరాజుకు పదోన్నతి కల్పిస్తూ ఇప్పటికే రిలీవ్ అయిన నెల్లూరు జిల్లా కలెక్టర్ జానకి స్థానంలో నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. -
హాలోజన్.. హాంఫట్!
గోదావరి పుష్కరాల్లో కొందరు పుణ్యం మూటగట్టుకుంటే మరికొందరు మాత్రం అక్రమంగా ప్రజాధనాన్ని మూటగట్టుకున్నారు. పన్నెండేళ్లకోసారి వచ్చే పుణ్యకార్యంగా చెప్పుకునే పుష్కరాల కోసం చేసిన ఏర్పాట్లలోనూ అవినీతికి పాల్పడి జేబులు నింపుకున్నారు. ఒక్క రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విద్యుదీకరణ పనుల్లోనే కోట్లాదిరూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏర్పాట్లలో ఎన్నికోట్లు.. ఎవరెవరి జేబుల్లోకి వెళ్లాయో..! వెల్లువెత్తుతున్న ఆరోపణలపై సర్కారు మిన్నకుంటున్న వైనం... మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన విద్యుదీకరణ పనులకు ఉపయోగించిన హాలోజన్ విద్యుద్దీపాలు, రంగుల బల్బులెక్కడున్నాయో తెలియడంలేదు. పుష్కరాల తర్వాత వీటిని నగరపాలక సంస్థకు అప్పగించలేదు. వీధి దీపాల నిర్వహణ బాధ్యతను చూసే కార్పొరేషన్‌కు ఇస్తే వీటిని తక్షణమే ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ లైట్ల ఆచూకీ లేకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. అసలు వీటిని కొన్నారా? అద్దెకు తెచ్చారా? కొన్నట్టు లెక్కలు చూపించి డబ్బులు కాజేశారా? అసలేం జరిగిందంటే.. రాజమండ్రి పుష్కర ఘాట్‌ను విద్యుల్లతలతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)ను ఆదేశించింది. ఇందుకోసం రూ.1,71,82,836ను విడుదల చేసింది. ఈ నిధుల్లో రూ. 99,23,100తో హాలోజన్ ల్యాంపులు, డెకరేషన్ బల్బులు అద్దెకు తెచ్చారు. మరో రూ. 72,59,736ను హాలోజన్ ల్యాంపులు, బల్బులు కొనుగోలుకు, కేబుల్, జీఐ వైర్, ఇన్సులేషన్ టేపులు, పిన్స్, ఎంసీబీలు, బల్బులు, ల్యాంపులు, హోల్డర్ల కొనుగోలుకు వెచ్చించారు. నిజానికి అంతపెద్ద మొత్తంలో బల్బులు అద్దెకు దొరికే పరిస్థితి నగరంలో లేకపోయినా పేరుకు కొన్ని దుకాణాల పేర్లురాశారు. అద్దెకు తెచ్చినవాటిని తిరిగిచ్చారు సరే.. మరి కొన్నవేవి? నిబంధనల ప్రకారం రూ. 5 లక్షలు దాటితే టెండర్లు పిలవాలి. దాదాపు రెండుకోట్ల వ్యవహారం జరిగినా ఎక్కడా టెండర్లన్న పదమే వినిపించలేదు. వెయ్యి వోల్టుల హాలోజన్ ల్యాంపులు కాంట్రాక్టరు చెప్పిన రేటుకే కొనేసినట్టు చెబుతున్నారు. ఒక్కో ల్యాంపు రూ. 824 చొప్పున 654 ల్యాంపులు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.5,41,512. 500 వాట్స్ హాలోజన్ ల్యాంపులు 553 కొనుగోలు చేశారు. ఒక్కొక్కటీ రూ. 588 చొప్పున రూ. 3,25,164 చెల్లించారు. లేబర్ చార్జీల పేరుతో 295 మందికి ఏడు రోజుల పాటు రోజుకు రూ.500 లెక్కన రూ. 10,32,500 చెల్లించారు. వీళ్ళను ఏ పనులకు వినియోగించారనే వివరాలు లేవు. సీఎండీ విచారణకు ఆదేశించినట్టు తెలియడంతో జిల్లా విద్యుత్ అధికారులు పాత తేదీల్లో బిల్లులు సంపాదించేందుకు హైదరాబాద్‌లోని ఓ విద్యుత్ ఉపకరణాల సంస్థను సంప్రదించినట్టు తెలిసింది. విచారణకు ఆదేశించాం గోదావరి పుష్కరాల సందర్భంగా విద్యుదీకరణ పనులపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్టు ఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాలరాజు తెలిపారు. వాస్తవాలు తెలుసుకునేందుకు సంస్థ డెరైక్టర్‌ను రాజమండ్రికి పంపుతున్నట్టు చెప్పారు. అయితే కొన్ని హాలోజన్ ల్యాంపులను విశాఖపట్టణానికి తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు. ఏదేమైనా అవకతవకలు జరిగినట్టు తేలితే, ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. -
ఆ పోస్టులు..అవినీతి వెలుగులు
- అవినీతికి తెర తీస్తున్న టీడీపీ ప్రభుత్వం - విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు ప్రయివేటుపరానికి రంగం సిద్ధం - ఈపీడీసీఎల్ సిబ్బందిని తప్పించే ప్రయత్నం - అధికార ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ప్రభుత్వం మరో అవినీతికి తెరతీస్తోంది. తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అనుయాయులకు భారీ మొత్తం సమకూర్చే పన్నాగానికి శ్రీకారం చుడుతోంది. విద్యుత్ సబ్స్టేషన్లలో ఈపీడీసీఎల్ సిబ్బందిని తప్పించి ప్రైవేటు షిఫ్ట్ ఆపరేటర్లను నియమించాలనుకుంటున్నారు. ఈ పోస్టుకు కనీసం రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకూ అమ్ముకునే వీలుంది. ఈపీడీసీఎల్ పరిధిలో పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలున్నాయి. ఐదు జిల్లాల్లో 52.76 లక్షల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరికి విద్యుత్ సరఫరా చేసేందుకు 33/11కెవి విద్యుత్ సబ్స్టేషన్లు 663 ఉన్నాయి. వాటిలో 539 సబ్స్టేషన్లు 2156 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది నిర్వహణలో ఉన్నాయి. మిగతా 124 సబ్స్టేషన్లలో సంస్థ సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సబ్స్టేషన్లలో ఈపీడీసీఎల్ సిబ్బందిని తప్పించి ప్రైవేటు వారిని నియమించుకోవాలని భావిస్తున్నారు. అధికారులకు ఇప్పటికే సూచనలు అందాయి. దీంతో ఏ నియోజకవర్గంలో ఎన్ని సబ్స్టేషన్లలో ఎంత మంది ఎప్పటి నుంచి పనిచేస్తున్నారనే నివేదిక ఇవ్వాలని అన్ని సర్కిళ్ల ఎస్ఈలకు ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేట్ కార్యాలయంలో నేడు సీఎండీ సమావేశం అవుతున్నారు. విశాఖ సర్కిల్లో 26 సబ్ స్టేషన్ల పరిధిలో 103మంది పనిచేస్తున్నారు. నిజానికి 2156 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు నియమించారు. అది చాలదన్నట్లు ఇప్పుడు సంస్థ నిర్వహణలో ఉన్న బస్స్టేషన్లను సైతం అవుట్సోర్సింగ్కు ఇచ్చి సొమ్ముచేసుకోవాలని తాజాగా వ్యూహం పన్నుతున్నారు. కాంట్రాక్టు షిఫ్ట్ ఆపరేటర్‌గా చేరడానికి విద్యార్హతలు ఎంత అవసరమో ప్రజాప్రతినిధుల సిఫార్సు కూడా అంతే అవసరం. ఆ సిఫార్సు లేఖ సాధించాలంటే సబ్‌స్టేషన్ పరిధి, అది ఉన్న ప్రాంతాన్ని బట్టి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకూ సమర్పించాలి. షిఫ్ట్ ఆపరేటర్లకు సంస్థ చేపట్టే శాశ్వత ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించడం, 20 మార్కులు వెయిటేజీ ఇస్తుండటం వల్ల తొలుత అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ప్రవేశించేందుకు నిరుద్యోగులు ఎగబడుతున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రజాప్రతినిధులు వాటిని అమ్ముకుంటున్నారు. -
కుర్చీలు కదిలాయి!
సాక్షి, విశాఖపట్నం : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో ఉద్యోగుల బదిలీలు దాదాపు పూర్తయ్యాయి. డీఈ, ఏడీఈ, ఏఈ, ఏఏఈ, ఎస్ఏఓ, ఏఓ, ఏఏఓ, పీఓ వరకూ అన్ని కేటగిరిల్లో బదిలీలు జరిగాయి. ఈ నెల 29న తొలి జాబితాను విడుదల చేయగా ఆదివారం తుది జాబితాను అధికారులు వెల్లడించారు. 12 మంది డీఈలతో పాటు మొత్తం 175 మంది ఉద్యోగులను ఈపీడీసీఎల్ పరిధిలోని ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బదిలీచేసి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఎప్పటిలా కాకుండా ఈ సారి సీఎండీ ఆర్.ముత్యాలరాజు ప్రత్యేక వ్యూహంతో బదిలీలు చేపట్టి సంచలనాలకు కారణమయ్యారు. ముఖ్యంగా స్టేషన్ సీనియారిటీ ప్రాతిపదికన బదిలీ చేయాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎండీ దానిని అమలు చేసేందుకు అంతే స్థాయిలో నిలబడ్డారు. దీంతో 5 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఒకే చోట పనిచేస్తున్న వారిపై బదిలీవేటు పడింది. వీరిలో ఎంపిక చేసిన కొందరిని దూరంగా విసిరేసినట్లు వారికిచ్చిన పోస్టింగ్‌లను బట్టి కనిపిస్తోంది. ఈపీడీసీఎల్‌లో మొత్తం 7800 మంది ఉద్యోగులున్నారు. వారిలో దాదాపు 1500 మంది బదిలీలకు అర్హులు. 5 ఏళ్లు పూర్తయిన వారు దాదాపు 350 మంది ఉన్నారు. సాధారణంగా బదిలీ నిబంధనల ప్రకారం ఒకే పోస్టులో 3 ఏళ్లు, ఒకే ప్రాంతంలో 5ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగిని బదిలీ చేయాలి. అయితే ప్రభుత్వ నిబంధనలకు సీఎండీ ముత్యాలరాజు మార్పులు చేశారు. ఏ పోస్టులో ఉన్నప్పటికీ ఒకే ప్రాంతంలో ఎన్నేళ్లుగా పనిచేస్తున్నారనేదే ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించారు. దానికి తగ్గట్టు మార్గదర్శకాలు తయారు చేయించి అర్హుల జాబితాను ప్రకటించారు. దీనిపై కొందరు ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తంచేసి హైదరాబాద్‌లో పంచాయతీ పెట్టినా సీఎండీ ఎక్కడా వెనకడుగు వేయలేదు. తన మాట కాదంటే సెలవుపై వెళ్లిపోవడానికైనా సిద్ధమని ఓ సమయంలో ఉన్నతాధికారుల వద్ద కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారని వార్తలు వినిపించాయి. అందువల్లనే వారు కూడా మారు మాట్లాడకుండా సీఎండీ నిర్ణయానికి వదిలేశారని కొందరు ఉద్యోగులు అంటున్నారు. పాతుకుపోయిన వారికి స్థానచలనం: ఎన్నో ఏళ్లుగా ఒకే జిల్లాలో పాతుకుపోయిన వారు ఇప్పుడు తప్పనిసరై జిల్లా దాటుతున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న కొందరు ఉద్యోగులను వారు ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి చాలా దూరం విసిరేశారు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సర్కిల్లో ఓ ఏడీఈ తనను ఎక్కడికి బదిలీ చేసినా ఆ ప్రాంతం నుంచి నెలలు తిరక్కుండానే తిరిగి ఆ సర్కిల్‌కు వచ్చేస్తుంటారు. అప్పటివరకూ ఎక్కువ రోజులు సెలవులోనే ఉంటారు. ఇప్పుడు అయనను శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. కొందరిని ఏజెన్సీకి పంపించారు. దీనివల్ల వ్యక్తుల వారీగా టార్గెట్ చేసి బదిలీలు చేశారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అవేవీ సీఎండీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు బదిలీ అర్డర్లు తీసుకున్న వారిలో అసంతృప్తిగా ఉన్న వారు ఆ పోస్టుల్లో చేరతారో లేక దీర్ఘకాల సెలవులు పెడతారో వేచి చూడాలి. నిజానికి ఓ డీఈ విషయంలో సీఎండీకి ఇలాంటి అనుమానమే రావడంతో సెలవుపై వెళ్లడం,పోస్టింగ్ మార్చమని రిక్వెస్ట్ పెట్టడం కుదరదని ఆయనకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వుల్లోనే స్పష్టంగా పేర్కొన్నారు. ఇది మిగతా ఉద్యోగులు ఓ హెచ్చరికగా భావించే అవకాశం ఉంది. -
ఏం చేద్దాం..
విశాఖపట్నం: చాలా ప్రత్యామ్నాయ మార్గాలు వదిలేసి విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఏమిటంటూ వినియోగదారులు సంధించిన ప్రశ్నకు ఈపీడీసీఎల్‌లో అంతర్మథనం మొదలైంది. ఇటీవల వినియోగదారుల నుంచి వ్యతిరేకతను చూశాక ప్రతిపాదించిన మేరకు చార్జీలు పెరుగుతాయో లేదోననే అనుమానం పుట్టుకొచ్చింది. గతేడాది కూడా ఇదే విధంగా టారిఫ్‌లు ఇచ్చినా చార్జీలు పెంచకుండా పాత టారిఫ్‌నే కొనసాగిస్తూ ఏపీఈఆర్సీ నిర్ణయం ప్రకటించింది. ఈసారి కూడా అదే పునరావృతమైనా లేక ప్రతిపాదించిన స్థాయిలో చార్జీలు పెరగకపోయినా ఈపీడీసీఎల్ ఆర్థిక లోటు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సంస్థ సీఎండీ ఆర్ ముత్యాలరాజు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. వాటిపైనే రోజూ కార్పొరేట్ కార్యాలయంలో డెరైక్టర్లు, సీజీఎంలతో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో 52.18 లక్షల విద్యుత్ వినియోగదారులున్నారు. వీరికి విద్యుత్ సరఫరా అందించేందుకు 941 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 150181 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ,33/11కెవి సబ్స్టేషన్లు 653 ఉన్నాయి. ఇవి తరచుగా మరమ్మతులకు గురవుతుండటం వల్ల విద్యుత్ అమ్మకాలపై ప్రభావం పడుతోంది. ఫలితంగా ఫెయిల్యూర్ శాతం 4.89 నమోదయింది. ఫిబ్రవరి, మార్చి నెలలు కూడా జతకలిసే సరికి ఈ శాతం మరింత పెరుగుతుంది. ఇప్పటికే నర్శీపట్నంలో రూ.3.31 కోట్లతో ఈ పనులు పూర్తి చేసింది. 15శాతం పైబడి నష్టాలు కలిగిన 9పట్టణాల్లో ఈ పనులకు రూ.61.82 కోట్లు మంజూరు చేశారు. పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను సీఎండీ ఆదేశించారు. అదే విధంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రూ.61.44 కోట్లతో ఈపీడీసీఎల్ పరిధిలోని 29 పట్టణాల్లో చేపట్టిన ఫీడర్ వారీగా ఎనర్జీ ఆడిట్ నివేదికలు సేకరించడం, కేంద్రీకృత వినియోగదారుల సేవాకేంద్రాల ఏర్పాటు పనులు 28 పట్టణాల్లో పూర్తికాగా విశాఖలో మార్చి 8వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. సబ్స్టేషన్లపై భారం పడకుండా చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకునే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఫరఫరా కోసం రూ.25.25 కోట్ల ఖర్చుతో 430 కిలో మీటర్ల 33కెవి లైన్లు ఇంటర్ లింకింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలనుకుంటున్నారు. విద్యుత్‌ను పొదుపు చేయాలని కూడా ఈపీడీసీఎల్ ప్రయత్నిస్తోంది. దాని కోసం 5స్టార్ రేటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే వినియోగించనున్నారు. ప్రస్తుతం అమ్మకాల ద్వారా వస్తున్న రూ.7898.223 కోట్ల ఆదాయాన్ని ఇలాంటి విధానాల ద్వారా పెంచుకోవాలని ఈపీడీసీఎల్ భావిస్తోంది. -
షాక్ తప్పదా!
సాక్షి, రాజమండ్రి :కరెంటు భారం ప్రజలకు తప్పేటట్టు లేదు. ఎవరెంత మొత్తుకున్నా చార్జీల పెంపునకు ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటూపోతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి బుధవారం కాకినాడ జేఎన్టీయూలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు వీలుగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) చేసిన చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈ సందర్భంగా ప్రజల అభిప్రాయం తెలుసుకుంటారు. నిబంధనల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ చేసినా, ఆ సందర్భంగా వస్తున్న ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వం పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. దీంతో భారం తప్పని పరిస్థితి ఏర్పడనుంది. అయినప్పటికీ కాకినాడలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు, ప్రజాసంఘాలు చార్జీల పెంపును ప్రతిఘటించేందుకు సిద్ధమవుతున్నాయి. జిల్లాపై రూ.13 కోట్లు పైగా భారం చార్జీల పెంపు ప్రతిపాదనలు అమలులోకి వస్తే జిల్లాపై నెలకు రూ.13 కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా. వంద యూనిట్లలోపు విని యోగదారులకు చార్జీల మోత ఉండదని ప్రభుత్వం చెబుతున్నా అది కంటితుడుపు కూడా కాదని వినియోగదారులు అంటున్నారు. జిల్లాలో మొత్తం 14,39,670 మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరిలో 12.44,626 మంది గృహ వినియోగదారులే. వీరిలో తాజా నెల బిల్లు ప్రకారం 50 యూనిట్లలోపు వినియోగదారులు 5.76 లక్షల మంది ఉన్నారు. 51 నుంచి 100 యూనిట్ల లోపు వినియోగిస్తున్నవారు 4.37 లక్షల మంది ఉన్నారు. వీరి సంఖ్య నెలనెలా మారుతూంటుంది. వచ్చేది వేసవి కావడంతో ప్రతి వినియోగదారుని ఇంటా వినియోగం భారీగా ఉంటుంది. మార్చి తర్వాత లెక్కలు పూర్తిగా తారుమారవుతాయి. అప్పటి లెక్కల అంచనాలు పరిశీలిస్తే 51 నుంచి 100 యూనిట్లలోపు వినియోగించేవారి సంఖ్య రెండు లక్షలకు తగ్గిపోతుంది. తద్వారా వేసవిలో ప్రభుత్వ రాయితీ ప్రభావం పేద, మధ్యతరగతి వినియోగదారులపై కనీసం 20 శాతం కూడా ఉండదు. -
ఏపీఈఆర్సీకి ఇద్దరు సభ్యులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సభ్యులుగా డాక్టర్ పెర్వెల రఘు, పెండ్యాల రామ్మోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరూ ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతార ని పేర్కొంది. రఘు 1979లో ఇండియన్ రెవెన్యూ సర్వీసులో చేశారు. తాజాగా ఆదాయం పన్నుశాఖ ముఖ్య కమిషనర్‌గా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. అంతకు ముందు ఆయన చెన్నై, హైదరాబాద్, గుంటూరు తిరుచ్చీ, అహ్మదాబాద్, ముంబై ప్రాంతాల్లో ఐటీ అదనపు కమిషనర్‌గా, డిప్యూటీ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. రామ్మోహన్ ప్రస్తుతం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. విశాఖపట్టణం జిల్లాకు చెందిన ఈయన ఈఎంసీ డిజైన్ ఆఫ్ ట్రాన్సిమిషన్, డిస్ట్రిబ్యూషన్లో పీహెచ్డీ చేశారు. 1978లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డులో సహాయ ఇంజనీర్‌గా చేశారు. ఏడీ, డీఈ, జీఎం, సీజీఎం, డెరైక్టర్‌గా అంచెలంచెలుగా ఎదిగారు. -
విద్యుత్ శాఖలో రాజకీయ అలజడి
సాక్షి, ఏలూరు : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో బదిలీల రాజకీయం తారస్థాయికి చేరుతోంది. రాజకీయ నేతలు రేపుతున్న అలజడితో ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. తమకు అనుకూలమైన వారిని తెచ్చుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలు ఆ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ పోస్టుపై ఉత్కంఠ వీడకపోగా, తాజాగా ఏలూరు, నిడదవోలు డీఈ పోస్టుల విషయంలోనూ రాజకీయ జోక్యం మొదలైంది. ఈ రెండు స్థానాలను దక్కించుకోవడానికి కొందరు ఉద్యోగులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. నిడదవోలు డీఈగా ప్రస్తుతం వీఎస్ మూర్తి విధులు నిర్వర్తిస్తున్నారు. రాజమండ్రి సర్కిల్ నుంచి కొన్ని నెలల క్రితమే ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇప్పుడు అదే సర్కిల్లో డీఈ స్థాయి అధికారిజిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ద్వారా నిడదవోలు డీఈగా వచ్చేందుకు సిఫార్సు చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఏలూరు డీఈ బి.వేదమూర్తి స్థానానికి వచ్చేందుకు ఒక ఏడీఈ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం పదోన్నతులు ఇచ్చే అవకాశం లేకపోయినప్పటికీ డీఈ పోస్టు కోసం ఏడీఈ ప్రయత్నాలు చేస్తుండటం విద్యుత్ ఉద్యోగులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎస్ఈ, డీఈ పోస్టులకే కాదు ఏడీఈ పోస్టులకూ పైరవీలు జోరుగా సాగుతున్నాయి. తణుకు ఏడీఈ పోస్టుకు గట్టిపోటీ ఏర్పడింది. ఏలూరు సర్కిల్ కార్యాలయం, చింతల పూడి డివిజన్లకు చెందిన ఏడీఈలు తణుకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు, రేపు జిల్లాలో సీఎండీ పర్యటన ఈ పరిస్థితుల్లో శుక్ర, శనివారాల్లో సంస్థ సీఎండీ మిరియాల వెంకట శేషగిరిబాబు జిల్లా పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం నిడదవోలు డివిజన్‌లోను, శనివారం భీమవరం డివిజన్‌లోను సీఎండీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో సమావేశం అవుతారు. పలు సెక్షన్ కార్యాలయాలను కూడా తనిఖీ చేస్తారు. ఉద్యోగుల బదిలీపై నెలకొన్న ఉత్కంఠకు సీఎండీ తెరదించుతారా, లేదా .. రాజకీయ పైరవీలపై ఆయన నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనే విషయమై విద్యుత్ శాఖ సిబ్బంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
హాట్ సీట్
సాక్షి, ఏలూరు : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్ఈ) పోస్టుకు చాలా గిరాకీ ఉంటుంది. అందులోనూ ఆపరేషన్స్ ఎస్ఈ పోస్టుకు పోటీ అంతాఇంతా కాదు. తామనుకున్న స్థానం దక్కించుకోవడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయడంలో ఈ సంస్థలోని అధికారులు ఎప్పుడూ ముందుంటారు. తమ ప్రయత్నం ఫలించేం దుకు ఎంత దూరమైనా వెళతారు.. ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఏలూరు సర్కిల్ ఆపరేషన్స్ ఎస్ఈ పోస్టు విషయంలో అదే జరుగుతోంది. ప్రస్తుత ఎస్ఈ టీవీ సూర్యప్రకాష్‌ను బదిలీ చేస్తూ ఆదివారం రాత్రి ఆ సంస్థ సీఎండీ ఎంవీ శేఖగిరిబాబు ఉత్తర్వులు జారీచేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్ఈగా సత్యనారాయణరెడ్డి (ప్రస్తుతం విశాఖపట్నం ఆపరేషన్స్ ఎస్ఈగా ఉన్నారు) విధుల్లో చేరతారని చెప్పారు. దీంతో సూర్యపకాష్ తాను బదిలీ అయిన విశాఖపట్నంలోని కార్పొరేట్ కార్యాలయానికి అసెస్మెంట్స్ ఎస్ఈగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఏమైందో ఏమో.. అప్పుడే రిలీవ్ కావద్దని, తదుపరి ఆదేశాలు వచ్చేంతవ రకూ వేచి ఉండాలని సీఎండీ నుంచి ఆదేశాలొచ్చాయి. చివరి నిమిషంలో ఎస్ఈ బదిలీకి బ్రేక్ పడటం చర్చనీయాంశమైంది. ఈ పోస్టులోకి వచ్చేందుకు విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి పలువురు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తుండటమే ఈ మార్పులకు కారణంగా తెలుస్తోంది. సూర్యప్రకాష్ ఇక్కడ ఎస్ఈగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు పూర్తయ్యింది. ఎన్నికల ముందే ఆయన బదిలీ అవుతారని అంతా ఊహించారు. కానీ కాలేదు. ఆయన కుటుంబ సభ్యులు విశాఖలోనే ఉండటంతో ఎప్పటినుంచో సూర్యప్రకాష్ తనను అక్కడికి బదిలీ చేయాల్సిందిగా సీఎండీని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత బదిలీ జరిగిం ది. ఆయన స్థానంలో ఎస్ఈగా వచ్చేందుకు ముగ్గురు అధికారులు తీవ్రంగా పోటీపడుతున్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా ఉన్నతాధికారులపై వత్తిడి తెస్తున్నారు. వారిలో గతంలో తాడేపల్లిగూడెం, రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన శరత్‌కుమార్ ప్రస్తుతం విశాఖపట్నంలోని కార్పొరేట్ కార్యాలయంలో వాణిజ్య విభాగం జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కావడంతో ఇక్కడ ఎస్ఈ పోస్టు తనకు ఇవ్వాల్సిం దిగా సీఎండీకి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రాష్టానికి చెందిన ఓ మహిళా మంత్రి ద్వారా సీఎండీకి సిఫార్సు చేయించుకుంటున్నారు. శరత్‌కుమార్ విజ్ఞప్తి చేసిన మాట వాస్తవమేనని కొద్దిరోజుల క్రితం సీఎండీ సైతం అంగీకరించారు. శరత్‌కుమార్‌తోపాటు మరో అధికారి ఎం.సత్యనారాయణమూర్తి కూడా ఏలూరు ఎస్ఈ పోస్టు కావాలంటున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ కార్యాలయంలో డీఈగా ఉన్న మూర్తికి పదోన్నతి కల్పించి విశాఖపట్నం ఎస్ఈగా నియమించారు. అయితే, ఆయన ఏలూరు వచ్చేందుకే మక్కువ చూపిస్తున్నారు. దానికోసం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా సీఎండీపై వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇక సూర్యప్రకాష్ స్థానంలో నియమితులైన సత్యనారాయణరెడ్డి కూడా జిల్లాకు చెందిన ఓ ఎంపీ సహకారంతోనే ఇక్కడి పోస్టును దక్కించుకున్నట్లు చెబుతున్నారు. చివరి నిమిషంలో బదిలీ నిలిచిపోవడంతో ఆయన మరోసారి ఆ ఎంపీని ప్రసన్నం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంపు మండలాల్లో సమస్యలను పరిష్కరించండి మహాప్రభో కుక్కునూరు : పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల సమస్యలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, వెంటనే సమస్యలను పరిష్కరిం చాలని సీపీఐ(ఎంఎల్) డివిజన్ కమిటీ సభ్యుడు ఎస్కె.గౌస్ సోమవారం డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించి తెలంగాణ ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ఈ మండలాలలో రేషన్ పంపిణీ, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. గోదావరి జిల్లాల అధికారులు ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆర్ఐ, వీఆర్వోల సస్పెన్షన్ కొవ్వూరు: ఈ నెల 25న ఓ రైతు నుంచి రూ.3 వేలులంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.నల్లరాజు, వీఆర్వో దుర్గారావులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్టు తహసిల్దార్ జి.కనకరాజు సోమవారం తెలి పారు. వేములూరుకు చెందిన సున్నం వీర ెంకట సుబ్రహ్మణ్యాచార్యులు అనే రైతు నుంచి రూ.3 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆర్ఐ, వీఆర్వో, రిటైర్డ్ వీఆర్వోలు పట్టుబడిన విషయం తెలిసిందే. -
మళ్లీ చీకట్లు!
విశాఖలో 3 గంటలు గ్రామీణ ప్రాంతాల్లో 5 గంటలు కోత సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ కోతల్లేని నవ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని పాలకులు ఊదరగొడుతుంటే...ఈపీడీసీఎల్ అధికారులు వేళాపాళాలేకుండా సరఫరా నిలిపివేసి వినియోగదారులకు నరకయాతన చూపెడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఉపాధి హామీ పీడీ శ్రీరాములనాయుడు నర్సీపట్నంలో క్లస్టర్ సమావేశం నిర్వహిస్తుండగా కరెంటు పోయింది. కొవ్వొత్తి వెలుతురులోనే సమావేశాన్ని కొనసాగించాల్సి వచ్చింది. విశాఖలో 3 గంటలు, గ్రామీణ జిల్లాలో 4 నుంచి 5 గంటలు సరఫరా నిలిపివేశారు. పరిశ్రమలకు 5 గంటల కోత విధించారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కూడా చాలా వరకు పడిపోయింది. సరఫరా, డిమాండ్ల మధ్య వ్యత్యాసంతో సాంకేతిక సమస్యలు ఏర్పడి కొన్ని యూనిట్లు ట్రిప్పయ్యాయి. దీంతో వేసవి మాదిరి విద్యుత్ కోతలు మొదలయ్యాయి. జిల్లా వరకు పరిశీలిస్తే శుక్రవారం 16 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. 15 మిలియన్ యూనిట్లు దాటి సరఫరా కాని పరిస్థితి. దీంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 4 నుంచి 5 గంటలపాటు విద్యుత్ కోతలుండగా, విశాఖలో మూడు గంటలు అత్యవసర కోతలు విధించారు. గురువారంతో పోలిస్తే గ్రామీణ, విశాఖ ప్రాంతాల్లో ఒక్కో గంట కోతలు పెరిగాయి. తగ్గిన ఉత్పత్తి : ఈపీడీసీఎల్ పరిధిలో శుక్రవారం నాటికి విండ్ పవర్ జనరేషన్ పూర్తిగా పడిపోయింది. 500 మెగావాట్ల సామర్థ్యమున్న ఈ విద్యుత్ కేవలం మూడు మాసాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది వారం రోజుల ముందే అయిపోయింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కూడా 700 మెగావాట్ల వరకు క్షీణించింది. సాధారణంగా 2,400-2,500 మెగావాట్లు ఉత్పత్తయ్యే థర్మల్ విద్యుత్ ప్రస్తుతం 1800 మెగావాట్లు మించి ఉత్పత్తి కాని పరిస్థితి. మరోవైపు వర్షాలు పడకపోవడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ వాడ కం బాగా పెరిగినట్టు అధికారులు చెప్తున్నారు. ఎండల తీవ్రత కూడా ఉండడంతో ఏసీల వినియోగం భారీగా ఉన్నట్టు పేర్కొంటున్నారు. శుక్రవారం ఈపీడీసీఎల్ పరిధిలో డిమాండ్ 2,200 మెగావాట్ల వరకు ఓ దశలో ఉంది. కానీ కోటా 1574 మెగావాట్లు మాత్రమే. అయినప్పటికీ ప్రత్యామ్నాయ సర్దుబాట్లుతో 1970 మెగావాట్ల వరకు శుక్రవారం విద్యుత్‌ను అందించగలిగారు. పరిశ్రమలకు భారీ కోత : విద్యుత్ ఉత్పత్తి క్షీణించి, డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈపీడీసీఎల్ అధికారులకు పరిశ్రమలపై పడ్డారు. గృహ వినియోగానికి సాధ్యమైనంత వరకు ఇబ్బందులుండరాదన్న ఉద్దేశంతో విద్యుత్ కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ ప్రయత్నాలు ఫలించకపోయినా.. భారీ వర్షాలు కురవకపోయినా విద్యుత్ వెతలు మరింత ఎక్కువయ్యే ప్రమాదముందని ఈపీడీసీఎల్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. -
‘వెలుగుల’ వెల మీరే భరించండి
సాక్షి, రాజమండ్రి :కొత్తగా కొలువైన పంచాయతీల పాలక మండళ్లు.. వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుందని సర్కారుపై పెట్టుకున్న ఆశ.. అడియాసే అయింది. పంచాయతీల ఆర్థిక భారాన్ని మోయలేనని సర్కారు చేతులెత్తేసింది. దీంతో పంచాయతీల్లో రూ.లక్షల్లో పేరుకుపోయిన కరెంటు బాకీలకు కనుచూపు మేరలో మోక్షం లభించే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లాలో గ్రామ పంచాయతీలు తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)కు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.70 కోట్లకు చేరుకున్నాయి. నాలుగేళ్లుగా ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరుగుతున్న ఈ బ కాయిలను తాము కట్టలేమని పంచాయతీలు ఆ బాధ్యతను ప్రభుత్వంపై నెట్టేస్తూ వచ్చా యి. ఇప్పుడు అది మా పని కాదని ప్రభుత్వం తేల్చేయడం తో నెలకు రూ.మూడు కోట్ల విలువైన విద్యుత్తును పంచాయతీలకు అప్పనంగా ఎలా ఇచ్చేదని ఈపీడీసీఎల్ ఆలోచనలో పడింది. నాలుగేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పం చాయతీలకు ఇటీవల పాలక మండళ్లు వచ్చినా నిధులు రా లేదు. తమ బకాయిల భారాన్ని తగ్గించాలని అటు విద్యుత్తు శాఖ, ఇటు పంచాయతీ రాజ్ శాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదించాయి. ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లించే స్థితిలో లేదని పంచాయతీ రాజ్ శాఖకు మౌఖిక ఆదేశాలు అందాయని తెలుస్తోంది. ఇదీ బకాయిల చిట్టా.. జిల్లాలో ఐదు విద్యుత్తు డివిజన్ల పరిధిలో మేజర్, మైనర్ పంచాయతీలకు 2600కు పైగా విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. గత జూన్ నెలాఖరుకు మేజర్ పంచాయతీలు రూ.39.05 కోట్లు, మైనర్ పంచాయతీలు రూ.26.88 కోట్లు బకాయి పడ్డాయి. వీటికి జూలై బకాయిలు మరో రూ.మూడు కోట్లకు పైగా వచ్చి చేరాయి. మొత్తం బకాయిలు దాదాపు రూ.70 కోట్లకు చేరినట్టు ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు. వీటిలో మైనర్ పంచాయతీల్లో వీధిలైట్లకు రూ.15.11 కోట్లు, తాగునీటి పథకాలకు రూ.11.77 కోట్లు చెల్లించాల్సి ఉంది. మేజర్ పంచాయతీల వీధి దీపాల బకాయిలు రూ.23.72 కోట్లు ఉండగా, తాగునీటి పథకాలకు సంబంధించి రూ.15.33 కోట్లు చెల్లించాల్సి ఉంది. -
విద్యుత్తు ‘రీ’ షాక్!
ఆలస్య రుసుం అడ్డంగా పెంచేసిన వైనం ఈపీడీసీఎల్ నిర్ణయంతో వినియోగదారులకు భారం యలమంచిలి: విద్యుత్ చార్జీల భారంతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఈపీడీసీఎల్ మరో షాక్ ఇచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా రీ కనెక్షన్ చార్జి (ఆలస్య రుసుం) అడ్డంగా పెంచేసింది. ఆదాయ అన్వేషణలో ఉన్న ఈపీడీసీఎల్ వినియోగదారుల జేబులు ఖాళీ చేసే చర్యలకు దిగుతోంది. ఇప్పటివరకు ఆలస్య రుసుంగా 500 వాట్ల వరకు రూ. 25లు, 500 వాట్లు దాటి వినియోగించేవారి నుంచి రూ. 75లు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు 500 వాట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికీ రూ. 75లు రీ కనెక్షన్ చార్జి విధిస్తున్నారు. పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో నెలకు ఒకసారి, గ్రామాల్లో రెండు నెలలకోసారి రీడింగ్ నమోదు చేస్తున్నారు. విద్యుత్ బిల్లులను ప్రతీ నెలా 10, 20వ తేదీల్లోగా చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఆలస్యంతో కొంతమొత్తంలో సర్చార్జిని వసూలు చేస్తున్నారు. గడువులోగా విద్యుత్ బిల్లులను చెల్లించని వినియోగదారుల ఇళ్లకు విద్యుత్ శాఖ సిబ్బంది వెళ్లి విద్యుత్ మీటర్ల ఫీజులను పట్టుకుపోతున్నారు. దీంతో వినియోగదారులు రీ కనెక్షన్ చార్జి చెల్లించి బిల్లును విద్యుత్ శాఖ సిబ్బందికి చూపిస్తేనే మళ్లీ ఫీజులు ఇస్తున్నారు. విద్యుత్ రీడింగ్ నమోదుచేసే పనిని కాంట్రాక్టర్లకు అప్పగించడంవల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ రీడింగ్‌లు సక్రమంగా తీయడంలేదు. దీంతో వినియోగదారులకు అవగాహన లేకపోవడంతో బిల్లులు చెల్లించడంలో ఆలస్యం జరుగుతోంది. ఒక్కరోజు ఆలస్యానికి కూడా రూ. 75లు రీకనెక్షన్ చార్జి చెల్లిస్తున్నారు. 500 వాట్లు లోపు విద్యుత్‌ను వినియోగించేవారే ఎక్కువగా ఉన్నారు. పెంచిన రీకనెక్షన్ చార్జి వారికి అదనపు భారం కానుంది. రూ. 100లు బిల్లు చెల్లించే వినియోగదారుడు కూడా రీకనెక్షన్ చార్జి కింద రూ.75లు చెల్లించవలసిందే. దీంతో ఈపీడీసీఎల్ వినియోగదారులను నిలువుదోపిడీ చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. -
కోతలకు కత్తెర!
- విద్యుత్ సరఫరా మెరుగుదలపై దృష్టి సారించిన ఈపీడీసీఎల్ - సమూల ప్రక్షాళనకు ప్రతిపాదనలు - రంగంలోకి ప్రత్యేక బృందాలు సాక్షి, ఏలూరు : జిల్లాలో విద్యుత్ కోతలకు కత్తెర పడనుందా.. అవుననే అంటున్నారు తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) అధికారులు. వారు చెప్పేదానిని బట్టిచూస్తే పూర్తిగా కాకపోరుునా.. కొంతమేరైనా విద్యుత్ కోతలు తగ్గే అవకాశాలు లేకపోలేదు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిచేయడం ద్వారా కోతలను చాలావరకు నివారించవచ్చని ఈపీడీసీఎల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తు మొదలుపెట్టామని చెబుతున్నారు. ఇవీ లోపాలు ఓ పక్క విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంటే మరోపక్క వినియోగం పెరిగిపోతోంది. దీంతో కోత లు విధించడం అనివార్యమవుతోంది. అయితే విద్యుత్ కొరత వల్ల వచ్చే కోతల కంటే స్థానిక సమస్యలు, లోపాల వల విధించే కోతలే ఎక్కువగా ఉంటున్నాయి. సబ్‌స్టేషన్ నుంచి వినియోగదారుడికి విద్యుత్ చేరేలోపు చాలావరకూ వృథా అవుతోంది. పాడైన లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వల్ల లో-ఓల్టేజీ సమస్య తలెత్తుతోంది. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎయిర్ బ్రేక్ స్విచ్‌లు లేకపోవడంతో బ్రేక్‌డౌన్ ఇబ్బం దులు తలెత్తుతున్నారు. ఫలితంగా మెరుగైన విద్యుత్‌కు నోచుకోక వినియోగదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఈ సమస్యపై తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) దృష్టి సారించింది. ప్రత్యేక బృందాలను నియమించి జిల్లావ్యాప్తంగా లైన్లు, ఫీడర్ల తనిఖీలు నిర్వహిస్తోంది. లోపాల విషయంలో సమగ్ర ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వృథాకు అడ్డుకట్ట ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 1.40 కోట్ల యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. కోటా తక్కువగా ఇవ్వడంతో గంటల తరబడి కోత విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాకు వచ్చే ప్రతి యూనిట్‌ను వృథా కానివ్వకుండా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ప్రస్తుతం 196 విద్యుత్ సబ్స్టేషన్లున్నాయి. వాటిపై లోడ్‌ను తగ్గించేందుకు, విద్యుత్ సరఫరాలో హై-ఓల్టేజీ, లో ఓల్టేజీ సమస్యలు (లైన్‌లాస్) తగ్గించి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఈపీడీసీఎల్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందుకు జిల్లాలో కొత్తగా 27 సబ్స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ పనులు చేయడానికంటే ముందు విద్యుత్ వృథాను అరికట్టి సరఫరా మెరుగుపరచాలని భావిస్తున్నారు. విస్తృత తనిఖీలు ఇద్దరు సభ్యులు గల 100 ప్రత్యేక బృందాలు జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్నాయి. 1,189 ప్రాంతాల్లో లో-ఓల్టేజి సమస్యలు ఉన్నట్లు ఇప్పటివరకూ నిర్వహించిన తనిఖీల్లో తేలింది. 178 ఫీడర్లపై గల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను ఇతర సర్వీసుల నుంచి వేరు చేయాల్సి ఉందని గుర్తించారు. 331 ఎయిర్ బ్రేక్ (ఏబీ) స్విచ్‌లను పాక్షికంగా బాగుచేయాలని, 1,020 ఏబీ స్విచ్‌లను లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద కొత్తగా ఏర్పాటు చేయడం ద్వారా బ్రేక్ డౌన్లు ఇతర అవసరాలకు అనుకూలంగా ఉంటుందని తేల్చారు. 33 కేవీ ఫీడర్లపై 27 లైన్లు, 11 కేవీ ఫీడర్లపై 50 లైన్లను ఇంటర్ లింకింగ్ చేయాలని గ్రహించారు. త్వరలోనే వీటి ప్రక్షాళన పనులు చేపట్టనున్నారు. -
ఈపీడీసీఎల్‌లో భారీగా బదిలీలు
10 మంది డీఈలకు స్థాన చలనం సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈపీడీసీఎల్ బదిలీల పర్వం మొదలయింది. ఏకంగా పది మంది డివిజనల్ ఇంజినీర్ల (డీఈ)లకు బదిలీలు చేస్తూ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలన సౌలభ్యం పేరిట బదిలీలు నిర్వహించినట్టు చెప్తున్నప్పటికీ.. చాలా వరకు సిబ్బందిలో నిర్లిప్తత రాజ్యమేలడం వల్లే మూకుమ్మడి బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది. పది రోజుల కిందట గాలీవాన బీభత్సానికి పాడైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడంలో నిర్లిప్తంగా వ్యవహరించిన విజయనగరం సర్కిల్ ఆపరేషన్స్ ఎస్ఈ డి.సత్యనారాయణపై ఈ నెల 24న బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. పెద్దగా ప్రజలతో సంబంధాల్లేని రెగ్యులేటరీ అఫైర్స్ జీఎంగా ఈపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్‌కు తీసుకొచ్చారు. శుక్రవారం జరిగిన బదిలీల్లో కూడా ఎక్కువ మంది అదే కోవకు చెందినవారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మతుల విషయంలో నిర్లిప్తంగా వ్యవహరించి, సంస్థకు నష్టం కలిగించిన వైనంపై సీఎండీ ఆగ్రహం కూడా తాజా బదిలీల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. వచ్చే నెల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. బదిలీ ఉత్తర్వులాధారంగా నిబంధనలన్నీ పూర్తి చేసి తక్షణమే పాత స్థానాలను వీడి, కొత్త స్థానాల్లో చేరాల్సిందిగా సీఎండీ తన ఉత్తర్వుల్లో ఆదేశించారు. బొబ్బిలి డీఈ ఎం.లక్ష్మణరావును కార్పొరేట్ ఆఫీస్ డీఈ టెక్నికల్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో కార్పొరేట్ ఆఫీస్ ప్రాజెక్ట్స్-1 డీఈఈ ఎస్.మసిలామణిని నియమించారు. -
200 యూనిట్లు దాటితే బిల్లు బాంబే
ఇళ్లకు భారీ షాక్.. విద్యుత్ చార్జీల వడ్డనకు ఈఆర్సీ ప్రతిపాదనలు * 50 యూనిట్లలోపు వారికి 50 పైసల భారం * వాణిజ్య సంస్థలకు 29 పైసల పెంపు * కొత్త ప్రభుత్వాల అనుమతికై ఎదురుచూపులు * తెలంగాణలో రూ.2,500 కోట్లు, సీమాంధ్రలో రూ.3,500 కోట్ల బాదుడు సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ చార్జీల వడ్డనకు రంగం సిద్ధమయ్యింది. ఇరు ప్రాంతాల ప్రజలపై మొత్తం రూ.6 వేల కోట్ల భారాన్ని మోపేందుకు ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ ప్రజలపై రూ.2,500 కోట్ల భారం పడనుండగా, సీమాంధ్ర ప్రజలకు రూ.3,500 కోట్ల షాక్ తగలనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రతిపాదనలను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ముందుంచనున్నారు. అధికారం చేపట్టిన వెంటనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చార్జీలపై నిర్ణయం తీసుకోనున్నారుు. ప్రభుత్వాలు అనుమతించిన వెంటనే కొత్త విద్యుత్ చార్జీలపై ఈఆర్సీ ఆదేశాలు వెలువడతాయి. జూన్ నెల నుంచే ఈ చార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. ఈఆర్సీ ప్రతిపాదనలను పరిశీలిస్తే.. తాజా పెంపు గృహ వినియోగదారులపై పెను భారం మోపనుంది. 50 యూనిట్లలోపు వినియోగించే పేద వినియోగదారులకూ షాక్ కొట్టనుంది. ఇక నెలకు 200 యూనిట్లు దాటితే బిల్లు బాంబులా పేలిపోనుంది. 200 యూనిట్లు దాటి వినియోగిస్తే... మొదటి 200 యూనిట్లకు యూనిట్‌కు రూ 5.56 చొప్పున చెల్లించాల్సి రానుంది. ఇక వాణిజ్య సంస్థలకు సంబంధించి యూనిట్‌కు 29 పైసల చొప్పున పెంపుదల ఉండనుండగా... పరిశ్రమలకు 29 పైసల నుంచి రూ.2.41 వరకూ చార్జీలు పెరగనున్నాయి. వాస్తవానికి గత ఏప్రిల్ 1 నుంచే కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్, ఆ తర్వాత రాష్ట్ర విభజన వల్ల గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా రెండు రాష్ర్ట ప్రభుత్వాలకు ఈ మేరకు విడివిడిగా ఈఆర్సీ ప్రతిపాదనలు పంపనుంది. సీమాంధ్రపైనే అధిక భారం! విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల వారీగా పడనున్న విద్యుత్ చార్జీల భారం లెక్క తేలిం ది. తెలంగాణలోని వినియోగదారులపై రూ.2,500 కోట్ల భారం పడనుండగా, సీమాంధ్రలోని వినియోగదారులపై రూ.3,500 కోట్ల భారం పడనుంది. సీమాంధ్రలో గృహ కనెక్షన్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని ఇంధనశాఖ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ప్రాంతంలో సీపీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లు సేవలు అందిస్తున్నాయి. సీమాంధ్రలో ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లు విద్యుత్ పంపిణీ చేపడుతున్నాయి. అయితే సీమాంధ్రలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకూ సీపీడీసీఎల్ విస్తరించి ఉంది. ఈ రెండు జిల్లాల పరిధిని ఎస్‌పీడీసీఎల్‌లోకి చేర్చారు. దీంతో ఈ రెండు జిల్లాల్లోని ఉచిత విద్యుత్, ఇతర వర్గాల సబ్సిడీ భారాన్ని సీమాంధ్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుం దని లెక్కకట్టారు. ఉచిత విద్యుత్‌తో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న సబ్సిడీ కింద తెలంగాణ ప్రభుత్వం రూ.2,800 కోట్లు చెల్లించాల్సి రానుంది. కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా కలుపుకుని సీమాంధ్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.3,200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని లెక్కకట్టారు. క్రాస్ సబ్సిడీతో తెలంగాణకు తగ్గిన భారం! వాస్తవానికి ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తెలంగాణలోనే అధికం. మొత్తం 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లలో తెలంగాణలోనే 18 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అయినప్పటికీ సబ్సిడీ భారం తక్కువగా ఉంది. పరిశ్రమలు క్రాస్ సబ్సిడీ కింద చెల్లిస్తున్న మొత్తం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అదేవిధంగా ఇక్కడ వాణిజ్య వినియోగదారులు అధికంగా ఉన్నారు. వీరు కూడా క్రాస్ సబ్సిడీ కింద మిగిలిన వర్గాల చార్జీల భారాన్ని భరిస్తున్నారు. తెలంగాణలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థల కనెక్షన్లు ఎక్కువగా ఉండటంతో క్రాస్ సబ్సిడీ ఆదాయం ఎక్కువగా ఉండి ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ భారం తగ్గిందన్నమాట. 200 దాటితే ఇల్లు గుల్లే: కొత్త చార్జీల నేపథ్యంలో నెలకు 200 యూనిట్లు దాటి విద్యుత్‌ను వినియోగిస్తే బిల్లు పెద్ద షాకివ్వడం ఖాయం. ఎందుకంటే 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ ఎక్కువగా వాడినా మొదటి 200 యూనిట్ల వరకు యూనిట్‌కు 5.56 చొప్పున వసూలు చేయనున్నారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 200 యూనిట్లు వినియోగిస్తే... పెరగనున్న చార్జీల మేరకు (మొదటి 50 యూని ట్లకు యూనిట్‌కు రూ.3.10 చొప్పున, 51-100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.75 చొప్పున, 101-150 వరకు యూనిట్‌కు రూ.5.38 చొప్పున, 151-200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.5.94 చొప్పున) మొత్తం రూ.908.50 చెల్లించాల్సి ఉంటుంది. 201 యూనిట్లు వినియోగిస్తే మాత్రం ఏకంగా (మొదటి 200 యూనిట్లకు యూనిట్‌కు రూ.5.56 చొప్పున రూ.1112తో పాటు ఒక యూనిట్‌కు రూ. 6.69 మేరకు మొత్తం రూ.1118.69 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక యూనిట్ అదనంగా వాడినందుకు ఏకంగా రూ. 210.19 అదనంగా చెల్లించాల్సి రానుంది. మొత్తం బిల్లుకు సర్వీసు, ఇతర చార్జీలు అదనం. -
కరెంట్ కట్
సాక్షి, ఏలూరు : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఉద్యోగులు ఆదివారం ఉదయం నుంచి సమ్మె బాట పట్టారు. ఒప్పందం మేరకు వేతన సవరణ అమలు చేయనందుకు నిరసనగా ఉదయం 6 గంటల నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. జిల్లాలోని దాదాపు అన్ని సబ్స్టేషన్లలో ఉదయం ఆరు గంటల నుంచి విద్యుత్ నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు డీఎస్ వరప్రసాద్, కో-కన్వీనర్ భూక్యా నాగేశ్వరావు, కన్వీనర్ సుబ్బారావుల ఆధ్వర్యంలో ఉద్యోగులు ఏలూరువిద్యుత్ భవన్ వద్ద ఆందోళన నిర్వహించారు. స్థానిక ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం గేట్లు మూసి వేశారు. యాజమాన్యం, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వేతన సవరణ చేయాలని, తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు. అంతవరకూ ఆందోళన విరమించేది లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సమ్మెకు సహకరించాల్సిందిగా పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్‌ను ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. దీంతో ఎస్ఈ మద్దతు ప్రకటించారు. సమ్మెలోకి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు ఈపీడీసీఎల్ జిల్లా పరిధిలో 2,400 మంది శాశ్వత, తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. వీరిలో అటెండర్‌స్థాయి నుంచి డివిజనల్ ఇంజినీర్ స్థాయి వరకు వివిధ కేటగిరీల్లో వారు పనిచేస్తున్నారు. విద్యుత్ సరఫరా, పర్యవేక్షణ, సబ్స్టేషన్ల నిర్మా ణం, పరిపాలన, అకౌంట్స్, కొనుగోళ్లు, మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ వంటి విధులను వీరు నిర్వర్తిస్తుంటారు. సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా సమ్మె బాట పట్టారు. అనధికారికంగా విద్యుత్ సరఫరా జిల్లాలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 196 ఉన్నాయి. వీటిలో 152 ప్రైవేట్ కాంట్రాక్టర్ల నిర్వహణలో, 44 సబ్స్టేషన్లు ఈపీడీసీఎల్ ఉద్యోగుల నిర్వహణలోనూ ఉన్నాయి. ఆదివారం ఉదయం కొన్ని సబ్స్టేషన్లను ఉద్యోగులు షట్‌డౌన్ చేశారు. దీంతో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సిబ్బంది సమ్మెలోనే కొనసాగుతూనే విద్యుత్‌ను పునరుద్ధరించారు. మరోవైపు కాంట్రాక్టు సిబ్బంది ఇంకా సమ్మెలోకి వెళ్లకపోవడంతో వారి నిర్వహణలో ఉన్న సబ్స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా జరుగుతోంది. అయితే సమ్మె కారణాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు కూడా ఉండటంతో వారు సైతం విధులు బహిష్కరించే అవకాశం ఉంది. కరెంట్ కట్‌తో ప్రజల అవస్థలు ఉదయం ఆరు గంటల నుంచి కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. గ్రామాల్లో ఉదయం రక్షిత మంచినీటి సరఫరా నిలిచిపోయింది.ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతూనే మధ్యాహ్నం 1 గంటకు విద్యుత్‌ను పునరుద్ధరించారు. దీంతో విద్యుత్ వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విద్యుత్ ఉద్యోగులు పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళితే జిల్లాలో అంధకారం అలుముకునే పరిస్థితి ఉంది. మండే ఎండలకు తోడు ఎడాపెడా విద్యుత్ కోతలతో అల్లాడుతున్న ప్రజలను విద్యుత్ ఉద్యోగుల సమ్మె కలవరపెడుతోంది. సమ్మె కొనసాగితే.. సమ్మెకు సంబంధించి హైదరాబాద్‌లో అధికారులకు, విద్యుత్ జేఏసీ నేతల మధ్య ఆదివారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. అవి ఫలప్రదమయితే ఏ క్షణాన అయినా సమ్మె విరమించే అవకాశం ఉంది. ఒక వేళ సమ్మె కొనసాగితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. కాంట్రాక్ట్ సిబ్బంది కూడా సమ్మెలో దిగితే జిల్లా మొత్తం చీకటిగా మారనుంది. అయితే అత్యవసర సేవలైన ఆస్పత్రులు, తాగునీటి సరఫరా విభాగాలకు విద్యుత్ అంతరాయం కలగకుండా చూసే అవకాశం ఉంది. -
పరిశ్రమలపై విద్యుత్ పిడుగు
సాక్షి, రాజమండ్రి : మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్టయింది పరిశ్రమల పరిస్థితి. ఏడాదిగా కరెంటు కోతల నుంచి విముక్తి పొందామనుకుంటున్న తరుణంలో మళ్లీ విద్యుత్తు శాఖ పవర్ హాలిడే ప్రారంభించింది. అధికారిక కోతలు లేవంటూనే ఈపీడీసీఎల్ అధికారులు జిల్లాలో పరిశ్రమలకు సైతం సరఫరా నిలుపుచేయడం ప్రారంభించారు. గతంలో పవర్ హాలిడే విధించినప్పుడు ఆందోళనలు చేసిన నిర్వాహకులు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పరిశ్రమల తీరిలా జిల్లాలో సుమారు 8500కు పైగా పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి. వీరందరూ సుమారు నెలకు 17 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తారు. పవర్ హాలిడే ద్వారా సుమారు మిలియన్ యూనిట్లను ఆదా చేయాలని విద్యుత్తుశాఖ ఆలోచిస్తోంది. ఈ పరిణామం పరిశ్రమలకు పిడుగుపాటుగా మారనుంది. ప్రధానంగా మూడువేలకు పైగా ఉన్న చిన్న పరిశ్రమలకు పవర్ హాలిడే ద్వారా నష్టం వాటిల్లనుంది. ఈ పరిస్థితి 10 శాతం ఉత్పాదకతపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువగా క్రూసిబుల్స్, రిఫ్రాస్ట్రక్చర్స్, రీసైకిల్డ్ పేపర్‌మిల్లులు, పీచు పరిశ్రమలు లాంటి చిన్న పరిశ్రమలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. జిల్లాలో ఉన్న 40 రీసైకిల్డు పరిశ్రమలు నెలకు రూ. 50 కోట్ల మేర టర్నోవర్ కలిగి ఉన్నాయి. సుమారు రూ. మూడు నుంచి నాలుగు కోట్ల విలువ చేసే ఉత్పాదకత తగ్గుతుందని ఈ పరిశ్రమల వర్గాలంటున్నాయి. మిగిలిన చిన్న పరిశ్రమలు అన్నీ కలిపి నెలకు మరో రూ. 15 కోట్ల వరకూ నష్టం చవిచూసే అవకాశాలు ఉన్నాయి. హాలిడే ఇలా 2012 సెప్టెంబర్‌లో తొలిసారిగా రాష్ట్రంలో పవర్ హాలిడే ప్రకటించారు. వారానికి మూడురోజులు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. పరిశ్రమల నిర్వాహకుల ఆందోళనతో హాలిడేను వినియోగ నియంత్రణగా మార్చి ఉదయం 60 శాతం, సాయంత్రం 10 నుంచి 30 శాతం విద్యుత్తు వినియోగించుకునేలా మార్పులు చేశారు. ఈ ఆంక్షలను 2013 ఆగస్టులో తొలగించారు. సుమారు ఏడాది పాటు పరిశ్రమలు వివిధ రూపాల్లో విద్యుత్తు వినియోగ ఆంక్షలను భరించాయి. తాజాగా పరిశ్రమలకు వారానికి ఒకరోజు అంటే ప్రతి గురువారం విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిపివేయనున్నారు. విధిగా సంబంధిత వినియోగదారులు ఈ విరామాన్ని పాటించాలని ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ ఎస్ఈ గంగాధర్ స్పష్టం చేశారు. కరెంటు కొరత ఎక్కువైతే అధిగమించేందుకు మరిన్ని రోజులపాటు సెలవు ప్రకటించే అవకాశాలను అధికారులు కొట్ట్టి పారేయలేకపోతున్నారు. వచ్చే జూన్ వరకూ ఎన్నికల సీజన్ కావడంతో అదనంగా కరెంటు వచ్చే అవకాశాలు లేవు. ఉన్న కరెంటునే సర్దుబాటు చేయాల్సి ఉండడంతో ఈ ఏడాది కోతల వాతలు దండిగా ఉంటాయని తెలుస్తోంది. -
విద్యుత్ శాఖలో కొలువుల జాతర
జిల్లాలో 356 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వీటిలో 45 జేఏ, 310 జేఎల్ఎం, 1 వాచ్‌మేన్ పోస్టులు కాంట్రాక్టు సిబ్బందికి గరిష్టంగా 20 గ్రేస్ మార్కులు సాక్షి, ఏలూరు : తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలో 45 జూనియర్ అసిస్టెంట్ (జేఏ), 310 జూనియర్ లైన్‌మేన్ (జేఎల్ఎం), 1 వాచ్‌మేన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఈపీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 1లోగా దరఖాస్తు చేసుకోవాలి. సబ్స్టేషన్లు, కార్యాలయాల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 600 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో కొందరికికొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రాధాన్యత లభించనుంది. వారి పనితీరు ఆధారంగా గరిష్టంగా 20 గ్రేస్ మార్కులు ఇవ్వనున్నారు. 500 కనెక్షన్లకు ఒక్క ఉద్యోగి మాత్రమే జిల్లాలో సుమారు 11 లక్షల విద్యు త్ కనెక్షన్ల ఉండగా, 2వేల మంది సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారు. సుమారు వెయ్యి కనెక్షన్లకు ఇద్దరు ఉద్యోగులు ఉన్నట్టు. అయితే ఈ సంఖ్య నాలుగు ఉండాలి. 1999లో రాష్ట్ర విద్యుత్ మండలి పునర్ వ్యవస్థీకరణ తరువాత సబ్స్టేషన్లు రెండున్నర రెట్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఐదున్నర రెట్లు, ఆదాయం నాలుగున్నర రెట్లు పెరిగాయి. వినియోగదారులు 127 శాతం పెరిగారు. ఉద్యోగుల సంఖ్యలో 59 శాతం తరుగుదల కనిపిస్తోంది. సిబ్బంది కొరతను ఆసరాగా తీసుకుని నిత్యం చేయాల్సిన పనులను కూడా యాజమాన్యం కాంట్రాక్టుకు ఇచ్చేస్తోంది. దీనికి అవుట్ సోర్సింగ్ పద్ధతిని జోడించారు. కాంట్రాక్టు సిబ్బంది శ్రమను కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. చట్టప్రకారం సిబ్బందికి ప్రయోజనాలేవీ అందడం లేదు. సిబ్బంది కొరతతో పని భారం పెరిగి అటు రెగ్యులర్, ఇటు కాంట్రాక్టు ఉద్యోగులు సతమతమవుతున్నారు. సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, విద్యుత్ కనెక్షన్లకు అనుగుణంగా అదనపు పోస్టులు మంజూరు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలనే ప్రధాన డిమాండ్లతో విద్యుత్ ఉద్యోగుల యూనియన్లు సంస్థపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఈపీడీసీఎల్ నిర్ణయించింది.