హాలోజన్.. హాంఫట్!
గోదావరి పుష్కరాల్లో కొందరు పుణ్యం మూటగట్టుకుంటే మరికొందరు మాత్రం అక్రమంగా ప్రజాధనాన్ని మూటగట్టుకున్నారు. పన్నెండేళ్లకోసారి వచ్చే పుణ్యకార్యంగా చెప్పుకునే పుష్కరాల కోసం చేసిన ఏర్పాట్లలోనూ అవినీతికి పాల్పడి జేబులు నింపుకున్నారు. ఒక్క రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విద్యుదీకరణ పనుల్లోనే కోట్లాదిరూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏర్పాట్లలో ఎన్నికోట్లు.. ఎవరెవరి జేబుల్లోకి వెళ్లాయో..! వెల్లువెత్తుతున్న ఆరోపణలపై సర్కారు మిన్నకుంటున్న వైనం... మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన విద్యుదీకరణ పనులకు ఉపయోగించిన హాలోజన్ విద్యుద్దీపాలు, రంగుల బల్బులెక్కడున్నాయో తెలియడంలేదు. పుష్కరాల తర్వాత వీటిని నగరపాలక సంస్థకు అప్పగించలేదు. వీధి దీపాల నిర్వహణ బాధ్యతను చూసే కార్పొరేషన్‌కు ఇస్తే వీటిని తక్షణమే ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ లైట్ల ఆచూకీ లేకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. అసలు వీటిని కొన్నారా? అద్దెకు తెచ్చారా? కొన్నట్టు లెక్కలు చూపించి డబ్బులు కాజేశారా?
అసలేం జరిగిందంటే..
రాజమండ్రి పుష్కర ఘాట్‌ను విద్యుల్లతలతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)ను ఆదేశించింది. ఇందుకోసం రూ.1,71,82,836ను విడుదల చేసింది. ఈ నిధుల్లో రూ. 99,23,100తో హాలోజన్ ల్యాంపులు, డెకరేషన్ బల్బులు అద్దెకు తెచ్చారు. మరో రూ. 72,59,736ను హాలోజన్ ల్యాంపులు, బల్బులు కొనుగోలుకు, కేబుల్, జీఐ వైర్, ఇన్సులేషన్ టేపులు, పిన్స్, ఎంసీబీలు, బల్బులు, ల్యాంపులు, హోల్డర్ల కొనుగోలుకు వెచ్చించారు. నిజానికి అంతపెద్ద మొత్తంలో బల్బులు అద్దెకు దొరికే పరిస్థితి నగరంలో లేకపోయినా పేరుకు కొన్ని దుకాణాల పేర్లురాశారు. అద్దెకు తెచ్చినవాటిని తిరిగిచ్చారు సరే.. మరి కొన్నవేవి? నిబంధనల ప్రకారం రూ. 5 లక్షలు దాటితే టెండర్లు పిలవాలి. దాదాపు రెండుకోట్ల వ్యవహారం జరిగినా ఎక్కడా టెండర్లన్న పదమే వినిపించలేదు.
వెయ్యి వోల్టుల హాలోజన్ ల్యాంపులు కాంట్రాక్టరు చెప్పిన రేటుకే కొనేసినట్టు చెబుతున్నారు. ఒక్కో ల్యాంపు రూ. 824 చొప్పున 654 ల్యాంపులు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.5,41,512. 500 వాట్స్ హాలోజన్ ల్యాంపులు 553 కొనుగోలు చేశారు. ఒక్కొక్కటీ రూ. 588 చొప్పున రూ. 3,25,164 చెల్లించారు. లేబర్ చార్జీల పేరుతో 295 మందికి ఏడు రోజుల పాటు రోజుకు రూ.500 లెక్కన రూ. 10,32,500 చెల్లించారు. వీళ్ళను ఏ పనులకు వినియోగించారనే వివరాలు లేవు.
సీఎండీ విచారణకు ఆదేశించినట్టు తెలియడంతో జిల్లా విద్యుత్ అధికారులు పాత తేదీల్లో బిల్లులు సంపాదించేందుకు హైదరాబాద్‌లోని ఓ విద్యుత్ ఉపకరణాల సంస్థను సంప్రదించినట్టు తెలిసింది.
విచారణకు ఆదేశించాం
గోదావరి పుష్కరాల సందర్భంగా విద్యుదీకరణ పనులపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్టు ఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాలరాజు తెలిపారు. వాస్తవాలు తెలుసుకునేందుకు సంస్థ డెరైక్టర్‌ను రాజమండ్రికి పంపుతున్నట్టు చెప్పారు. అయితే కొన్ని హాలోజన్ ల్యాంపులను విశాఖపట్టణానికి తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు. ఏదేమైనా అవకతవకలు జరిగినట్టు తేలితే, ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.