ఆ పోస్టులు..అవినీతి వెలుగులు
- అవినీతికి తెర తీస్తున్న టీడీపీ ప్రభుత్వం
- విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు ప్రయివేటుపరానికి రంగం సిద్ధం
- ఈపీడీసీఎల్ సిబ్బందిని తప్పించే ప్రయత్నం
- అధికార ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ప్రభుత్వం మరో అవినీతికి తెరతీస్తోంది. తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అనుయాయులకు భారీ మొత్తం సమకూర్చే పన్నాగానికి శ్రీకారం చుడుతోంది. విద్యుత్ సబ్‌స్టేషన్లలో ఈపీడీసీఎల్ సిబ్బందిని తప్పించి ప్రైవేటు షిఫ్ట్ ఆపరేటర్లను నియమించాలనుకుంటున్నారు. ఈ పోస్టుకు కనీసం రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకూ అమ్ముకునే వీలుంది. ఈపీడీసీఎల్ పరిధిలో పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలున్నాయి. ఐదు జిల్లాల్లో 52.76 లక్షల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరికి విద్యుత్ సరఫరా చేసేందుకు 33/11కెవి విద్యుత్ సబ్‌స్టేషన్లు 663 ఉన్నాయి.
వాటిలో 539 సబ్‌స్టేషన్లు 2156 మంది అవుట్‌సోర్సింగ్ సిబ్బంది నిర్వహణలో ఉన్నాయి. మిగతా 124 సబ్‌స్టేషన్లలో సంస్థ సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సబ్‌స్టేషన్లలో ఈపీడీసీఎల్ సిబ్బందిని తప్పించి ప్రైవేటు వారిని
నియమించుకోవాలని భావిస్తున్నారు. అధికారులకు ఇప్పటికే సూచనలు అందాయి. దీంతో ఏ నియోజకవర్గంలో ఎన్ని సబ్‌స్టేషన్లలో ఎంత మంది ఎప్పటి నుంచి పనిచేస్తున్నారనే నివేదిక ఇవ్వాలని అన్ని సర్కిళ్ల ఎస్‌ఈలకు ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేట్ కార్యాలయంలో నేడు సీఎండీ సమావేశం అవుతున్నారు. విశాఖ సర్కిల్‌లో 26 సబ్ స్టేషన్ల పరిధిలో 103మంది పనిచేస్తున్నారు.
నిజానికి 2156 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు నియమించారు. అది చాలదన్నట్లు ఇప్పుడు సంస్థ నిర్వహణలో ఉన్న బస్‌స్టేషన్లను సైతం అవుట్‌సోర్సింగ్‌కు ఇచ్చి సొమ్ముచేసుకోవాలని తాజాగా వ్యూహం పన్నుతున్నారు. కాంట్రాక్టు షిఫ్ట్ ఆపరేటర్‌గా చేరడానికి విద్యార్హతలు ఎంత అవసరమో ప్రజాప్రతినిధుల సిఫార్సు కూడా అంతే అవసరం. ఆ సిఫార్సు లేఖ సాధించాలంటే సబ్‌స్టేషన్ పరిధి, అది ఉన్న ప్రాంతాన్ని బట్టి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకూ సమర్పించాలి. షిఫ్ట్ ఆపరేటర్లకు సంస్థ చేపట్టే శాశ్వత ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించడం, 20 మార్కులు వెయిటేజీ ఇస్తుండటం వల్ల తొలుత అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ప్రవేశించేందుకు నిరుద్యోగులు ఎగబడుతున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రజాప్రతినిధులు వాటిని అమ్ముకుంటున్నారు.