సాక్షి, విశాఖపట్నం : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో ఉద్యోగుల బదిలీలు దాదాపు పూర్తయ్యాయి. డీఈ, ఏడీఈ, ఏఈ, ఏఏఈ, ఎస్‌ఏఓ, ఏఓ, ఏఏఓ, పీఓ వరకూ అన్ని కేటగిరిల్లో బదిలీలు జరిగాయి. ఈ నెల 29న తొలి జాబితాను విడుదల చేయగా ఆదివారం తుది జాబితాను అధికారులు వెల్లడించారు. 12 మంది డీఈలతో పాటు మొత్తం 175 మంది ఉద్యోగులను ఈపీడీసీఎల్ పరిధిలోని ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బదిలీచేసి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఎప్పటిలా కాకుండా ఈ సారి సీఎండీ ఆర్.ముత్యాలరాజు ప్రత్యేక వ్యూహంతో బదిలీలు చేపట్టి సంచలనాలకు కారణమయ్యారు.
ముఖ్యంగా స్టేషన్ సీనియారిటీ ప్రాతిపదికన బదిలీ చేయాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎండీ దానిని అమలు చేసేందుకు అంతే స్థాయిలో నిలబడ్డారు. దీంతో 5 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఒకే చోట పనిచేస్తున్న వారిపై బదిలీవేటు పడింది. వీరిలో ఎంపిక చేసిన కొందరిని దూరంగా విసిరేసినట్లు వారికిచ్చిన పోస్టింగ్‌లను బట్టి కనిపిస్తోంది. ఈపీడీసీఎల్‌లో మొత్తం 7800 మంది ఉద్యోగులున్నారు. వారిలో దాదాపు 1500 మంది బదిలీలకు అర్హులు. 5 ఏళ్లు పూర్తయిన వారు దాదాపు 350 మంది ఉన్నారు. సాధారణంగా బదిలీ నిబంధనల ప్రకారం ఒకే పోస్టులో 3 ఏళ్లు, ఒకే ప్రాంతంలో 5ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగిని బదిలీ చేయాలి.
అయితే ప్రభుత్వ నిబంధనలకు సీఎండీ ముత్యాలరాజు మార్పులు చేశారు. ఏ పోస్టులో ఉన్నప్పటికీ ఒకే ప్రాంతంలో ఎన్నేళ్లుగా పనిచేస్తున్నారనేదే ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించారు. దానికి తగ్గట్టు మార్గదర్శకాలు తయారు చేయించి అర్హుల జాబితాను ప్రకటించారు. దీనిపై కొందరు ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తంచేసి హైదరాబాద్‌లో పంచాయతీ పెట్టినా సీఎండీ ఎక్కడా వెనకడుగు వేయలేదు. తన మాట కాదంటే సెలవుపై వెళ్లిపోవడానికైనా సిద్ధమని ఓ సమయంలో ఉన్నతాధికారుల వద్ద కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారని వార్తలు వినిపించాయి. అందువల్లనే వారు కూడా మారు మాట్లాడకుండా సీఎండీ నిర్ణయానికి వదిలేశారని కొందరు ఉద్యోగులు అంటున్నారు.
పాతుకుపోయిన వారికి స్థానచలనం: ఎన్నో ఏళ్లుగా ఒకే జిల్లాలో పాతుకుపోయిన వారు ఇప్పుడు తప్పనిసరై జిల్లా దాటుతున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న కొందరు ఉద్యోగులను వారు ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి చాలా దూరం విసిరేశారు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సర్కిల్‌లో ఓ ఏడీఈ తనను ఎక్కడికి బదిలీ చేసినా ఆ ప్రాంతం నుంచి నెలలు తిరక్కుండానే తిరిగి ఆ సర్కిల్‌కు వచ్చేస్తుంటారు. అప్పటివరకూ ఎక్కువ రోజులు సెలవులోనే ఉంటారు.
ఇప్పుడు అయనను శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. కొందరిని ఏజెన్సీకి పంపించారు. దీనివల్ల వ్యక్తుల వారీగా టార్గెట్ చేసి బదిలీలు చేశారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అవేవీ సీఎండీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు బదిలీ అర్డర్లు తీసుకున్న వారిలో అసంతృప్తిగా ఉన్న వారు ఆ పోస్టుల్లో చేరతారో లేక దీర్ఘకాల సెలవులు పెడతారో వేచి చూడాలి. నిజానికి ఓ డీఈ విషయంలో సీఎండీకి ఇలాంటి అనుమానమే రావడంతో సెలవుపై వెళ్లడం,పోస్టింగ్ మార్చమని రిక్వెస్ట్ పెట్టడం కుదరదని ఆయనకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వుల్లోనే స్పష్టంగా పేర్కొన్నారు. ఇది మిగతా ఉద్యోగులు ఓ హెచ్చరికగా భావించే అవకాశం ఉంది.
కుర్చీలు కదిలాయి!
Published Sun, May 31 2015 11:32 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement