Employees Transfer
-
ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం రోజు తన కార్యాలయంలో పరస్పర బదిలీలకు సంబంధించి సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. పరస్పర బదిలీలకు సంబంధించి ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 2,558 మంది ఉద్యోగుల, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. -
ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఆమేరకు విధించిన బ్యాన్‌ను ఎత్తేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 8 నుంచి 17వరకు బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐదేళ్లకు పైబడిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తున్నారు. వ్యక్తిగత వినతులు, పరిపాలన సౌలభ్యం ఆధారంగా బదిలీలను చేపడుతున్నారు. చదవండి: (CM YS Jagan: ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్) -
‘317 జీవోను రద్దు చేయండి’
ఉస్మానియా యూనివర్సిటీ: ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న 317 జీవోను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. ఉద్యోగుల బదిలీల కోసం జారీ చేసిన జీవో 317తో ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. స్థానికతను, రోస్టర్‌ను పట్టించుకోకుండా అధికారులు రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు తూట్లు పొడిచారన్నారు. సీనియర్‌ను జూనియర్‌గా మారుస్తూ సొంత జిల్లాల నుంచి ఇతర జిల్లాకు అన్యాయంగా బదిలీ చేస్తూ మానసిక వేదనకు గురిచేయడం సరికాదన్నారు. భార్యాభర్తలు వేర్వేరు చోట్ల విధులు నిర్వహిస్తే లోకల్ సమస్యతో పాటు వారి పిల్లలు ఆగమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పరస్పర బదిలీలకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అగౌరవపరచకుండా వారికి న్యాయం జరిగేలా ఉన్న జీవోపై కేసీఆర్ క్షుణంగా అధ్యయనం చేయాలని, బదిలీలపై గందరగోళ పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. -
తెలంగాణ: కీలక దశకు చేరుకున్న ఉద్యోగుల విభజన
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన కీలక దశకు చేరుకుంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల జిల్లా కేడర్ కేటాయింపులు మొత్తం పూర్తయ్యాయి. వారంతా దాదాపు తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్తున్నారు. ఈ రిపోర్టింగ్ ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో ముగియనుంది. ఇక జోనల్, మల్టీజోనల్‌కు సంబంధించి కొన్ని శాఖల్లో కేటాయింపులు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రక్రియ రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. దీంతో అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగుల లెక్క పక్కాగా తెలిసే వీలుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటివరకూ జరిగిందంతా కేడర్ విభజన మాత్రమేనని, ఎవరు ఏ జిల్లా, జోన్, మల్టీజోన్ అనే దానిపైనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పనిచేసే చోటు నుంచి రిలీవ్ కాకుండా కొత్త జిల్లాల్లో రిపోర్టు చేయడాన్ని కేడర్ విభజనగా తీసుకోవాలే తప్ప కొత్త ప్రాంతంలో వెంటనే పనిచేయాలన్నట్లు కాదని ప్రభుత్వ వర్గాలూ స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలవారీ విభజనతోపాటే భార్యాభర్తలు, వికలాంగుల బదిలీలు, ఇతర అభ్యంతరాలను స్వీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ రకమైన అప్పీళ్లను పరిశీలించాక కొన్ని మార్పుచేర్పులు జరిగే వీలుంది. మొత్తమ్మీద వచ్చే నెల 20 నాటికి క్షేత్రస్థాయి విభజన తుది దశకు చేరుకుంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ విభజన తక్షణ అవసరం కావడంతో ఈ కసరత్తు పూర్తవుతోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. చదవండి: పాక్ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు.. కుట్ర పన్నింది ఇలా... శేషప్రశ్నలెన్నో... మిగతా ప్రభుత్వ శాఖల్లో విభజన పెద్దగా సమస్యలు తేవట్లేదు. విద్యాశాఖలోనే అనేక సందేహాలకు తావిస్తోంది. మెజారిటీ టీచర్ల విభజన జిల్లా స్థాయిలోనే ఉంది. ఈ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఉపాధ్యాయులు ప్రస్తుత జిల్లా నుంచి కొత్త జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. పోస్టింగ్ ఇచ్చే జిల్లాలో విద్యాశాఖ కౌన్సెలింగ్ జరిపి ఏ స్కూల్లో పనిచేయాలనేది నిర్ణయిస్తుంది. దీనికోసం విద్యాశాఖ విధివిధానాలు రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. జిల్లా మారిన వారికే బదిలీలు చేపట్టాలా? సాధారణ బదిలీల మాదిరి మార్గదర్శకాలు ఇవ్వాలా? సీనియారిటీ కొలమానమైతే ఇవ్వాల్సిన ఆప్షన్లు ఏమిటి? ఇలా అనేక అంశాలపై గురువారం అధికారులు చర్చించారు. చదవండి: టీఆర్ఎస్కు త్వరలో కొత్త ‘టీమ్’.. కసరత్తు ప్రారంభించిన సీఎం కేసీఆర్ కేడర్ విభజన పూర్తయింది కాబట్టి బదిలీల ప్రక్రియను విద్యాసంవత్సరం ముగిసేవరకూ వాయిదా వేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. జిల్లా కేడర్ ఇచ్చిన టీచర్ అప్పటివరకూ ఉన్న చోటే పనిచేస్తే నష్టమేమీలేదని అధికారులు అంటున్నారు. ఇది పాలనాపరమైన సమస్యకు దారితీస్తుందని విద్యాశాఖలోని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖలో మూడేళ్లుగా బదిలీల్లేవు. దీంతో అన్ని ప్రాంతాల్లో టీచర్లు ట్రాన్స్ఫర్లు అడుగుతున్నారు. ఏప్రిల్‌లో బదిలీలు చేపట్టాలని అధికారులు కేడర్ విభజనకు ముందు నిర్ణయించారు. దీంతో ఇప్పటికిప్పుడు బదిలీలు ఎందుకని అధికారులు భావిస్తున్నారు. దీనిపై త్వరలో స్పష్టత రావచ్చని ఓ అధికారి తెలిపారు. -
పోలీసుల్లో హైరానా..
సాక్షి, ఆదిలాబాద్: పోలీసులు ఒక్కసారిగా హైరానా పడ్డారు. బదిలీలకు దరఖాస్తులు ఇవ్వాలని బాస్‌ల నుంచి గురువారం ఆదేశాలు రావడంతో ఆందోళన చెందారు. ఈ నిర్ణయాన్ని పోలీసులు స్వాగతిస్తున్నా ఓ అంశం మాత్రం వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నట్లు పోలీసుల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే వారి లో గందరగోళానికి దారి తీసింది. అయితే శాఖ లో వ్యవస్థాగత చర్యలే తప్పితే బదిలీలకు సం బంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేద ని ఉన్నతాధికారులు చెబుతుండడం గమనార్హం. బదిలీలు ఉంటాయా...! పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో ఈ శాఖలో బదిలీలు ప్రస్తుతం ఉండే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. కాని స్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సైలకు స్థానచలనం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 83 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. సుమారు 1400 మంది కానిస్టేబుళ్లు, 400 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 220 మంది ఏఎస్సైలు ఉన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడినప్పు డు ఆర్డర్ టు సర్వ్‌పై పలురువురి పంపించారు. దాని తర్వాత సుమారు ఏడాది కిందట మరోసారి పోలీసు శాఖలో బదిలీలు చేసి పలువురిని ఉమ్మడి జిల్లాలో అటు ఇటుగా పంపించారు. దరఖాస్తే గందరగోళం.. గతంలో బదిలీల సందర్భంగా కానిస్టేబుళ్లకు 5 సంవత్సరాలు, హెడ్‌కానిస్టేబుళ్లకు 4 సంవత్సరాలు, ఏఎస్సైలు 3 సంవత్సరాలు ఒకే చోట పని చేసిన వారిని పరిగణలోకి తీసుకుని ట్రాన్స్ఫర్స్ చేసే వారు. అదే విధంగా ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీలో 3 సంవత్సరాలు, గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో 4 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాల్లో 5 సంవత్సరాలు ఒకే చోట పని చేసిన వారిని అటు ఇటుగా బదిలీలు చేసేవారు. ఇలా బదిలీల్లో అధికారులు పై నిబంధనలను అనుసరించే వారు. అయితే గురువారం ప్రతీ కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై బదిలీకి సంబంధించి రాసివ్వాలని అధికారులు పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. అందులో ఉమ్మడిలో ఏ జిల్లాకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని రాసివ్వమనడమే గందరగోళానికి కారణమైంది. అదే సందర్భంలో బదిలీ అయి కొన్ని నెలలు అయిన వా రు కూడా దరఖాస్తు ఇవ్వాలని చెప్పడం వారిలో అయోమయానికి దారి తీస్తోంది. దీంతో దరఖాస్తు ఇవ్వాలా.. వద్దా.. అనే మీమాంసలో పడ్డారు. ఒకవేళ దరఖాస్తు ఇవ్వకపోతే ఎలా ఉంటుందో.. ఇస్తే ఎక్కడైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలా.. ఇలా పోలీసుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రధానంగా కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా నుంచి పలువురు కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లను కొత్త జిల్లాలైన నిర్మల్, మంచి ర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌కు పంపారు. ఇప్పుడు అక్కడ ఉన్న వారే సొంత జిల్లాకు రావాలని ఉవిళ్లూరుతున్నారు. అయితే ఏ జిల్లాకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలనడం వారిని సందిగ్ధానికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే అప్పు డు ఆర్డర్ టు సర్వ్ ద్వారా వెళ్లిన వారిలో పలువు రు పదవీ విరమణకు దగ్గర ఉండగా, తమ సొం త ప్రాంతాలకు పంపాలని శాఖపరంగా పోలీసు ఉన్నతాధికారులను కలిసి వినతులు అందించారు. ఏమవుతుందో.. పోలీసుశాఖలో గురువారం ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో గందరగోళమైన వాతావరణం నెలకొంది. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు బదిలీ దరఖాస్తు విషయంలో హైరానా చెందడం కనిపించింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పడం తప్పించి వారికి మరే విషయం తెలియకపోవడంతో హైరానా పడటం వారివంతైంది. దరఖాస్తు ఇవ్వక తప్పని పరిస్థితుల్లో తమను ఎక్కడికి పంపుతారోనన్న ఆందోళన కనిపించింది. -
‘విశాఖ’ వేదన!
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే విభజన నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని ప్రధాన కార్యాలయం రైల్‌నిలయం. గణాంకాల కార్యాలయం లేఖాభవన్, రైల్ నిర్మాణ్ భవన్ వంటి ప్రధాన పరిపాలన, నిర్వహణ కేంద్రాల్లో గురువారం ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కొత్తగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వే, పాత దక్షిణమధ్య రైల్వేల మధ్య ఉద్యోగుల విభజన తప్పనిసరి కావడంతో అన్ని ప్రధాన కేంద్రాల్లో విభజన అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అనేక సంవత్సరాలుగా సికింద్రాబాద్ కేంద్రంగా పని చేసిన అధికారులు, ఉద్యోగులు ఇప్పుడు ఏపీకి తరలి వెళ్లవలసి రావడంతో ఉద్వేగానికి గురవుతున్నారు. మొదటి దశలో ఆప్షన్లు ఇచ్చినప్పటికీ కిందిస్థాయి ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఉండకపోవచ్చునని, తప్పనిసరిగా విశాఖ జోన్‌కు వెళ్లవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌లో పని చేస్తూ ఇక్కడే స్థిరపడి సొంత ఇళ్లు, ఆస్తులు సంపాదించుకొన్న వారు ఇప్పుడు ఉన్నఫళంగా కొత్త జోన్‌కు వెళ్లవలసి రావడంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘‘చాలా కాలంగా పని చేస్తూ సొంత ఊళ్లనే మరిచిపోయాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి. తిరిగి ఎక్కడ స్థిరపడాలి. చాలా గందరగోళంగా ఉంది.’’ అని రైల్‌నిలయంలో పని చేస్తున్న అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. నగరంలోనే హైదరాబాద్ డివిజన్ , సికింద్రాబాద్ డివిజన్ల ప్రధాన కార్యాలయాలు ఉన్నప్పటికీ విభజన ప్రభావం డివిజనల్ ఉద్యోగులపైన ఉండబోదు. కేవలం జోనల్ కార్యాలయాల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు మాత్రమే రెండు జోన్ల మధ్య బదిలీ కావలసి ఉంటుంది. తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన అధికారులు, ఉద్యోగులు, విశాఖ, విజయవాడ, తదితర ప్రాంతాల్లో పని చేస్తున్నప్పటికీ వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. హైదరాబాద్‌లో పని చేస్తున్న వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రైల్నిలయంపై ప్రభావం... దక్షిణమధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్‌నిలయంలో సుమారు 1500 మంది ఉద్యోగులు, అధికారులు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది పని చేస్తున్నారు. జోన్‌లోని మొత్తం 6 డివిజన్ల కార్యాలకలాపాలను ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తారు. పరిపాలన, మానవ వనరుల విభాగం, ఆపరేషన్స్, విజిలెన్స్, ప్రజాసంబంధాలు, కమర్షియల్, తదితర విభాగాలతో పాటు, ఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం కూడా రైల్నిలయంలోనే ఉంది. విభజన నేపథ్యంలో సుమారు 750 మందికి పైగా విశాఖ జోన్‌కు తరలి వెళ్లే అవకాశం ఉంది. దీంతో రైల్‌నిలయంలోని ఏడంతస్థుల భవనంలో సగానికి పైగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందని దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నేత అరుణ్ విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కొంత భాగాన్ని రైల్‌నిలయం కేంద్రంగా దక్షిణమధ్య రైల్వే నిర్వహిస్తుంది. విభజన అనంతరం హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దీని పరిధిలో ఉంటాయి. ఉద్యోగుల సంఖ్య చాలా వరకు తగ్గుతుంది.అలాగే దక్షిణమధ్య రైల్వేలో కొత్త లైన్ల నిర్మాణం, కొత్త భవనాలు, కట్టడాలు,తదితర కార్యాలయాలను చేపట్టి పర్యవేక్షించే రైల్నిర్మాణ్ భవన్లో సుమారు 650 మంది పని చేస్తున్నారు. లేఖా భవన్లో మరో 500 మందికి పైగా ఉన్నారు. ఈ రెండు కార్యాలయాల్లోనూ సగం మంది కొత్త జోన్‌కు తరలి వెళ్లవలసిందే. తగ్గనున్న ఏ–1 స్టేషన్లు... జోన్ విభజన దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే జోన్లో ఏ–1 స్టేషన్ల సంఖ్య తగ్గనుంది. విజయవాడ, తిరుపతి రైల్వేస్టేషన్లు కొత్త జోన్‌కు బదిలీ అవు తాయి. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లు మాత్రమే మిగులుతాయి.దీంతో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు తగ్గే అవకాశం ఉన్న ట్లు అధికారవర్గాలు భావిస్తున్నాయి. సికింద్రాబాద్ డివిజన్ ఒక్కటే అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్‌గా మారింది. కొత్తగా కాజీపేట్ డివిజన్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని మజ్దూర్ యూనియన్ నాయకులు అరుణ్ కోరారు. విశాఖ–సికింద్రాబాద్నెట్వర్క్ పెరిగే అవకాశం దక్షిణమధ్య రైల్వే విభజన పట్ల ఉద్యోగ వర్గాల్లో కొంత విముఖత ఉన్నప్పటికీ కొత్త జోన్ వల్ల ప్రయాణికులకు మరిన్ని అదనపు రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్టణం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండే ఈ కారిడార్‌లో కొత్త రైళ్లను విశాఖ వరకు పొడిగించేందుకు అవకాశం లేకపోవడంతో కాకినాడ నుంచే మళ్లిస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వేకు, దక్షిణమధ్య రైల్వేకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఉత్తరాంధ్రకు హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ పెరగడం లేదు. కొత్త రైళ్లు నడపాలని అనేక ఏళ్లుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈస్ట్‌కోస్ట్ నుంచి సహకారం లభించకపోవడంతో వాయిదా వేస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే సౌత్‌కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వేలు రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించనున్న దృష్ట్యా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తారు ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం. ఇంత ఉన్న పళంగా జోన్ పైన నిర్ణయం తీసుకుంటారని ఊహించలేకపోయాం. ఇప్పటికిప్పుడు జోన్ విభజించడం వల్ల ఉద్యోగులు, వారి పిల్లలు ఎక్కడికి వెళ్లాలి. ఎక్కడ చదువుకోవాలి. చాలామంది ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్ల పరిస్థితి ఏంటీ. చిన్న జోన్ల వల్ల రైల్వేకు నష్టమే కానీ లాభం మాత్రం ఉండబోదు. – ఉమా నాగేంద్రమణి, దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆందోళన మొదలైంది జూనియర్ ఉద్యోగుల్లో అప్పుడే ఆందోళన కనిపిస్తోంది. ఆప్షన్లు ఇస్తామంటారు కానీ, కిందిస్థాయికి వచ్చేటప్పటికీ బలవంతపు బదిలీలు తప్పవు. పారదర్శకత పాటించాలి. ప్రధాన కార్యాలయాల్లో పనిచేసే వారిపైన ప్రభావం ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది.– అరుణ్‌కుమార్, సహాయ ప్రధాన కార్యదర్శి, మజ్దూర్ యూనియన్ నిరుద్యోగం అలాగే ఉంటుంది విశాఖ పట్నంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటును ఆంధ్ర ప్రజలు ఆహ్వానించినప్పటికీ , అక్కడవున్న నిరుద్యోగ సమస్య పూర్తిగా తొలగిపోదు. జోన్ రాకతో ముఖ్య కార్యాలయానికి మాత్రమే అధికారులు,సిబ్బంది అవసరం ఉంటుంది. గుంతకల్ , విజయవాడ , గుంటూరు డివిజన్ లో పని చేస్తున్న స్టాఫ్ యధావిధిగా వుంటారు. ఏ రైల్వే నుండైనా బదిలీలపై వచ్చే అవకాశం ఉంటుంది. వేరే చోట పని చేస్తున్న అధికారులు అనధికారులు కొత్త జోన్ కు రావడానికి ప్రయత్నిస్తారు. ఇక కొత్త ఉద్యోగాలు ఎక్కడివి. – నూర్, దక్షిణమధ్య రైల్వే రిటైర్డ్ అధికారి -
మెరుగైన సేవలందిస్తే జీవితాంతం ఆత్మసంతృప్తి
కాకినాడ సిటీ : ఏ ఉద్యోగి అయినా మెరుగైన సేవలు అందిస్తే.. అలాంటివారు పదవీ విరమణ చేసినా లేదా వేరే ప్రాంతానికి బదిలీ అయినా ఆ సేవలు వారికి జీవితాంతం ఆత్మసంతృప్తిని కలిగిస్తాయని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. స్థానిక రెవెన్యూ అసోసియేషన్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా శాఖ ఆధ్వర్యాన ఇద్దరు సమాచార శాఖ ఉద్యోగులకు శనివారం ఆత్మీయ సత్కార వీడ్కోలు సభ జరిగింది. సమాచార శాఖ రేడియో ఇంజనీరింగ్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరుగా పనిచేస్తూ పదవీ విరమణ చేస్తున్న డీవీఎస్ రాజు, అలాగే జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో 20 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పని చేసి ఇటీవల బదిలీపై విజయవాడ వెళ్లిన కాకినాడ డివిజనల్ పౌర సంబంధాల అధికారి వి.రామాంజనేయులును సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ డీవీఎస్ రాజు, రామాంజనేయులు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం.ఫ్రాన్సిస్, సీనియర్ పాత్రికేయుడు మధుసూదనరావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డీఎస్ఎస్ రామాంజనేయులు పాల్గొన్నారు. -
రెండు నెలల్లో విజయవాడకు తరలి వెళ్లాల్సిందే..
సాక్షి, హైదరాబాద్ : రెండు నెలల్లోగా ప్రజలతో నేరుగా సంబంధాలుండే శాఖలు విజయవాడకు తరలి వెళ్లాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య, విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, హోం, వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ తక్షణం విజయవాడ వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు వారంలో మూడు రోజులపాటు విజయవాడలోనే ఉండాల్సిందిగా బాబు సూచించారు. మంత్రివర్గ సమావేశాలనూ విజయవాడలోనే నిర్వహిస్తానని, రెండు నెలలకోసారి మాత్రమే హైదరాబాద్‌లో నిర్వహిస్తానన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులందరూ విజయవాడ-గుంటూరుల్లో అద్దెకు ఇళ్లను తీసుకోవాలని, అక్కడి నుంచే పాలనను నిర్వహించాలని సూచిం చారు. మంత్రుల ఇళ్ల అద్దె పరిమితులకు మినహాయింపు ఇస్తామని స్పష్టం చేశారు. గతంలో ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తన దృష్టికి తీసుకురాకపోవడం పట్ల ఆర్థిక శాఖ అధికారి పీవీ రమేశ్‌పై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేట్ వర్సిటీలకు సంబంధించి బిల్లును కేబినెట్ అజెండాలో చేర్చకపోవడంపైనా అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు, కొంతమంది అధికారుల పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. -
కుర్చీలు కదిలాయి!
సాక్షి, విశాఖపట్నం : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో ఉద్యోగుల బదిలీలు దాదాపు పూర్తయ్యాయి. డీఈ, ఏడీఈ, ఏఈ, ఏఏఈ, ఎస్ఏఓ, ఏఓ, ఏఏఓ, పీఓ వరకూ అన్ని కేటగిరిల్లో బదిలీలు జరిగాయి. ఈ నెల 29న తొలి జాబితాను విడుదల చేయగా ఆదివారం తుది జాబితాను అధికారులు వెల్లడించారు. 12 మంది డీఈలతో పాటు మొత్తం 175 మంది ఉద్యోగులను ఈపీడీసీఎల్ పరిధిలోని ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బదిలీచేసి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఎప్పటిలా కాకుండా ఈ సారి సీఎండీ ఆర్.ముత్యాలరాజు ప్రత్యేక వ్యూహంతో బదిలీలు చేపట్టి సంచలనాలకు కారణమయ్యారు. ముఖ్యంగా స్టేషన్ సీనియారిటీ ప్రాతిపదికన బదిలీ చేయాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎండీ దానిని అమలు చేసేందుకు అంతే స్థాయిలో నిలబడ్డారు. దీంతో 5 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఒకే చోట పనిచేస్తున్న వారిపై బదిలీవేటు పడింది. వీరిలో ఎంపిక చేసిన కొందరిని దూరంగా విసిరేసినట్లు వారికిచ్చిన పోస్టింగ్‌లను బట్టి కనిపిస్తోంది. ఈపీడీసీఎల్‌లో మొత్తం 7800 మంది ఉద్యోగులున్నారు. వారిలో దాదాపు 1500 మంది బదిలీలకు అర్హులు. 5 ఏళ్లు పూర్తయిన వారు దాదాపు 350 మంది ఉన్నారు. సాధారణంగా బదిలీ నిబంధనల ప్రకారం ఒకే పోస్టులో 3 ఏళ్లు, ఒకే ప్రాంతంలో 5ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగిని బదిలీ చేయాలి. అయితే ప్రభుత్వ నిబంధనలకు సీఎండీ ముత్యాలరాజు మార్పులు చేశారు. ఏ పోస్టులో ఉన్నప్పటికీ ఒకే ప్రాంతంలో ఎన్నేళ్లుగా పనిచేస్తున్నారనేదే ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించారు. దానికి తగ్గట్టు మార్గదర్శకాలు తయారు చేయించి అర్హుల జాబితాను ప్రకటించారు. దీనిపై కొందరు ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తంచేసి హైదరాబాద్‌లో పంచాయతీ పెట్టినా సీఎండీ ఎక్కడా వెనకడుగు వేయలేదు. తన మాట కాదంటే సెలవుపై వెళ్లిపోవడానికైనా సిద్ధమని ఓ సమయంలో ఉన్నతాధికారుల వద్ద కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారని వార్తలు వినిపించాయి. అందువల్లనే వారు కూడా మారు మాట్లాడకుండా సీఎండీ నిర్ణయానికి వదిలేశారని కొందరు ఉద్యోగులు అంటున్నారు. పాతుకుపోయిన వారికి స్థానచలనం: ఎన్నో ఏళ్లుగా ఒకే జిల్లాలో పాతుకుపోయిన వారు ఇప్పుడు తప్పనిసరై జిల్లా దాటుతున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న కొందరు ఉద్యోగులను వారు ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి చాలా దూరం విసిరేశారు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సర్కిల్లో ఓ ఏడీఈ తనను ఎక్కడికి బదిలీ చేసినా ఆ ప్రాంతం నుంచి నెలలు తిరక్కుండానే తిరిగి ఆ సర్కిల్‌కు వచ్చేస్తుంటారు. అప్పటివరకూ ఎక్కువ రోజులు సెలవులోనే ఉంటారు. ఇప్పుడు అయనను శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. కొందరిని ఏజెన్సీకి పంపించారు. దీనివల్ల వ్యక్తుల వారీగా టార్గెట్ చేసి బదిలీలు చేశారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అవేవీ సీఎండీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు బదిలీ అర్డర్లు తీసుకున్న వారిలో అసంతృప్తిగా ఉన్న వారు ఆ పోస్టుల్లో చేరతారో లేక దీర్ఘకాల సెలవులు పెడతారో వేచి చూడాలి. నిజానికి ఓ డీఈ విషయంలో సీఎండీకి ఇలాంటి అనుమానమే రావడంతో సెలవుపై వెళ్లడం,పోస్టింగ్ మార్చమని రిక్వెస్ట్ పెట్టడం కుదరదని ఆయనకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వుల్లోనే స్పష్టంగా పేర్కొన్నారు. ఇది మిగతా ఉద్యోగులు ఓ హెచ్చరికగా భావించే అవకాశం ఉంది. -
బదిలీ గుబులు
ఏలూరు : ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు బదిలీ గుబులు పట్టుకుంది. ఆర్ అండ్ బీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల్లోని జోనల్, జిల్లాస్థాయి ఉద్యోగులకు గత నెలలో బదిలీ కౌన్సెలింగ్ పూర్తిచేశారు. అయితే, వారికి ఉత్తర్వులు ఇవ్వాలా, వద్దా అన్న గందరగోళంలో అధికారులు ఉన్నారు. బదిలీలు చేపట్టేందుకు ఈ నెల 30 వరకు మాత్రమే గడువు ఉంది. హుదూద్ తుపాను కారణంగా జిల్లాలో వాయిదాపడిన జన్మభూమి గ్రామసభలను నవంబర్ 1నుంచి నిర్వహించాల్సి ఉండటంతో ఈలోగా ఉద్యోగుల్ని బదిలీ చేయూలా, చేయకూడదా అనేది అధికారులకు తోచడం లేదు. ఒకవేళ కౌన్సెలింగ్ పూర్తయిన వారికి బదిలీ ఉత్తర్వులు ఇస్తే.. వారు జన్మభూమి సభలు పూర్తయ్యాక మాత్రమే విధుల్లో చేరాల్సి ఉంటుంది. బదిలీ అయిన ఉద్యోగి కొత్త స్థానంలో చేరడానికి వారం నుంచి 15 రోజుల వరకు సమయం ఇవ్వాల్సి ఉంది. నవంబర్ 13 నుంచి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆలోగా ఈ పక్రియ పూర్తికాకపోతే ఇక బదిలీల ఊసే ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఎటూ తేల్చని ప్రభుత్వం అవసరమైన శాఖల్లోనే బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఇటీవల రాష్ట్ర ఎన్జీవో జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఇది జరిగి వారం గడుస్తున్నా.. ఈ విషయమై ప్రభుత్వ శాఖలకు ఎలాంటి సమాచారం రాలేదు. ఏ విషయం తేలకపోవడంతో ఆయుష్, వైద్య ఆరోగ్య శాఖల్లో బదిలీ కౌన్సెలింగ్ వాయిదా వేశారు. మరోవైపు రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల్లో చాలాకాలంగా వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టుల కోసం వేచివున్న వారిని బదిలీ చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ నెల 30న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో బదిలీ ప్రక్రియపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కౌన్సెలింగ్ పూర్తయిన ఉద్యోగులకు ఆ రోజే బదిలీ ఉత్తర్వులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. చివరకు బదిలీ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వస్తుందోనన్న అయోమయం ఉద్యోగులను వెన్నాడుతోంది. -
బదిలీలు..మళ్లీ వాయిదా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు మళ్లీ బ్రేక్ పడే అవకాశముందంటున్నారు. తుపాను వల్ల జిల్లాకు భారీ నష్టం వాటిల్లడంతో సహాయ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. అలాగే పంటలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసి సర్వేలు మరోవైపు జరుగుతున్నాయి. ఈ తరుణంలో బదిలీల ప్రక్రియ చేపట్టడం కుదరదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో బదిలీల పేరుతో కాసులు దండుకోవాలన్న టీడీపీ నేతల ఆశలపైనా నీళ్లు చల్లినట్లయ్యింది. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు బదిలీలు చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించడంతో తమవారిని అనుకూలమైన ప్రాంతాలకు పోస్టింగ్ ఇప్పించడంతోపాటు కోరుకున్న చోటుకు ఉద్యోగులను బదిలీ చేయించేందుకు అధికార పార్టీ నాయకులు పావులు కదిపారు, ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. గత కొన్నేళ్లుగా సాధారణ బదిలీలు లేకపోవడంతో ఉద్యోగులు కూడా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ఉత్సుకత చూపారు. నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తుపాను దెబ్బతో అవన్నీ నీరుగారిపోయాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా బదిలీల ప్రక్రియ చేపట్టాలని గత సెప్టెంబర్‌లోనే ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆటంకాలు రావడంతో కొన్నాళ్ల పాటు నిషేధం విధించింది. కొన్నాళ్ల తర్వాత ఈ నెల 20లోగా బదిలీలు పూర్తి చేయాలని ఆదేశాలొచ్చాయి. ఇదే సమయంలో ఈనెల 2 నుంచి 20 వరకు జన్మభూమి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తహశీల్దార్లు సహా సిబ్బందిని మారిపోతే గ్రామస్థాయిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, కొత్త సిబ్బందితో పని చేయించుకోలేమని భావించిన అధికారులు మళ్లీ బదిలీల వాయిదాకు ప్రయత్నించారు. అదే తరుణంలో ఈ నెల 12న భీకర హుదూద్ తుపాను రావడం, జిల్లాలో భారీ ఎత్తున నష్టం వాటిల్లడంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సహాయ, పునరావాస పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే అక్టోబర్ 20 నుంచి నవంబర్ 10 వరకు బదిలీల ప్రక్రియ నిర్వహించాలని మళ్లీ ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి. తుపాను నష్టాల నుంచి జిల్లా ఇంకా కోలుకోని పరిస్థితుల్లో ఈసారి కూడా వాయిదా పడకతప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తుంద ని భావిస్తున్నారు. మొత్తానికి తమ వారికి పోస్టింగ్లిప్పించి పనులు చేయించుకుందామని భావించిన టీడీపీ నేతలకు హుదూద్ తుపాను పెద్ద షాకే ఇచ్చినట్టయింది. దేవాలయ, మార్కెట్ కమిటీల నియామకాల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని, దేవాదాయ కమిటీల నియామకాలకు ప్రభుత్వం జీవో ఇచ్చినా ఇప్పట్లో ఆ ప్రక్రియ పూర్తయ్యేలా లేదని నేతలే చెబుతున్నారు.