సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు మళ్లీ బ్రేక్ పడే అవకాశముందంటున్నారు. తుపాను వల్ల జిల్లాకు భారీ నష్టం వాటిల్లడంతో సహాయ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. అలాగే పంటలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసి సర్వేలు మరోవైపు జరుగుతున్నాయి. ఈ తరుణంలో బదిలీల ప్రక్రియ చేపట్టడం కుదరదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో బదిలీల పేరుతో కాసులు దండుకోవాలన్న టీడీపీ నేతల ఆశలపైనా నీళ్లు చల్లినట్లయ్యింది. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు బదిలీలు చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించడంతో తమవారిని అనుకూలమైన ప్రాంతాలకు పోస్టింగ్ ఇప్పించడంతోపాటు కోరుకున్న చోటుకు ఉద్యోగులను బదిలీ చేయించేందుకు అధికార పార్టీ నాయకులు పావులు కదిపారు, ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. గత కొన్నేళ్లుగా సాధారణ బదిలీలు లేకపోవడంతో ఉద్యోగులు కూడా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ఉత్సుకత చూపారు. నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తుపాను దెబ్బతో అవన్నీ నీరుగారిపోయాయి.
ఇప్పటికే పలుమార్లు వాయిదా
బదిలీల ప్రక్రియ చేపట్టాలని గత సెప్టెంబర్‌లోనే ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆటంకాలు రావడంతో కొన్నాళ్ల పాటు నిషేధం విధించింది. కొన్నాళ్ల తర్వాత ఈ నెల 20లోగా బదిలీలు పూర్తి చేయాలని ఆదేశాలొచ్చాయి. ఇదే సమయంలో ఈనెల 2 నుంచి 20 వరకు జన్మభూమి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తహశీల్దార్లు సహా సిబ్బందిని మారిపోతే గ్రామస్థాయిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, కొత్త సిబ్బందితో పని చేయించుకోలేమని భావించిన అధికారులు మళ్లీ బదిలీల వాయిదాకు ప్రయత్నించారు.
అదే తరుణంలో ఈ నెల 12న భీకర హుదూద్ తుపాను రావడం, జిల్లాలో భారీ ఎత్తున నష్టం వాటిల్లడంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సహాయ, పునరావాస పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే అక్టోబర్ 20 నుంచి నవంబర్ 10 వరకు బదిలీల ప్రక్రియ నిర్వహించాలని మళ్లీ ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి. తుపాను నష్టాల నుంచి జిల్లా ఇంకా కోలుకోని పరిస్థితుల్లో ఈసారి కూడా వాయిదా పడకతప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తుంద ని భావిస్తున్నారు. మొత్తానికి తమ వారికి పోస్టింగ్‌లిప్పించి పనులు చేయించుకుందామని భావించిన టీడీపీ నేతలకు హుదూద్ తుపాను పెద్ద షాకే ఇచ్చినట్టయింది. దేవాలయ, మార్కెట్ కమిటీల నియామకాల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని, దేవాదాయ కమిటీల నియామకాలకు ప్రభుత్వం జీవో ఇచ్చినా ఇప్పట్లో ఆ ప్రక్రియ పూర్తయ్యేలా లేదని నేతలే చెబుతున్నారు.
బదిలీలు..మళ్లీ వాయిదా?
Published Wed, Oct 29 2014 2:14 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement