సాక్షి, ఆదిలాబాద్: పోలీసులు ఒక్కసారిగా హైరానా పడ్డారు. బదిలీలకు దరఖాస్తులు ఇవ్వాలని బాస్‌ల నుంచి గురువారం ఆదేశాలు రావడంతో ఆందోళన చెందారు. ఈ నిర్ణయాన్ని పోలీసులు స్వాగతిస్తున్నా ఓ అంశం మాత్రం వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నట్లు పోలీసుల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే వారి లో గందరగోళానికి దారి తీసింది. అయితే శాఖ లో వ్యవస్థాగత చర్యలే తప్పితే బదిలీలకు సం బంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేద ని ఉన్నతాధికారులు చెబుతుండడం గమనార్హం.
బదిలీలు ఉంటాయా...!
పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో ఈ శాఖలో బదిలీలు ప్రస్తుతం ఉండే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. కాని స్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సైలకు స్థానచలనం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 83 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. సుమారు 1400 మంది కానిస్టేబుళ్లు, 400 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 220 మంది ఏఎస్సైలు ఉన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడినప్పు డు ఆర్డర్ టు సర్వ్‌పై పలురువురి పంపించారు. దాని తర్వాత సుమారు ఏడాది కిందట మరోసారి పోలీసు శాఖలో బదిలీలు చేసి పలువురిని ఉమ్మడి జిల్లాలో అటు ఇటుగా పంపించారు.
దరఖాస్తే గందరగోళం..
గతంలో బదిలీల సందర్భంగా కానిస్టేబుళ్లకు 5 సంవత్సరాలు, హెడ్‌కానిస్టేబుళ్లకు 4 సంవత్సరాలు, ఏఎస్సైలు 3 సంవత్సరాలు ఒకే చోట పని చేసిన వారిని పరిగణలోకి తీసుకుని ట్రాన్స్‌ఫర్స్ చేసే వారు. అదే విధంగా ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీలో 3 సంవత్సరాలు, గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో 4 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాల్లో 5 సంవత్సరాలు ఒకే చోట పని చేసిన వారిని అటు ఇటుగా బదిలీలు చేసేవారు. ఇలా బదిలీల్లో అధికారులు పై నిబంధనలను అనుసరించే వారు. అయితే గురువారం ప్రతీ కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై బదిలీకి సంబంధించి రాసివ్వాలని అధికారులు పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది.
అందులో ఉమ్మడిలో ఏ జిల్లాకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని రాసివ్వమనడమే గందరగోళానికి కారణమైంది. అదే సందర్భంలో బదిలీ అయి కొన్ని నెలలు అయిన వా రు కూడా దరఖాస్తు ఇవ్వాలని చెప్పడం వారిలో అయోమయానికి దారి తీస్తోంది. దీంతో దరఖాస్తు ఇవ్వాలా.. వద్దా.. అనే మీమాంసలో పడ్డారు. ఒకవేళ దరఖాస్తు ఇవ్వకపోతే ఎలా ఉంటుందో.. ఇస్తే ఎక్కడైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలా.. ఇలా పోలీసుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రధానంగా కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా నుంచి పలువురు కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లను కొత్త జిల్లాలైన నిర్మల్, మంచి ర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌కు పంపారు.
ఇప్పుడు అక్కడ ఉన్న వారే సొంత జిల్లాకు రావాలని ఉవిళ్లూరుతున్నారు. అయితే ఏ జిల్లాకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలనడం వారిని సందిగ్ధానికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే అప్పు డు ఆర్డర్ టు సర్వ్ ద్వారా వెళ్లిన వారిలో పలువు రు పదవీ విరమణకు దగ్గర ఉండగా, తమ సొం త ప్రాంతాలకు పంపాలని శాఖపరంగా పోలీసు ఉన్నతాధికారులను కలిసి వినతులు అందించారు.
ఏమవుతుందో..
పోలీసుశాఖలో గురువారం ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో గందరగోళమైన వాతావరణం నెలకొంది. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు బదిలీ దరఖాస్తు విషయంలో హైరానా చెందడం కనిపించింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పడం తప్పించి వారికి మరే విషయం తెలియకపోవడంతో హైరానా పడటం వారివంతైంది. దరఖాస్తు ఇవ్వక తప్పని పరిస్థితుల్లో తమను ఎక్కడికి పంపుతారోనన్న ఆందోళన కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment