సాక్షి, రాజమండ్రి :కొత్తగా కొలువైన పంచాయతీల పాలక మండళ్లు.. వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుందని సర్కారుపై పెట్టుకున్న ఆశ.. అడియాసే అయింది. పంచాయతీల ఆర్థిక భారాన్ని మోయలేనని సర్కారు చేతులెత్తేసింది. దీంతో పంచాయతీల్లో రూ.లక్షల్లో పేరుకుపోయిన కరెంటు బాకీలకు కనుచూపు మేరలో మోక్షం లభించే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లాలో గ్రామ పంచాయతీలు తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)కు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.70 కోట్లకు చేరుకున్నాయి. నాలుగేళ్లుగా ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరుగుతున్న ఈ బ కాయిలను తాము కట్టలేమని పంచాయతీలు ఆ బాధ్యతను ప్రభుత్వంపై నెట్టేస్తూ వచ్చా యి.
ఇప్పుడు అది మా పని కాదని ప్రభుత్వం తేల్చేయడం తో నెలకు రూ.మూడు కోట్ల విలువైన విద్యుత్తును పంచాయతీలకు అప్పనంగా ఎలా ఇచ్చేదని ఈపీడీసీఎల్ ఆలోచనలో పడింది. నాలుగేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పం చాయతీలకు ఇటీవల పాలక మండళ్లు వచ్చినా నిధులు రా లేదు. తమ బకాయిల భారాన్ని తగ్గించాలని అటు విద్యుత్తు శాఖ, ఇటు పంచాయతీ రాజ్ శాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదించాయి. ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లించే స్థితిలో లేదని పంచాయతీ రాజ్ శాఖకు మౌఖిక ఆదేశాలు అందాయని తెలుస్తోంది.
ఇదీ బకాయిల చిట్టా..
జిల్లాలో ఐదు విద్యుత్తు డివిజన్‌ల పరిధిలో మేజర్, మైనర్ పంచాయతీలకు 2600కు పైగా విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. గత జూన్ నెలాఖరుకు మేజర్ పంచాయతీలు రూ.39.05 కోట్లు, మైనర్ పంచాయతీలు రూ.26.88 కోట్లు బకాయి పడ్డాయి. వీటికి జూలై బకాయిలు మరో రూ.మూడు కోట్లకు పైగా వచ్చి చేరాయి. మొత్తం బకాయిలు దాదాపు రూ.70 కోట్లకు చేరినట్టు ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు. వీటిలో మైనర్ పంచాయతీల్లో వీధిలైట్లకు రూ.15.11 కోట్లు, తాగునీటి పథకాలకు రూ.11.77 కోట్లు చెల్లించాల్సి ఉంది. మేజర్ పంచాయతీల వీధి దీపాల బకాయిలు రూ.23.72 కోట్లు ఉండగా, తాగునీటి పథకాలకు సంబంధించి రూ.15.33 కోట్లు చెల్లించాల్సి ఉంది.
‘వెలుగుల’ వెల మీరే భరించండి
Published Tue, Aug 12 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM
Advertisement