హాట్ సీట్ | Hot Seat | Sakshi
Sakshi News home page

హాట్ సీట్

Published Tue, Sep 2 2014 2:01 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM

హాట్ సీట్ - Sakshi

హాట్ సీట్

సాక్షి, ఏలూరు : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్‌ఈ) పోస్టుకు చాలా గిరాకీ ఉంటుంది. అందులోనూ ఆపరేషన్స్ ఎస్‌ఈ పోస్టుకు పోటీ అంతాఇంతా కాదు. తామనుకున్న స్థానం దక్కించుకోవడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయడంలో ఈ సంస్థలోని అధికారులు ఎప్పుడూ ముందుంటారు. తమ ప్రయత్నం ఫలించేం దుకు ఎంత దూరమైనా వెళతారు.. ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఏలూరు సర్కిల్ ఆపరేషన్స్ ఎస్‌ఈ పోస్టు విషయంలో అదే జరుగుతోంది. ప్రస్తుత ఎస్‌ఈ టీవీ సూర్యప్రకాష్‌ను బదిలీ చేస్తూ ఆదివారం రాత్రి ఆ సంస్థ సీఎండీ ఎంవీ శేఖగిరిబాబు ఉత్తర్వులు జారీచేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్‌ఈగా సత్యనారాయణరెడ్డి (ప్రస్తుతం విశాఖపట్నం ఆపరేషన్స్ ఎస్‌ఈగా ఉన్నారు) విధుల్లో చేరతారని చెప్పారు.
 
 దీంతో సూర్యపకాష్ తాను బదిలీ అయిన విశాఖపట్నంలోని కార్పొరేట్ కార్యాలయానికి అసెస్‌మెంట్స్ ఎస్‌ఈగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఏమైందో ఏమో.. అప్పుడే రిలీవ్ కావద్దని, తదుపరి ఆదేశాలు వచ్చేంతవ రకూ వేచి ఉండాలని సీఎండీ నుంచి ఆదేశాలొచ్చాయి. చివరి నిమిషంలో ఎస్‌ఈ బదిలీకి బ్రేక్ పడటం చర్చనీయాంశమైంది. ఈ పోస్టులోకి వచ్చేందుకు విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి  పలువురు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తుండటమే ఈ మార్పులకు కారణంగా తెలుస్తోంది. సూర్యప్రకాష్ ఇక్కడ ఎస్‌ఈగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు పూర్తయ్యింది.
 
 ఎన్నికల ముందే ఆయన బదిలీ అవుతారని అంతా ఊహించారు. కానీ కాలేదు. ఆయన కుటుంబ సభ్యులు విశాఖలోనే ఉండటంతో ఎప్పటినుంచో సూర్యప్రకాష్ తనను అక్కడికి బదిలీ చేయాల్సిందిగా సీఎండీని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత బదిలీ జరిగిం ది. ఆయన స్థానంలో ఎస్‌ఈగా వచ్చేందుకు ముగ్గురు అధికారులు తీవ్రంగా పోటీపడుతున్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా ఉన్నతాధికారులపై వత్తిడి తెస్తున్నారు. వారిలో గతంలో తాడేపల్లిగూడెం, రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన శరత్‌కుమార్ ప్రస్తుతం విశాఖపట్నంలోని కార్పొరేట్ కార్యాలయంలో వాణిజ్య విభాగం జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కావడంతో ఇక్కడ ఎస్‌ఈ పోస్టు తనకు ఇవ్వాల్సిం దిగా సీఎండీకి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రాష్టానికి చెందిన ఓ మహిళా మంత్రి ద్వారా సీఎండీకి సిఫార్సు చేయించుకుంటున్నారు.
 
 శరత్‌కుమార్ విజ్ఞప్తి చేసిన మాట వాస్తవమేనని కొద్దిరోజుల క్రితం సీఎండీ సైతం అంగీకరించారు.  శరత్‌కుమార్‌తోపాటు మరో అధికారి ఎం.సత్యనారాయణమూర్తి కూడా ఏలూరు ఎస్‌ఈ పోస్టు కావాలంటున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ కార్యాలయంలో డీఈగా ఉన్న మూర్తికి పదోన్నతి కల్పించి విశాఖపట్నం ఎస్‌ఈగా నియమించారు. అయితే, ఆయన  ఏలూరు వచ్చేందుకే మక్కువ చూపిస్తున్నారు. దానికోసం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా సీఎండీపై వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇక సూర్యప్రకాష్ స్థానంలో నియమితులైన సత్యనారాయణరెడ్డి కూడా జిల్లాకు చెందిన ఓ ఎంపీ సహకారంతోనే ఇక్కడి పోస్టును దక్కించుకున్నట్లు చెబుతున్నారు. చివరి నిమిషంలో బదిలీ నిలిచిపోవడంతో ఆయన మరోసారి ఆ ఎంపీని ప్రసన్నం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
 ముంపు మండలాల్లో సమస్యలను పరిష్కరించండి మహాప్రభో
 కుక్కునూరు : పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల సమస్యలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, వెంటనే సమస్యలను పరిష్కరిం చాలని సీపీఐ(ఎంఎల్) డివిజన్ కమిటీ సభ్యుడు ఎస్‌కె.గౌస్ సోమవారం డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించి తెలంగాణ ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ఈ మండలాలలో రేషన్ పంపిణీ, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. గోదావరి జిల్లాల అధికారులు ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
 
 ఆర్‌ఐ, వీఆర్వోల సస్పెన్షన్
 కొవ్వూరు: ఈ నెల 25న ఓ రైతు నుంచి రూ.3 వేలులంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కె.నల్లరాజు, వీఆర్వో దుర్గారావులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్టు తహసిల్దార్ జి.కనకరాజు సోమవారం తెలి పారు. వేములూరుకు చెందిన సున్నం వీర ెంకట సుబ్రహ్మణ్యాచార్యులు అనే రైతు నుంచి రూ.3 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆర్‌ఐ, వీఆర్వో, రిటైర్డ్ వీఆర్వోలు పట్టుబడిన విషయం తెలిసిందే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement