ధర దడలు | Price palpitations | Sakshi
Sakshi News home page

ధర దడలు

Published Sat, Dec 28 2013 2:09 AM | Last Updated on Sat, Jul 6 2019 3:22 PM

Price palpitations

నిత్యావసర సరుకులు.. గ్యాస్.. పెట్రోల్.. డీజిల్ ధరలు.. ఆర్టీసీ.. విద్యుత్ చార్జీల పెరుగుదలతో ఈ ఏడాది జిల్లాలో సగటు జీవి చుక్కలు చూశాడు. కూరల ధరలు గాయాలను మిగల్చగా.. ఉల్లి ధర కన్నీళ్లు పెట్టించింది. సన్న బియ్యం ధర కొండెక్కడంతో జనం కుదేలయ్యారు. దీపావళి టపాసుల ధరలను చూసి కొనేందుకు  వెనుకడుగు వేశారు. ఈ రకంగా అన్నిరకాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులపై పెనుభారాన్ని మోపాయి. ఓ వైపు సమైక్యాంధ్ర ఉద్యమంతో పనులు లేక.. మరోవైపు పెరిగిన ధరలు భరించలేక..  సామాన్య, మధ్య తరగతి ప్రజలు పండగలు, పబ్బాలకు కూడా దూరమయ్యారు.   -సాక్షి / ఏలూరు
 
  పెట్రోల్ మంట
 పెట్రోల్ ధర జూన్ 15న లీటరుకు రూ.2 పెంచగా, పన్నులతో కలిపి రూ.2.60  పెరిగింది. రెండోసారి జూన్ 28న మరోసారి రూ.1.80 మేర పెంచడంతో పన్నులతో కలిపి రూ. 2.40 పెరిగింది. మూడోసారి లీటరుకు రూ.1.55 పెంచగా, పన్నులతో కలిపి రూ.2.15 పెరిగింది. ఏడాది ప్రారంభంలో పెట్రోల్ లీటరు ధర రూ. 72.65 ఉండగా ప్రస్తుతం రూ. 77.67కు చేరింది. డీజిల్ ధర రూ.52 ఉండగా నెలకు రూ. 0.50 వంతున ఆయిల్ కంపెనీలు పెంచాయి. దీంతో జిల్లాలో సుమారు 5 లక్షల ద్విచక్ర, ఆటోలు, కార్లు తదితర వాహన దారులపై భారం పడింది.
 
 
  విద్యుత్ షాక్
 జిల్లాలోని 11,81,672 మంది విద్యుత్ వినియోగదారులపై రూ.103.88 కోట్ల సర్‌చార్జీల భారం పడింది. పరిశ్రమలు బయట నుంచి విద్యుత్ కొనాలంటే యూనిట్‌కు 132 కేవీ లైన్‌పై  సర్వీసులు రూ.13.84, 33 కేవీ లైన్ సర్వీసులు రూ.14.33, 11 కేవీ లైన్ సర్వీసులు రూ.14.96 చొప్పున చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. డిస్కంలు  దీనినే రూ.4.50 నుంచి రూ.6.60కు సరఫరా చేస్తున్నాయి. ఏప్రిల్‌లో యూనిట్‌కు రూ.0.50 పైసలు నుంచి రూ.0.70 పైసలు విద్యుత్  చార్జీలు పెంచారు. ఉచిత విద్యుత్ కు సర్వీస్ చార్జీని నెలకు రూ.20 నుంచి రూ.30కు పెంచారు. జిల్లాలో 83 వేల సర్వీసులు ఉన్న రైతులు రూ.66 లక్షల 40 వేలను నెలకు రూ.20 చొప్పున చెల్లించాలంటూ నోటీసులిచ్చారు. 
 
  గుది ‘బండ’
 గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర 
 రూ. 403 నుంచి రూ. 416.50కు పెరిగింది. బ్లాక్ మార్కెట్‌లో
 సిలిండర్ ధర రూ.850 నుంచి రూ.1050 వరకూ 
 ప్రాంతాన్ని బట్టి విక్రయిస్తున్నారు. పండగల వేళ ఈ ధర 
 రూ. 1,500 వరకు పలుకుతోంది. ఏడాదికి తొమ్మిది
 సబ్సిడీ సిలిండర్లను మాత్రమే సరఫరా చేస్తున్నారు.
 సబ్సిడీ లేని సిలిండర్‌పై రూ.46.50 ధర పెంచారు. 
 జిల్లాలో గ్యాస్ వినియోగదారులపై ఈ ఏడాది 
  రూ. 4 కోట్ల భారం పడింది. 
 
  బియ్యం.. ప్రియం
 బియ్యం ధరలు కొండెక్కాయి. కొత్త బియ్యం ధరలు హోల్‌సేల్‌లో  సోనా మసూరి 25 కిలోల బస్తా రూ.700, రిటైల్‌లో రూ.775, స్వర్ణ బస్తా రూ.525, రిటైల్‌లో రూ.570, పీఎల్ రూ.600, రిటైల్‌లో రూ.675గా అమ్మారు. పాత బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. సోనా మసూరి ధర 25 కిలోల బస్తా రూ. 1,200 నుంచి రూ. 1,500 వరకు రకాన్ని బట్టి పెరిగింది. అన్ని రకాల బియ్యం ధరలు బస్తాకు సుమారు రూ. 200 వరకు పెరిగాయి.  దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు సన్న బియ్యం పేరు చెబితే హడలిపోయే పరిస్థితి వచ్చింది. 
 
  ఆర్టీసీ బాదుడు
 ఆర్టీసీ ఈ ఏడాది నవంబర్‌లో చార్జీలు పెంచింది. జిల్లాలో 630 బస్సుల్లో కిలోమీటరుకు రూ.4 పైసల నుంచి రూ.15 పైసల వరకూ చార్జీ పెరిగింది. జిల్లా ప్రయాణికులపై నెలకు రూ.1.20 కోట్ల భారం పడింది. పల్లె వెలుగు బస్సులో మినిమమ్ చార్జీను మినహా మిగతా స్టేజీలకు చార్జీలను పెంచేశారు. 
 
  వినోదమూ భారమే
 సినిమా టికెట్ ధరలు పెరి గాయి. ఏలూరు, భీమవరం లో బాల్కనీ రూ.60 నుంచి రూ.75కు పెంచారు. పార్కిం గ్ ధర సైకిల్‌కు రూ. 5, బైక్‌కు రూ.10 వసూలు చేస్తున్నారు. గతేడాది సైకిల్‌కు రూ. 3, బైక్‌కు రూ.5 చొప్పున పార్కింగ్ చార్జీ ఉండేది.  
 
  ద్విచక్ర  వాహనాలు కొనలేం
 ద్విచక్రవాహనాల ధరలు పెరిగాయి. 100 సీసీ మోటార్‌సైకిల్ ధర రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు, 150 సీసీ బైక్‌ల ధర రూ. 4 వేల వరకు, లేడీస్ మోపెడ్స్ ధర రూ. 2 వేల వరకు పెరిగాయి.
 
  అద్దె భారం
 పెరిగిన ఇంటి అద్దెలతో వేతన జీవులు ఈ ఏడాది సతమతమయ్యారు. జిల్లాలో ఏలూరు నగరంతోపాటు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పాల కొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో ఇంటి అద్దెలు 10 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. అపార్ట్‌మెంట్లు, దుకాణాల అద్దెలు కూడా పెరిగాయి. 
 
  వెజ్ పైకి.. నాన్‌వెజ్ దిగువకు
 తుపాన్లు, భారీ వర్షాలతో కూరగాయల ధరలు కొండెక్కాయి. ఓ దశలో ఉల్లిపాయలు కిలో రూ.80, అల్లం రూ.280, వంకాయ రూ.100, టమోటా రూ.100, బంగాళాదుంపలు రూ.33 కు చేరాయి. అదే సమయంలో చికెన్ ధర కిలో రూ. 70కు దిగొచ్చింది. కోడిగుడ్డు ధర రికార్డు స్థాయిలో రూ.3.65 పైసలకు పెరిగింది. నిత్యావసర సరుకుల ధరలు భారీగానే పెరిగాయి. కందిపప్పు, మినప్పప్పు, పంచదార, వంట నూనెల ధరలు ఆకాశన్నంటాయి. కిలోకు రూ. 6 నుంచి రూ. 15 వరకు పెరుగుదల కనిపించింది.
 
  టపాసులతో తంటా
 దీపావళి బాణసంచా ధరలు 10 నుంచి 30 శాతం పెరి గాయి. ఏటా జిల్లాలో టపాసుల వ్యాపారం రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఉంటుంది. అయితే ఈ ఆశిం చినంతగా వ్యాపారం జరగలేదు. 
 
  వన్నె తగ్గిన బంగారం
 అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల క్షీణత, సామాన్యులకు కొంత ఊరట కలిగించినా మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. ఒకానొక సమయంలో బంగారం ధర గ్రాము రూ.1,800కు చేరింది. ప్రత్యేక రోజుల్లో జిల్లాలో సుమారు రూ.50 కోట్ల మేర బంగారం కొనుగోళ్లు జరిగాయి. జిల్లాలో నెలకు బంగారంపై సుమారు రూ.150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు వ్యాపారం జరిగింది. బంగారం ధర లో హెచ్చుతగ్గులతో పెట్టుబడిదారులు సుమారు రూ.300 కోట్ల వరకు నష్టపోయినట్టు మార్కెట్ వర్గాలు అంచనా. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement