బియ్యం ధరలు పైపైకి.. | rice price going to high in karimnagar | Sakshi
Sakshi News home page

బియ్యం ధరలు పైపైకి..

Published Sat, Jan 13 2018 7:26 AM | Last Updated on Sat, Jan 13 2018 7:26 AM

rice price going to high in karimnagar - Sakshi

బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం ధరలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అంతకంతకూ సన్న బియ్యం ధరలు భారీగా పెరుగుతూ సామాన్యుడికి భారంగా మారాయి. ధరలను నియంత్రించకపోగా వ్యాపారుల ఆగడాలు శృతిమించుతున్నాయి. ఫలితంగా సన్న బియ్యం అమ్మకాల దందా జోరుగా సాగుతోంది. సుడిదోమతో ధాన్యం దిగుబడి తగ్గిపోవడాన్ని ఆసరాగా చేసుకుని ధరలు పెంచడమే గాకుండా అటు రైసుమిల్లర్లు, ఇటు వ్యాపారులు కుమ్మక్కై బియ్యంపై 5 శాతం జీఎస్టీ పన్నును తగ్గించకుండానే విక్రయాలు జరుపుతూ దోపిడీ చేస్తున్నారు. – కరీంనగర్‌సిటీ

కరీంనగర్‌సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో సన్న రకాలు సాగయ్యాయి. జైశ్రీరాం, హెచ్‌ఎంటీ, బీపీటీ ఎక్కువగా ఉన్నాయి. వరికి సుడిదోమ ఆశించడం వల్ల ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 10 నుంచి 15 క్వింటాళ్ల లోపే వచ్చింది. 2.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా వేస్తే 1.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సుడిదోమ కారణంగా దిగుబడి తగ్గిన విషయాన్ని అవకాశంగా తీసుకుని వ్యాపారులు ధర పెంచేస్తున్నారు. ధరల కట్టడి తమ పరిధిలోకి రాదంటూ ప్రభుత్వశాఖల అధికారులు తప్పించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఇతర రాష్ట్రాలు, జిల్లాల వ్యాపారులు జిల్లాలో వాలిపోయి పంట రైతుల చేతికి అందగానే తీసుకెళ్లిపోయారు. మహారాష్ట్ర, గుజరాత్, గుంటూరు తదితర జిల్లాల నుంచి వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. ఖరీఫ్‌లో సాగైన సన్నరకాలను ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదు. కేవలం దొడ్డురకాలను మాత్రమే కొనుగోలు చేసింది. దీంతో సన్నరకాలను వ్యాపారులు కొనుగోలు చేశారు. క్వింటాలుకు రూ.1900 నుంచి రూ.2200 వరకు చెల్లించారు. క్వింటాలు ధాన్యం మర ఆడిస్తే 65 నుంచి 70 కిలోల వరకు బియ్యం వస్తుంది. కొరతను బూచీగా చూపి ధరలను అమాంతం పెంచారు. ధరలను సమీక్షించాల్సిన అధికారులు ఆ దిశగా చొరవ చూపకపోవడంతో వ్యాపారుల ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. సన్నబియ్యానికి ధరలు పెరగడంతో కొంత మంది మిల్లర్లు రేషన్‌ బియ్యాన్ని మరాడించి పాలిష్‌ చేసి సన్నబియ్యం అంటూ అంటగడుతున్నారు. ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చే రూపాయి కిలో బియ్యాన్ని వ్యాపారులు కిలోకు 8 నుంచి 10 రూపాయలు చెల్లించి తీసుకుంటున్నారు. వాటిని సన్న బియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బియ్యం వ్యాపారులు ఇష్టమొచ్చిన ధరలకు విక్రయిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

5 శాతం తగ్గించకుండానే విక్రయాలు..
దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలులో ఉండాలని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది. మధ్యతరగతి జనాలపై భారం పడరాదన్న ఉద్దేశంతో గతంలో బియ్యంపై ఉన్న ఐదు శాతం పన్నును పూర్తిగా ఎత్తివేసింది. కానీ.. వ్యాపారులు మాత్రం బియ్యంపై ఈ పన్ను తగ్గించకుండా గతంలో ఉన్న ధరకు విక్రయించడమే కాకుండా.. నాణ్యత పేరుతో మరింత ధరలను పెంచేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నారు. రైస్‌మిల్లులే అడ్డాగా ఈ దందా కొనసాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది జూలై నుంచి అమల్లోకి వచ్చిన వస్తుసేవల పన్ను ప్రకారం క్వింటాల్‌ బియ్యం ధర 400 నుంచి 500 రూపాయల వరకు తగ్గించాలి. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఉమ్మడి జిల్లాలో బియ్యం వ్యాపారులు మాత్రం ధరలు తగ్గించకుండా మరింత పెంచేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో బీపీటీ పాతవి రూ.3,500, బీపీటీ కోదాడ రకం క్వింటాలుకు రూ.3,600, జైశ్రీరాం క్వింటాలుకు రూ.4,500 నుంచి రూ.4,700 వరకు, హెచ్‌ఎంటీ 4 వేల నుంచి రూ.4,200 వరకు విక్రయిస్తున్నారు. గతేడాది జైశ్రీరాం బియ్యం పాతవి రూ.4,400 ఉండగా కొత్తవి రూ.3,400 వరకు విక్రయించారు. హెచ్‌ఎంటీ పాతవి రూ.4,200, కొత్తవి రూ.3,200 వరకు విక్రయించారు. బీపీటీ పాతవి 3,900 ఉండగా కొత్తవి 3,100 వరకు విక్రయించారు. ఉమ్మడి జిల్లాలో 33 లక్షల జనాభాలో సగానికిపైగా సన్నబియ్యాన్నే వినియోగిస్తున్నారు. రోజువారీగా పెద్దమొత్తంలో సన్నబియ్యం అమ్ముడవుతున్నాయి. క్వింటాలుకు అదనంగా 500 చొప్పున వసూలు చేస్తుండడం వినియోగదారులపై రోజువారీగా 2 లక్షల రూపాయలపైనే భారం పడుతోంది. నెలకు 60 లక్షలు వరకు భారం పడుతోందని అంచనా.

పుట్టగొడుగుల్లా నాన్‌బ్రాండ్‌లు..
ఉమ్మడి జిల్లాలో హోలోగ్రామ్‌ ఉన్న బియ్యం బ్రాండ్లు ఒక్కటి కూడా లేదని ఆయా శాఖల అధికారులే చెబుతున్నారు. హోలోగ్రామ్‌ లేకుండా, బ్రాండ్‌రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవి కూడా లేవు. మార్కెట్‌లోకి మాత్రం వివిధ పేర్లతో పదుల సంఖ్యలో నాన్‌బ్రాండ్‌లు పుట్టుకొస్తున్నాయి. రిజిస్ట్రేషన్, హోలోగ్రామ్‌లు లేని రకరకాల సంచులను తయారు చేసి నాణ్యమైన బియ్యమంటూ వినియోగదారులకు అంటగడుతున్నారు. హోలోగ్రామ్‌ అంటేనే నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం సరుకులను విక్రయించాల్సింటుంది. ప్రమాణాల ఉల్లంఘన జరిగితే సంబంధిత విక్రయదారులపై కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నిబంధనల ప్రకారం సూపర్‌ క్వాలిటీ బియ్యాన్ని కిలో 30 మించి బహిరంగ మార్కెట్‌లో విక్రయించరాదు. ఇది ఎక్కడా అమలు కావడం లేదు. వ్యాపారులు సంచులపై ఎక్కడా కూడా ఎంఆర్‌పీ ధరలు ప్రచురించడం లేదు. 25 కిలోల బియ్యం బస్తాను 1200 వరకు విక్రయిస్తున్నారు. ఈ లెక్కన క్వింటా బియ్యం ధర ఏకంగా 4800 వరకు చేరుతుంది. ఇలా వ్యాపారులు బియ్యాన్ని పాత ధరకే విక్రయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు.

మిలర్లు, వ్యాపారులు కుమ్మక్కు..
రైస్‌మిల్లర్లు, బియ్యం వ్యాపారులు కుమ్మక్కై బియ్యంపై 5 శాతం పన్ను తగ్గించకుండా విక్రయిస్తూ దందా సాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. రైస్‌మిల్లులే దందాకు అడ్డాగా మారుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు పండించిన సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసి మరాడించి రంగు రంగుల సంచుల్లో నింపి విక్రయిస్తున్నారు. మరికొందరు దొడ్డుబియ్యాన్నే రీసైక్లింగ్‌ చేసి సన్నబియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు. రెండు రకాల బియ్యాన్ని ఒకే సంచిలో కలిపి సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని ఇష్టం వచ్చిన బ్రాండ్ల పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చి వ్యాపారుల ద్వారా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కిరాణా దుకాణాల మాదిరిగా బియ్యం దుకాణాలు గల్లీ గల్లీకి వెలుస్తుండడం అక్రమ దందాకు బలం చేకూరుస్తోంది. దుకాణంలో ఎంత మేర నిల్వ చేసుకోవాలి..? లైసెన్స్‌ తీసుకోవడం..? పన్ను చెల్లించడం వంటి నిబంధనలేవీ కానరావడం లేదు. అమాయక ప్రజలను తేలికగా మోసం చేసే ఈ దందాలో అధికారులకూ వాటా ఉందని తెలుస్తోంది. పర్యవేక్షించాల్సిన అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో నిలువు దోపిడీకి అడ్డులేకుండా పోతోందని సామాన్యులు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement