ఎరువులు
సాక్షి, కరీంనగర్: వర్షాభావం.. నీరందక ఎండిపోతున్న పైర్లు.. బతికి బట్టకట్టిన పంటలకు తెగుళ్లు.. ఖరీఫ్ సీజన్‌లో దిగుబడి లేక దిగాలు పడుతున్న రైతులకు రబీ సీజన్‌లో కూడా కష్టాలే ఎదురుకానున్నాయి. రబీకి రైతన్నలు సిద్ధం కాకముందే ఎరువుల రూపంలో ప్రతికూలతలు ఎదురయ్యాయి. డీజిల్ ధరలు పెరగడంతో సాగు వ్యయం పెరిగి గిట్టుబాటు కాని వ్యవసాయం చేసే రైతులకు ఎరువుల ధరలు మరింత భారం కానున్నాయి. రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ప్రతీ ఏడాది రైతు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు.
గతేడాది వర్షాలు సకాలంలో కురియకపోవడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో రైతులు అప్పులపాలయ్యారు. ఈ ఖరీఫ్ సీజన్ జూన్ మొదటి వారంలో వర్షాలు కురిసినప్పటికీ ఆ తర్వాత దాదాపు 10 రోజులపాటు వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో నష్టపోయారు. దీనికితోడు ఎరువుల ధరలను అయా కంపెనీలు పెంచేశాయి. ఇక పెట్టుబడి భారం మరింత పెరుగనుంది. పంటల దిగుబడి పెరగాలనే ఉద్దేశంతో రైతులు
దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వినియోగిస్తారు. ఇదే అదునుగా భావించిన కంపెనీలు ఒక్కో బస్తాపై రూ.95 నుంచి రూ.170 వరకు పెంచాయి. ఈ ఏడాదిలో ఇప్పటికి మూడు సార్లు ధరలను పెంచారు. ఒక్కో రైతుపై దాదాపు రూ.4 వేల వరకు అదనపు భారం పడనుంది.
పెరుగుతున్న ఎరువుల వాడకం..
జిల్లాలో 2.1 లక్షల హెకార్ల సాగు విస్తీర్ణం కాగా.. లక్షా 25 వేల హెక్టార్లలో పత్తి సాగు, 20 వేల హెక్టార్లలో సోయా, 15 వేల హెక్టార్లలో కందులు, 7 వేల హెక్టార్లలో జొన్న, 3 వేల హెక్టార్లలో చిరుధాన్యాలు, 2 వేల హెక్టార్లలో పెసరి పంటలు సాగు చేశారు. అయితే.. జిల్లాకు 36 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 14 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 5 వేల మెట్రిక్ టన్నుల పొటాష్, 20 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం. ఎరువుల ధరల పెరుగుదల రైతుల మెడపై గుదిబండగా మారాయి.
ప్రభుత్వం పెట్టుబడి సహాయం కింద ఎకరానికి రూ.4 వేలు ఇవ్వడంతో సంతోషంలో ఉన్న రైతులకు పురుగుల మందుల ధరలు, ఎరువుల ధరలు పెరగడంతో మోయలేని భారంగా మారింది. డీఏపీ ధర ఎక్కువ పెరగడంతో దీని వాడకం తగ్గించి యూరియా, ఇతర ఎరువుల వాడకం పెంచారు. దీంతో ఎరువుల సమతూల్యత తగ్గి పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment