ఎరువు సంచులు
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందగా మారింది.. రైతుల పరిస్థితి. ప్రతి ఏడాది రైతు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. గత ఏడాది వర్షాలు సకాలంలో కురియకపోవడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో అప్పులపాలయ్యారు. ఈ ఖరీఫ్ సీజన్ ఆగస్టులో భారీ వర్షాలు కురువడంతో జిల్లాలో 24 వేల హెక్టార్లలో పత్తి, సోయా పంటలు నష్టపోయారు. దీనికి తోడు ప్రస్తుతం అయా కంపెనీలు ఎరువుల ధరలు పెంచేశాయి. దీంతో రబీ పంటల పెట్టుబడి భారం మరింత పెరుగనుంది. పంటల దిగుబడి పెరగాలనే ఉద్దేశంతో రైతులు దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వినియోగిస్తారు. ఇదే అదునుగా భావించిన కంపెనీలు ఒక్కో బస్తాపై రూ.100 నుంచి రూ.275 వరకు పెంచాయి.
ప్రతి సంవత్సరం ఎరువుల ధరలను పెంచుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికి మూడు సార్లు ధరలను పెంచారు. 2017 మార్చిలో ధరలు పెంచగా ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్‌లో ధరలు పెరిగాయి. ప్రస్తుతం మరోసారి ధరలను పెంచి రైతులను కోలుకోకుండా చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతుపై దాదాపు రూ.5వేల వరకు అదనపు భారం పడనుంది. యూరియా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండడంతో ధరను పెంచడానికి వీలు లేదు.
అన్నదాతకు గుదిబండ..
జిల్లాలో రబీ సాగు విస్త్రీర్ణం 23 హెక్టార్లలో సాగయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 18వేల హెక్టార్లలో శనగ, వెయ్యి హెక్టార్లలో వేరుశనగ, 2వేల హెక్టార్లలో జోన్న, 500 హెక్టార్లలో మొక్కజోన్న, 1500 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రబీ పంటల కోసం 9వేల మెట్రిక్ టన్నుల యూరియా, 4,500 టన్నుల డీఏపీ, 2300 మెట్రిక్ టన్నుల ఎంఓపీ, 6500 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం.
ఎరువుల ధరల పెరుగుదల రైతుల మెడపై గుదిబండగా మారాయి. పొటాష్ ధర బస్తాకు రూ.675 నుంచి రూ.950, డీఏపీ ధర రూ.1290 నుంచి రూ.1425కు పెరిగింది. డీఏపీ ధర ఎక్కువ పెరగడంతో దీని వాడకం తగ్గించి యూరియా, ఇతర ఎరువుల వాడకం పెంచనున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో ఎరువుల సమత్యులత తగ్గి పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment