కిరోసిన్ 'మండుతోంది'
కిరోసిన్ 'మండుతోంది'
Published Mon, Sep 19 2016 3:14 PM | Last Updated on Sat, Jul 6 2019 3:22 PM
రేషన్ కిరోసిన్ ధర రూ.2 పెంపు
జిల్లా పేదలపై నెలకు రూ.20 లక్షల భారం
నెన్నెల : పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న నీలి కిరోసిన్ ధర లీటర్‌కు రూ.2 పెరిగింది. దీంతో నెలకు జిల్లాలోని పేదలపై రూ.20 లక్షల మేర అదనపు భారం పడుతోంది. ఏడాదికి ఈ భారం రూ.2.40 కోట్లుగా ఉండనుంది. ఈ నెల నుంచి రేషన్ కిరోసిన్ లీట ర్‌కు రూ.17గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు వరకు ఈ ధర రూ.15 ఉండేది. ఈ నెల నుంచి లీటరుకు రూ. 2 పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ముందు పెట్రోల్, డీజిల్ ధరలు లాగే రేషన్ దుకాణాల్లో ఇస్తున్న నీలి కిరోసిన్ ధరలో కూడా హెచ్చుతగ్గులూ ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికే కిరోసిన్‌పై లీటరు ఒక్కంటికి రూ.18 సబ్సిడీ భారాన్ని భరిస్తోంది. వినియోగదారుల నుంచి రూ.17 మాత్రమే వసూలు చేస్తోంది. ఇక భవిష్యత్తులో కిరోసిన్ సబ్సిడీ మొత్తాన్ని ప్రతీ నెల నగదు బదిలీ రూపేనా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో ప్రతి నెల 9.50 లక్షల లీటర్లకు పైగా కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. ఈ లబ్ధిదారులు సుమారు 20 లక్షల మంది వరకు ఉన్నారు. పెరిగిన ధరలో నెలకు పేదలు రూ.20 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అయితే గత 20 సంవత్సరాల నుంచి కూడా కిరోసిన్ పంపిణీ చేస్తున్న రేషన్ షాపు డీలర్లకు మాత్రం కమీషన్ పెంచడం లేదు. లీటరు ఒక్కంటికి 25 పైసలు కమీషన్ మాత్రమే చెల్లిస్తున్నారు. కిరోసిన్ ధర వంద శాతం పెరిగినా కమీషన్ మాత్రం పెరగలేదు. దీంతో ఆవిరిరూపంలో తగ్గిన కిరోసిన్ నష్టాన్ని డీలర్లు భరించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిలో కొన్ని చోట్ల నీలి కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోవడానికి పరోక్షంగా ప్రభుత్వమే కారణమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Advertisement