రైతులకు లభించని ‘మద్దతు’
- పంటలకు మద్దతు ధర కరువు ఆదుకోని ప్రభుత్వ రంగ సంస్థలు
- దళారులను ఆశ్రయించి నష్టపోతున్న రైతులు
ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కరువైంది. పంట దిగుబడులను మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామనే హామీలు ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని చేతి కొచ్చిన పంటలను మార్కెట్‌కు తరలిస్తే గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో సాగు చేసిన శెనగ, వరి, మొక్కజొన్న, కందులు తదితర పం టలను మార్కెట్‌యార్డులకు తరలిస్తే ప్రభుత్వ మద్దతు ధర లభించక.. పెట్టుబడులు రాక నష్టాలు చవిచూస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు వివిధ గ్రామాల్లో ఐకేపీ, డీసీఎంఎస్, పీఎస్‌యూ ద్వారా 155 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ మండలాల్లో అందుబాటులో లేక రైతులు వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు సీసీఐ, ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్, నాఫెడ్, డీసీఎంఎస్ మార్కెట్ అధికారుల ఒత్తిడి మేరకు మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా 20 నుంచి 25 రోజులే కొనుగోలు చేస్తున్నారు. సమయపాలన పాటించకపోవడంతో రైతులు వెనుదిరగాల్సి వస్తోంది. గత సంవత్సరం సీసీఐ 52,02,111 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది. ఈయేడాది 26,459 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది.
మార్క్‌ఫెడ్, నాఫెడ్, డీసీఎంఎస్ ద్వారా క్వింటాల్ కందులకు మద్దతు ధర రూ.4300తో నెలరోజులు కొనుగోలు చేసి నిలిపివేశారు. దీంతో వ్యాపారులకు రూ.3500 నుంచి రూ.3700లకు అమ్మి నష్టపోతున్నారు. శెనగలు గత నెలలో ప్రభుత్వ రంగ సంస్థలు మద్దతు ధర రూ.3100తో 25 రోజులు కొనుగోలు చేసి నాణ్యత లేమి పేరిట నిలిపివేశాయి. దీంతో వ్యాపారులను ఆశ్రయించి రూ.2200 నుంచి రూ.2400 క్వింటాల్ చొప్పున విక్రయించి నష్టపోతున్నారు. వరి ధాన్యం ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీయూ ద్వారా ఏ-గ్రేడ్‌లో క్వింటాలుకు రూ.1345, బీ-గ్రేడ్ రూ.1310 కొనుగోలు చేస్తున్నా.. పలు గ్రామాల్లో అందుబాటులో లేక వ్యాపారులకు రూ.1150 నుంచి రూ.1250 వరకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్నారు. మొక్కజొన్న రూ.1310కు కొనుగోలు చేయాల్సి ఉండగా మార్కెట్‌లో ఆ ధర లభించక రూ.1200లకే అమ్ముతున్నారు.
పత్తి క్వింటాలుకు మద్దతు ధర రూ.4వేలు ఉన్నా.. మార్కెట్‌లో అధికంగా రూ.300 నుంచి రూ.400 లభిస్తుంది. ఇప్పటికే 90 శాతం మంది రైతులు పత్తిని విక్రయించారు. అధిక ధర వస్తుందని కొందరు బడా రైతులు ఇళ్లలో నిల్వ చేసిన పత్తికి రూ.4,300 నుంచి రూ.4,450 వరకు ధర పలుకుతోంది. క్వింటాలు మక్కలకు మద్దతు ధర కంటే రూ.150 నుంచి రూ.200 వరకు ధర తక్కువగా వస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. శెనగలకు రూ.700 నుంచి రూ.850 వరకు ధర తక్కువగా లభిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులు చొరవ తీసుకుని మద్దతు ధర దక్కేలా చూడాలని రైతులు కోరుతున్నారు.