Farmers Market system
-
Kavita Shukla: అమ్మమ్మ ఇంట్లో వచ్చిన ఐడియా జీవితాన్నే మార్చేసింది!
సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళితే ఏం దొరుకుతుంది? అంతులేని ఆనందం. అయితే అమెరికా నుంచి ఇండియాలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన కవితా శుక్లాకు ఆనందంతో పాటు ‘ఐడియా’ కూడా దొరికింది. ఆ ఐడియా ఆమెను ఇన్వెంటర్ని చేసింది. ఆ తరువాత ఎంటర్‌ప్రెన్యూర్‌ను చేసింది. ఇన్వెంటర్, ఎంటర్ప్రెన్యూర్, మోటివేషనల్ స్పీకర్, డిజైనర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది కవితా శుక్లా... చిన్నప్పటి నుంచి సైన్స్, కళలు అంటే కవితకు ఆసక్తి. సైన్స్‌లో రకరకాల ప్రయోగాలు చేసేది. తాను ఇన్నోవేటర్ కావడానికి ఆ ప్రయోగాలు పునాదిగా ఉపయోగపడ్డాయి. పదిహేడు సంవత్సరాల వయసులోనే ఎన్నో పేటెంట్లు తీసుకుంది. ‘ఫ్రెష్‌పేపర్’ రూపంలో ఆహార వ్యర్థాలను తగ్గించే సాంకేతిక ఆవిష్కరణ కవితకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చింది. ఈ ఫ్రెష్ పేపర్ ఆహారం, కూరగాయలలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను నిరోధించి వాటిని ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది. బోస్టన్లోని స్థానిక రైతు మార్కెట్ లో ఫ్రెష్ పేపర్ లాంచ్ చేశారు. మౌత్‌టాక్‌తోనే ఈ పేపర్ పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ ఫ్రెష్‌పేపర్ 180 దేశాల్లో అందుబాటులో ఉంది. ‘యూఎస్‌లో ఆహార వృథా అనేది ఇంత పెద్ద సమస్య అని తెలియదు. ఫ్రెష్పేపర్కు వచ్చిన స్పందన నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. పండ్లు, కూరగాయలు, ఆహారాన్ని తాజాగా ఉంచడానికి తద్వారా ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. లోకల్ఫుడ్ బ్యాంకులకు వీటిని విరాళంగా ఇచ్చాం’ అంటుంది కవిత. ఫుడ్ ప్రిజర్వేషన్‌కు సంబంధించిన ఆసక్తి కవితలో పదమూడు సంవత్సరాల వయసు నుంచే మొదలైంది. సెలవులు వచ్చినప్పుడు ఇండియాలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది కవిత. ఒకరోజు పొరపాటున కలుషితమైన నీరు తాగింది. ఆందోళన పడిన అమ్మమ్మ వెంటనే కవితతో ఏదో కషాయం తాగించింది. దీంతో కవితకు ఏమీ కాలేదు. అమెరికాకు తిరిగిన వచ్చిన తరువాత కషాయంలో అమ్మమ్మ ఉపయోగించిన పదార్థాల గురించి వివరంగా తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆహారపదార్థాలు, కూరగాయలు చెడిపోకుండా సంరక్షించడానికి సంబంధించిన పరిశోధనలు మొదలుపెట్టింది. జర్మనీలో పుట్టిన కవిత ఇలియట్ సిటీ (యూఎస్)లో పెరిగింది. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పుచ్చుకుంది. ‘ సింపుల్ ఐడియాలకు మార్పు తెచ్చే శక్తి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు’ అంటుంది కవిత. ఆహార భద్రత, సంరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కవిత మోటివేషనల్ స్పీకర్ కూడా. ఎన్నో కాలేజీలలో, సమావేశాలలో యువతను ఉద్దేశించి ఉత్తేజకరమైన ప్రసంగాలు చేసింది. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్లు అందుకుంది. ఫోర్బ్స్ ‘30 అండర్ 30: సోషల్ ఎంటర్ ప్రెన్యూర్స్’ టైమ్ మ్యాగజైన్ ‘5 మోస్ట్ ఇనోవేటివ్ ఉమెన్ ఇన్ ఫుడ్’ న్యూస్‌వీక్ ‘125 ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ జాబితాలలో చోటు సంపాదించింది. రెండు సంవత్సరాల క్రితం వర్జీనియాలో జరిగిన వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఇండిపెంటెంట్ ఇన్వెంటర్లు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొఫెషనల్స్ సమావేశంలో కీలక ఉపన్యాసం ఇచ్చింది. ఇన్వెంటర్ అయిన కవిత ‘ఫ్రెష్ గ్లో’ కంపెనీతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా అద్భుత విజయం సాధించింది. ‘మీకు ఏదైనా ఆసక్తిగా అనిపిస్తే దాని గురించి లోతుగా ఆలోచించండి. ఆ తరువాత పరిశోధించండి. ఫలితాలు చేతికి అందేవరకు ప్రయోగాలు చేయండి’ అంటుంది కవిత. ఆలోచించండి... అద్భుతాలు చేయండి కష్టాల దారిలో ప్రయాణించి విజయాలు సాధించిన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ల గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. వారి గురించి సమావేశాల్లో చెబుతుంటాను. వారి విజయగాథలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తాయి. ఆలోచిస్తే ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాలతో ఎన్ని గొప్ప పనులైనా చేయవచ్చు. మన ఐడియాను మొదట ఇతరులతో పంచుకోవడానికి భయంగా అనిపిస్తుంది. ఆ భయాన్ని వదులుకొని ఆత్మవిశ్వాసంతో చెప్పండి. ఆత్మవిశ్వాసం ఉన్న చోటుకి విజయం త్వరగా వస్తుంది. – కవితా శుక్లా, ఫ్రెష్ గ్లో కంపెనీ ఫౌండర్, సీయీవో ∙చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో కవితా శుక్లా -
రైతుబజార్లలో సబ్సిడీ టమాటా
సాక్షి, అమరావతి: చుక్కలనంటుతున్న టమాటా ధరల నుంచి వినియోగదారులకు ఊరట లభిస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ.100 దాటింది. దీంతో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద రైతుల నుంచి టమాటాను సేకరించి కిలో రూ.50 చొప్పున సబ్సిడీ ధరపై వినియోగదారులకు అందిస్తోంది. తొలుత కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోని రైతుబజార్లలో సబ్సిడీ టమాటా విక్రయాలు ప్రారంభించగా.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లోని రైతుబజార్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికభారమైనప్పటికీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మదనపల్లి, పలమనేరు తదితర మార్కెట్లలో రైతుల నుంచి కిలో రూ.98 నుంచి రూ.104 చొప్పున చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇలా గడిచిన నాలుగు రోజుల్లో 95 టన్నులు సేకరించారు. శుక్రవారం 36 టన్నులు సేకరించి.. బహిరంగ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్న విశాఖపట్నం జిల్లాకు 20 టన్నులు, ఎన్టీఆర్ జిల్లాకు ఆరు, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు ఐదేసి టన్నుల చొప్పున తరలించి స్థానిక రైతుబజార్ల ద్వారా కిలో రూ.50 చొప్పున విక్రయించారు. శనివారం నుంచి రోజు 50 టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే నాలుగైదు రోజులు విశాఖ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు అన్నమయ్య, వైఎస్సార్, ప్రకాశం జిల్లాలకు స్థానిక అవసరాలకు తగినట్లు టమాటా నిల్వలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై ప్రభుత్వం నిఘా పెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులతో కూడిన బృందాల ద్వారా తనిఖీలకు శ్రీకారం చుడుతోంది. టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలను సీఎం యాప్‌ద్వారా నిత్యం సమీక్షిస్తూ ధరల నియంత్రణకు చర్యలు చేపట్టారు. -
సబ్సిడీపై టమాటా
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న టమాటా ధరల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పలుచోట్ల టమాటా రేట్లు చుక్కలను తాకుతుండటంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను రంగంలోకి దించింది. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని రైతుబజార్లలో కిలో రూ.50కే అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. వైఎస్సార్, కర్నూలు జిల్లాలలో బుధవారం శ్రీకారం చుట్టగా.. మిగిలిన జిల్లాల్లో గురువారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు నిత్యం 50–60 టన్నుల టమాటాలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మరోవైపు టమాటాతో పోటీపడుతూ ఆకాశానికి ఎగబాకుతున్న పచ్చి మిర్చిని కూడా సబ్సిడీపై వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం యాప్‌లో పర్యవేక్షణ.. పలుచోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలు టమాటా ధరలను హడలెత్తిస్తున్నాయి. వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో టమాటా ధర చుక్కలనంటుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.20–30కు మించి పలకని టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకాయి. పలు రాష్ట్రాల్లో కిలో రూ.100 దాటగా మన రాష్ట్రంలోని బహిరంగ మార్కెట్లలో ప్రస్తుతం కిలో రూ.65 నుంచి 90 మధ్య పలుకుతోంది. పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులపై భారం పడకుండా చర్యలు చేపట్టింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే, రైతుబజార్ల సీఈవో నందకిషోర్‌తో పాటు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. సీఎం యాప్ ద్వారా ధరల హెచ్చుతగ్గులను సమీక్షిస్తూ కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. టమాటాతో పాటు పచ్చి మిర్చి ధరలు కూడా వంద దాటడంతో వాటిని కూడా సబ్సిడీపై అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. టమాటా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అత్యధికంగా విశాఖలో కిలో రూ.90 ఉండగా మిగిలిన జిల్లాల్లో రూ.50–85 మధ్య ధరలున్నట్లు గుర్తించడంతో రైతుబజార్ల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. నాలుగేళ్లుగా టమాటా ధరలు పెరిగిన పలు సందర్భాల్లోనూ రాష్ట్రప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై వినియోగదారులకు అందిస్తోంది. ధరల పెరుగుదల ఎక్కువగా ఉన్న నగరాలు, పట్టణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదేవిధంగా పచ్చి మిర్చి కూడా పలు జిల్లాల్లో రూ.వంద దాటినట్టు గుర్తించారు. దీంతో మంత్రి ఆదేశాలతో పచ్చి మిర్చిని కూడా రైతుల నుంచి కొనుగోలు చేసి సబ్సిడీపై రైతుబజార్లలో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో సేకరణ ధరలు ఎగబాకడంతో టమాటా రైతన్నలకు మంచి రేటు లభిస్తోంది. రాష్ట్రంలోని మదనపల్లి, పలమనేరు, పత్తికొండ, పుంగనూరు, కలికిరి మార్కెట్లకు వస్తున్న టమాటాను పొరుగు రాష్ట్రాల వ్యాపారులు ఎగరేసుకుపోతున్నారు. బుధవారం మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో మార్కెటింగ్ శాఖ అధికారులు రైతుల నుంచి కిలో రూ.70 చొప్పున 10 టన్నుల టమాటాలు సేకరించారు. నేటి నుంచి మిగిలిన మార్కెట్లలోనూ సేకరించనున్నారు. రోజుకు కనీసం 50–60 టన్నులు తక్కువ కాకుండా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో రైతుబజార్ల ద్వారా కిలో రూ.50 చొప్పున టమాటా విక్రయాలకు బుధవారం శ్రీకారం చుట్టగా.. విశాఖ సహా మిగిలిన జిల్లాలకు గురువారం నుంచి విస్తరించాలని నిర్ణయించారు. అదుపులోకి వచ్చే దాకా సబ్సిడీపై విక్రయాలు ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కిలో రూ.100 దాటింది. ప్రధాన మార్కెట్లలో రైతుల నుంచి సేకరించి సబ్సిడీపై వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాం. ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు దీన్ని కొనసాగిస్తాం. – నందకిషోర్, సీఈవో, ఏపీ రైతుబజార్లు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఏర్పాటు ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ టమాటా అమ్మకాలకు శ్రీకారం చుడుతున్నాం. మిగిలిన చోట్ల రైతు బజార్లలో కూడా కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ టమాటా, పచ్చిమిర్చి కూడా.. మార్కెట్లో టమాటా, మిర్చి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. ధరల నియంత్రణపై స్పెషల్ సీఎస్‌తోపాటు, మార్కెటింగ్ శాఖ కమిషనర్, రైతు బజార్ల సీఈవోతో సమీక్షించాం. గురువారం నుంచి రాష్ట్రంలో ప్రధాన రైతు బజార్లలో టమాటా కిలో రూ.50కే సబ్సిడీపై అందించనున్నాం. అదేవిధంగా మిర్చిని కూడా సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
రూ.1,500 కోట్ల కేటాయించినా..రైతన్నకు పనిముట్లు అందలే
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ఒకరకంగా వ్యవసాయ యాంత్రీకరణ విప్లవం వచ్చింది. తెలంగాణ ఏర్పడక ముందు నాటి పరిస్థితితో పోల్చుకుంటే, రైతులకు యంత్రాల పంపిణీ దాదాపు రెండింతలైంది. ఈ ఏడాది రూ.10 లక్షల వరకు విలువ చేసే వరి నాటు యంత్రాలను సైతం సబ్సిడీపై అందజేయాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం బడ్జెట్లో రూ. 1,500 కోట్లు కేటాయించింది. సీజన్ ప్రారంభంలోనే రైతులకు యంత్రాలు చేతికి అందితే సాగుకు బాగా మేలు జరిగేది. కానీ ఇప్పటివరకు పనిముట్ల పంపిణీకి మార్గదర్శకాలే ఖరారు కాలేదు. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, కోత, నూర్పిడి యంత్రాలు, పవర్ టిల్లర్లు వంటి భారీ యంత్రాలతో పాటు స్ప్రేయర్ల వంటి వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై ఇచ్చేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,500 కోట్లను ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించింది. కానీ ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా రైతులకు లబ్ధి చేకూర్చడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వానాకాలం సీజన్ మొదలుకావడం, పెరిగిన నీటి వనరుల లభ్యత, పెట్టుబడి సాయం (రైతుబంధు) సైతం అందిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 30 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ సమయంలో సర్కారు లక్ష్యం మేరకు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు అందితే వారికి మరింత ఊతం లభించినట్టయ్యేది. కానీ వ్యవసాయ శాఖ ఈ దిశగా అడుగులు ముందుకు వేయకపోవడంతో, కనీసం తైవాన్ స్ప్రేయర్ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు రైతుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించాల్సిన రైతు చైతన్య యాత్రల నిర్వహణలో, రైతులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో నిర్మించిన రైతు వేదికల ప్రారంభంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఆధునికత సంతరించుకున్న సాగు వాస్తవానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వ్యవసాయ యాంత్రీకరణకు టీఆర్ఎస్ ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. 2018 వరకు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో సహా పలు రకాల యంత్రాలను సబ్సిడీపై రైతులకు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. దాదాపు 8 వేల వరకు ట్రాక్టర్లను వ్యవసాయశాఖ రైతులకు సబ్సిడీపై అందజేసింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం ఆధునికత సంతరించుకుంది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. కంపెనీలు సిద్ధంగా ఉన్నా.. గతంలో ట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో ఇచ్చినందున ఈ ఏడాది ప్రధానంగా వరినాట్లు పెట్టే యంత్రాలను సబ్సిడీపై ఇచ్చి రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఒక్కో వరి నాటు యంత్రం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉండే నేపథ్యంలో మండలానికి 10 యంత్రాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే ఇతర యంత్రాలు అందజేసేందుకు పలు కంపెనీలతో మాట్లాడింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన 5 వేలకు పైగా వరినాటు యంత్రాలను ఆయా కంపెనీలు కూడా సిద్ధం చేసి ఉంచాయి. వీటితో పాటు ఇతర యంత్రాల కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపి, నిధులు మంజూరు చేయించుకుని, రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమయ్యింది. ఇప్పటికే ఆలస్యం వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయ యంత్రాలను రైతులకు సరఫరా చేయాలి. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వరినాట్ల యంత్రాలను సరఫరా చేయాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నా అర్హులను తేల్చి పంపిణీ చేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని గతంలో ట్రాక్టర్ల పంపిణీ అనుభవాలు చెబుతున్నాయి. ఇప్పుడు వరినాట్ల యంత్రాల పంపిణీ కూడా పారదర్శక విధానంలో చేపట్టాలంటే ఖచ్చితంగా సమయం తీసుకుంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వంరూ.1,500 కోట్ల బడ్జెట్ కేటాయించినా సద్వినియోగం కాని తీరుపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతు చైతన్య యాత్రలేవీ? వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక పోకడలు, అధునాతన సాంకేతికత వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించాల్సిన రైతు చైతన్య యాత్రలు గత మూడేళ్లుగా జరగడం లేదు. ఏటా వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందు వేసవిలో 15 రోజుల పాటు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఈ యాత్రలు నిర్వహించేవారు. ప్రస్తుతం అవి జరగకపోవడంతో పంటల సాగులో వస్తున్న మార్పులపై అవగాహన లేకుండా పోతోందని రైతు సంఘాలు చెబుతున్నాయి. అధికారులు మాత్రం రైతుబంధు, రైతు బీమా పథకాల అమల్లో నిమగ్నం అవ్వడం వల్లే ఈ యాత్రలు నిర్వహించలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ప్రారంభం కాని రైతు వేదికలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు చాలాచోట్ల ప్రారంభం కాకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. రైతులంతా ఒకచోట సమావేశమై సాగు సమస్యలు చర్చించుకునేందుకు, రైతులకు అవసరమైన శిక్షణ ప్రధాన లక్ష్యంగా రైతు వేదికలు నిర్మించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,601 వేదికలను నిర్మించినా చాలాచోట్ల ఇవి ప్రారంభానికి నోచుకోలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 101 రైతు వేదికలు నిర్మించారు. అయితే పంచాయతీరాజ్ శాఖ ఇంకా ఆ భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించకపోవడంతో అవి ప్రారంభం కాలేదు. ఆసిఫాబాద్‌లో 70కి గాను 46 నిర్మాణాలు పూర్తికాగా, ఇందులో 13 ప్రారంభించలేదు. నిజామాబాద్ జిల్లాలో 103 వేదికలు నిర్మిస్తే 54, పాలమూరులో 88కి 25 ప్రారంభించారు. నారాయణపేట జిల్లాలో 77 రైతు వేదికలు నిర్మిస్తే కేవలం మూడు మాత్రమే ప్రారంభం కావడం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టం చేస్తోంది. సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ సమయంలో సర్కారు లక్ష్యం మేరకు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు అందితే వారికి మరింత ఊతం లభించినట్టయ్యేది. కానీ వ్యవసాయ శాఖ ఈ దిశగా అడుగులు ముందుకు వేయకపోవడంతో, కనీసం తైవాన్ స్ప్రేయర్ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు రైతుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించాల్సిన రైతు చైతన్య యాత్రల నిర్వహణలో, రైతులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో నిర్మించిన రైతు వేదికల ప్రారంభంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఆధునికత సంతరించుకున్న సాగు వాస్తవానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వ్యవసాయ యాంత్రీకరణకు టీఆర్ఎస్ ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. గతంలో కూలీల కొరత సమస్యను అధిగమించడంతో పాటు ఉత్పత్తి పెంపునకు దోహదపడుతుందనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు సహా పలు రకాల యంత్రాలను సబ్సిడీపై రైతులకు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. దాదాపు 8 వేల వరకు ట్రాక్టర్లను వ్యవసాయశాఖ రైతులకు సబ్సిడీపై అందజేసింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం ఆధునికత సంతరించుకుంది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో ప్రభుత్వం ఆశించినట్లుగానే పంటల ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. -
కాళ్లు మొక్కుతాం.. కందులు కొనండి
షాద్‌నగర్ టౌన్: కందులను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని.. దళారులతో చేతులు కలిపి దందా నిర్వహిస్తున్నారని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ రైతులు ఆరోపించారు. తాము తెచ్చిన కందులను కొనుగోలు చేయమని కొనుగోలు కేంద్రం ఇన్చార్జి నర్సింహారెడ్డి కాళ్లు మొక్కారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జికి, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ కందులను కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో పట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట పాత జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. పోలీసులు రైతులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. కాగా ఘటనపై విచారణ చేపడతామని ఐపీఎస్ అధికారిణి రితిరాజ్ రైతులకు హామీ ఇచ్చారు. -
సాగు సాగేదెలా..?
మెదక్‌జోన్: కాలం కలిసిరాక సాధారణం కన్నా వర్షపాతం తక్కువ నమోదైతే ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వరుస కరువు కాటకాలతో అప్పుల పాలవుతున్న రైతులు వర్షాలకోసం ఎదురుచూస్తూ దీర్ఘకాలిక పంటలైన వరి పంటలకు బదులు తేలికపాటి పంటలైన ఆరుతడి పంటలను సాగుచేస్తే అడపాదడప వర్షాలు కురిసినా, పంటలు పండుతాయనే ఉద్దేశ్యంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికే అంచనాలను వేశారు. మరో వారం రోజులపాటు వర్షం కురవకుంటే అధికారులు తయారు చేసిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాల్సిందేనని ఓ జిల్లాస్థాయి అధికారి తెలిపారు. గతేడాది ఇప్పటికే జూన్ 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. వర్షాకాల ప్రారంభంలోనే గత సంవత్సరం పుష్కలంగా వర్షాలు కురిశాయి. ఈ యేడు నేటికి చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. దీంతో కనీసం దుక్కులు సైతం ఎక్కడ కూడా దున్నలేక పోయారు. ఇప్పటికే 20 రోజుల పుణ్యకాలం గడిచిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగు అంచనా 80 వేలహెక్టార్లు.. ఈ యేడు వర్షాలు సమృద్ధిగా కురిస్తే జిల్లా వ్యాప్తంగా 80 వేల హెక్టార్లమేర సాధారణ పంటలు సాగవుతోందని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేసి అందుకు అనుగుణంగా ఎరువులు, సబ్సిడీ విత్తనాలను సైతం సిద్ధంగా ఉంచారు. అందులో 36 వేల హెక్టార్లలో వరి పంటలు, 20 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటలు, 15 వేల హెక్టార్లలో పత్తితో పాటు 9 వేల హెక్టార్లలో పొద్దుతిరుగుడు పంటలతో పాటు ఇతర పంటలు సాగు చేయటం జరుగుతుందని అంచనాలు వేశారు. నేటికి వర్షాలు కురవక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు.. జులై 31వ తేదీ వరకు సాధారణ వర్షపాతం నమోదు కాకుంటే మొక్కజొన్న పంటకు బదులు 4200 హెక్టార్లలో కంది(పీఆర్జీ 176) తేలికపాటి రకం పంటను సాగేచేసే విధంగా అధికారులు కార్యచరణ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి విత్తనాలు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. అలాగే వరిపంటకు బదులు 14,985 హెక్టార్లలో సోయాబీన్ పంటను సాగుచేసేందుకు అందుకు సంబంధించిన సోయాబిన్ విత్తనాలు సిద్ధంగా ఉంచారు. అలాగే పత్తి పంటకు బదులుగా 6085 హెక్టార్లలో నల్లరేగడి భూముల్లో వేసేందుకు కంది విత్తనాలు సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు, సాములు, కొర్రలు, విత్తనాలు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదయితే తేలికపాటి పంటలు 39000 హెక్టార్లలో పంటలును సాగుచేయాలని అందుకు సంబంధించిన విత్తనాలు సిద్ధంగా ఉంచారు. ప్రత్యామ్నాయానికి సిద్ధం.. మరో 20 రోజుల్లో సరిపడా వర్షాలు కురవకుంటే ప్రత్యామ్నాయ పంటలు సాగు కోసం రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు ముందస్తుగానే కార్యచరణ పూర్తిచేశాం. ఇందుకు సంబంధించిన విత్తనాలను సైతం సిద్ధంగా ఉంచాం. వర్షాలు పుష్కలంగా (సరిపడ) కురిస్తేనే ముందస్తు అంచనాల మేరకు జిల్లాలో 80 వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. లేనిచో అడపాదడప వర్షాలు కురిస్తే ప్రత్యామ్నాయ పంటల మేరకు తేలికపాటి పంటలైన 39,000 వేల హెక్టార్లలోనే పంటలను సాగు చేయాల్సి వస్తోంది. ఈ విషయంపై రైతులు తొందర పాటుతనంతో విత్తనాలు వేయొద్దు – పరశురాం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
ప్రత్యామ్నాయం వైపు..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : వరుణుడు కరుణించడం లేదు. ఖరీఫ్ సీజను ప్రారంభమై పక్షం రోజులు గడిచినా వర్షం జాడ లేకుండా పోయింది. రైతన్నలు ఆకాశం వైపు చూస్తున్నారు. కనీసం లోటు వర్షపాతం కాదు, ఏకంగా డ్రైస్పెల్ నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. మోస్రా మండలంలో ఈ సీజనులో కనీసం జల్లులు కూడా పడలేదని వర్షపాతం రికార్డులు పేర్కొంటున్నాయి. అలాగే మిగిలిన 28 మండలాల్లోనూ డ్రైస్పెల్ కొనసాగుతోంది. కరువుకు సంకేతాలుగా చెప్పుకునే డ్రైస్పెల్ కొనసాగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లా సాధారణ సగటు వర్షపాతం 1,042 మిల్లీమీటర్లు. ఈనెల 19 వరకు సగటున 111 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉంది. కేవలం 10 మిల్లీ మీటర్లు మాత్రమే వర్షపాతం రికార్డు అయ్యింది. మోస్రా, కోటగిరిల్లో అసలు వర్షమే కురవలేదు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశం జిల్లాలో డ్రైస్పెల్ కొనసాగుతుండటంతో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈనెలారులోగా వర్షాలు కురవకపోతే చేపట్టనున్న ప్రణాళికను తయారు చేస్తోంది. ఇందులో భాగంగా ఏరువాక శాస్త్రవేత్తలను సంప్రదించారు. ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కాని పక్షంలో రైతులకు ఆరుతడి పంటల విత్తనాల సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ఆందోళనలో రైతన్నలు.. వరుణుడి జాడ లేకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గత ఖరీఫ్‌లోనూ ఆశించిన మేరకు వర్షం కురవలేదు. దీనికి తోడు ఎండల తీవ్రతకు భూగర్భజలాలు కూడా అడుగంటి పోయాయి. సీజను ప్రారంభమై మూడు వారాలు దగ్గరపడుతున్నప్పటికీ చుక్క వర్షం కురవకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముదురుతున్న నారు.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో ముందుగా నాట్లు వేసుకుంటారు. వర్ని, బోధన్, ఎడపల్లి, నవీపేట్, కోటగిరి వంటి మండలాల్లో ముందుగా వరి నాట్లు వేస్తారు. ఈసారి కూడా చాలా మంది రైతులు నారుమడులు వేసుకున్నారు. ఈనెల 25లోగా నాట్లు వేసుకుంటేనే నారు పనిచేస్తుంది. లేనిపక్షంలో నారు పనికిరాకుండా పోతుంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో నారు పోసి 15 నుంచి 20 రోజులవుతోంది. మరో వారం, పది రోజుల్లో వర్షాలు కురవకపోతే ఈ నారు పనిచేయకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలంటున్న అధికారులు.. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బోర్ల కింద సాగు చేసుకునే రైతులు నీటి వాడకం విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. బోర్ల వద్ద వరి సాగు చేసే రైతులు స్వల్ప కాలిక, మధ్యకాలిక రకాలను వేసుకోవాలని డాట్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ నవీన్‌కుమార్ పేర్కొన్నారు. -
వానమ్మ.. రావమ్మా
సాక్షి, ఆదిలాబాద్: వానమ్మ.. రావమ్మా.. అంటూ తొలకరి వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు మురిపిస్తాయనుకుంటే అసలు జాడనే లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు. జిల్లాలో మృగశిర కార్తె ప్రవేశంతోనే రైతులు పత్తి విత్తనాలు వేశారు. అక్కడక్కడ చిన్నపా టి చినుకులు పడడమే తప్పా పెద్ద వర్షాల జాడలేదు. అయినా నీటివసతి ఉన్న రైతులు వితనాలు వేసేశారు. దీం తో మిగతా రైతులు ఆగమాగం అవుతున్నారు. ఒకరిని చూసి మరొకరు భూమిలో విత్తనం వేస్తున్నారు. ఇప్పటికే 20 నుంచి 30 శాతం మంది పత్తి విత్తనాలు పెట్టారు. ఇక వరుణుడి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రెండుమూడు రోజుల్లో వర్షాలు కురువని పక్షంలో పెట్టుబడిలోనే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అప్పటికి.. ఇప్పటికీ గతేడాది తొలకరి వర్షాలు రైతులను మురిపించాయి. పోయినేడు ఇదే సమయానికి 70 శాతం మంది రైతులు పత్తి విత్తనాలు నాటారు. సాధారణంగా జిల్లాలో రైతులు పత్తి పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 2 లక్షల హెక్టార్ల వరకు సాగయ్యే పరిస్థితి ఉండగా, అందులో పత్తి పంటనే 1.47 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. ఈ ఏడాది వర్షా ల రాక ఆలస్యం కావడంతో రైతులు పత్తి విత్తనా లు నాటడంలో డోలయాన పరిస్థితి కనిపిస్తోంది. నీటి సౌకర్యం ఉన్న కొంత మంది బడా రైతులు పత్తి విత్తనాలు నాటడంతో వర్షాధారంపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. వారిని చూసి పలు వురు చిన్న, సన్నకారు రైతులు కూడా విత్తనాలు వేశారు. ఈ రెండుమూడు రోజులు వర్షాలు పడితే నే ఆ విత్తనం మొలకెత్తే అవకాశం ఉంది. లేదంటే భూమిలోనే విత్తు నాశనమయ్యే పరిస్థితి ఉంది. అంతా రెడీ.. వర్షాకాలం పంటలకు ముందు రైతులు సర్వం సిద్ధం చేసుకున్నారు. దుక్కులు దున్ని చదును చేశారు. ఇక విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని ఇం ట్లో పెట్టుకుంటున్నారు. వర్షాలు మంచిగ పడిన పక్షంలో పత్తి విత్తనాలు జోరుగా నాటే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తొలకరి ఆశాజనకంగా లేకపోవడంతో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ధైర్యం చేసి తెచ్చిన విత్తనాలను నాటితే వర్షాలు రాక చెయ్యికి అందదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ విత్తనాలు నాటాల్సి వస్తోంది. అప్పటికీ వర్షాలు సహకరిస్తేనే రైతుకు మేలు జరుగుతుంది. ఏటా ప్రకృ తి వైపరిత్యాలతో కర్షకుడు ఏదో రీతిన నష్టపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గతేడాది తొలకరి జోరుగా మురిపించగా, ఆ తర్వాత వర్షాలు ము ఖం చాటేయడంతో పెట్టుబడి గణనీయంగా పెరిగి రైతు ఆర్థిక పరిస్థితి కుదేలైంది. పంట చేతికొచ్చే సమయంలో అతివృష్టి కారణంగా పం టలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇసుక మేటలతో చేల్లు ధ్వంసమయ్యాయి. రైతులు నష్టపోయా రు. ఇలా రైతన్నను భారీ వర్షాలు అప్పట్లో దెబ్బతీ శాయి. సాహసం చేయడం పత్తి రైతుకు అలవా టైంది. ప్రధానంగా ఇప్పుడు విత్తనాలు నాటి వ ర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మృగశిర కార్తె ప్రవేశంతో పత్తి విత్తనం నాటిన పక్షంలో సరైన స మయంలో పత్తికి పూత, కాత వస్తుందనే నమ్మకంతో రైతులు ఈ సమయంలో విత్తు నాటేందుకు సాహసం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వరుణ దేవు డు కరుణిస్తే రైతుకు మేలు జరిగే పరిస్థితి ఉంది. తీవ్ర వర్షాభావం గతేడాదితో పోల్చితే ఈసారి తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. జిల్లాలోని ఆదిలాబాద్‌రూరల్, మావల, జైనథ్ మండలాల్లో తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. సాధారణ వర్షం కంటే –60 శాతం నుంచి –99 శాతం వరకు తక్కువ వర్షపాతం ఉంటే దానిని తీవ్ర వర్షాభావంగా పరిగణిస్తారు. ప్రస్తుతం పై మూడు మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. –20 శాతం నుంచి –59 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే దానిని వర్షాభావ పరిస్థితిగా పరిగణిస్తారు. జిల్లాలోని బేల, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, తలమడుగు, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూర్‌లలో ఈ పరిస్థితి ఉంది. సాధారణ వర్షపాతం కంటే –19 శాతం నుంచి +19 శాతం వరకు వర్షం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. బజార్హత్నూర్, బోథ్ మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇక సాధారణ వర్షపాతం కంటే +20 శాతం, అంతకంటే ఎక్కువ కురిస్తే దానిని అతివర్షపాతంగా పరిగణిస్తారు. జిల్లాలో ప్రస్తుతం ఒక తాంసి, భీంపూర్ మండలాల్లోనే అధిక వర్షపాతం కురిసింది. స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి రుతుపవనాలు కేరళను తాకాయి. మనదగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండుమూడు మంచి వర్షాలు పడిన తర్వాతనే విత్తనాలు వేయాలి. తక్కువ వర్షపాతంలో విత్తనాలు వేయొద్దు. తేమ లేకపోవడంతో మొలక సరిగ్గా రాదు. సోయాబీన్‌ను జూలై 15 వరకు వేసుకోవచ్చు. వర్షాలు ఆలస్యంగా కురుస్తున్న దృష్ట్యా పత్తి, సోయా, తొగర్లు స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. సోయాబీన్‌కు అంతరపంటగా తొగర్లను నాటడం ద్వారా ఒకవేళ సోయాలో నష్టపోయినా తొగర్ల ద్వారా రైతులకు కొంత లాభం జరుగుతుంది. పత్తి రైతులు వర్షాలు పడకముందే తొందర పడొద్దు. – సుధాన్షు, శాస్త్రవేత్త -
పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం: ధర్మపురి అర్వింద్
జగిత్యాల: లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆదివారం జగిత్యాలలోని ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామ న్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. గల్ఫ్‌లో ఉన్న రాష్ట్ర కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, అక్కడివారి సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకునేందుకు చర్య లు తీసుకుంటామని చెప్పారు. దీనికోసం టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు సైతం కృషి చేస్తామన్నారు -
ఖరీఫ్ ఆలస్యం
కెరమెరి(ఆసిఫాబాద్): మృగశిరం మాసం ప్రారంభమైనా వానలు మృగ్యమవడంతో అన్నదాత దిగాలు చెందుతున్నారు. ఇప్పటికే పొలం పనులన్నీ పూర్తి చేసి నింగికేసి చూస్తున్న రైతులు ఎందరో జిల్లాలో ఉన్నారు. నైరుతి రుతుపవనాల రాక మరింతగా ఆలస్యమవుతుందని వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వారం దాటితే తప్పా తొలకరి పలకరించే అవకాశం లేదని చెబుతుండడంతో ఈసారి ఖరీఫ్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమైన రుతుపవనాలు... గతేడు జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురువడంతో రైతులు సంతోషంతో విత్తనాలు నాటుకున్నారు. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో 40శాతం విత్తనాలు వేశారు. ఈ సారి మాత్రం ఇప్పటి వరకు వర్షాలు కురవక పోవడంతో రైతులు వేసవి దుక్కులు సైతం చేయలేక ఆకాశం వైపు చూస్తున్నారు. దుక్కులు దున్నేందుకు భూముల్లో సేంద్రియ ఎరువులు, నల్లమట్టి వేసి ఎదరుచూస్తున్నారు. ఇప్పటి వరకు 20శాతం దుక్కులు కూడా కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇటీవల అక్కడక్కడ కురిసిన వర్షాలకు తడిసిన భూముల్లో పిచ్చి మొక్కల తొలగించేందుకే సరిపోయిందని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పుడు వానస్తోనే వేసవి దుక్కులు చేసినా తర్వాత మరో సారి వానలు కురిస్తేనే విత్తనాలు వేసేందుకు అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వర్షాలు వచ్చినా విత్తనా లు నాటుకునేందుకు దాదాపు మూడు వారా లు పట్టె అవకాశముంది. దీంతో సీజన్ నెలరోజులు వెనక్కి వెళ్లినట్టేనని రైతులు అంటున్నారు. కాలం ఆశాజనకంగా.. కాలం ఆశాజనకంగా ఉంటుందని వాతావరణ శాఖ మూడు వారాల కిందట ప్రకటించిన నేపథ్యంలో అధికారులు సాధారణ సాగు విస్తీర్ణానికి మించి పంటలు సాగవనున్నాయని 30 శాతం అదనంగా ప్రణాళికలో చేర్చినట్లు సమాచారం. అయినా నేటికి వర్షాలు కురవక పోవడం రైతులను కలవరానికి గురి చేస్తున్నాయి. జిల్లాలో కొంత కాలువల ద్వారా సాగువుతుండగా.. అధిక శాతం నీటి సౌకర్యం లేక పోవడంతో అకాశం వైపు వేచి చూస్తున్నారు. కొందరు విద్యుత్ ఆధారిత బోరు బావులను నమ్ముకుంటున్నారు. మండిపోతున్న ఎండలు! సాధారణంగా జూన్ మొదటి వారం వచ్చిందటే రుతుపవనాల ఆగమనంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు వస్తాయి. ప్రస్తుతం రుతుపవనాల జాడ లేక పోవడం, వడగాల్పులు వీస్తుండడం. రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో పగటి ఉష్ణ్రోగ్రతలు 40 నుంచి 45డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. మరో వారం రోజులు తపరిస్తితులు ఇలాగే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది లోటు వర్షపాతం.. నిరుడు జిల్లాలో సాధారణ వర్షాపాతం కంటే 30.5 మిల్లీ.మీటర్ల లోటు నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోయాయి. జిల్లా పరిధిలో ఆశించయిన స్థాయిలో వానలు కురవలేదు. పంటలు ఎండిపోయి నష్టం వాటిల్లింది. ఈసారి గత చేదు అనుభవాలు దరిచేరకుండా వానలు కురవాలని అన్నదాతలు ఆశిస్తున్నారు. కాలువల ద్వారా సాగు నీరందించి రైతున్నల కన్నీళ్లు తుడవాలనే సంకల్పంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గతేడాది వరకు పలు చోట్ల చెక్ డ్యాంలు, చెరువు కట్టలు నిర్మించింది. కానీ ప్రస్తుతం అవి ఎండిపోయి ఉండడంతో వాటిని చూసి అన్నదాత దిగాలు చెందుతున్నాడు. పరిస్థితిలో మార్పు రాకుంటే రానున్న కాలం గడ్డు కాలమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
రైతుకు సెస్ పోటు
ఒంగోలు సబర్బన్: వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులు పండించిన పంట ఉత్పత్తులపై మార్కెట్ సెస్ పేరిట రైతును నిలువు దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. జిల్లాలో వరుసగా ఐదేళ్లు కరువు కరాళనృత్యం చేసినా కనీసం రైతులపై కనికరం కూడా చూపని ప్రభుత్వం మార్కెట్ ఫీజు పేరిట ముక్కు పిండి వసూలు చేసింది. అసలే వర్షాలు లేక, అంతంత మాత్రంగా పండిన పంటలను మార్కెట్‌కు తరలించేందుకు రైతులు రోడ్డెక్కితే ఆ పంట ఉత్పత్తులపై మార్కెట్ ఫీజు కింద కిలోకు రూపాయి చొప్పున వసూలు చేసింది. ఈ విధంగా జిల్లాలోని 15 వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి ఒక్క 2018–19 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.19.71 కోట్లు వసూలు చేసింది. అయితే విధించిన లక్ష్యాన్ని చేరుకోకపోయినా ఇంత మొత్తంలో కరువు పీడిస్తున్న సమయంలో రైతులు కట్టడమంటే మామూలు విషయం కాదు. ఇదిలా ఉంటే ఇంత మొత్తంలో రైతుల నుంచి వసూలు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతు సంక్షేమం విషయంలో ఏమాత్రం ఆలోచించలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఒక్క రైతు బంధు పథకం మాత్రమే అమలులో ఉంది. అయితే ఆ పథకంలో కూడా అత్యల్పంగా 214 మంది రైతులకు జిల్లా వ్యాప్తంగా పండించిన పంటలను మార్కెట్ కమిటీ గోడౌన్లలో కుదువ ఉంచుకొని రుణాలు ఇచ్చారు. కేవలం రూ.2.87 కోట్లు మాత్రమే ఇచ్చి రైతులకు ఏదో చేశామని చెప్పుకుంటూ వచ్చారు. వరి ధాన్యం కుదువ పెట్టుకొని 217 మంది రైతులకు, వరిగలు కుదువ పెట్టుకొని 24 మంది రైతులకు మాత్రమే రుణంగా అందించారు. అది కూడా పచ్చ చొక్కా నేతలకే ఈ రుణాలు కూడా అందాయన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఈ ఐదేళ్లలో రైతుల నుంచి మార్కెట్ ఫీజు రూపంలో వసూలు చేసింది అక్షరాలా రూ.107.96 కోట్లు. ఆర్ధిక సంవత్సరం వసూలు చేసిన ఫీజు 2014–15 రూ.27.42 కోట్లు 2015–16 రూ.21.07 కోట్లు 2016–17 రూ.21.00 కోట్లు 2017–18 రూ.18.76 కోట్లు 2018–19 రూ.19.71 కోట్లు ఉచిత వైద్యశిబిరాలు కనుమరుగు: గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో రైతులకు, పశువులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి రైతుల ఆరోగ్యంతో పాటు పశువుల ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించేవారు. అదేవిధంగా ఉచితంగా మందులు కూడా అందించేవారు. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఆ ఊసే మరిచిపోయారు. మార్కెట్ ఫీజు పేరిట వసూలు చేయటం మినహా ఎలాంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు. ఇకపోతే వ్యవసాయ మార్కెట్ పాలక కమిటీలను ఏర్పాటు చేసుకొని పదవులు మాత్రం అలంకరించారు. పాలక మండళ్లతో కమిటీలకు అదనపు భారం తప్ప ప్రయోజనం శూన్యంగా మారింది. పాలక మండలి కమిటీలు అలంకార ప్రాయంగానే మిగిలాయి. ఈ ఏడాది వసూలు చేసిన మార్కెట్ ఫీజు మార్కెట్ కమిటీలు వసూలు చేసిన ఫీజు ఒంగోలు రూ.1.62 కోట్లు కందుకూరు రూ.1.42 కోట్లు మార్టూరు రూ.1.32 కోట్లు పర్చూరు రూ.2.30 కోట్లు దర్శి రూ.1.01 కోట్లు అద్దంకి రూ.1.76 కోట్లు చీరాల రూ.2.00 కోట్లు కొండపి రూ.3.24 కోట్లు మద్దిపాడు రూ.1.42 కోట్లు మార్కాపురం రూ.0.68 కోట్లు గిద్దలూరు రూ.0.76 కోట్లు పొదిలి రూ.0.21 కోట్లు ఎర్రగొండపాలెం రూ.0.98 కోట్లు కంభం రూ.0.54 కోట్లు -
కరువు ఉరిమింది.. బతుకు బరువైంది
వరుస కరువులతో రైతన్న వలవల ఏడ్చేను.. తోటలు ఎండుతుంటే రైతు గుండె చెరువాయే.. ఏడ్చనీకి కన్నీళ్లు రాక.. గుండె తడారిపాయే..! భూమి తవ్వినా బూడిదే మిగిలే.. భూమినే నమ్ముకున్న బతుకు బుగ్గిపాలాయే.. కన్నీళ్లింకే.. కాళ్లల్లో సత్తువ తగ్గే.. కూడు పెట్టే మనిషి కాటికి పయనమాయే..!! సాక్షి, పెద్దారవీడు (ప్రకాశం): తీవ్ర వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వర్షాలు లేక వివిధ పంటలు సాగు చేసిన రైతులకు పెట్టుబడి కూడా దక్కడం లేదు. దీంతో చేసిన అప్పులు తీరేమార్గం కనిపించక రైతులు ఇతర ప్రాంతాలకు వలస బాటపడుతున్నారు. పశుగ్రాసం కొరతతో పాడి రైతులు పశుసంపదను కబేళాలకు తరలిస్తున్నారు. వరుస కరువులతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో పత్తి, మిరప కంది, జోన్న, కూరగాయల తోటలు నిట్ట నిలువునా కళ్ల ఎదుటే ఎండిపోతున్నాయి. దీంతో కంటికి రెప్పలా కన్న బిడ్డల కంటే ఎంతో మక్కువతో పెంచుకున్న తోటలు ఎండిపోతుంటే రైతుల గుండె చెరువై పోతోంది. ఈ ఏడాది రబీ, ఖరీఫ్‌లో పత్తి, మిరప, కంది, తదితర పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయి. దీంతో కోట్ల రూపాయల మేర రైతులకు నష్టం వాటిల్లింది. వందల అడుగుల లోతు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. పంటలను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతుల వ్యథలను ప్రభుత్వం, అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదు. నీరు లేక విలవిల నియోజకవర్గంలో చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేక ఎడారులను తలపిస్తున్నాయి. ఏటా వర్షపాతం నమోదులో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా సాగు, తాగు నీటికి ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మండలంలో ఇరిగేషన్‌కు సంబంధించిన చెరువులు 10 ఉన్నాయి. ఒక్క చెరువులోనూ చుక్క నీరు లేదు. వర్షాభావం కారణంగా చెరువులు, కుంటలు నీళ్లు లేక బావురుమంటున్నాయి. చెరువుల్లో నీళ్లు ఉంటే సమీపంలోని బోరు బావుల్లో కూడా నీళ్లు పుష్కలంగా ఉంటాయని రైతులు అంటున్నారు. వేసవిలో పంటల సాగుపై రైతుల్లో అయోమయం నెలకొంది. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలు బీటలు వారుతున్నాయి. ట్రాక్టర్ గడ్డి రూ. 15 వేలు కరువు కారణంగా పచ్చిగడ్డి కరువైంది. దీనికితోడు పంటలు లేకపోవడంతో పాడి రైతులకు పశుపోషణ భారంగా మారింది. దీంతో మండలంలోని పాడి రైతులు ట్రాక్టర్ గడ్డికి రూ. 12 నుంచి రూ. 15 వేలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక గ్రామీణ పాడి రైతులు ఇక్కట్లు పడుతున్నారు. గ్రాసం లేక పోషణ భారమై నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు పాడి రైతులకు శాపంగా మారింది. పచ్చిగడ్డి కూడా కరువైంది. గ్రాసం కొరతతో పాడి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పశు పోషణ భారమై దిక్కు తోచడంలేదు. కరువు నేపథ్యంలో జీవాల పోషణ భారమై మేకలు, గొర్రెల పెంపకందారులు తమ జీవాలను గుంటూరు జిల్లా గురజాల, సత్తెనపల్లె లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. కష్టాల నుంచి గట్టెక్కవచ్చు వర్షాలు కురుస్తాయో లేదోనని ఆలోచించి పంటలు పంటలు సాగు చేయాలి. రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయిస్తే కరువు కాలం కష్టాల నుంచి గట్టెక్కవచ్చును. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్సాలు లేకపోవడంతో బోరు 600 అడుగులు వేస్తేగానీ నీరు పడటంలేదు. దీంతో రైతులు సాహసం చేయలేక వెనుకడుగు వేస్తున్నారు. జగన్ ఇచ్చిన ప్రకారం ఉచితంగా వ్యవసాయ బోర్లు వేస్తే ధైర్యంగా వ్యవసాయం చేయవచ్చు. జగన్ హామీలు అమలైతే మళ్లీ రైతు రాజ్యం వస్తుంది. – ఏర్వ వెంకటనారాయణరెడ్డి, చట్లమిట్ల ప్రభుత్వం రైతులను ఆదుకుంటేనే భవిష్యత్తు ఏ ప్రభుత్వమైనా రైతులను అన్ని విధాల అదుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులంతా ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. ఇక రైతులను ఎవరు బాగుపర్చుతారు. రైతుకు ఏం అవసరమో తెలుసుకుని వారి జీవితాలకు భరోసా ఇచ్చిన వైఎస్సార్‌కు సాటిలేరు. చంద్రబాబు పాలనలో అవినీతి ఏరులై పారుతోంది తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు. – బూస పెరయ్య, చాట్లమడ అగ్రహారం పెట్టబడికి ఇబ్బంది ఉండదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతు రాజ్యం నడిచింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించే వ్యక్తి జగన్మోణ్రెడ్డి మాత్రమే. జగన్మోహన్రెడ్డి రైతు భరోసా కింద రైతులకు ఉచిత బొర్లతో పాటు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ 12,500 ఇస్తామంటున్నారు. పెట్టుబడి కోసం రైతులు బ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. –బొచ్చు ఆంజనేయరెడ్డి, సానికవరం -
అ‘ధన’పు కష్టం
సాక్షి, కొత్తగూడెం: మార్కెటింగ్ శాఖకు ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరట్లేదు. ఇందుకు అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. కందులు, మొక్కజొన్నలకు ఫీజు మినహాయింపునివ్వడం, పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడం, కొన్ని చెక్‌పోస్టులు ఇతర జిల్లాల్లోకి వెళ్లడం, పౌరసరఫరాల శాఖ, సీసీఐ బకాయిల చెల్లింపు ప్రక్రియ పూర్తి కాకపోవడం వంటి కారణాలన్నీ కూడా అదనపు ఆటంకాలుగానే మారాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2018–19లో జిల్లాలో మార్కెటింగ్ శాఖ ఆదాయం తగ్గుతోంది. మొత్తం 59 గోదాములు, 20 చెక్‌పోస్టులు ఉన్నాయి. కందులు, మొక్కజొన్న పంటలకు ఒకశాతం మార్కెట్ ఫీజు మినహాయింపునివ్వడం, పత్తి దిగుబడి తగ్గడంతో మార్కెటింగ్ ఆదాయంపై గట్టి ప్రభావం పడింది. కొన్ని చెక్‌పోస్టులు ఇతర జిల్లాల్లోకి వెళ్లడంతో పాటు పోలవరం విలీన మండలాల్లో కొన్ని ఉండిపోవడంతో కచ్చితంగా ఆదాయానికి గండి పడింది. దీనికి తోడు పౌరసరఫరాల శాఖ, కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) ద్వారా బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో ఆదాయ లక్ష్యాన్ని సాధించడంలో వెనుకంజలో ఉంది. కొన్ని గోదాములను ఎన్నికల సామగ్రి భద్రపరిచేందుకు ఉపయోగిస్తుండగా, అత్యధిక గోదాముల్లో పౌరసరఫరాల శాఖ వారి ధాన్యం, సీసీఐ వారి పత్తిని నిల్వ ఉంచారు. వీటి ద్వారా రావాల్సన ఆదాయ బకాయిలు మాత్రం నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. బకాయిల క్రమం ఇలా.. సీసీఐ ద్వారా మార్కెటింగ్ శాఖకు ఇప్పటివరకు రూ.50 లక్షలకుపైగా బకాయి నిధులందాల్సి ఉంది. పౌరసరఫరాల శాఖ ద్వారా రూ.3 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయి. ఇందులో గతేడాదికి సంబంధించి రూ.కోటి, ఈ సంవత్సరానికి రూ.2కోట్లు రావాల్సి ఉంది. అయితే పౌరసరఫరాల శాఖ వాళ్లు ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఫీజును తదుపరి ఏడాదిలో చెల్లిస్తుండడంతో బకాయిలు ఎక్కువగా పేరుకుపోతున్నాయి. ఇక పత్తి పంట ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుందని అంచనా వేసినప్పటికీ ఆ మేరకు సాధించలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 47,294 హెక్టార్లలో రైతులు పత్తి పంటను సాగు చేశారు. అయితే ఇందులో ఎకరానికి 8 నుంచి 9 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే భారీగా తగ్గిపోవడంతో ఈ ప్రభావం మార్కెటింగ్ శాఖ ఆదాయంపైనా పడింది. ఎకరానికి కేవలం 2 నుంచి 3 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగబడి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మొత్తం 9,59,000 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని భావించగా, అది మూడోవంతుకు కూడా రాలేదు. గతేడాది ఈ సమయానికి జిల్లాలోని బూర్గంపాడు, దమ్మపేట, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, చర్ల మార్కెట్ కమిటీల ద్వారా అనుకున్న లక్ష్యంలో 5.85 శాతం ఎక్కువగా ఆదాయం సాధించగా ఈసారి మాత్రం తగ్గింది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది 45.64 శాతం తక్కువగా ఉంది. -
రోడ్డెక్కుతారా.. తోలు తీస్తా...
నల్లగొండ అగ్రికల్చర్: ధాన్యం కొనాలంటూ ధర్నా చేసిన రైతులపై పోలీసులు లాఠీ ఝలిపించారు. ‘రోడ్డెక్కుతారా కొడకల్లారా.. తోలు తీస్తా’అంటూ నల్లగొండ టూటౌన్ సీఐ ఊగిపోతూ బూతు పురాణం అందుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన పలువురు రైతులపై పిడిగుద్దులు కురిపించి సుమోలోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. దీంతో మిగతా రైతులు భయపడి పరుగెత్తి బీట్ మార్కెట్ యార్డులో దాక్కున్నారు. మంగళవారం స్థానిక నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. మూడ్రోజులుగా కొనుగోళ్లు లేకపోవడంతో యార్డులో పెద్దఎత్తున ధాన్యం రాశులు నిలిచిపోయాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో విసిగిన రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా చేస్తారా అంటూ రైతులపై విరుచుకుపడి లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల తీరుపై రైతులు మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎరువు.. ‘ధర’వు
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందగా మారింది.. రైతుల పరిస్థితి. ప్రతి ఏడాది రైతు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. గత ఏడాది వర్షాలు సకాలంలో కురియకపోవడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో అప్పులపాలయ్యారు. ఈ ఖరీఫ్ సీజన్ ఆగస్టులో భారీ వర్షాలు కురువడంతో జిల్లాలో 24 వేల హెక్టార్లలో పత్తి, సోయా పంటలు నష్టపోయారు. దీనికి తోడు ప్రస్తుతం అయా కంపెనీలు ఎరువుల ధరలు పెంచేశాయి. దీంతో రబీ పంటల పెట్టుబడి భారం మరింత పెరుగనుంది. పంటల దిగుబడి పెరగాలనే ఉద్దేశంతో రైతులు దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వినియోగిస్తారు. ఇదే అదునుగా భావించిన కంపెనీలు ఒక్కో బస్తాపై రూ.100 నుంచి రూ.275 వరకు పెంచాయి. ప్రతి సంవత్సరం ఎరువుల ధరలను పెంచుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికి మూడు సార్లు ధరలను పెంచారు. 2017 మార్చిలో ధరలు పెంచగా ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్‌లో ధరలు పెరిగాయి. ప్రస్తుతం మరోసారి ధరలను పెంచి రైతులను కోలుకోకుండా చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతుపై దాదాపు రూ.5వేల వరకు అదనపు భారం పడనుంది. యూరియా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండడంతో ధరను పెంచడానికి వీలు లేదు. అన్నదాతకు గుదిబండ.. జిల్లాలో రబీ సాగు విస్త్రీర్ణం 23 హెక్టార్లలో సాగయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 18వేల హెక్టార్లలో శనగ, వెయ్యి హెక్టార్లలో వేరుశనగ, 2వేల హెక్టార్లలో జోన్న, 500 హెక్టార్లలో మొక్కజోన్న, 1500 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రబీ పంటల కోసం 9వేల మెట్రిక్ టన్నుల యూరియా, 4,500 టన్నుల డీఏపీ, 2300 మెట్రిక్ టన్నుల ఎంఓపీ, 6500 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం. ఎరువుల ధరల పెరుగుదల రైతుల మెడపై గుదిబండగా మారాయి. పొటాష్ ధర బస్తాకు రూ.675 నుంచి రూ.950, డీఏపీ ధర రూ.1290 నుంచి రూ.1425కు పెరిగింది. డీఏపీ ధర ఎక్కువ పెరగడంతో దీని వాడకం తగ్గించి యూరియా, ఇతర ఎరువుల వాడకం పెంచనున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో ఎరువుల సమత్యులత తగ్గి పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
ఆన్లైన్ మార్కెటింగ్‌లో మనమే టాప్
- నామ్ విధానంతో రైతులకు మద్దతు ధ ర: మంత్రి హరీశ్ - రైతు బజార్ వ్యవస్థను విస్తరిస్తాం - విడతలవారీగా రెవెన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు - నామ్‌పై రెండ్రోజుల శిక్షణ తరగతులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లైన్ మార్కెటింగ్‌లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, హర్యానా మాత్రమే మన రాష్ట్రంతో పోటీ పడుతోందని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ (నామ్) విధానంపై రెండ్రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులను మంత్రి బుధవారమిక్కడ ప్రారంభించారు. కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా 214 వ్యవసాయ మార్కెట్ యార్డులను అనుసంధానం చేస్తూ నామ్‌ను ప్రారంభించిందని, రాష్ట్రంలో 44 మార్కెట్లను కింద ఎంపిక చేయగా వాటిలో ఐదు మార్కెట్ యార్డుల్లో ప్రయోగాత్మకంగా ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని మంత్రి వివరించారు. ఏకీకృత లెసైన్సు, ఒకేసారి మార్కెట్ ఫీజు వసూలు తదితరాలు నామ్ ప్రత్యేకతలని పేర్కొన్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ విధానం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను మద్దతు ధరకు అమ్ముకునే అవకాశం ఉందని.. తద్వారా దళారీ వ్యవస్థ నిర్మూలించవచ్చన్నారు. మార్కెటింగ్ కార్యకలాపాల్లో పారదర్శకత పెంచడంతో పాటు రైతులకు లాభం కలిగేలా నూతన విధానం ఉంటుందని చెప్పారు. సంస్కరణల కోసం అస్కితో ఒప్పందం నూతన సంస్కరణలు, విధానాలు ప్రవేశ పెట్టడం ద్వారా మార్కెటింగ్ శాఖను బలోపేతం చేస్తామని, అందులో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(అస్కి)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హరీశ్ తెలిపారు. మార్కెటింగ్ లావాదేవీల్లో మార్గదర్శకాలను సులభతరం చేసేందుకు అవసరమైన సూచనలు, సలహాల కోసం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంతో చర్చలు జరుపుతున్నామన్నారు. పెసర సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్ సంస్థలు ఎఫ్‌సీఐ, నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ సుముఖత వ్యక్తం చేశారన్నారు. రైతు బజారు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, తొలి విడతలో రెవెన్యూ డివిజన్లలో.. మలి విడతలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కూరగాయల ధరలను స్థిరీకరించేందుకు హైదరాబాద్‌లో ‘మన కూరగాయలు’ పథకం కింద వంద విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,024 కోట్ల వ్యయంతో 330 గోదాములు నిర్మిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అస్కి చైర్మన్ పద్మనాభయ్య, మార్కెటింగ్ డెరైక్టర్ డాక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.