Kavita Shukla: అమ్మమ్మ ఇంట్లో వచ్చిన ఐడియా జీవితాన్నే మార్చేసింది! | Kavita Shukla: Alleviating food hunger and reducing food waste with innovation | Sakshi
Sakshi News home page

Kavita Shukla: అమ్మమ్మ ఇంట్లో వచ్చిన ఐడియా జీవితాన్నే మార్చేసింది!

Published Tue, Dec 5 2023 12:30 AM | Last Updated on Tue, Dec 5 2023 12:30 AM

Kavita Shukla: Alleviating food hunger and reducing food waste with innovation - Sakshi

సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళితే ఏం దొరుకుతుంది? అంతులేని ఆనందం. అయితే అమెరికా నుంచి ఇండియాలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన కవితా శుక్లాకు ఆనందంతో పాటు ‘ఐడియా’ కూడా దొరికింది. ఆ ఐడియా ఆమెను ఇన్వెంటర్‌ని చేసింది. ఆ తరువాత ఎంటర్‌ప్రెన్యూర్‌ను చేసింది. ఇన్వెంటర్, ఎంటర్‌ప్రెన్యూర్, మోటివేషనల్‌ స్పీకర్, డిజైనర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది కవితా శుక్లా...

చిన్నప్పటి నుంచి సైన్స్, కళలు అంటే కవితకు ఆసక్తి. సైన్స్‌లో రకరకాల ప్రయోగాలు చేసేది. తాను ఇన్నోవేటర్‌ కావడానికి ఆ ప్రయోగాలు పునాదిగా ఉపయోగపడ్డాయి. పదిహేడు సంవత్సరాల వయసులోనే ఎన్నో పేటెంట్లు తీసుకుంది. ‘ఫ్రెష్‌పేపర్‌’ రూపంలో ఆహార వ్యర్థాలను తగ్గించే సాంకేతిక ఆవిష్కరణ కవితకు  ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చింది.

ఈ ఫ్రెష్‌ పేపర్‌ ఆహారం, కూరగాయలలో బ్యాక్టీరియా, ఫంగస్‌ పెరుగుదలను నిరోధించి వాటిని ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది. బోస్టన్‌లోని స్థానిక రైతు మార్కెట్‌ లో ఫ్రెష్‌ పేపర్‌ లాంచ్‌ చేశారు. మౌత్‌టాక్‌తోనే ఈ పేపర్‌ పాపులర్‌ అయింది.

ప్రస్తుతం ఈ ఫ్రెష్‌పేపర్‌ 180 దేశాల్లో అందుబాటులో ఉంది. ‘యూఎస్‌లో ఆహార వృథా అనేది ఇంత పెద్ద సమస్య అని తెలియదు. ఫ్రెష్‌పేపర్‌కు వచ్చిన స్పందన నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. పండ్లు, కూరగాయలు, ఆహారాన్ని తాజాగా ఉంచడానికి తద్వారా ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. లోకల్‌ఫుడ్‌ బ్యాంకులకు వీటిని విరాళంగా ఇచ్చాం’ అంటుంది కవిత.

 ఫుడ్‌ ప్రిజర్వేషన్‌కు సంబంధించిన ఆసక్తి కవితలో పదమూడు సంవత్సరాల వయసు నుంచే మొదలైంది. సెలవులు వచ్చినప్పుడు ఇండియాలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది కవిత. ఒకరోజు పొరపాటున కలుషితమైన నీరు తాగింది. ఆందోళన పడిన అమ్మమ్మ వెంటనే కవితతో ఏదో కషాయం తాగించింది. దీంతో కవితకు ఏమీ కాలేదు. అమెరికాకు తిరిగిన వచ్చిన తరువాత కషాయంలో అమ్మమ్మ ఉపయోగించిన పదార్థాల గురించి వివరంగా తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆహారపదార్థాలు, కూరగాయలు చెడిపోకుండా సంరక్షించడానికి సంబంధించిన పరిశోధనలు మొదలుపెట్టింది.

జర్మనీలో పుట్టిన కవిత ఇలియట్‌ సిటీ (యూఎస్‌)లో పెరిగింది. హార్వర్డ్‌ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పట్టా పుచ్చుకుంది. ‘ సింపుల్‌ ఐడియాలకు మార్పు తెచ్చే శక్తి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు’ అంటుంది కవిత.

ఆహార భద్రత, సంరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కవిత మోటివేషనల్‌ స్పీకర్‌ కూడా. ఎన్నో కాలేజీలలో, సమావేశాలలో యువతను ఉద్దేశించి ఉత్తేజకరమైన ప్రసంగాలు చేసింది. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్‌లు అందుకుంది. ఫోర్బ్స్‌ ‘30 అండర్‌ 30: సోషల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్స్‌’ టైమ్‌ మ్యాగజైన్‌ ‘5 మోస్ట్‌ ఇనోవేటివ్‌ ఉమెన్‌ ఇన్‌ ఫుడ్‌’ న్యూస్‌వీక్‌ ‘125 ఉమెన్‌ ఆఫ్‌ ఇంపాక్ట్‌’ జాబితాలలో చోటు సంపాదించింది.

రెండు సంవత్సరాల క్రితం వర్జీనియాలో జరిగిన వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఇండిపెంటెంట్‌ ఇన్వెంటర్‌లు, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ప్రొఫెషనల్స్‌ సమావేశంలో కీలక ఉపన్యాసం ఇచ్చింది. ఇన్వెంటర్‌ అయిన కవిత ‘ఫ్రెష్‌ గ్లో’ కంపెనీతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా అద్భుత విజయం సాధించింది. ‘మీకు ఏదైనా ఆసక్తిగా అనిపిస్తే దాని గురించి లోతుగా ఆలోచించండి. ఆ తరువాత పరిశోధించండి. ఫలితాలు చేతికి అందేవరకు ప్రయోగాలు చేయండి’ అంటుంది కవిత.                    

ఆలోచించండి... అద్భుతాలు చేయండి
కష్టాల దారిలో ప్రయాణించి విజయాలు సాధించిన ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ల గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. వారి గురించి సమావేశాల్లో చెబుతుంటాను. వారి విజయగాథలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తాయి. ఆలోచిస్తే ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాలతో ఎన్ని గొప్ప పనులైనా చేయవచ్చు. మన ఐడియాను మొదట ఇతరులతో పంచుకోవడానికి భయంగా అనిపిస్తుంది. ఆ భయాన్ని వదులుకొని ఆత్మవిశ్వాసంతో చెప్పండి. ఆత్మవిశ్వాసం ఉన్న చోటుకి విజయం త్వరగా వస్తుంది.
– కవితా శుక్లా, ఫ్రెష్‌ గ్లో కంపెనీ ఫౌండర్, సీయీవో

∙చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో కవితా శుక్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement