Inventor
-
Kavita Shukla: అమ్మమ్మ ఇంట్లో వచ్చిన ఐడియా జీవితాన్నే మార్చేసింది!
సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళితే ఏం దొరుకుతుంది? అంతులేని ఆనందం. అయితే అమెరికా నుంచి ఇండియాలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన కవితా శుక్లాకు ఆనందంతో పాటు ‘ఐడియా’ కూడా దొరికింది. ఆ ఐడియా ఆమెను ఇన్వెంటర్ని చేసింది. ఆ తరువాత ఎంటర్‌ప్రెన్యూర్‌ను చేసింది. ఇన్వెంటర్, ఎంటర్ప్రెన్యూర్, మోటివేషనల్ స్పీకర్, డిజైనర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది కవితా శుక్లా... చిన్నప్పటి నుంచి సైన్స్, కళలు అంటే కవితకు ఆసక్తి. సైన్స్‌లో రకరకాల ప్రయోగాలు చేసేది. తాను ఇన్నోవేటర్ కావడానికి ఆ ప్రయోగాలు పునాదిగా ఉపయోగపడ్డాయి. పదిహేడు సంవత్సరాల వయసులోనే ఎన్నో పేటెంట్లు తీసుకుంది. ‘ఫ్రెష్‌పేపర్’ రూపంలో ఆహార వ్యర్థాలను తగ్గించే సాంకేతిక ఆవిష్కరణ కవితకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చింది. ఈ ఫ్రెష్ పేపర్ ఆహారం, కూరగాయలలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను నిరోధించి వాటిని ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది. బోస్టన్లోని స్థానిక రైతు మార్కెట్ లో ఫ్రెష్ పేపర్ లాంచ్ చేశారు. మౌత్‌టాక్‌తోనే ఈ పేపర్ పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ ఫ్రెష్‌పేపర్ 180 దేశాల్లో అందుబాటులో ఉంది. ‘యూఎస్‌లో ఆహార వృథా అనేది ఇంత పెద్ద సమస్య అని తెలియదు. ఫ్రెష్పేపర్కు వచ్చిన స్పందన నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. పండ్లు, కూరగాయలు, ఆహారాన్ని తాజాగా ఉంచడానికి తద్వారా ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. లోకల్ఫుడ్ బ్యాంకులకు వీటిని విరాళంగా ఇచ్చాం’ అంటుంది కవిత. ఫుడ్ ప్రిజర్వేషన్‌కు సంబంధించిన ఆసక్తి కవితలో పదమూడు సంవత్సరాల వయసు నుంచే మొదలైంది. సెలవులు వచ్చినప్పుడు ఇండియాలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది కవిత. ఒకరోజు పొరపాటున కలుషితమైన నీరు తాగింది. ఆందోళన పడిన అమ్మమ్మ వెంటనే కవితతో ఏదో కషాయం తాగించింది. దీంతో కవితకు ఏమీ కాలేదు. అమెరికాకు తిరిగిన వచ్చిన తరువాత కషాయంలో అమ్మమ్మ ఉపయోగించిన పదార్థాల గురించి వివరంగా తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆహారపదార్థాలు, కూరగాయలు చెడిపోకుండా సంరక్షించడానికి సంబంధించిన పరిశోధనలు మొదలుపెట్టింది. జర్మనీలో పుట్టిన కవిత ఇలియట్ సిటీ (యూఎస్)లో పెరిగింది. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పుచ్చుకుంది. ‘ సింపుల్ ఐడియాలకు మార్పు తెచ్చే శక్తి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు’ అంటుంది కవిత. ఆహార భద్రత, సంరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కవిత మోటివేషనల్ స్పీకర్ కూడా. ఎన్నో కాలేజీలలో, సమావేశాలలో యువతను ఉద్దేశించి ఉత్తేజకరమైన ప్రసంగాలు చేసింది. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్లు అందుకుంది. ఫోర్బ్స్ ‘30 అండర్ 30: సోషల్ ఎంటర్ ప్రెన్యూర్స్’ టైమ్ మ్యాగజైన్ ‘5 మోస్ట్ ఇనోవేటివ్ ఉమెన్ ఇన్ ఫుడ్’ న్యూస్‌వీక్ ‘125 ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ జాబితాలలో చోటు సంపాదించింది. రెండు సంవత్సరాల క్రితం వర్జీనియాలో జరిగిన వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఇండిపెంటెంట్ ఇన్వెంటర్లు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొఫెషనల్స్ సమావేశంలో కీలక ఉపన్యాసం ఇచ్చింది. ఇన్వెంటర్ అయిన కవిత ‘ఫ్రెష్ గ్లో’ కంపెనీతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా అద్భుత విజయం సాధించింది. ‘మీకు ఏదైనా ఆసక్తిగా అనిపిస్తే దాని గురించి లోతుగా ఆలోచించండి. ఆ తరువాత పరిశోధించండి. ఫలితాలు చేతికి అందేవరకు ప్రయోగాలు చేయండి’ అంటుంది కవిత. ఆలోచించండి... అద్భుతాలు చేయండి కష్టాల దారిలో ప్రయాణించి విజయాలు సాధించిన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ల గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. వారి గురించి సమావేశాల్లో చెబుతుంటాను. వారి విజయగాథలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తాయి. ఆలోచిస్తే ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాలతో ఎన్ని గొప్ప పనులైనా చేయవచ్చు. మన ఐడియాను మొదట ఇతరులతో పంచుకోవడానికి భయంగా అనిపిస్తుంది. ఆ భయాన్ని వదులుకొని ఆత్మవిశ్వాసంతో చెప్పండి. ఆత్మవిశ్వాసం ఉన్న చోటుకి విజయం త్వరగా వస్తుంది. – కవితా శుక్లా, ఫ్రెష్ గ్లో కంపెనీ ఫౌండర్, సీయీవో ∙చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో కవితా శుక్లా -
ఈ-మెయిల్ సృష్టికర్త మనోడే తెలుసా?
ఈ రోజు మన జీవితంలో ఈ-మెయిల్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. దీనిని ఉద్యోగుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు అంతా ఉపయోగిస్తున్నారు. కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి మరొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అని అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని అర్థము. 14 సంవత్సరాల వయసులో ఒక భారతీయ అమెరికన్ పిల్లవాడు ఈ-మెయిల్‌ను కనుగొన్నాడు. ఈ-మెయిల్‌ను 1978లో శివ అయ్యదురై ఆవిష్కరించాడు. శివ అయ్యదురై 1978లో ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధి చేశాడు. దానిని ఈ-మెయిల్ అని పిలుస్తారు. ఈ-మెయిల్ టు బాక్స్, ఇన్‌బాక్స్, ఫోల్డర్లు, మెమోలు వంటి ఈ ప్రోగ్రామ్‌లు శివ అయ్యదురై ఈ మెయిల్లో కనిపించే ప్రధాన లక్షణాలు, ఇప్పటికీ అవి ఉన్నాయి. శివ అయ్యదురైని ఈమెయిల్ కనుగొన్న వ్యక్తిగా అమెరికా ప్రభుత్వం ఆగష్టు 30, 1982 అధికారికంగా గుర్తించింది. ఈ-మెయిల్ సృష్టికర్తగా శివ అయ్యదురైకి 1978లో యూఎస్ కాపీరైట్ హక్కులు లభించాయి. తమిళ కుటుంబానికి వెల్లయప్ప అయ్యదురై శివ డిసెంబర్ 2, 1963న ముంబైలో జన్మించారు. తనకు ఏడు ఏళ్లు ఉన్నప్పుడు శివ కుటుంబం అమెరికాకు వెళ్లిపోయింది. అయ్యదురై 14 ఏళ్ల వయసులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని కొరెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్‌లో ఒక ప్రత్యేక ఇంటిగ్రేషన్ కార్యక్రమంలో చేరాడు. అలాగే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) నుంచి నాలుగు డిగ్రీలు పొందాడు. కొంచెం ఈ-మెయిల్ సృష్టికర్త విషయంలో కొందరు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రే టాంలిన్సన్ ఈ-మెయిల్ సృష్టించినట్లు భావిస్తున్నారు. చదవండి: బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ -
ముఖచిత్ర మకుటం
మూడేళ్ల వయసులో తల్లి అడిగింది. ‘బేబీ.. సిక్ అయిన వాళ్లకు నువ్వెలా నయం చేస్తావ్?’ అని. ‘మ్యూజిక్ వినిపిస్తాను’ అంది గీతాంజలి! పియానో చక్కగా ప్లే చేస్తుంది ఇప్పటికీ తను. గీతాంజలికి ఇప్పుడు పదిహేనేళ్లు. మ్యూజిక్లోంచి సైన్స్ చేసే మ్యాజిక్‌లోకి వచ్చేసింది. సైంటిస్ట్, ఇన్వెంటర్ తనిప్పుడు! స్కూల్‌కి వెళ్లొస్తూనే ప్రపంచాన్ని మలుస్తోంది. భూగోళంపై ఎన్నో సమస్యలు. వాటి పరిష్కారానికి ఒక టీమ్‌ని నిర్మిస్తానంటోంది.. ఈ ‘టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్’. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘టైమ్’ పత్రిక తరచు కొన్ని ప్రత్యేకమైన ముఖచిత్రాలతో వెలువడుతుంటుంది. ఈ సోమవారం మరింత ప్రత్యేకమైన ముఖచిత్రంతో కొత్త సంచిక మార్కెట్లోకి రాబోతోంది. అయితే ఆ ప్రత్యేకత ‘టైమ్’ పత్రిక వల్ల ఆ ముఖచిత్రానికి వచ్చింది కాక, ముఖచిత్రం వల్ల టైమ్ పత్రికకు వచ్చినది! ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’గా పదిహేనేళ్ల భారతీయ బాలిక గీతాంజలీరావును ‘టైమ్’పత్రిక ఎంపిక చేయడమే అందుకు కారణం. ‘టైమ్’ కే ఒక కిరీటం అయినట్లుగా ముఖచిత్రంపై ఆత్మవిశ్వాసపు దృక్కులతో మందస్మిత గంభీరంగా కూర్చొని ఉంది చిన్నారి గీతాంజలి. ఆన్లైన్లో గీతాంజలితో ఏంజెలీనా. ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్‌తో ‘టైమ్’ ఇలా ఒక ముఖచిత్రాన్ని వెయ్యడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల మంది చిన్నారుల ప్రతిభా సామర్థ్యాలను పరిశీలించి, విశ్లేషించి, వడపోసి గీతాంజలిని ఎంపిక చేసింది టైమ్. గీతాంజలి కొన్ని సామాజిక, నిత్యజీవితావసరాల్లో మిళితమై ఉన్న సమస్యలకు పరిష్కారం కనిపెట్టింది. అవే ఆమెను తక్కిన చిన్నారుల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ‘‘ప్రపంచాన్ని ఎవరైతే మలుచుతారో వారిదే ఈ ప్రపంచం. ప్రపంచం ఏ విధమైన అస్థిరతలో ఉన్నా, అందుకొక పరిష్కారాన్ని చూపే చిన్నారులు ప్రతి తరంలోనైనా ఉంటారు’’ అని టైమ్ వ్యాఖ్యానించింది. ∙∙ గీతాంజలిని ‘టైమ్’ పత్రిక.. సైంటిస్ట్, ఇన్వెంటర్ అని పేర్కొంది. అయితే సైంటిస్టుగా, ఇన్వెంటర్‌గా నేరుగా ల్యాబ్‌లోకి వెళ్లి కూర్చోలేదు గీతాంజలి. మొదట ఆమెక్కొన్ని ఆలోచనలు వచ్చాయి. మంచినీటి కాలుష్యాన్ని తగ్గించడం, కలుషిత కారకాలు అసలే లేకుండా చేయడం మొదటి ఆలోచన. ఆమెకు తొమ్మిదేళ్ల వయసులో వచ్చిన ఆలోచన అది. స్కూలు పిల్లల్లో ‘సైబర్ బుల్లీయింగ్’ను కనిపెట్టి ‘ఎడిట్’ చెయ్యడం పన్నెండేళ్ల వయసు లో ఆమెకు వచ్చిన రెండో ఆలోచన. ఈ రెండు ఆలోచనల మధ్యలో అనేక ఆలోచనలు చేసింది గీతాంజలి. ‘టెడ్ఎక్స్ టాక్’ షో లో గీతాంజలితో బాలీవుడ్ షారుక్‌ఖాన్ (గత ఏడాది) వీటన్నిటినీ టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నియంత్రించే పద్ధతుల్ని కనిపెట్టింది! తాగు నీటిలో ఉండే సీసం ఆరోగ్యానికి హాని చేసే రసాయన మూలకం. సీసం ప్రకృతి సిద్ధంగానే నీటిలో కలిసి ఉంటుంది. అయితే మోతాదుకు మించి ఉంటే ప్రమాదం. ఎలా తెలుస్తుంది మనకు, మన తాగే నీటిలో సీసం ఎంత ఉందన్నది?! దాన్ని తెలుసుకునేందుకు గీతాంజలి ‘టెథిస్’ అనే పరికరాన్ని కనిపెట్టింది! అసలైతే తాగునీటిలో సీసం సున్నా శాతం ఉండాలి కానీ, అది సాధ్యం కాదు కనుక పాయింట్ 24 మైక్రో మోలార్స్ కంటే మించకుండానైతే చూసుకోవాలి. టెథిస్‌తో అలా చూసుకోవడం, జాగ్రత్త పడటం సాధ్యమౌతుంది. బావికో, చెరువుకో వెళ్లి మంచినీళ్లను తోడుకునో, నింపుకునో తెచ్చుకునే కాలం నుంచి, ప్లాంట్ల నుంచి కొనుక్కునే కాలం లోకి ఏనాడో వచ్చిపడ్డాం. నీటిని అమ్మే పెద్ద పెద్ద ప్లాంట్ల వాళ్లు నీటి నుంచి సీసాన్ని తొలగించామనే చెబుతారు. అయితే నిజంగానే తొలగించారా, ఏ మేరకు తొలగించారు అని గీతాంజలి కనిపెట్టిన టెథిస్‌తో తెలుసుకోవచ్చు. టెథిస్ను క్యాన్లలోని నీటికి తాకిస్తే చాలు. మొబైల్‌కు కనెక్ట్ చేసుకున్న సెన్సర్ ద్వారా ఆ నీటిలో సీసం ఎంత మోతాదులో ఉన్నదీ డిస్ప్లే అవుతుంది. యు.ఎస్.లోని కొలరడోలో ఉంటున్న గీతాంజలికి ఈ ‘టెథిస్’ థాట్ 2014లో వచ్చింది. ఆ యేడాది మిషిగాన్‌లోని ఫ్లింట్ సిటీలో పురాతన కాలం నాటి పైపుల నుంచి సీసం నిల్వలు వచ్చి తాగునీటిలో కలవడంతో అనేకమంది జబ్బునపడటం ఆ చిన్నారిలో ఆలోచనలు రేపింది. అలాగే ‘సైబర్ బుల్లీయింగ్’పై నిఘాకు గీతాంజలి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థను కనిపెట్టడానికి కూడా స్కూల్లో తను చూసిన సంఘటనలే ప్రేరణ. లావుగా ఉన్నారని, పీలగా ఉన్నారని, బ్లాక్ పీపుల్ అని ఇలా సాటి విద్యార్థులను ఏడిపించేవారి నుంచి మనసు గాయపడకుండా తప్పించుకోవడం కోసం ‘కైండ్లీ’ అనే ఒక యాప్‌ను, క్రోమ్ ఎక్స్టెన్షన్ అనుసంధానం చేస్తూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని వృద్ధి చేసింది! ప్రధానంగా ఈ రెండు ఆవిష్కరణలు గీతాంజలిని ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’గా నిలిపాయి. ∙∙ గీతాంజలి తల్లిదండ్రులు ఉండేది కొలరడోలోని ‘లోన్ ట్రీ’ ప్రాంతంలో. గీతాంజలి అక్కడే పుట్టింది. ప్రస్తుతం అక్కడి ‘స్టెమ్ స్కూల్ హైలాండ్ రాంచ్’లో చదువుతోంది. బాల్యం నుంచే తనకు కొత్తకొత్త విషయాలను కనుక్కోవడం పై ఆసక్తి. కనుక్కునే అవసరాన్ని మాత్రం ఆమె చూసిన నిజ జీవిత ఘటనలు కలిగించాయి. జెనిటిక్స్ ఇంజినీరింగ్ చదువుతానని అంటోంది. వ్యసనాల మీద, ఉద్యోగాలలో స్త్రీ, పురుష వేతనాల్లోని వ్యత్యాసాల మీద ఈ వయసుకే ప్రసంగాలు కూడా ఇచ్చింది! ‘‘సమాజాన్ని అన్ని విధాలా ఆరోగ్యవంతంగా పునర్నిర్మించగల జ్ఞానం, వివేకం ఉన్న చిన్నారులే ఈ భూగోళం భవిష్యత్తు’’ అని టైమ్ ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ గా నిలిచిన సందర్భంగా గీతాంజలిని ఇంటర్వ్యూ చేసిన నటి ఏంజెలీనా జోలీ ఆమెను ప్రశంసిస్తూ అన్నారు. మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది గత ఏడాది కూడా ఇదే సమయానికి గీతాంజలి వార్తల్లో ఉంది. నవంబర్ 2 న షారుక్ ఖాన్ బర్త్‌డే. అదే రోజు స్టార్ ప్లస్‌లో ‘టెడ్ టాక్స్ ఇండియా సీజన్ 2 – నయీ బాత్ ప్రీమియర్ మొదలైంది. ‘డోంట్ కిల్ ఐడియాస్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ టెక్నాలజీ–ఎంటర్టైన్మెంట్–డిజైన్ (టి.ఇ.డి) టాక్ షో ప్రసారం అవుతుంటుంది. ఆ షోకి వ్యాఖ్యాత షారుక్‌ఖాన్. ఆ రోజు గెస్ట్ స్పీకర్ గీతాంజలీరావు. అవును స్పీకర్! అలా అమెరికాలో ఉన్న గీతాంజలికి ముంబైలో ఉన్న షారుక్ ఖాన్‌ను కలిసే అవకాశం వస్తే, ముంబైలో ఉన్న షారుక్‌కు అమెరికాలో ఉండే గీతాంజలిని కలిసే అవకాశం వచ్చింది. నిజంగా అవకాశంలానే ఫీల్ అయ్యారు షారుక్. ఆమె కనిపెట్టిన టెథిస్ పరికరం గురించి విని చాలా సంతోషపడిపోయారు. ‘మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది’ అని ప్రశంసించారు. టెథిస్ అంటే స్వచ్ఛమైన జలం అని అర్థం. గ్రీకుపురాణాల్లోని ఒక సముద్రం పేరు కూడా. ‘నా పిల్లలకీ చెబుతాను’ గీతాంజలి టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక అవగానే హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ టైమ్ తరఫున గీతాంజలిని ఇంటర్వ్యూ చేశారు. ప్రధానంగా ఆమె ‘సైబర్ బుల్లీయింగ్’ని అడ్డుకునేందుకు గీతాంజలి కనిపెట్టిన ‘కైండ్లీ’ యాప్ టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ ఫోన్ టెక్స్టింగ్లో బుల్లీయింగ్ని సూచించే పదాలను గీతాంజలి రూపొందించిన యాప్ డిలీట్ చేసి, ఆ తర్వాతే సెండ్ చేస్తుంది. అలా అప్షన్స్ని సెట్ చేసుకోవచ్చు. ఈ వయసు పిల్ల అంత టెక్నాలజీని కనిపెట్టడం ఏజెలీనాకు మురిపెంగా అనిపించింది. ‘అయితే ఈ యాప్ గురించి నా పిల్లలకీ చెబుతాను’ అని ఆమె అన్నారు. ‘నీ లక్ష్యం ఏమిటì గీతాంజలీ అని అడిగిన ప్రశ్నకు.. ‘‘భూగోళంపై సమస్యలన్నిటికీ పరిష్కారం కనిపెట్టే ఒక యంగ్ టీమ్‌ని నిర్మించడం’’ అని చెప్పింది గీతాంజలి. -
కట్, కాపీ, పేస్ట్ సృష్టికర్త లారీ టెస్లర్ మృతి
వాషింగ్టన్: ఆధునిక యుగంలో కట్, కాపీ, పేస్ట్ కీలు లేకుండా కంప్యూటర్ ఆధారిత కార్యకలాపాలను చేయలేము. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలను కనుగొనలేమన్న విషయం తెలిసిందే. అటువంటి కట్, కాపీ, పేస్ట్ కీలను కనుగొని ప్రపంచానికి అందించిన శాస్త్రవేత్త లారీ టెస్లర్ (74) మృతి చెందారు. టెస్లర్ 1945వ సంవత్సరం అమెరికాలో జన్మించారు. ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించారు. టెస్లర్ ఆపిల్, అమెజాన్, యాహూ, జిరాక్స్ సంస్థలల్లో పనిచేశారు. 1970 జిరాక్స్ పాలో ఆల్టో పరిశోధన కేంద్రంలో ఆయన పని చేసస్తున్న సమయంలో కట్, కాపీ, పేస్ట్ కీలు ఆవిష్కరించడానికి ఆలోచన వచ్చింది. ఆయన ఆపిల్ సంస్థలో లీసా, మాకింతోష్‌తో కలిసి ఇంటఫేస్ రూపకల్పనపై పనిచేశారు. దీంతో ఆయన ఆపిల్‌నెట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. టెస్లర్ అమెజాన్‌లో చేరే ముందు అతను స్టేజ్‌కాస్ట్ సాఫ్ట్వేర్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకులుగా పనిచేశారు. ఇది విద్యార్థులకు ప్రోగ్రామింగ్ నేర్పించే సంస్థ. ఆయన యాహూలో యూజర్స్ ఎక్సిపీరియన్స్ అండ్ రీసెర్చ్ విభాగానికి హెడ్‌గా పనిచేశారు. తన మరణానికి ముందు శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ కన్సల్టింగ్ సంస్థలో పని చేశారు. -
మొట్టమొదటి సెల్‌ఫోన్.. గ్రేట్ హిస్టరీ
సాక్షి : ఒక్క ఆవిష్కరణ... ప్రపంచ గతిని మార్చేసింది. వ్యాపార, విద్య, వినోద, మీడియా రంగాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. అదే.. సెల్‌ఫోన్! అరచేతిలో ఇమిడిపోతున్న ఈ వస్తువు చుట్టూ ప్రస్తుతం ప్రపంచం తిరుగుతోంది. మాములు ల్యాండ్ ఫోన్‌ను అలెగ్జాండర్ గ్రహంబెల్ రూపొందించాడన్న విషయం మనకు తెలిసిందే. మరి మొదటిసారి ప్రపంచానికి సెల్‌ఫోన్‌ను పరిచయం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..? ఆయనే మార్టిన్ కూపర్. ఆయన ఆలోచనల నుంచి పుట్టిన సెల్‌ఫోన్ ఇప్పుడు ఎన్నో మార్పులకు లోనై.. ఒక అద్భుతంగా మారింది. తన ఆవిష్కరణతో సాంకేతిక విప్లవానికి కారణమైన మార్టిన్ కూపర్ జీవిత విశేషాలు ఈరోజు ‘సైంటిస్ట్’లో మీకోసం... ప్రస్తుతం సమాచార విప్లవం ఒక స్థాయిలో ఉంది. ప్రపంచంలో ఎక్కడున్న వారితోనైనా, ఎక్కడి నుంచైనా ఎంతో సులభంగా మాట్లాడగలుగుతున్నాం. కానీ 1970కి ముందు ఇవన్నీ కనీసం ఊహకు కూడా అందని అద్భుతాలు. అప్పట్లో కేవలం ల్యాండ్ లైన్ ఫోన్ల ద్వారా మాత్రమే మాట్లాడగలిగేవారు. ఇప్పుడు ఇంతటీ సమూల మార్పుకు నాంది పలికిన తొలి వ్యక్తిగా మార్టిన్ కూపర్ నిలిచిపోతాడు. మొదటి సెల్‌ఫోన్ విశేషాలు... ⇒ మొదటగా తయారు చేసిన ఫోన్ బరువు 1.1 కిలోలు ⇒ ఈ ఫోన్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేయడానికి పదిగంటలు సమయం పట్టేది. దీంతో 30 నిమిషాలు మాట్లాడే వీలుండేది. ⇒ 1983లో మోటరోలా ‘డైమా టీఏసీ 8000 ఎక్స్’ పేరుతో తొలి కమర్షియల్ ఫోన్‌ను విడుదలచేసింది. దీని ధర అప్పట్లోనే సుమారు రూ.3లక్షలు. చిన్ననాటి నుంచే... మార్టిన్ కూపర్ 1928 డిసెంబర్26న అమెరికాలోని చికాగాలో జన్మించాడు. కూపర్‌కు చిన్ననాటి నుంచే టెక్నాలజీ మీద ఎంతో ఆసక్తి ఉండేది. అదే అతణ్ని అటువైపు నడిపించేలా చేసింది. కూపర్ ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. అనంతరం అమెరికా నేవీలో ఉద్యోగంలో చేరాడు. కానీ చదువు, ఆవిష్కరణలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగం మానేసి ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాడు. కమ్యూనికేషన్‌పై ఆసక్తితో... కూపర్‌కు ఆవిష్కరణలపై ఎంతో ఆసక్తి ఉండేది. మరీ ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థపై మక్కువ చూపేవాడు. దాంతో కొరియా యుద్ధం తర్వాత నేవీ నుంచి బయటకు వచ్చి ‘టెలిటైప్’ అనే కంపెనీలో చేరాడు. తర్వాత 1954లో అప్పట్లో ‘వైర్లెస్ కమ్యూనికేషన్’లో ప్రథమ స్థానంలో ఉన్న ‘మోటరోలా’ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. అక్కడ ఎన్నో ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్నాడు మార్టిన్. అందులో ‘రేడియో ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ’ చాలా గుర్తింపుపొందింది. న్యూయార్క్‌లో మొదటి పోలీస్ రేడియోలను తయారు చేసింది మార్టినే కావడం విశేషం. అనంతరం మోటరోలాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాడు మార్టిన్. ‘ఏటీ అండ్ టీ’ కంపెనీకి ధీటుగా.. అమెరికాకు చెందిన ‘ఏటీ అండ్ టీ’ కంపెనీ ఆ సమయంలోనే వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సరికొత్త ఒరవడిని సృష్టించింది. 1946లోనే మోబైల్ ఫోన్లపై పరిశోధనలు వేగవంతం చేసి ఒక మోబైల్ ఫోన్‌ను రూపొందించింది. కానీ వీటిని కేవలం కారులోనే ఉపయోగపడేలా రూపొందించారు. అది కూడా ఒకేసారి కేవలం పది మంది మాత్రమే మాట్లడ్డానికి వీలుండేది. దీంతో పాటు బ్యాటరీ సమస్య కూడా ఉండేది. ఏటీ అండ్ టీ కంపెనీ చేస్తోన్న పరిశోధనలు గమనించిన మోటరోలా కేవలం కారులోనే కాకుండా బయట కూడా ఉపయోగించుకునే సెల్‌ఫోన్‌ను రూపొందించాలనుకుంది. మార్టిన్ నేతృత్వంలో... ప్రత్యర్థి కంపెనీ ‘ఏటీ అండ్ టీ’ని అధిగమించడానికి మోటరోలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి సెల్‌ఫోన్ రూపకల్పనపై ప్రయోగాలను ముమ్మరం చేసింది. ఈ బృందానికి మార్టిన్ నేతృత్వం వహించాడు. ‘రేడియో ఫోన్ టెక్నాలజీ’కి సమానమైన సాంకేతికతో మార్టిన్ ‘డైనమిక్ అడాప్టిక్ టోటల్ కవరేజ్’ ఫోన్‌ని తయారు చేశాడు. ఇదే ప్రపంచంలో తయారు చేసిన తొలి సెల్‌ఫోన్. 1973 ఏప్రిల్ 3న మార్టిన్ తాను రూపొందించిన సెల్‌ఫోన్ ద్వారా మొదటి కాల్‌ను ప్రత్యర్థి కంపెనీ అయినా ‘ఏటీ అండ్ టీ’ అధిపతి జోయల్‌కు చేశాడు. జోయల్ ఫోన్ ఎత్తగానే ‘నేను మార్టిన్‌ను మాట్లాడుతున్నాను. న్యూయార్క్ స్ట్రీట్ నుంచి సెల్‌ఫోన్‌తో ఫోన్ చేస్తున్నాను. నా మొదటి కాల్ నీ ల్యాండ్‌లైన్‌కు చేస్తున్నాను‘అని ప్రత్యర్థి కంపెనీకి షాక్ ఇచ్చాడు మార్టిన్. దాంతో మార్టిన్ పేరు అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో మారుమోగిపోయింది. ఈ మొదటి ఫోన్ ధర ఆరోజుల్లోనే సుమారు రూ. 3 లక్షలు ఉండేది. అనంతరం మార్టిన్ తన భార్య అర్లెనే హారిస్‌తో కలిసి ‘డైనా ఎల్ఎల్సీ’ అనే కంపెనీని స్థాపించి సెల్ఫోన్లపై మరిన్ని ప్రయోగాలు చేస్తూ నూతన ఫోన్లను విడుదల చేశాడు. అవార్డులు.. సమాచార రంగంలో ఎన్నో మార్పులకు కారణమైన మార్టిన్‌కు ఎన్నో అవార్డులు వరించాయి. అందులో కొన్ని... 1984 – ఏఈఈఈ ఫెల్లోషిప్ 1995 – వార్టన్ ఇన్ఫోసిస్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్. 2002 – వైర్లెస్ సిస్టమ్స్ డిజైన్ ఇండస్ట్రీ లీడర్ అవార్డ్. 2006 – సీఐటీఏ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అవార్డ్. 2007 – గ్లోబల్ స్పెక్ గ్రేట్ మూమెంట్స్ ఇంజనీరింగ్ అవార్డ్. 2013 – మార్కొని అవార్డ్. -
360 డిగ్రీల్లో తిరిగే కొత్త కారు
కారు కొనాలనుకున్నవారు... ముందుగా దానికున్న విశిష్ట లక్షణాలను గమనిస్తారు. ముఖ్యంగా అందులోని ఆధునిక పరిజ్ఞానానికీ ప్రాధాన్యతనిస్తారు. అందుకే వాహన ప్రేమికులంతా ఇష్టపడే విధంగా లండన్ కు చెందిన ఓ వ్యక్తి కొత్తరకం కారును సృష్టించాడు. ప్రధానంగా 360 డిగ్రీల్లో చక్రాలు ఏ దిశకైనా తిరిగేలా ఏర్పాటు చేసి, తక్కువ స్థలంలో కూడా కారు అన్నివైపులకూ తిరిగేలా రూపొందించాడు. లండన్ కు చెందిన విలియం లిడ్డియార్డ్.. నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ఫోర్క్ లిఫ్ట్ వాహనాల్లో వినియోగించే వోమిని డైరెక్షనల్ చక్రాలను పెట్టి, తయారు చేసిన ఆ కారు.. 360 డిగ్రీల్లో ఎటుపక్కకైనా సులభంగా తిరిగేట్టు ఏర్పాటు చేశాడు. అడ్డంగా పార్క్ చేయాల్సి వచ్చినపుడు సైతం ఇబ్బంది పడకుండా పక్కకు జరిపేందుకు వీలుగా కారు వీల్స్ ను రూపొందించాడు. సాధారణ కార్లకు వినియోగించే చక్రాల్లా కాకుండా... తాను వినియోగించిన చక్రాలు ఏ దిశకైనా తిరుగుతాయని, బోల్ట్ ఆన్ ఆప్లికేషన్ ను వినియోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఈ నూతన ఆవిష్కరణకు నాంది పలికినట్లు లిడ్డియార్డ్ చెప్తున్నాడు. పాత టయోటా కారుకు తాను రూపొందించి కొత్తరకం వీల్స్ ను పెట్టి, ట్రయల్ రన్ వేసిన అతడు.. ఆ వీడియోను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి, అందుకు సంబంధించిన వివరణ ఇచ్చాడు. సాధారణ కారుకు వేగంలోనూ, పనిచేసే తీరులోనూ ఏమాత్రం తీసిపోదని, అంతకంటే ఎక్కువ నియంత్రణా సామర్థ్యం కూడా కలిగి ఉంటుందని చెప్తున్నాడు. విలియమ్స్ కొత్త ప్రయోగం.. ఇప్పుడు యూట్యూబ్ లో లక్షలకొద్దీ వ్యూయర్లను ఆకట్టుకుంటోంది. అతడు పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే నాలుగు లక్షలమంది వరకూ తిలకించడం ఎంతో ఆనందంగా ఉందని, తన నూతన ఆవిష్కరణ 'లిడ్డర్డ్ వీల్స్' కు సోషల్ మీడియా సహాయపడుతుందని ఆశిస్తున్నాడు. తన కొత్త సృష్టిని ఏదైనా కంపెనీ ప్రోత్సహిస్గే వారితో కలసి అభివృద్ధి పరిచి, కొత్తరకం కారును మార్కెట్లోకి తేవాలని ఎదురు చూస్తున్నాడు. మార్కెట్లో ప్రవేశ పెడితే తన వీల్స్ కు ఎంతో డిమాండ్ వస్తుందని ధీమాగా చెప్తున్నాడు.