తాను తయారుచేసిన మొట్టమొదటి సెల్‌ఫోన్‌తో మార్టిన్ కూపర్
సాక్షి : ఒక్క ఆవిష్కరణ... ప్రపంచ గతిని మార్చేసింది. వ్యాపార, విద్య, వినోద, మీడియా రంగాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. అదే.. సెల్‌ఫోన్! అరచేతిలో ఇమిడిపోతున్న ఈ వస్తువు చుట్టూ ప్రస్తుతం ప్రపంచం తిరుగుతోంది. మాములు ల్యాండ్ ఫోన్‌ను అలెగ్జాండర్ గ్రహంబెల్ రూపొందించాడన్న విషయం మనకు తెలిసిందే. మరి మొదటిసారి ప్రపంచానికి సెల్‌ఫోన్‌ను పరిచయం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..? ఆయనే మార్టిన్ కూపర్. ఆయన ఆలోచనల నుంచి పుట్టిన సెల్‌ఫోన్ ఇప్పుడు ఎన్నో మార్పులకు లోనై.. ఒక అద్భుతంగా మారింది. తన ఆవిష్కరణతో సాంకేతిక విప్లవానికి కారణమైన మార్టిన్ కూపర్ జీవిత విశేషాలు ఈరోజు ‘సైంటిస్ట్’లో మీకోసం...
ప్రస్తుతం సమాచార విప్లవం ఒక స్థాయిలో ఉంది. ప్రపంచంలో ఎక్కడున్న వారితోనైనా, ఎక్కడి నుంచైనా ఎంతో సులభంగా మాట్లాడగలుగుతున్నాం. కానీ 1970కి ముందు ఇవన్నీ కనీసం ఊహకు కూడా అందని అద్భుతాలు. అప్పట్లో కేవలం ల్యాండ్ లైన్ ఫోన్ల ద్వారా మాత్రమే మాట్లాడగలిగేవారు. ఇప్పుడు ఇంతటీ సమూల మార్పుకు నాంది పలికిన తొలి వ్యక్తిగా మార్టిన్ కూపర్ నిలిచిపోతాడు.
మొదటి సెల్‌ఫోన్ విశేషాలు...
⇒ మొదటగా తయారు చేసిన ఫోన్ బరువు 1.1 కిలోలు
⇒ ఈ ఫోన్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేయడానికి పదిగంటలు సమయం పట్టేది. దీంతో 30 నిమిషాలు మాట్లాడే వీలుండేది.
⇒ 1983లో మోటరోలా ‘డైమా టీఏసీ 8000 ఎక్స్’ పేరుతో తొలి కమర్షియల్ ఫోన్‌ను విడుదలచేసింది. దీని ధర అప్పట్లోనే సుమారు రూ.3లక్షలు.
చిన్ననాటి నుంచే... మార్టిన్ కూపర్ 1928 డిసెంబర్26న అమెరికాలోని చికాగాలో జన్మించాడు. కూపర్‌కు చిన్ననాటి నుంచే టెక్నాలజీ మీద ఎంతో ఆసక్తి ఉండేది. అదే అతణ్ని అటువైపు నడిపించేలా చేసింది. కూపర్ ఇలినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. అనంతరం అమెరికా నేవీలో ఉద్యోగంలో చేరాడు. కానీ చదువు, ఆవిష్కరణలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగం మానేసి ఇలినాయిస్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాడు.
కమ్యూనికేషన్‌పై ఆసక్తితో... కూపర్‌కు ఆవిష్కరణలపై ఎంతో ఆసక్తి ఉండేది. మరీ ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థపై మక్కువ చూపేవాడు. దాంతో కొరియా యుద్ధం తర్వాత నేవీ నుంచి బయటకు వచ్చి ‘టెలిటైప్’ అనే కంపెనీలో చేరాడు. తర్వాత 1954లో అప్పట్లో ‘వైర్‌లెస్ కమ్యూనికేషన్’లో ప్రథమ స్థానంలో ఉన్న ‘మోటరోలా’ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. అక్కడ ఎన్నో ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్నాడు మార్టిన్. అందులో ‘రేడియో ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ’ చాలా గుర్తింపుపొందింది. న్యూయార్క్‌లో మొదటి పోలీస్ రేడియోలను తయారు చేసింది మార్టినే కావడం విశేషం. అనంతరం మోటరోలాలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాడు మార్టిన్.
‘ఏటీ అండ్ టీ’ కంపెనీకి ధీటుగా.. అమెరికాకు చెందిన ‘ఏటీ అండ్ టీ’ కంపెనీ ఆ సమయంలోనే వైర్‌లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సరికొత్త ఒరవడిని సృష్టించింది. 1946లోనే మోబైల్ ఫోన్‌లపై పరిశోధనలు వేగవంతం చేసి ఒక మోబైల్ ఫోన్‌ను రూపొందించింది. కానీ వీటిని కేవలం కారులోనే ఉపయోగపడేలా రూపొందించారు. అది కూడా ఒకేసారి కేవలం పది మంది మాత్రమే మాట్లడ్డానికి వీలుండేది. దీంతో పాటు బ్యాటరీ సమస్య కూడా ఉండేది. ఏటీ అండ్ టీ కంపెనీ చేస్తోన్న పరిశోధనలు గమనించిన మోటరోలా కేవలం కారులోనే కాకుండా బయట కూడా ఉపయోగించుకునే సెల్‌ఫోన్‌ను రూపొందించాలనుకుంది.
మార్టిన్ నేతృత్వంలో... ప్రత్యర్థి కంపెనీ ‘ఏటీ అండ్ టీ’ని అధిగమించడానికి మోటరోలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి సెల్‌ఫోన్ రూపకల్పనపై ప్రయోగాలను ముమ్మరం చేసింది. ఈ బృందానికి మార్టిన్ నేతృత్వం వహించాడు. ‘రేడియో ఫోన్ టెక్నాలజీ’కి సమానమైన సాంకేతికతో మార్టిన్ ‘డైనమిక్ అడాప్టిక్ టోటల్ కవరేజ్’ ఫోన్‌ని తయారు చేశాడు. ఇదే ప్రపంచంలో తయారు చేసిన తొలి సెల్‌ఫోన్. 1973 ఏప్రిల్ 3న మార్టిన్ తాను రూపొందించిన సెల్‌ఫోన్ ద్వారా మొదటి కాల్‌ను ప్రత్యర్థి కంపెనీ అయినా ‘ఏటీ అండ్ టీ’ అధిపతి జోయల్‌కు చేశాడు. జోయల్ ఫోన్ ఎత్తగానే ‘నేను మార్టిన్‌ను మాట్లాడుతున్నాను. న్యూయార్క్ స్ట్రీట్ నుంచి సెల్‌ఫోన్‌తో ఫోన్ చేస్తున్నాను. నా మొదటి కాల్ నీ ల్యాండ్‌లైన్‌కు చేస్తున్నాను‘అని ప్రత్యర్థి కంపెనీకి షాక్ ఇచ్చాడు మార్టిన్. దాంతో మార్టిన్ పేరు అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో మారుమోగిపోయింది. ఈ మొదటి ఫోన్ ధర ఆరోజుల్లోనే సుమారు రూ. 3 లక్షలు ఉండేది. అనంతరం మార్టిన్ తన భార్య అర్లెనే హారిస్‌తో కలిసి ‘డైనా ఎల్‌ఎల్‌సీ’ అనే కంపెనీని స్థాపించి సెల్‌ఫోన్‌లపై మరిన్ని ప్రయోగాలు చేస్తూ నూతన ఫోన్లను విడుదల చేశాడు.
అవార్డులు..
సమాచార రంగంలో ఎన్నో మార్పులకు కారణమైన మార్టిన్‌కు ఎన్నో అవార్డులు వరించాయి. అందులో కొన్ని...
- 1984 – ఏఈఈఈ ఫెల్లోషిప్
- 1995 – వార్టన్ ఇన్‌ఫోసిస్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ అవార్డ్.
- 2002 – వైర్‌లెస్ సిస్టమ్స్ డిజైన్ ఇండస్ట్రీ లీడర్ అవార్డ్.
- 2006 – సీఐటీఏ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అవార్డ్.
- 2007 – గ్లోబల్ స్పెక్ గ్రేట్ మూమెంట్స్ ఇంజనీరింగ్ అవార్డ్.
- 2013 – మార్కొని అవార్డ్.
Comments
Please login to add a commentAdd a comment