ముఖచిత్ర మకుటం | Indian-American Gitanjali Rao named first-ever TIME Kid of the Year | Sakshi
Sakshi News home page

ముఖచిత్ర మకుటం

Published Sat, Dec 5 2020 12:54 AM | Last Updated on Sat, Dec 5 2020 5:29 AM

Indian-American Gitanjali Rao named first-ever TIME Kid of the Year - Sakshi

టైమ్‌ ముఖచిత్రంగా గీతాంజలీరావు

మూడేళ్ల వయసులో తల్లి అడిగింది. ‘బేబీ.. సిక్‌ అయిన వాళ్లకు నువ్వెలా నయం చేస్తావ్‌?’ అని. ‘మ్యూజిక్‌ వినిపిస్తాను’ అంది గీతాంజలి! పియానో చక్కగా ప్లే చేస్తుంది ఇప్పటికీ తను. గీతాంజలికి ఇప్పుడు పదిహేనేళ్లు. మ్యూజిక్‌లోంచి సైన్స్‌ చేసే మ్యాజిక్‌లోకి వచ్చేసింది. సైంటిస్ట్, ఇన్వెంటర్‌ తనిప్పుడు! స్కూల్‌కి వెళ్లొస్తూనే ప్రపంచాన్ని మలుస్తోంది. భూగోళంపై ఎన్నో సమస్యలు. వాటి పరిష్కారానికి ఒక టీమ్‌ని నిర్మిస్తానంటోంది.. ఈ ‘టైమ్‌ కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘టైమ్‌’ పత్రిక తరచు కొన్ని ప్రత్యేకమైన ముఖచిత్రాలతో వెలువడుతుంటుంది. ఈ సోమవారం మరింత ప్రత్యేకమైన ముఖచిత్రంతో కొత్త సంచిక మార్కెట్‌లోకి రాబోతోంది. అయితే ఆ ప్రత్యేకత ‘టైమ్‌’ పత్రిక వల్ల ఆ ముఖచిత్రానికి వచ్చింది కాక, ముఖచిత్రం వల్ల టైమ్‌ పత్రికకు వచ్చినది! ‘కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా పదిహేనేళ్ల భారతీయ బాలిక గీతాంజలీరావును ‘టైమ్‌’పత్రిక ఎంపిక చేయడమే అందుకు కారణం. ‘టైమ్‌’ కే ఒక కిరీటం అయినట్లుగా ముఖచిత్రంపై ఆత్మవిశ్వాసపు దృక్కులతో మందస్మిత గంభీరంగా కూర్చొని ఉంది చిన్నారి గీతాంజలి.

ఆన్‌లైన్‌లో గీతాంజలితో ఏంజెలీనా.

‘కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ టైటిల్‌తో ‘టైమ్‌’ ఇలా ఒక ముఖచిత్రాన్ని వెయ్యడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల మంది చిన్నారుల ప్రతిభా సామర్థ్యాలను పరిశీలించి, విశ్లేషించి, వడపోసి గీతాంజలిని ఎంపిక చేసింది టైమ్‌. గీతాంజలి కొన్ని సామాజిక, నిత్యజీవితావసరాల్లో మిళితమై ఉన్న సమస్యలకు పరిష్కారం కనిపెట్టింది. అవే ఆమెను తక్కిన చిన్నారుల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ‘‘ప్రపంచాన్ని ఎవరైతే మలుచుతారో వారిదే ఈ ప్రపంచం. ప్రపంచం ఏ విధమైన అస్థిరతలో ఉన్నా, అందుకొక పరిష్కారాన్ని చూపే చిన్నారులు ప్రతి తరంలోనైనా ఉంటారు’’ అని టైమ్‌ వ్యాఖ్యానించింది.
∙∙
గీతాంజలిని ‘టైమ్‌’ పత్రిక.. సైంటిస్ట్, ఇన్వెంటర్‌ అని పేర్కొంది. అయితే సైంటిస్టుగా, ఇన్వెంటర్‌గా నేరుగా ల్యాబ్‌లోకి వెళ్లి కూర్చోలేదు గీతాంజలి. మొదట ఆమెక్కొన్ని ఆలోచనలు వచ్చాయి. మంచినీటి కాలుష్యాన్ని తగ్గించడం, కలుషిత కారకాలు అసలే లేకుండా చేయడం మొదటి ఆలోచన. ఆమెకు తొమ్మిదేళ్ల వయసులో వచ్చిన ఆలోచన అది. స్కూలు పిల్లల్లో ‘సైబర్‌ బుల్లీయింగ్‌’ను కనిపెట్టి ‘ఎడిట్‌’ చెయ్యడం పన్నెండేళ్ల వయసు లో ఆమెకు వచ్చిన రెండో ఆలోచన. ఈ రెండు ఆలోచనల మధ్యలో అనేక ఆలోచనలు చేసింది గీతాంజలి.


‘టెడ్‌ఎక్స్‌ టాక్‌’ షో లో గీతాంజలితో బాలీవుడ్‌ షారుక్‌ఖాన్‌ (గత ఏడాది)
 

వీటన్నిటినీ టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో నియంత్రించే పద్ధతుల్ని కనిపెట్టింది! తాగు నీటిలో ఉండే సీసం ఆరోగ్యానికి హాని చేసే రసాయన మూలకం. సీసం ప్రకృతి సిద్ధంగానే నీటిలో కలిసి ఉంటుంది. అయితే మోతాదుకు మించి ఉంటే ప్రమాదం. ఎలా తెలుస్తుంది మనకు, మన తాగే నీటిలో సీసం ఎంత ఉందన్నది?! దాన్ని తెలుసుకునేందుకు గీతాంజలి ‘టెథిస్‌’ అనే పరికరాన్ని కనిపెట్టింది! అసలైతే తాగునీటిలో సీసం సున్నా శాతం ఉండాలి కానీ, అది సాధ్యం కాదు కనుక పాయింట్‌ 24 మైక్రో మోలార్స్‌ కంటే మించకుండానైతే చూసుకోవాలి.

టెథిస్‌తో అలా చూసుకోవడం, జాగ్రత్త పడటం సాధ్యమౌతుంది. బావికో, చెరువుకో వెళ్లి మంచినీళ్లను తోడుకునో, నింపుకునో తెచ్చుకునే కాలం నుంచి, ప్లాంట్‌ల నుంచి కొనుక్కునే కాలం లోకి ఏనాడో వచ్చిపడ్డాం. నీటిని అమ్మే పెద్ద పెద్ద ప్లాంట్‌ల వాళ్లు నీటి నుంచి సీసాన్ని తొలగించామనే చెబుతారు. అయితే నిజంగానే తొలగించారా, ఏ మేరకు తొలగించారు అని గీతాంజలి కనిపెట్టిన టెథిస్‌తో తెలుసుకోవచ్చు. టెథిస్‌ను క్యాన్‌లలోని నీటికి తాకిస్తే చాలు. మొబైల్‌కు కనెక్ట్‌ చేసుకున్న సెన్సర్‌ ద్వారా ఆ నీటిలో సీసం ఎంత మోతాదులో ఉన్నదీ డిస్‌ప్లే అవుతుంది. యు.ఎస్‌.లోని కొలరడోలో ఉంటున్న గీతాంజలికి ఈ ‘టెథిస్‌’ థాట్‌ 2014లో వచ్చింది.

ఆ యేడాది మిషిగాన్‌లోని ఫ్లింట్‌ సిటీలో పురాతన కాలం నాటి పైపుల నుంచి సీసం నిల్వలు వచ్చి తాగునీటిలో కలవడంతో అనేకమంది జబ్బునపడటం ఆ చిన్నారిలో ఆలోచనలు రేపింది. అలాగే ‘సైబర్‌ బుల్లీయింగ్‌’పై నిఘాకు గీతాంజలి ఒక ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను కనిపెట్టడానికి కూడా స్కూల్లో తను చూసిన సంఘటనలే ప్రేరణ. లావుగా ఉన్నారని, పీలగా ఉన్నారని, బ్లాక్‌ పీపుల్‌ అని ఇలా సాటి విద్యార్థులను ఏడిపించేవారి నుంచి మనసు గాయపడకుండా తప్పించుకోవడం కోసం ‘కైండ్‌లీ’ అనే ఒక యాప్‌ను, క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ అనుసంధానం చేస్తూ ఒక ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీని వృద్ధి చేసింది! ప్రధానంగా ఈ రెండు ఆవిష్కరణలు గీతాంజలిని ‘కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా నిలిపాయి.
∙∙
గీతాంజలి తల్లిదండ్రులు ఉండేది కొలరడోలోని ‘లోన్‌ ట్రీ’ ప్రాంతంలో. గీతాంజలి అక్కడే పుట్టింది. ప్రస్తుతం అక్కడి ‘స్టెమ్‌ స్కూల్‌ హైలాండ్‌ రాంచ్‌’లో చదువుతోంది. బాల్యం నుంచే తనకు కొత్తకొత్త విషయాలను కనుక్కోవడం పై ఆసక్తి. కనుక్కునే అవసరాన్ని మాత్రం ఆమె చూసిన నిజ జీవిత ఘటనలు కలిగించాయి. జెనిటిక్స్‌ ఇంజినీరింగ్‌ చదువుతానని అంటోంది. వ్యసనాల మీద, ఉద్యోగాలలో స్త్రీ, పురుష వేతనాల్లోని వ్యత్యాసాల మీద ఈ వయసుకే ప్రసంగాలు కూడా ఇచ్చింది! ‘‘సమాజాన్ని అన్ని విధాలా ఆరోగ్యవంతంగా పునర్నిర్మించగల జ్ఞానం, వివేకం ఉన్న చిన్నారులే ఈ భూగోళం భవిష్యత్తు’’ అని టైమ్‌ ‘కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ గా నిలిచిన సందర్భంగా గీతాంజలిని ఇంటర్వ్యూ చేసిన నటి ఏంజెలీనా జోలీ ఆమెను ప్రశంసిస్తూ అన్నారు.                        


మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది
గత ఏడాది కూడా ఇదే సమయానికి గీతాంజలి వార్తల్లో ఉంది. నవంబర్‌ 2 న షారుక్‌ ఖాన్‌ బర్త్‌డే. అదే రోజు స్టార్‌ ప్లస్‌లో ‘టెడ్‌ టాక్స్‌ ఇండియా సీజన్‌ 2 – నయీ బాత్‌ ప్రీమియర్‌ మొదలైంది. ‘డోంట్‌ కిల్‌ ఐడియాస్‌’ అనే ట్యాగ్‌ లైన్‌తో ఈ టెక్నాలజీ–ఎంటర్‌టైన్‌మెంట్‌–డిజైన్‌ (టి.ఇ.డి) టాక్‌ షో ప్రసారం అవుతుంటుంది. ఆ షోకి వ్యాఖ్యాత షారుక్‌ఖాన్‌. ఆ రోజు గెస్ట్‌ స్పీకర్‌ గీతాంజలీరావు. అవును స్పీకర్‌! అలా అమెరికాలో ఉన్న గీతాంజలికి ముంబైలో ఉన్న షారుక్‌ ఖాన్‌ను కలిసే అవకాశం వస్తే, ముంబైలో ఉన్న షారుక్‌కు అమెరికాలో ఉండే గీతాంజలిని కలిసే అవకాశం వచ్చింది. నిజంగా అవకాశంలానే ఫీల్‌ అయ్యారు షారుక్‌. ఆమె కనిపెట్టిన టెథిస్‌ పరికరం గురించి విని చాలా సంతోషపడిపోయారు. ‘మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది’ అని ప్రశంసించారు. టెథిస్‌ అంటే స్వచ్ఛమైన జలం అని అర్థం. గ్రీకుపురాణాల్లోని ఒక సముద్రం పేరు కూడా.  


‘నా పిల్లలకీ చెబుతాను’
గీతాంజలి టైమ్‌ కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపిక అవగానే హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీ టైమ్‌ తరఫున గీతాంజలిని ఇంటర్వ్యూ చేశారు. ప్రధానంగా ఆమె ‘సైబర్‌ బుల్లీయింగ్‌’ని అడ్డుకునేందుకు గీతాంజలి కనిపెట్టిన ‘కైండ్‌లీ’ యాప్‌ టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ టెక్స్‌టింగ్‌లో బుల్లీయింగ్‌ని సూచించే పదాలను గీతాంజలి రూపొందించిన యాప్‌ డిలీట్‌ చేసి, ఆ తర్వాతే సెండ్‌ చేస్తుంది. అలా అప్షన్స్‌ని సెట్‌ చేసుకోవచ్చు. ఈ వయసు పిల్ల అంత టెక్నాలజీని కనిపెట్టడం ఏజెలీనాకు మురిపెంగా అనిపించింది. ‘అయితే ఈ యాప్‌ గురించి నా పిల్లలకీ చెబుతాను’ అని ఆమె అన్నారు. ‘నీ లక్ష్యం ఏమిటì  గీతాంజలీ అని అడిగిన ప్రశ్నకు.. ‘‘భూగోళంపై సమస్యలన్నిటికీ పరిష్కారం కనిపెట్టే ఒక యంగ్‌ టీమ్‌ని నిర్మించడం’’ అని చెప్పింది గీతాంజలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement