360 డిగ్రీల్లో తిరిగే కొత్త కారు
కారు కొనాలనుకున్నవారు... ముందుగా దానికున్న విశిష్ట లక్షణాలను గమనిస్తారు. ముఖ్యంగా అందులోని ఆధునిక పరిజ్ఞానానికీ ప్రాధాన్యతనిస్తారు. అందుకే వాహన ప్రేమికులంతా ఇష్టపడే విధంగా లండన్ కు చెందిన ఓ వ్యక్తి కొత్తరకం కారును సృష్టించాడు. ప్రధానంగా 360 డిగ్రీల్లో చక్రాలు ఏ దిశకైనా తిరిగేలా ఏర్పాటు చేసి, తక్కువ స్థలంలో కూడా కారు అన్నివైపులకూ తిరిగేలా రూపొందించాడు.
లండన్ కు చెందిన విలియం లిడ్డియార్డ్.. నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ఫోర్క్ లిఫ్ట్ వాహనాల్లో వినియోగించే వోమిని డైరెక్షనల్ చక్రాలను పెట్టి, తయారు చేసిన ఆ కారు.. 360 డిగ్రీల్లో ఎటుపక్కకైనా సులభంగా తిరిగేట్టు ఏర్పాటు చేశాడు. అడ్డంగా పార్క్ చేయాల్సి వచ్చినపుడు సైతం ఇబ్బంది పడకుండా పక్కకు జరిపేందుకు వీలుగా కారు వీల్స్ ను రూపొందించాడు. సాధారణ కార్లకు వినియోగించే చక్రాల్లా కాకుండా... తాను వినియోగించిన చక్రాలు ఏ దిశకైనా తిరుగుతాయని, బోల్ట్ ఆన్ ఆప్లికేషన్ ను వినియోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఈ నూతన ఆవిష్కరణకు నాంది పలికినట్లు లిడ్డియార్డ్ చెప్తున్నాడు. పాత టయోటా కారుకు తాను రూపొందించి కొత్తరకం వీల్స్ ను పెట్టి, ట్రయల్ రన్ వేసిన అతడు.. ఆ వీడియోను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి, అందుకు సంబంధించిన వివరణ ఇచ్చాడు. సాధారణ కారుకు వేగంలోనూ, పనిచేసే తీరులోనూ ఏమాత్రం తీసిపోదని, అంతకంటే ఎక్కువ నియంత్రణా సామర్థ్యం కూడా కలిగి ఉంటుందని చెప్తున్నాడు.
విలియమ్స్ కొత్త ప్రయోగం.. ఇప్పుడు యూట్యూబ్ లో లక్షలకొద్దీ వ్యూయర్లను ఆకట్టుకుంటోంది. అతడు పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే నాలుగు లక్షలమంది వరకూ తిలకించడం ఎంతో ఆనందంగా ఉందని, తన నూతన ఆవిష్కరణ 'లిడ్డర్డ్ వీల్స్' కు సోషల్ మీడియా సహాయపడుతుందని ఆశిస్తున్నాడు. తన కొత్త సృష్టిని ఏదైనా కంపెనీ ప్రోత్సహిస్గే వారితో కలసి అభివృద్ధి పరిచి, కొత్తరకం కారును మార్కెట్లోకి తేవాలని ఎదురు చూస్తున్నాడు. మార్కెట్లో ప్రవేశ పెడితే తన వీల్స్ కు ఎంతో డిమాండ్ వస్తుందని ధీమాగా చెప్తున్నాడు.