ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో మనమే టాప్
- నామ్ విధానంతో రైతులకు మద్దతు ధ ర: మంత్రి హరీశ్
- రైతు బజార్ వ్యవస్థను విస్తరిస్తాం
- విడతలవారీగా రెవెన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు
- నామ్‌పై రెండ్రోజుల శిక్షణ తరగతులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, హర్యానా మాత్రమే మన రాష్ట్రంతో పోటీ పడుతోందని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ (నామ్) విధానంపై రెండ్రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులను మంత్రి బుధవారమిక్కడ ప్రారంభించారు. కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా 214 వ్యవసాయ మార్కెట్ యార్డులను అనుసంధానం చేస్తూ నామ్‌ను ప్రారంభించిందని, రాష్ట్రంలో 44 మార్కెట్లను కింద ఎంపిక చేయగా వాటిలో ఐదు మార్కెట్ యార్డుల్లో ప్రయోగాత్మకంగా ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని మంత్రి వివరించారు. ఏకీకృత లెసైన్సు, ఒకేసారి మార్కెట్ ఫీజు వసూలు తదితరాలు నామ్ ప్రత్యేకతలని పేర్కొన్నారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను మద్దతు ధరకు అమ్ముకునే అవకాశం ఉందని.. తద్వారా దళారీ వ్యవస్థ నిర్మూలించవచ్చన్నారు. మార్కెటింగ్ కార్యకలాపాల్లో పారదర్శకత పెంచడంతో పాటు రైతులకు లాభం కలిగేలా నూతన విధానం ఉంటుందని చెప్పారు.
సంస్కరణల కోసం అస్కితో ఒప్పందం
నూతన సంస్కరణలు, విధానాలు ప్రవేశ పెట్టడం ద్వారా మార్కెటింగ్ శాఖను బలోపేతం చేస్తామని, అందులో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(అస్కి)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హరీశ్ తెలిపారు. మార్కెటింగ్ లావాదేవీల్లో మార్గదర్శకాలను సులభతరం చేసేందుకు అవసరమైన సూచనలు, సలహాల కోసం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంతో చర్చలు జరుపుతున్నామన్నారు. పెసర సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్ సంస్థలు ఎఫ్‌సీఐ, నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ సుముఖత వ్యక్తం చేశారన్నారు.
రైతు బజారు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, తొలి విడతలో రెవెన్యూ డివిజన్లలో.. మలి విడతలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కూరగాయల ధరలను స్థిరీకరించేందుకు హైదరాబాద్‌లో ‘మన కూరగాయలు’ పథకం కింద వంద విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,024 కోట్ల వ్యయంతో 330 గోదాములు నిర్మిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అస్కి చైర్మన్ పద్మనాభయ్య, మార్కెటింగ్ డెరైక్టర్ డాక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.