ఔను.. 6 నెలలకు సీఎం మారడం గ్యారంటీ | Telangana: Minister Harish Rao Comments On Congress 6 Guarantee Schemes - Sakshi
Sakshi News home page

ఔను.. 6 నెలలకు సీఎం మారడం గ్యారంటీ

Published Wed, Sep 20 2023 3:57 AM | Last Updated on Wed, Sep 20 2023 7:18 PM

Minister Harish Rao Comments on Congress 6 Guarantee Schemesme - Sakshi

పెద్దశంకరంపేట (మెదక్‌) / కంగ్టి (నారాయణఖేడ్‌): కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ కార్డు పథకాలపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ కార్డులు అమలు కావని, ఆరు నెలలకు ముఖ్యమంత్రి మారడం మాత్రం గారంటీ అని విమర్శించారు.

అదేవిధంగా 6 నెలలకు ఒక కర్ఫ్యూ, రైతులకు 6 గంటల కరెంటు, పరిశ్రమలకు వారానికి రెండు పవర్‌ హాలిడేలు ఉండటం మాత్రం గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. మంగళవారం మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట, సంగారెడ్డి జిల్లా కంగ్టిలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎలాగూ అధికారంలోకి రాలేమని తెలిసి కాంగ్రెస్‌ నేతలు కల్లగోల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. 

ఇక రెండో రాజధాని బెంగళూరు అవుతుందేమో 
ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకమాండ్‌ అవుతుందని, దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లాలంటే వయా బెంగళూరు మీదుగా వెళ్లాలని, ఇక బెంగళూరు మనకు రెండో రాజధాని అవుతుందని హరీశ్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ హామీలు పోస్టుడేటెడ్‌ చెక్కులాంటివన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉండి రూ.600లు పింఛన్‌ ఇస్తున్న ఆ పార్టీ.. తెలంగాణలో రూ.4000 ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ ప్రస్తుతం అక్కడ బస్సులు తగ్గించారన్నారు. బీఆర్‌ఎస్‌ 24 గంటలూ ఉచిత కరెంటు సరఫరా చేస్తుందని, గతంలో ఉచిత కరెంటు హామీ ఇచి్చన కాంగ్రెస్‌ అధికారంలో ఉండి ఉత్త కరెంటు ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. కిట్లు ఇచ్చే వారు కావాలో, కేసీఆర్‌ను తిట్టే వారు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. త్వరలో బీఆర్‌ఎస్‌ నుంచి అద్భుతమైన మేనిఫెస్టో వస్తుందని వెల్లడించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement