సాక్షి, అమరావతి: చుక్కలనంటుతున్న టమాటా ధరల నుంచి వినియోగదారులకు ఊరట లభిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా రూ.100 దాటింది. దీంతో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం కింద రైతుల నుంచి టమాటాను సేకరించి కిలో రూ.50 చొప్పున సబ్సిడీ ధరపై వినియోగదారులకు అందిస్తోంది. తొలుత కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోని రైతుబజార్లలో సబ్సిడీ టమాటా విక్రయాలు ప్రారంభించగా.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లోని రైతుబజార్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికభారమైనప్పటికీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మదనపల్లి, పలమనేరు తదితర మార్కెట్లలో రైతుల నుంచి కిలో రూ.98 నుంచి రూ.104 చొప్పున చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇలా గడిచిన నాలుగు రోజుల్లో 95 టన్నులు సేకరించారు. శుక్రవారం 36 టన్నులు సేకరించి.. బహిరంగ మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉన్న విశాఖపట్నం జిల్లాకు 20 టన్నులు, ఎన్టీఆర్ జిల్లాకు ఆరు, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు ఐదేసి టన్నుల చొప్పున తరలించి స్థానిక రైతుబజార్ల ద్వారా కిలో రూ.50 చొప్పున విక్రయించారు.
శనివారం నుంచి రోజు 50 టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే నాలుగైదు రోజులు విశాఖ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు అన్నమయ్య, వైఎస్సార్, ప్రకాశం జిల్లాలకు స్థానిక అవసరాలకు తగినట్లు టమాటా నిల్వలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై ప్రభుత్వం నిఘా పెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులతో కూడిన బృందాల ద్వారా తనిఖీలకు శ్రీకారం చుడుతోంది. టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలను సీఎం యాప్‌ద్వారా నిత్యం సమీక్షిస్తూ ధరల నియంత్రణకు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment