సాక్షి, అమరావతి/కృష్ణలంక(విజయవాడ తూర్పు): వినియోగదారులపై భారం పడకూడదనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీపై టమాటాల విక్రయాలు చేపట్టిందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు తగ్గే వరకు సబ్సిడీపై టమాటాలను అందజేస్తామని తెలిపారు. ధరలు తగ్గినప్పుడు రైతులకు, విపరీతంగా పెరిగినప్పుడు వినియోగదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం బాసటగా నిలుస్తోందన్నారు. విజయవాడలోని కృష్ణలంక రైతు బజార్‌లో సబ్సిడీపై టమాటాల విక్రయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలతో టమాటా పంట దెబ్బతినడం వల్ల దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కిలో ధర రూ.250కు చేరుకోగా.. రాష్ట్రంలోని బహిరంగ మార్కెట్‌లో రూ.98 నుంచి రూ.124 వరకు ఉందన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 103 రైతుబజార్లలో సబ్సిడీపై టమాటాలను కిలో రూ.50కే విక్రయిస్తున్నామని చెప్పారు.
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మదనపల్లి, పలమనేరు ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 600 టన్నుల టమాటాలను రూ.6 కోట్లతో సేకరించామని చెప్పారు. రూ.3 కోట్లకు పైగా సబ్సిడీ భరించి ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. నాలుగేళ్లలో రూ.10.26 కోట్ల విలువైన 3,100 టన్నుల టమాటాలను సేకరించి రైతులకు, వినియోగదారులకు అండగా నిలిచామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా టమాటా రైతులను, వినియోగదారుల ప్రయోజనాలను పట్టించుకోలేదన్నారు.
టీడీపీ పాలనలో టమాటా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయినా చంద్రబాబు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్‌పాండే, రైతు బజార్ల సీఈవో నందకిశోర్, వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్‌కుమార్, మార్కెటింగ్ శాఖ జేడీ శ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ సీహెచ్ జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment