ఈయన పేరు సోమిశెట్టి రామచంద్రరావు. విజయవాడ ఇందిరా కాలనీలో ఉంటున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో టమాటా కిలో రూ.120–150 పలుకుతుండగా, కృష్ణలంక రైతుబజార్‌లో రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ.50కే అందిస్తుండడం మాబోటి వారికి చాలా ఊరటగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే నాలుగైదుసార్లు వెళ్లి తెచ్చుకున్న ఆయన.. టమాటాలు తాజాగా, నాణ్యతతో ఉంటున్నాయంటూ ఆయన తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.
సాక్షి, అమరావతి : టమాటా ధరలు చుక్కలనంటుతున్న ప్రస్తుత తరుణంలో రైతుబజార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై టమాటాలను విక్రయిస్తూ వినియోగదారులకు బాసటగా నిలుస్తోంది. ఆకస్మిక వర్షాలతో మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో టమాటా పంట దెబ్బతినడంతో ధరలు దేశవ్యాప్తంగా చుక్కలనంటాయి. దాదాపు 40 రోజులు కావస్తున్నా డిమాండ్ సరిపడా నిల్వల్లేక ధరలు అదుపులోకి రాని పరిస్థితి.
ధరలు పతనమైనప్పుడు మార్కెట్‌లో జోక్యం చేసుకుని రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే రీతిలో ప్రస్తుతం మార్కెట్‌లో ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు బాసటగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేని విధంగా దాదాపు నెలరోజులుగా ఆర్థిక భారాన్ని లెక్కచేయకుండా సబ్సిడీపై టమాటాలు విక్రయాలను కొనసాగిస్తోంది.
రంగంలోకి మార్కెటింగ్ శాఖ..
ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో కిలో రూ.200కు పైగా పలుకుతుండగా, రాష్ట్రంలో బహిరంగ మార్కెట్‌లో నేటికీ కిలో రూ.120 నుంచి రూ.150కు తగ్గలేదు. ధరలు పెరుగుదల మొదలైన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మార్కెటింగ్ శాఖను రంగంలోకి దింపిన ప్రభుత్వం మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద రైతులు, వ్యాపారుల నుంచి సేకరించి వాటిని రైతుబజార్ల ద్వారా కిలో రూ.50 చొప్పున సబ్సిడీపై వినియోగదారులకు అందిస్తోంది.
రాష్ట్రంలో సబ్సిడీపై టమాటా విక్రయాలు ప్రారంభించిన మూడు వారాల తర్వాత కేంద్రం కూడా ఏపీ బాటలో వినియోగదారులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చిం ది. దక్షిణాది రాష్ట్రాల నుంచి సేకరించి ఉత్తరాదిలోని మండీల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో రూ.80 చొప్పున విక్రయాలకు శ్రీకారం చుట్టింది.
సబ్సిడీ కోసం రూ.11.82 కోట్లు ఖర్చు..
రోజూ రాష్ట్రంలోని వివిధ టమాటా మార్కెట్లలో వ్యాపారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం వేలం పాటల్లో పాల్గొని రైతుల నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తోంది. డిమాండ్‌ను బట్టి స్థానిక వ్యాపారుల నుంచి కూడా సేకరిస్తోంది. ఇలా ఇప్పటివరకు సగటున కిలో రూ.104 చొప్పున రూ.11,82,40,000 ఖర్చుచేసి 1,136.90 మెట్రిక్ టన్నుల టమాటాలను సేకరించింది. రోజూ 40–70 టన్నుల చొప్పున సేకరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 105 ప్రధాన రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా మనిషికి ఒక కిలో చొప్పున విక్రయిస్తోంది.
కిలో రూ.123.50 చొప్పున కొనుగోలు..
మంగళవారం సగటున కిలో రూ.123.50 చొప్పున రూ.49.40 లక్షల విలువైన 40 టన్నుల టమాటాలను అధికారులు సేకరించారు. వీటిని విశాఖ, విజయనగరం, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 40 రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు సరఫరా చేశారు. ఇలా దాదాపు నెలరోజులుగా సబ్సిడీపై టమాటా విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుండడంపట్ల వినియోగదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
రెండేళ్ల క్రితం కూడా ఇదే రీతిలో కిలో రూ.100 దాటినప్పుడు రైతుల నుంచి సేకరించి సబ్సిడీపై రైతుబజార్ల ద్వారా విక్రయించారు. గతలో ఎన్నడూ ఇలా ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకున్న సందర్భాల్లేవని వినియోగదారులు చెబుతున్నారు.
పేదలకు ఊరట
టమాటా ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో నెలరోజులుగా రైతుబజార్ల ద్వారా కిలో రూ.50కే నాణ్యమైన టమాటాలు అందిస్తుండడం మాలాంటి పేదవారికి ఎంతో ఉపయోగకరం. ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న టమాటాలను ప్రజలు పొదుపుగా వాడుకుంటే మంచిది. – కె.నాయుడు, కార్మికుడు, సీతమ్మధార, విశాఖపట్నం
నాణ్యంగా ఉంటున్నాయి
ప్రభుత్వం అండగా నిలవకపోతే ఈ సమయంలో బహిరంగ మార్కెట్‌లో మాలాంటివారు కొనే పరిస్థితి ఉండదు. నెలరోజులుగా సీతమ్మధార రైతుబజారులో సబ్సిడీపై టమాటాలు అందిస్తున్నారు. కాయలు చాలా నాణ్యంగా ఉంటున్నాయి. చాలా సంతోషంగా ఉంది. – పైడి రమణమ్మ, పాత వెంకోజీపాలెం, విశాఖపట్నం
ధరలు తగ్గే వరకు కొనసాగిస్తాం
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గత నెల 27న సబ్సిడీపై టమాటాల విక్రయా లకు శ్రీకారం చుట్టాం. సగటున కిలో రూ.104 చొప్పున కొనుగోలు చేసి వినియోగదారులకు కిలో రూ.50లకే విక్రయిస్తున్నాం. ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు రైతుబజార్లలో సబ్సిడీ కౌంటర్లు కొనసాగుతాయి. – రాహుల్ పాండే, కమిషనర్, ఏపీ మార్కెటింగ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment