సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న టమాటా ధరల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పలుచోట్ల టమాటా రేట్లు చుక్కలను తాకుతుండటంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను రంగంలోకి దించింది. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని రైతుబజార్లలో కిలో రూ.50కే అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది.
వైఎస్సార్, కర్నూలు జిల్లాలలో బుధవారం శ్రీకారం చుట్టగా.. మిగిలిన జిల్లాల్లో గురువారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు నిత్యం 50–60 టన్నుల టమాటాలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మరోవైపు టమాటాతో పోటీపడుతూ ఆకాశానికి ఎగబాకుతున్న పచ్చి మిర్చిని కూడా సబ్సిడీపై వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం యాప్‌లో పర్యవేక్షణ..
పలుచోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలు టమాటా ధరలను హడలెత్తిస్తున్నాయి. వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో టమాటా ధర చుక్కలనంటుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.20–30కు మించి పలకని టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకాయి. పలు రాష్ట్రాల్లో కిలో రూ.100 దాటగా మన రాష్ట్రంలోని బహిరంగ మార్కెట్లలో ప్రస్తుతం కిలో రూ.65 నుంచి 90 మధ్య పలుకుతోంది.
పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులపై భారం పడకుండా చర్యలు చేపట్టింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే, రైతుబజార్ల సీఈవో నందకిషోర్‌తో పాటు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.
సీఎం యాప్ ద్వారా ధరల హెచ్చుతగ్గులను సమీక్షిస్తూ కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. టమాటాతో పాటు పచ్చి మిర్చి ధరలు కూడా వంద దాటడంతో వాటిని కూడా సబ్సిడీపై అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. టమాటా ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో అత్యధికంగా విశాఖలో కిలో రూ.90 ఉండగా మిగిలిన జిల్లాల్లో రూ.50–85 మధ్య ధరలున్నట్లు గుర్తించడంతో రైతుబజార్ల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు.
నాలుగేళ్లుగా టమాటా ధరలు పెరిగిన పలు సందర్భాల్లోనూ రాష్ట్రప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై వినియోగదారులకు అందిస్తోంది. ధరల పెరుగుదల ఎక్కువగా ఉన్న నగరాలు, పట్టణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదేవిధంగా పచ్చి మిర్చి కూడా పలు జిల్లాల్లో రూ.వంద దాటినట్టు గుర్తించారు. దీంతో మంత్రి ఆదేశాలతో పచ్చి మిర్చిని కూడా రైతుల నుంచి కొనుగోలు చేసి సబ్సిడీపై రైతుబజార్లలో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో సేకరణ
ధరలు ఎగబాకడంతో టమాటా రైతన్నలకు మంచి రేటు లభిస్తోంది. రాష్ట్రంలోని మదనపల్లి, పలమనేరు, పత్తికొండ, పుంగనూరు, కలికిరి మార్కెట్లకు వస్తున్న టమాటాను పొరుగు రాష్ట్రాల వ్యాపారులు ఎగరేసుకుపోతున్నారు. బుధవారం మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో మార్కెటింగ్ శాఖ అధికారులు రైతుల నుంచి కిలో రూ.70 చొప్పున 10 టన్నుల టమాటాలు సేకరించారు.
నేటి నుంచి మిగిలిన మార్కెట్లలోనూ సేకరించనున్నారు. రోజుకు కనీసం 50–60 టన్నులు తక్కువ కాకుండా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో రైతుబజార్ల ద్వారా కిలో రూ.50 చొప్పున టమాటా విక్రయాలకు బుధవారం శ్రీకారం చుట్టగా.. విశాఖ సహా మిగిలిన జిల్లాలకు గురువారం నుంచి విస్తరించాలని నిర్ణయించారు.
అదుపులోకి వచ్చే దాకా సబ్సిడీపై విక్రయాలు
ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కిలో రూ.100 దాటింది. ప్రధాన మార్కెట్లలో రైతుల నుంచి సేకరించి సబ్సిడీపై వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాం. ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు దీన్ని కొనసాగిస్తాం. – నందకిషోర్, సీఈవో, ఏపీ రైతుబజార్లు
ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఏర్పాటు
ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ టమాటా అమ్మకాలకు శ్రీకారం చుడుతున్నాం. మిగిలిన చోట్ల రైతు బజార్లలో కూడా కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
– రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ
టమాటా, పచ్చిమిర్చి కూడా..
మార్కెట్‌లో టమాటా, మిర్చి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. ధరల నియంత్రణపై స్పెషల్ సీఎస్‌తోపాటు, మార్కెటింగ్ శాఖ కమిషనర్, రైతు బజార్ల సీఈవోతో సమీక్షించాం. గురువారం నుంచి రాష్ట్రంలో ప్రధాన రైతు బజార్లలో టమాటా కిలో రూ.50కే సబ్సిడీపై అందించనున్నాం. అదేవిధంగా మిర్చిని కూడా సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment