సాక్షి, కొత్తగూడెం: మార్కెటింగ్ శాఖకు ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరట్లేదు. ఇందుకు అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. కందులు, మొక్కజొన్నలకు ఫీజు మినహాయింపునివ్వడం, పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడం, కొన్ని చెక్‌పోస్టులు ఇతర జిల్లాల్లోకి వెళ్లడం, పౌరసరఫరాల శాఖ, సీసీఐ బకాయిల చెల్లింపు ప్రక్రియ పూర్తి కాకపోవడం వంటి కారణాలన్నీ కూడా అదనపు ఆటంకాలుగానే మారాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2018–19లో జిల్లాలో మార్కెటింగ్ శాఖ ఆదాయం తగ్గుతోంది. మొత్తం 59 గోదాములు, 20 చెక్‌పోస్టులు ఉన్నాయి. కందులు, మొక్కజొన్న పంటలకు ఒకశాతం మార్కెట్ ఫీజు మినహాయింపునివ్వడం, పత్తి దిగుబడి తగ్గడంతో మార్కెటింగ్ ఆదాయంపై గట్టి ప్రభావం పడింది.
కొన్ని చెక్‌పోస్టులు ఇతర జిల్లాల్లోకి వెళ్లడంతో పాటు పోలవరం విలీన మండలాల్లో కొన్ని ఉండిపోవడంతో కచ్చితంగా ఆదాయానికి గండి పడింది. దీనికి తోడు పౌరసరఫరాల శాఖ, కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) ద్వారా బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో ఆదాయ లక్ష్యాన్ని సాధించడంలో వెనుకంజలో ఉంది. కొన్ని గోదాములను ఎన్నికల సామగ్రి భద్రపరిచేందుకు ఉపయోగిస్తుండగా, అత్యధిక గోదాముల్లో పౌరసరఫరాల శాఖ వారి ధాన్యం, సీసీఐ వారి పత్తిని నిల్వ ఉంచారు. వీటి ద్వారా రావాల్సన ఆదాయ బకాయిలు మాత్రం నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి.
బకాయిల క్రమం ఇలా..
సీసీఐ ద్వారా మార్కెటింగ్ శాఖకు ఇప్పటివరకు రూ.50 లక్షలకుపైగా బకాయి నిధులందాల్సి ఉంది. పౌరసరఫరాల శాఖ ద్వారా రూ.3 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయి. ఇందులో గతేడాదికి సంబంధించి రూ.కోటి, ఈ సంవత్సరానికి రూ.2కోట్లు రావాల్సి ఉంది. అయితే పౌరసరఫరాల శాఖ వాళ్లు ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఫీజును తదుపరి ఏడాదిలో చెల్లిస్తుండడంతో బకాయిలు ఎక్కువగా పేరుకుపోతున్నాయి. ఇక పత్తి పంట ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుందని అంచనా వేసినప్పటికీ ఆ మేరకు సాధించలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 47,294 హెక్టార్లలో రైతులు పత్తి పంటను సాగు చేశారు.
అయితే ఇందులో ఎకరానికి 8 నుంచి 9 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే భారీగా తగ్గిపోవడంతో ఈ ప్రభావం మార్కెటింగ్ శాఖ ఆదాయంపైనా పడింది. ఎకరానికి కేవలం 2 నుంచి 3 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగబడి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మొత్తం 9,59,000 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని భావించగా, అది మూడోవంతుకు కూడా రాలేదు. గతేడాది ఈ సమయానికి జిల్లాలోని బూర్గంపాడు, దమ్మపేట, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, చర్ల మార్కెట్ కమిటీల ద్వారా అనుకున్న లక్ష్యంలో 5.85 శాతం ఎక్కువగా ఆదాయం సాధించగా ఈసారి మాత్రం తగ్గింది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది 45.64 శాతం తక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment