ఏదీ కళ్లెం?.. 12కే గొళ్లెం!
రైతుబజార్లకు నామ మాత్రంగా
సబ్సిడీ టమోటా సరఫరా
12 గంటలకే కౌంటర్ల మూసివేత
ధరలపై చేతులెత్తేసిన మార్కెటింగ్ శాఖ
సిటీబ్యూరో: గ్రేటర్‌లో కూరగాయల ధరలకు కళ్లెం వేసేందుకు మార్కెటింగ్ శాఖ చేసిన ప్రయత్నం కంటితుడుపు చర్యగా మిగిలింది. టమోటా ధరలను నియంత్రిస్తే మిగతా కూరగాయల ధరలు అదుపులో ఉంటాయని అధికారులు భావించారు. ఈ మేరకు గత నెల 29న రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సబ్సిడీ టమోటా అందుబాటులో ఉంచారు. ఈ కౌంటర్లు మధ్యాహ్నానికే మూతపడుతుండటంతో వినియోగదారులకు తక్కువ ధరకు టమోటా అందని పరిస్థితి ఎదురైంది. ఒక్కో రైతుబజార్‌కు 50 ట్రేల టమోటా అవసరం ఉండగా... కేవలం 10-15ట్రేల సరుకు మాత్రమే సరఫరా చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. సబ్సిడీ ధరపై కేజీ రూ. 14కే అందుబాటులో ఉంచినట్లు అధికారులు ఆర్భాటంగా ప్రకటిస్తున్నా.... అవి అందరికీ అందకపోవడంతో రిటైల్ మార్కెట్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. గిరాకీని గుర్తించిన వ్యాపారులు టమోటా కేజీ రూ.25-30 చొప్పున విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అరకొరగా అందిస్తోన్న టమోటా కూడా ఉదయం 10గంటల తర్వాత రైతుబజార్లకు చేరుతోంది. మధ్యాహ్నం 12 గంటలకే సరుకంతా అమ్ముడుపోతోంది. ఆ త ర్వాత వచ్చే వినియోగదారులకు అవి దక్కని పరిస్థితి ఎదురవుతోంది. శని, ఆదివారాల్లో సబ్సిడీ టమోటా గంటన్నర వ్యవధిలోనే ఖాళీ అవుతుండటం వినియోగదారులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
డిమాండ్‌కు తగ్గట్టు సరుకు సరఫరా చేయడంలో మార్కెటింగ్ శాఖ అధికారులు విఫలమవ్వడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరూర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మెహిదీపట్నం రైతుబజార్లలో ఉదయాన్నే వచ్చి క్యూలో నిలబడినా అందరికీ అందడం లేదని మహిళలు వాపోతున్నారు. కేవలం 2గంటల వ్యవధిలోనే కౌంటర్ ఖాళీ అవుతుండటాన్ని బట్టి చూస్తే టమోటాను గుట్టుగా హోటళ్లకు సరఫరా చేస్తున్నారేమోనన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. రైతుబజార్ల సిబ్బందిపై నిఘా లేకపోవడాన్ని దీనికి కారణంగా చూపుతున్నారు. మరోవైపు ఏ రోజు వచ్చిన సరుకు ఆరోజే అమ్మకపోతే చెడిపోయే అవకాశం ఉండటంతో రైతుబజార్ల సిబ్బంది కావాలనే తక్కువ ఇండెంట్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే సబ్సిడీ టమోటా అందరికీ అందడం లేదని అంటున్నారు.
చిత్తశుద్ధి ఏదీ..?
రైతుబజార్లలోని ప్రత్యేక కౌంటర్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే మధ్యాహ్నానికి మూత పడుతున్నాయి. ఆ తర్వాత వ్యాపారులు యథావిధిగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్ర వేళల్లో వచ్చే ఉద్యోగులు, ఇతరులకు సబ్సిడీ టమోటా అందని పరిస్థితి ఏర్పడింది. మొత్తమ్మీద సబ్సిడీ ప్రక్రియ పేరుకే తప్ప ఎక్కువ మందికి వినియోగపడడం లేదనే విమర్శలను అధికారులు మూటగట్టుకుంటున్నారు.