Tomato supply
-
తక్కువ రేటుకు టమాటా
సాక్షి, అమరావతి: ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రైతు బజార్ల ద్వారా సరసమైన ధరకు టమాటా విక్రయాలకు శ్రీకారం చుట్టింది. శుక్రవారమే రాష్ట్రవ్యాప్తంగా 47 రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు చేపట్టింది. మిగిలిన రైతుబజార్లలో శనివారం నుంచి తక్కువ ధరకు టమాటా విక్రయించనుంది. బహిరంగ మార్కెట్ కంటే రూ.10 నుంచి రూ.15 వరకు తక్కువ ధరకే ఇక్కడ అమ్ముతున్నారు. దీంతో రైతు బజార్లలో వినియోగదారులు బారులు తీరారు. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో టమాటా కిలో రూ.60 నుంచి రూ.85 వరకు ఉంది. పొరుగు రాష్ట్రంలో కిలో రూ.100కు చేరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు రైతుబజార్ల ద్వారా సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు టమాటా విక్రయాలు చేపట్టారు. షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకున్న 15 టన్నుల టమాటాను విశాఖ, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో స్థానిక రైతుల వద్ద ఉన్న నిల్వలను మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కొనుగోలు చేసి స్థానిక రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. కనిష్టంగా విజయవాడ రైతుబజార్లలో కిలో రూ.52కు అమ్ముతున్నారు. పల్నాడు, ఏలూరు జిల్లాల్లోనూ స్థానిక రైతుల నుంచి కొన్న టమాటాను అక్కడి రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ తదితర ప్రాంతాల నుంచి మరో 70 టన్నుల దిగుమతికి ఏర్పాట్లు చేశారు. ఇవి శుక్రవారం రాత్రికి రాష్ట్రానికి రానున్నాయి. వీటిని మిగిలిన జిల్లాల్లోని రైతు బజార్లకు తరలించి శనివారం నుంచి అందుబాటులో ఉంచనున్నారు. టమాటా ధరలపై మంత్రి కాకాణి సమీక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతుబజార్ల సీఈవో శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ జేడీ రాజశేఖర్, ఇతర అధికారులతో ఫోన్లో సమీక్షించారు. ధరలను అదుపులో ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా టమాటా విక్రయించాలని ఆదేశించారు. స్థానికంగా రైతుల వద్ద అందుబాటులో ఉన్న నిల్వలను కొనడంతోపాటు పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపి, అక్కడి వ్యాపారులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా టమాటాను ప్రతిరోజు కొనాలని చెప్పారు. «ధరలు అదుపులోకి వచ్చే వరకు మార్కెట్‌పై నిరంతర పర్యవేక్షణ, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై నిఘా ఉంచాలని సూచించారు. -
ఏదీ కళ్లెం?.. 12కే గొళ్లెం!
రైతుబజార్లకు నామ మాత్రంగా సబ్సిడీ టమోటా సరఫరా 12 గంటలకే కౌంటర్ల మూసివేత ధరలపై చేతులెత్తేసిన మార్కెటింగ్ శాఖ సిటీబ్యూరో: గ్రేటర్లో కూరగాయల ధరలకు కళ్లెం వేసేందుకు మార్కెటింగ్ శాఖ చేసిన ప్రయత్నం కంటితుడుపు చర్యగా మిగిలింది. టమోటా ధరలను నియంత్రిస్తే మిగతా కూరగాయల ధరలు అదుపులో ఉంటాయని అధికారులు భావించారు. ఈ మేరకు గత నెల 29న రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సబ్సిడీ టమోటా అందుబాటులో ఉంచారు. ఈ కౌంటర్లు మధ్యాహ్నానికే మూతపడుతుండటంతో వినియోగదారులకు తక్కువ ధరకు టమోటా అందని పరిస్థితి ఎదురైంది. ఒక్కో రైతుబజార్‌కు 50 ట్రేల టమోటా అవసరం ఉండగా... కేవలం 10-15ట్రేల సరుకు మాత్రమే సరఫరా చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. సబ్సిడీ ధరపై కేజీ రూ. 14కే అందుబాటులో ఉంచినట్లు అధికారులు ఆర్భాటంగా ప్రకటిస్తున్నా.... అవి అందరికీ అందకపోవడంతో రిటైల్ మార్కెట్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. గిరాకీని గుర్తించిన వ్యాపారులు టమోటా కేజీ రూ.25-30 చొప్పున విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అరకొరగా అందిస్తోన్న టమోటా కూడా ఉదయం 10గంటల తర్వాత రైతుబజార్లకు చేరుతోంది. మధ్యాహ్నం 12 గంటలకే సరుకంతా అమ్ముడుపోతోంది. ఆ త ర్వాత వచ్చే వినియోగదారులకు అవి దక్కని పరిస్థితి ఎదురవుతోంది. శని, ఆదివారాల్లో సబ్సిడీ టమోటా గంటన్నర వ్యవధిలోనే ఖాళీ అవుతుండటం వినియోగదారులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. డిమాండ్‌కు తగ్గట్టు సరుకు సరఫరా చేయడంలో మార్కెటింగ్ శాఖ అధికారులు విఫలమవ్వడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరూర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, మెహిదీపట్నం రైతుబజార్లలో ఉదయాన్నే వచ్చి క్యూలో నిలబడినా అందరికీ అందడం లేదని మహిళలు వాపోతున్నారు. కేవలం 2గంటల వ్యవధిలోనే కౌంటర్ ఖాళీ అవుతుండటాన్ని బట్టి చూస్తే టమోటాను గుట్టుగా హోటళ్లకు సరఫరా చేస్తున్నారేమోనన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. రైతుబజార్ల సిబ్బందిపై నిఘా లేకపోవడాన్ని దీనికి కారణంగా చూపుతున్నారు. మరోవైపు ఏ రోజు వచ్చిన సరుకు ఆరోజే అమ్మకపోతే చెడిపోయే అవకాశం ఉండటంతో రైతుబజార్ల సిబ్బంది కావాలనే తక్కువ ఇండెంట్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే సబ్సిడీ టమోటా అందరికీ అందడం లేదని అంటున్నారు. చిత్తశుద్ధి ఏదీ..? రైతుబజార్లలోని ప్రత్యేక కౌంటర్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే మధ్యాహ్నానికి మూత పడుతున్నాయి. ఆ తర్వాత వ్యాపారులు యథావిధిగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్ర వేళల్లో వచ్చే ఉద్యోగులు, ఇతరులకు సబ్సిడీ టమోటా అందని పరిస్థితి ఏర్పడింది. మొత్తమ్మీద సబ్సిడీ ప్రక్రియ పేరుకే తప్ప ఎక్కువ మందికి వినియోగపడడం లేదనే విమర్శలను అధికారులు మూటగట్టుకుంటున్నారు.