
కూటమి ప్రభుత్వంలో కనిపించని పంపిణీ
అడపాదడపా అరకొర కార్డుదారులకు మాత్రమే సరఫరా
1.48 కోట్ల కార్డులకు 8 నెలలకు దాదాపు 1.20 లక్షల టన్నులు అవసరం
పంపిణీ చేసింది మాత్రం కేవలం 36 వేల టన్నులే
సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ఎత్తులు
ఉద్దేశపూర్వకంగా సేకరణ పట్ల దృష్టి పెట్టని వైనం
బహిరంగ మార్కెట్‌లో సేకరించి ఇవ్వడానికి ససేమిరా
ధర పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఎగ్గొడుతున్న దుస్థితి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పింది. పేదలకు సబ్సిడీపై అందించాల్సిన నిత్యావసరాలపై నిర్లక్ష్య ధోరణి పెరుగుతోంది. ప్రభుత్వం రేషన్ ఇస్తే తప్ప పూట గడవని కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. గడిచిన ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి. ఒక నెలలో వచ్చిన రేషన్ సరుకులు మరుసటి నెలలో ఇస్తారో లేదో తెలియని దుస్థితి. ఎన్నికల్లో పేదల ఓట్లను దండుకోవడమే పరమావధిగా తాము అధికారంలోకి వస్తే రేషన్‌లో 18 రకాల సరుకులు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నాయకులు.. పీఠం ఎక్కిన తర్వాత పత్తా లేకుండా పోయారు.
పేదల నోటికి అందాల్సిన తిండిని లాగేస్తున్నారు. కార్డుదారులకు కిలో కంది పప్పు కూడా ఇవ్వలేక ముఖం చాటేస్తున్నారు. కార్డు తీసుకుని ఎండీయూ వాహనందగ్గరకు వెళ్లిన ప్రతిసారీ లబ్దిదారులకు కందిపప్పు లేదనో, రాలేదనో, వచ్చింది సరిపోలేదనో సమాధానమే ఎదురవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై, ఆగస్టులో కేవలం 249 టన్నుల కందిపప్పును మాత్రమే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసింది. సెప్టెంబర్ లో అసలు పంపిణీ ఊసే లేదు. అంటే తొలి మూడు నెలల్లో 1.48 కోట్లకుపై రేషన్ కార్డులు ఉండగా కేవలం 2 శాతం (2.50 లక్షల) కార్డుదారులకు మాత్రమే కందిపప్పు అందించారు.
అక్టోబర్‌లో 2,981 టన్నులు, నవంబర్, డిసెంబర్‌లో 10,800 టన్నుల చొప్పన, జనవరిలో 8,700 టన్నులు, ఫిబ్రవరిలో 3,100 టన్నుల సరఫరాతో సరిపెట్టేశారు. వాస్తవానికి నెలకు కార్డుదారులు అందరికీ కిలో కందిపప్పు చొప్పున పంపిణీ చేయాలంటే 15 వేల టన్నులు అవసరం. సగటున 7 వేల టన్నులకుపైగా కార్డుదారుల నుంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. కానీ, గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం పంపిణీ చేసింది కేవలం 36 వేల టన్నులు మాత్రమే.
పండుగ పూట కూడా పప్పన్నం లేదు..
పండుగల సమయంలో కందిపప్పు అసలే పంపిణీ చేయలేదు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.180–220 వరకు ధర పలుకుతున్న సమయంలో పేదలు కందిపప్పు కొనుగోలు చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఇస్తుందని ఎదురు చూశారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం నిరాశే మిగిల్చారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలల్లో 14 వేల టన్నుల కందులను మద్దతు ధరపై ఏపీకి కేటాయిస్తే వాటిని మరాడించగా వచ్చిన కంది పప్పును మాత్రమే పంపిణీ చేశారు.
టెండర్ల ప్రక్రియలో కాంట్రాక్టర్లు ఎక్కువ కోట్ చేస్తున్నారన్న కారణంతో కొనుగోలుకు ముందుకు వెళ్లడం లేదు. దీంతో నిల్వలు ఖాళీ అయిపోవడంతో మార్చి నుంచి కందిపప్పు పంపిణీ నిలిచి పోయింది. రాజధాని ప్రాంత జిల్లాల్లోనే ఒక్క ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు కూడా కిలో కంది పప్పు చేరని దుస్థితి.
సబ్సిడీ భారం తగ్గించుకునే కుట్ర
కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే సబ్సిడీ రేషన్‌లో కోత పెట్టేందుకే కుట్రలు చేస్తోంది. ఇందులో భాగంగానే కందిపప్పు పంపిణీని కావాలనే నిలిపి వేస్తోంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా కందిపప్పు ధర కిలో రూ.180–220కి పైగా పలికింది. ఆ సమయంలో ప్రభుత్వం పేదల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో ఎంత రేటు పెరిగినప్పటికీ (రూ.170కిలో) కిలో కందిపప్పును రాయితీపై రూ.67కే అందించింది.

కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సబ్సిడీని భారంగా భావిస్తోంది. రేటు పెంచితే లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, దీనికి బదులు ఎక్కువ రేటు పెట్టి కొని కందిపప్పును ఇవ్వడం కంటే పంపిణీని ఎత్తేస్తే మంచిదనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే.. దేశీయంగా కందిపప్పు ధరలు కొంతమేర దిగి వచ్చాయి. హోల్ సేల్‌లో కిలో రూ.100 (సాధారణం), క్వాలిటీ రకం రూ.110–118 పలుకుతోంది. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు సబ్సిడీపై కందిపప్పును అందించక పోవడం శోచనీయం.
మరో వైపు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టడంతో పౌర సరఫరాల సంస్థపై ఆర్థిక భారం పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. అసలు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌లో కోతలు పెట్టడం.. నెలలు తరబడి నిత్యావసరాల పంపిణీని నిలిపి వేయడం కొత్తేమీ కాదు. 2014 సెప్టెంబర్ నుంచి 2015 జూలై వరకు కందిపప్పు పంపిణీని ఆపేశారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రూ.1,605 కోట్ల విలువైన 0.93 లక్షల టన్నుల కందిపప్పును మాత్రమే పంపిణీ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,140 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల కందిపప్పును పేదలకు సబ్సిడీపై అందించడం విశేషం.
కార్డుదారులు తిరగబడే రోజులు వస్తాయి
కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు అందిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల వస్తువులు ఇస్తామన్న ప్రభుత్వం ఒకటి రెండు సరుకులతోనే సరిపెడుతోంది. బియ్యం, చక్కెర తప్ప మిగిలినవి ఏవీ పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. కందిపప్పు చూద్దామంటే కనిపించకుండా పోతోంది. ప్రభుత్వం ఇలాగే వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తే కార్డుదారులు తిరగబడే రోజులు వస్తాయి. – హుసేనమ్మ, కానాల గ్రామం, నంద్యాల జిల్లా
స్టాక్ రాలేదని చెప్పారు
తిరుపతి జిల్లాలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ కార్డుదారులకు కందిపప్పును సక్రమంగా ఇవ్వడం లేదు. మొదటి మూడు నెలలు స్టాక్ రాలేదని చెప్పారు. ఆ తర్వాత కొంత మేరకు మాత్రమే వచ్చిందని తెలిపారు. తాజాగా మళ్లీ రాలేదని చెబుతున్నారు. అధికారులు మాత్రం ప్రస్తుతం కందిపప్పు వస్తుందని.. అయితే కొందరు డీలర్లు డీడీ కట్టడం లేదని చెబుతున్నారు. మొత్తంగా అయితే కందిపప్పు 50 శాతం మంది కార్డుదారులకు సక్రమంగా ఇవ్వడం లేదు. చౌకదుకాణాల్లో కేజీ కందిపప్పు రూ.67కే లభిస్తుంది. మార్కెట్లో రూ.120 నుంచి రూ.130 వరకు చెల్లించాల్సి ఉంటుంది. – గురవయ్య, వాకాడు, తిరుపతి జిల్లా
జనవరి నెలలో సగం మందికే పంపిణీ
ప్రతినెలా రేషన్ డిపోల నుంచి బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, గోధుమ పిండి తదితర వస్తువులను సరఫరా చేయాల్సి ఉన్నా ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుంది. జనవరి నెలలో కందిపప్పు కొంత మందికి మాత్రమే మా ప్రాంతంలో అందజేశారు. మిగిలిన వారు రేషన్ దుకాణదారుడిని అడిగితే నిల్వలు అయిపోయాయని సమాధానం ఇచ్చారు. – ఉరిటి అప్పలనాయుడు, ఎమ్మార్ నగరం, పార్వతీపురం మండలం
సరిగా ఇవ్వడం లేదు
నేను ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నా. మా కుటుంబంలో నలుగురం ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో రేషన్ షాపు నుంచి బియ్యం, బ్యాళ్లు (కంది పప్పు), చక్కెర తదితరాలు వచ్చేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం మాత్రమే ఇస్తున్నారు. రెండు నెలల నుంచి బ్యాళ్లు ఇవ్వడం లేదు. దీంతో బయటి మార్కెట్లో కేజీ రూ.150 పెట్టి కొనుగోలు చేస్తున్నాం. – రాజశేఖర్, గణేష్నగర్, కర్నూలు
ఒకటి, రెండు నెలలే..
కూటమి ప్రభుత్వం రేషన్ సరుకులు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. గత ప్రభుత్వ హయాంలో వాహనాల ద్వారా బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు, గోధుమ పిండి, రాగిపిండి, రాగులు తదితర సరుకులు అందజేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల్లో ఒకటి రెండు నెలల్లో మాత్రమే అదీ కొద్ది మందికే సరఫరా చేశారు. – హయగ్రీవాచారి, రాయపాడు గ్రామం, గోస్పాడు మండలం, నంద్యాల జిల్లా
నమ్మించి మోసం చేయడమే
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రతి నెల పేదలకు అందించాల్సిన కంది పప్పును సక్రమంగా అందించడం లేదు. ప్రస్తుతం ప్రతి నెల బియ్యం, పంచదారతో సరిపెడుతున్నారు. పేద ప్రజలకు కంది పప్పు ఇవ్వడమే మానేశారు. ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడమే. – డి.రాజ్యలక్ష్మి, రంకిణి గ్రామం, పాతపట్నం మండలం, శ్రీకాకుళం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment