Ration goods
-
పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్ అరెస్టు
కోల్‌కతా: రేషన్ సరుకుల కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో పశ్చిమ బెంగాల్ అటవీ మంత్రి, టీఎంసీ నేత జ్యోతిప్రియో మల్లిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 18 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మల్లిక్‌ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. మల్లిక్‌ను కోర్టులో ప్రవేశపెట్టి, తదుపరి విచారణ కోసం కస్టడీ కోరుతామని చెప్పారు. 18 గంటలపాటు ప్రశ్నించినా నోరువిప్పలేదని, విచారణకు సహకరించలేదని అన్నారు. కాగా, మంత్రి మల్లిక్‌ను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలినట్లు తెలిసింది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. న్యాయస్థానం ఆయనను 10 రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇదో విప్లవం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో తెచ్చిన మార్పులు అందరికీ ఆహారం, ఇతర నిత్యావసరాలు అందాలన్న ప్రభుత్వ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్నాయి. ఇప్పటికే ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ విధానం ప్రజా మన్ననలు పొందింది. వలంటీరు వ్యవస్థ పటిష్టంగా ఉండటం, సచివాలయాల పాలన ప్రజలకు అతి దగ్గరగా కొనసాగుతుండటం వల్ల ప్రజాపంపిణీ మరింత ప్రయోజకత్వాన్ని సంతరించుకొంది. దీంతో ప్రజల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలా మొదటి వారంలోనే చౌక డిపోల నుంచి ఇంటిముందుకు ప్రత్యేక సంచార వాహనాలు సరుకులు తీసుకురావడం దేశంలో ఇదే మొదటిసారి. కుటుంబంలో ఏ ఒక్క లబ్ధిదారుడయినా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. పెద్దలు కుటుంబ పోషణ కోసం ఇంటి నుంచి పని చేసే ప్రదేశాలకు వెళ్ళిన సమయాల్లో పిల్లలు సైతం ఈ సంచార వాహనాల నుంచి సరుకులు తీసుకోవచ్చు. చిన్నా చితకా కూలి పనులు చేసుకు బతికే పేదల చెంతకు సత్వర సేవలు అందాలనే ప్రభుత్వ లక్ష్యం కూడా ఇక్కడ నెరవేరుతుంది. ‘జాతీయ ఆహార భద్రతా చట్టం 2013’ పోషకాహార భద్రతను అందించడం లక్ష్యంగా సాగుతోంది. ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి ఈ చట్టం ఉపకరిస్తుంది. సరస మైన ధరలకు తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహారాన్ని అందించలసిన బాధ్యత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ బియ్యం, గోధుమలను భారత ఆహార సంస్థ నుంచీ, చక్కెరను పరిశ్రమల నుంచీ సేకరించి ప్రజలకు చేరుస్తోంది. చౌక ధరల దుకాణాలు ప్రజాపంపిణీ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. మిల్లుల నుంచి మండల స్థాయి నిల్వ కేంద్రాలకు ‘భారత ఆహారసంస్థ’ సరకు రవాణా చేస్తుంది. ఆ సరుకు నిల్వ కేంద్రాల నుంచి లబ్ధి దారుల ఇంటి మెట్ల వరకు సరుకులు చేర్చడం ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నూతన అధ్యాయం సృష్టించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనూ, విపత్తులలోనూ ఆహారం, వస్తువుల పంపిణీ చౌకధరల దుకాణాల నుంచే జరుగుతోంది. కోవిడ్ మహమ్మారి కాలంలో ఈ దుకాణాలు ప్రజలకు ఆహారాన్ని అందించడంలో అవిశ్రాంతంగా కృషి చేశాయి. కొన్ని జిల్లాల్లో 25 కిలోమీటర్ల పరిధిలోని భారత ఆహార సంస్థ గోడౌన్ల నుంచి చౌకధరల దుకాణాలకు నేరుగా ఆహార ధాన్యాల తరలింపు కూడా జరుగుతోంది. తొలిదశ రవాణా, నిర్వహణ ఛార్జీలను నివారించడం ద్వారా విజయ వాడ, విశాఖపట్నంలలో చౌక ధరల దుకాణాల డీలర్లు నేరుగా మండల స్థాయి సరుకు నిల్వ కేంద్రాల నుంచి సరుకు తీసుకెళ్తున్నారు. ఇలా భారత ఆహారసంస్థ ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ ఒక కారణం. గ్రామ స్థాయి నుంచి ఆంధ్ర ప్రదేశ్ పాలనా యంత్రాంగంలో చోటు చేసుకున్న మార్పులు ఉద్యోగుల్నీ, అధికారులనూ పజలపక్షం నిలబెట్టాయని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాపంపిణీ వ్యవస్థలో సంచార వాహనాల ద్వారా ఇంటింటికీ సరుకు పంపిణీ మొదలయిన తర్వాత లబ్ధిదారులు పదిశాతం మంది పెరిగారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి సంచార వాహ నాల ద్వారా ప్రజాపంపిణీ జనామోదం పొందిందని అర్థమ వుతుంది. ప్రజాపంపిణీ వ్యవస్థను ‘సమగ్ర శిశు అభివృద్ధి పథకం’, ‘మధ్యాహ్న భోజన పథకా’లకు కూడా విస్తరించారు. దీనితో సకాలంలో లబ్ధిదారులకు ఆహారపదార్థాలు అందించ గలుగుతున్నారు. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో ఆహార, పౌర సరఫరాల శాఖకు రూ. 3,725 కోట్లు కేటాయించారు. ఇటువంటి పథకాలు, ప్రభుత్వ విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆహార భద్రత’ స్థాయి పెరిగింది. గతంలో కంటే పేదలకు ప్రభుత్వం పట్ల మనస్సులో విశ్వాసం నిండింది. భారత ప్రభుత్వ ‘వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ’ మంత్రిత్వశాఖ ప్రత్యేక ప్రకటన ద్వారా రాష్ట్ర ఆహార కమిషన్ ‘జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013’లోని సెక్షన్ 16 అమలును సమీక్షిస్తుంది. నేటి ‘ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్’ దాని పరిధిలో శక్తి మంతంగా పనిచేస్తోంది. ఆహార భద్రత, హక్కుల పట్ల ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. అధికారులు, ఉద్యో గులు సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షిస్తోంది. ప్రజా ఫిర్యాదులకు వెంటనే స్పందించి పరిష్కరిస్తోంది. అంగన్ వాడీ కేంద్రాల్నీ, ప్రభుత్వ గురుకులాల్నీ, వసతి గృహాలనూ తనిఖీ చేసి అక్కడ విద్యార్థులకు పెడుతున్న ఆహారం, వసతుల్ని పర్యవేక్షిస్తోంది. ఈ విద్యాలయాలు, హాస్టళ్లకు నాణ్యమైన ఆహార పదార్థాలు సక్రమంగా సరఫరా జరుగుతుందో లేదో తనిఖీ చేస్తోంది. గతంలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో భారత ఆహార భద్రతాచట్టం పటిష్టంగా అమలు జరుగుతుందని చెప్పొచ్చు. దీని కోసం స్థానిక ఏపీ ఆహార కమిషన్ అన్ని విధాలా సమర్థంగా పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ‘వలంటీర్’ వ్యవస్థను ప్రవేశపెట్టి తద్వారా ‘ఇంటిదగ్గరకే ప్రభుత్వ పాలన’ అనే లక్ష్యాన్ని అక్షరాలా సాధించిందని చెప్పడానికి ప్రజా పంపిణీ వ్యవస్థలో వచ్చిన మార్పులే నిదర్శనం. ప్రభుత్వ సేవలు భౌతిక రూపంలో ఇంటిముందుకు నడిచి రావడం కన్నా ఏ ప్రజా పంపిణీ వ్యవస్థ అయినా సాధించగల విజయం ఏముంది? కాట్రగడ్డ సురేష్ వ్యాసకర్త ఆల్ ఇండియా కన్సూ్యమర్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఏపీ అధ్యక్షులు ‘ 94412 64249 -
CM YS Jagan: 48 గంటల్లో సాయం
వరద బాధితులను ఆదుకోవడంలో విరామం లేకుండా అవిశ్రాంతంగా పని చేస్తున్నప్పటికీ కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న దురుద్దేశపూర్వక ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ‘మీరు చేస్తున్న మంచి పనులు కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతుంటే వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ముందడుగు వేసి అలాంటి వాటి పట్ల దూకుడుగా వ్యవహరించాలి’ అని నిర్దేశించారు. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గోదావరి వరద బాధిత కుటుంబాలకు 48 గంటల్లోగా రూ.రెండు వేల సాయం అందించడంతోపాటు రేషన్ పంపిణీని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ముంపు బారిన పడిన గ్రామాల్లో ఏ ఒక్క ఇల్లూ మిగిలిపోకుండా అందరికీ సాయం అందించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ఎక్కడా రూ.2 వేల సాయం, రేషన్ అందలేదనే మాటే వినిపించడానికి వీల్లేదని, కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. 25 కిలోలు బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు, కిలో పామాయిల్‌తో రేషన్ సరుకుల పంపిణీ జరగాలన్నారు. బాధితులు శిబిరాలకు వచ్చినా రాకున్నా.. ముంపునకు గురైన చోట్ల ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు, రేషన్ సరుకులు అందాలని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతున్నందున సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు దురుద్దేశపూరితంగా చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికార యంత్రాంగానికి సూచించారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, విపత్తుల నిర్వహణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి సాయానికైనా సిద్ధం.. మీకు ఇంకా ఏమైనా అవసరమైతే అన్ని రకాలుగా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నిధుల సమస్య లేనే లేదు. చురుగ్గా ముందుకు వెళ్లండి. ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కారానికి ఫోన్ కాల్ చేస్తే చాలు. బాధిత కుటుంబాల పట్ల మానవతా ధృక్పథంతో వ్యవహరించండి. ఇప్పటివరకూ ఒకరు మాత్రమే మరణించినట్లు సమాచారం ఉంది. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సహాయ శిబిరాలు కొనసాగించాలి. బాధిత కుటుంబాలకు మంచి ఆహారం, తాగునీరు అందించాలి. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి. వరద తగ్గగానే పంట నష్టం అంచనా వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తి చేయాలి. పశువులకు పశుగ్రాసం, దాణా సక్రమంగా అందించాలి. పశు సంపదకు నష్టం వాటిల్లితే అంచనాలు రూపొందించాలి. గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ గర్భిణిలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఆస్పత్రులకు తరలించాలి. వైద్యాధికారులు, స్పెషలిస్టులు సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. ముంపు తగ్గగానే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. ఆస్పత్రుల్లో తగినంత మంది సిబ్బంది, మందులను సిద్ధంగా ఉంచాలి. రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించాలి, క్లోరినేషన్ కొనసాగించండి. అన్ని మంచినీటి పథకాలను ఒకసారి పరిశీలించడంతో పాటు మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయించండి. అదనపు సిబ్బంది తరలింపు.. వరద బాధిత ప్రాంతాలకు పక్క జిల్లాల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తరలించి ముమ్మరంగా పనులు చేపట్టాలి. ఇతర జిల్లాల నుంచి తరలించేటప్పుడు సిబ్బంది వసతి, భోజన సదుపాయాలకు లోటు రాకుండా చూసుకోవాలి. పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖల విభాగాధిపతులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మురుగునీటి కాలువల్లో పూడిక తీత కార్యక్రమాలు చేపట్టాలి. నీరు తగ్గగానే కల్వర్టులు, బ్రిడ్జిలను క్షుణ్నంగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టాలి. కరకట్ట పరిశీలన.. పూడికతీత గోదావరి కరకట్ట బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలి. అన్ని డ్రెయిన్ల ముఖద్వారాలు మూసుకుపోయే అవకాశం ఉన్నందున పూడిక తొలగింపు పనులు చేయాలి. గట్లు, కాల్వలకు ఎక్కడైనా గండ్లు పడితే వెంటనే పూడ్చి వేయాలి. తక్షణం విద్యుత్తు పునరుద్ధరణ వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చే 48 గంటల్లో ఈ సమస్యను పరిష్కరించాలి. పలు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలను నిర్వహిస్తున్నందున తిరిగి అప్పగించేటప్పుడు పరిశుభ్రంగా అప్పగించాలి. అందుబాటులో అత్యుత్తమ వ్యవస్థ.. గతంలో రెండు జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు ఇద్దరు చొప్పున మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం కాకినాడతో కలిపి ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలున్నారు. సచివాలయాల వ్యవస్థ కూడా మీకు అందుబాటులో ఉంది. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులున్నారు. ప్రతి 50 ఇళ్లకూ ఒక వలంటీర్ ఉన్నారు. అందుబాటులో ఉన్న ఇలాంటి అత్యుత్తమ వ్యవస్థ ద్వారా నాణ్యమైన సేవలు అందించాలి. పంపిణీ ముమ్మరం చేయాలి. ఈ వ్యవస్థ ద్వారా ఎప్పుడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ రూ.2 వేలు ఆర్థిక సాయం చేయలేదు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్‌కళ్యాణ్ లాంటివారు బురద జల్లుతున్నారు. వీరంతా రాష్ట్ర ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తారు. బురద జల్లడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలి. వదంతులను కూడా తిప్పికొట్టాలి. -
బియ్యం బండిపై మొండిగా!
సాక్షి, అమరావతి: అది రెక్కాడితేగానీ డొక్కాడని పేదల కోసం ఎప్పుడో ప్రకటించిన పథకం. అదేమీ కొత్తది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. క్యూ లైన్లలో నించుని, కూలి పనులు మానుకుని చౌక ధరల దుకాణాల వద్ద పడిగాపులు కాసే దుస్థితి తప్పిందని, ఇన్నాళ్లకు తమ ఇంటివద్దే రేషన్ బియ్యం అందబోతున్నాయని గ్రామీణ పేదలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే పేదల ఇబ్బందులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది ఓ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, పేదలకు తిండిగింజలు అందించటాన్ని సానుకూలంగా చూడాలని హైకోర్టు సైతం సూచించినా పెడచెవిన పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన మొబైల్ వాహనాలపై ఉన్న రంగులతో పాటు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బొమ్మలను తొలగించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. తొలుత ఒక వాహనానికి మాత్రం ప్రస్తుతం ఉన్న రంగులను మార్చి తాను పరిశీలించేందుకు తీసుకుని రావాలని పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగు మార్చిన ఆ వాహనాన్ని పరిశీలించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఆ మార్పులకు తాను అనుమతిస్తేనే వాహనాలు తిప్పాలన్నారు. ముందస్తు వ్యూహంతోనే.. మొబైల్ వాహనాలకు ప్రస్తుతం ఉన్న రంగులను మార్పు చేసి పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ పాత రంగులు వేయాలని భావించరాదని నిమ్మగడ్డ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని నిమ్మగడ్డ ప్రకటించారు. దీన్నిబట్టి ఆయన ముందస్తు వ్యూహంతో, నెలల తరబడి ఎన్నికల కోడ్ అమలులో ఉండేలా పక్కా స్క్రిప్టు ప్రకారం వ్యవహరిస్తున్నట్లు వెల్లడవుతోంది. ఎప్పుడో సిద్ధమైన వేల వాహనాలకు ఇప్పటికిప్పుడు రంగులు మార్చడం సాధ్యమయ్యే పనేనా? ఇదంతా ఇప్పట్లో జరిగేపని కాదనే ఎస్ఈసీ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కోర్టు విధించిన గడువు ముగుస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఉత్తర్వును జారీ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలతో నివేదిక ఇచ్చినా.. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా సరుకుల పంపిణీ కోసం మొబైల్ వాహనాలను వినియోగించడానికి వీల్లేదని గత నెల 28న ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ హైకోర్టును ఆశ్రయించగా.. ఈ పథకం రాజకీయ కార్యక్రమం కాదని, ఈ పథకం పేదలకు ఎంత అవసరమో గమనించాలని న్యాయస్థానం పేర్కొంది. ఇంటింటా రేషన్ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వినతి అందుకున్న ఐదు రోజుల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు వాహనాల ద్వారా సరుకులు పంపిణీ వల్ల పేదలకు ఒనగూరే ప్రయోజనాల గురించి ఎస్ఈసీకి పౌరసరఫరాల శాఖ అధికారులు వివరించడంతో పాటు పూర్తి వివరాలతో నివేదిక కూడా ఇచ్చారు. పథకం అమలుæ కోసం వినియోగించనున్న మొబైల్ వాహనాలను ఈనెల 3న నిమ్మగడ్డ పరిశీలించారు. అయితే ఇటు ప్రభుత్వం అటు హైకోర్టు సూచించిన విషయాలను ఆయన ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తొలుత మొబైల్ వాహనాలపై ఉన్న రంగులను తొలగించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించడంతో పేదలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. -
నేటి నుంచి ఉచిత సరుకుల పంపిణీ
సాక్షి, అమరావతి: బియ్యం కార్డుదారులకు నేటి (సోమవారం) నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఉచిత సరుకుల పంపిణీ జరగనుంది. కోవిడ్–19 వైరస్ కారణంగా ఉపాధి కోల్పోతున్న పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పటికే లబ్ధిదారులకు ఏడు సార్లు ఉచితంగా సరుకులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 8వ విడతలో భాగంగా కార్డులో పేర్లు నమోదై ఉన్న ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా 1.49 కోట్ల కుటుంబాలకు పైగా లబ్ధి చేకూరనుంది. -
రేపటి నుంచి ఉచిత సరుకుల పంపిణీ
సాక్షి, అమరావతి: పేదలకు ఎనిమిదో విడత ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సరుకులను సిద్ధం చేసింది. సోమవారం నుంచి లబ్ధిదారులు బియ్యంతో పాటు శనగలను ఉచితంగా తీసుకోచ్చు. మండల స్థాయి స్టాకు పాయింట్ల నుంచి అవసరమైన సరుకులను ఇప్పటికే రేషన్ షాపులకు తరలించారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోతున్న పేదలను ఆదుకునేందుకు కార్డుల్లో పేర్లు నమోదైన ఒక్కో వ్యక్తికి ఐదు కిలోలు, కుటుంబానికి కిలో కందిపప్పు లేదా శనగలు నెలకు రెండుసార్లు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. కరోనా తీవ్రమవుతున్నందున ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. భౌతిక దూరం తప్పనిసరి ► రేషన్ షాపుల వద్ద గుంపులుగా ఉండకూడదు. విడతల వారీగా రావాలి. ► బయోమెట్రిక్ వేసే ముందు, ఆ తర్వాత చేతులను శానిటైజ్ చేసుకోవాలి. ► శానిటైజర్, నీళ్లు, సబ్బును రేషన్ డీలర్లు అందుబాటులో ఉంచాలి. ► సోమవారం నుంచి 28వ తేదీ వరకు రేషన్ షాపులను తెరవాలి. ► ఈ దఫా 1.49 కోట్ల కుటుంబాలకు పైగా లబ్ధిపొందనున్నారు. -
తొలి రోజు 15.22 లక్షల కుటుంబాలకు ఉచిత సరుకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 7వ విడత ఉచిత సరుకుల పంపిణీ శుక్రవారం ఉదయం 6 గంటలకే ప్రారంభమైంది. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. బియ్యం కార్డులో పేరున్న ఒక్కో సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా ఇచ్చారు. కరోనా కారణంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు గుమిగూడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాకే.. లబ్ధిదారుల నుంచి బయోమెట్రిక్ తీసుకున్నారు. ఇందుకు అవసరమైన శానిటైజర్‌ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఏడో విడత ఉచిత సరుకులను మొదటి రోజైన శుక్రవారం 15,22,822 కుటుంబాల వారు తీసుకున్నారు. -
మరోసారి ఉచిత సరుకులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మరో విడత ఉచితంగా సరుకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నివారణలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా పేదలు ఉపాధి కోల్పోయారు. దీంతో నిరుపేదలెవ్వరూ ఖాళీ కడుపుతో ఉండటానికి వీలులేదని భావించిన ప్రభుత్వం ఏడో విడత పంపిణీలో భాగంగా బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వనుంది. చక్కెరకు మాత్రం లబ్ధిదారులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలోని 1.48 కోట్ల బియ్యం కార్డుదారులు లబ్ధి పొందనున్నారు. మార్చి 29వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆరు విడతలుగా పేదలకు బియ్యంతో పాటు కందిపప్పు లేదా శనగలు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఏడో విడత పంపిణీ ఈ నెల 3నుంచి ప్రారంభిస్తారు. బియ్యం కార్డులో పేర్లు నమోదైన ప్రతి ఒక్కరికీ 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తారు. బియ్యంతో పాటు సబ్సిడీ సరుకుల కోసం రేషన్ డీలర్లు ఇప్పటికే డీడీల రూపంలో చెల్లించిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించి రాష్ట్రానికి అదనంగా బియ్యం కేటాయించాలని కేంద్రానికి బుధవారం లేఖ రాసినట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. -
ట్రాన్స్జెండర్లకు రేషన్ సరుకులు ఇచ్చారా?
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్జెండర్లకు రేషన్ షాపుల్లో సరుకుల కేటాయింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుందో లేదో తెలియజేయాలని హైకోర్టు కోరింది. కరోనా సమయంలో ట్రాన్స్జెండర్లకు నిత్యావసరా లు, వసతి, వైద్యం, ప్రభుత్వ పథకాలను అమలు చేసేలా ఉత్తర్వుల జారీని కోరుతూ వైజయంతి వసంత మొగిలి (ఎం.విజయ్‌కుమార్) దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో వివరాలు అసమగ్రంగా ఉన్నాయని, పూర్తి వివరాలు నివేదించాలని ధర్మాసనం ఆదేశించింది. వైరస్ వ్యాప్తికి గురయ్యే ట్రాన్స్జెండర్లకు వైద్య సహాయం అందించేందుకు గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించే ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించాలని సూచించింది. వారిని జనరల్ వార్డులో ఉంచితే ఇతరులతో వారు సమస్యలు ఎదుర్కొనవచ్చునని వ్యాఖ్య చేసింది. ఇలా చేయడం దురదృష్టకరమని కోర్టు అభిప్రాయపడింది. అనంతరం కోర్టు కేసు విచారణ జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. -
రెండు రోజుల్లో అరకోటి కుటుంబాలకు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ సరుకులను రెండు రోజుల్లో 50,99,293 కుటుంబాలకు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో 1.48 కోట్ల కుటుంబాలకు ఇప్పటికే మూడు విడతలు బియ్యంతో పాటు కందిపప్పు / శనగలు పంపిణీ చేశారు. నాలుగో విడత పంపిణీ శనివారం నుంచి ప్రారంభించారు. సరుకుల కోసం వచ్చిన లబ్ధిదారులు వెనక్కు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించడంతో రేషన్ డీలర్లు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపుల వద్దే ఉండి పంపిణీ చేస్తున్నారు. సమయంతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులు ఎప్పుడు వచ్చినా మానవతా దృక్ఫథంతో సరుకులు ఇవ్వాలని డీలర్లందరితో చర్చించి నిర్ణయించినట్లు రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు తెలిపారు. అత్యధికంగా ‘అనంత’లో... ► నాలుగో విడత ఉచిత రేషన్‌తో ఆదివారం నాటికి అరకోటి కుటుంబాలు లబ్ధి్దపొందాయి. ► 12,61,917 కుటుంబాలు పోర్టబులిటీ ద్వారా రేషన్ తీసుకున్నాయి. ► రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన అదనపు కౌంటర్ల ద్వారా 2.51 లక్షల మంది రేషన్ తీసుకున్నారు. ► అత్యధికంగా అనంతపురం జిల్లాలో 44.05 శాతం కుటుంబాలు సరుకులు అందుకున్నాయి. -
నేటి నుంచి 4వ విడత ఉచిత రేషన్
సాక్షి, అమరావతి: లాక్డౌన్ వేళ పేదల ఆకలిని తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ సరుకులు పంపిణీ చేయనుంది. లాక్‌డౌన్‌తో పనులు లేక.. పేదలు ఆకలి బాధలతో ఇబ్బంది పడకుండా వారిని ఆదుకునేందుకు మార్చి 29 నుంచి ఇప్పటివరకు మూడు విడతలుగా ఉచితంగా బియ్యంతోపాటు కందిపప్పు లేదా శనగపప్పును పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. గొడుగులు ఉపయోగిస్తే మంచిది – కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ ఎండలు తీవ్రంగా ఉన్నందున వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు చౌక దుకాణాల వద్దకు వచ్చే కార్డుదారులు గొడుగులు ఉపయోగిస్తే మంచిది. గొడుగు వల్ల వ్యక్తికి, వ్యక్తికి మధ్య దూరం ఉంటుంది. సరుకుల పంపిణీలో భాగంగా బయోమెట్రిక్ వేయడం తప్పనిసరి. కోవిడ్–19 నియంత్రణలో భాగంగా చౌక దుకాణాల వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాం. ప్రతి ఒక్కరూ రేషన్ తీసుకునే ముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా గతంలో మాదిరి ఈసారి కూడా సరుకుల పంపిణీకి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశాం. ► శనివారం నుంచి రేషన్ కార్డులో నమోదై ఉన్న ప్రతి సభ్యుడికి ఐదు కిలోల బియ్యంతోపాటు కుటుంబానికి కిలో శనగలు ఉచితంగా ఇస్తారు. ► రాష్ట్రంలో 1,48,05,879 పేద కుటుంబాలకు ఉచితంగా సరుకులు అందనున్నాయి. ► అర్హత ఉండి బియ్యం కార్డు లేని పేద కుటుంబాలకు కూడా ఉచితంగా రేషన్ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో కొత్తగా 81,862 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేయనున్నారు. ► ఇప్పటికే బియ్యం, శనగలు రేషన్ షాపులకు చేరుకున్నాయి. ► కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్ధిదారులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. షాపుల వద్ద శాని టైజర్లను అందుబాటులో ఉంచారు. ► ఒకేసారి రేషన్ షాపుల వద్దకు రాకుండా టైమ్‌స్లాట్‌తో కూడిన కూపన్లను లబ్ధిదారులకు జారీ చేశారు. కూపన్లపై వారికి కేటాయించిన రేషన్ షాప్, ఏ తేదీలో, ఏ సమయానికి వెళ్లి రేషన్ తీసుకోవచ్చనే పూర్తి వివరాలు పొందుపరిచారు. ► కార్డుదారులు రేషన్ తీసుకునే ముందు ఈ–పాస్‌లో బయోమెట్రిక్ తప్పనిసరి. ► లబ్ధిదారులు తమ సొంత ఊరిలో లేకపోయినా పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. -
3 రోజులు.. 86.23 లక్షల కుటుంబాలు
సాక్షి, అమరావతి: అధికారులు, రేషన్ డీలర్లు, గ్రామ, వార్డు వలంటీర్ల కృషితో మూడు రోజుల్లోనే రాష్ట్రంలో 86.23 లక్షలకు పైగా కుటుంబాలకు ఉచిత రేషన్ సరుకులు అందాయి. శనివారం ఒక్క రోజే 33.26 లక్షల మంది కుటుంబాలు సరుకులు తీసుకున్నాయి. ఇప్పటి వరకు 1.26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 8,524 మెట్రిక్ టన్నుల శనగల్ని పేదలకు పంపిణీ చేశారు. రేషన్ కార్డుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పంపిణీ చేశారు. రాష్ట్రంలో 18.67 లక్షల మంది పోర్టబులిటీ ద్వారా సరుకులు తీసుకున్నారు. తెల్లరేషన్ కార్డులున్న 1,47,24,017 కుటుంబాలకు సరుకులు అందుబాటులో ఉంచినట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియోకార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. -
ఏపీ : రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత రేషన్ సరకుల పంపిణీ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం నుంచే కూపన్లు తీసుకున్న వారికి ఒక్కో కుటుంబానికి కేజీ శనగలు, ఒక్కో సభ్యుడికి 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు.రెడ్ జోన్ ఏరియాల్లో నేరుగా కార్డుదారుని ఇంటికే ఉచిత రేషన్‌ను పంపిణీ చేస్తున్నారు. తొలి విడతగా మార్చి 29వ తేదీ నుంచి కార్డులో పేరు ఉన్న ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. రెండో విడతలో భాగంగా రాష్ట్రంలో 1,47,24,017 కుటుంబాలకు బియ్యంతో పాటు కిలో శనగలు ఉచితంగా అందిస్తున్నారు. అందరూ ఒకేసారి రేషన్ షాప్ లోకి రాకుండా సమయాలను సూచిస్తూ వాలంటీర్లు కూపన్లు పంపిణీ చేశారు. కార్డుదారులు తమకు ఇచ్చిన కూపన్లోని సమయాల్లోనే రేషన్ షాపుకు వచ్చి సరుకులను తీసుకెళ్తున్నారు. ఇక లబ్దిదారులు భౌతిక దూరాన్ని పాటించేలా అధికారులు పకడ్బంధీగా చర్యలు తీసుకున్నారు. బయోమెట్రిక్ లేకుండానే సరుకులను అందజేస్తున్నారు. నేరుగా ఇంటికే రేషన్..! లాక్డౌన్ నేపథ్యంలో రెండో విడత ఉచిత రేషన్ కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా కేంద్రం మచిలీపట్నం నగర పాలక సంస్థలో ఉచిత డోర్ డెలివరీని మంత్రి పేర్ని నాని, ఆర్డీవో ఖాజావలీ ప్రారంభించారు. కార్డులోని కుటుం సభ్యులకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం, ప్రతి కార్డుకి కిలో శనగలు పంపిణీ చేశారు. 27 వరకు అందిస్తాం : మంత్రి వెల్లంపల్లి రెండో విడత ఉచిత రేషన్‌ను ఈ నెల 27వరకు అందిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విజయవాడ తూర్పులో రెండో విడత రేషన్ సరకుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెల్లకార్డు లేకపోయినా పేదవానిరి గుర్తిస్తే సరుకులు అం దిస్తామని తెలిపారు. ముందుగా రెడ్ జోన్ల ప్రాంతాలతో ఇంటికే రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నామని, ఆతర్వాత అన్ని ప్రాంతాల వారికి అందిస్తామని చెప్పారు. ►తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరడ గ్రామంలో రెండో విడత బియ్యం పంపిణీని ఆర్డివో చిన్న కృష్ణ ప్రారంభించారు. ►నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు ఆర్ఆర్ కాలనీలో రెండో విడత రేషన్‌ను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. లాక్డౌన్ సమయంలో పేదలు ఆకలితో వస్తులు ఉండకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు సార్లు రేషన్ అందిస్తున్నారని తెలిపారు. ►కర్నూలు జిలాల్లోని 2436 రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ ప్రారంభమైంది. లాక్డౌన్ నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా 2,036 కౌంటర్లు ఏర్పాటు చేసి జిల్లాలోని 11.91 లక్షల కార్డు దారులకు రేషన్ అందిస్తున్నారు. ►వైఎస్సార్ జిల్లా రామరాజుపల్లిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పర్యటించి ఉచిత రేషన్ సరకులను అందించారు. రేషన్ సరకులకు వచ్చే ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. కూపన్లలో తెలిపిన సమయానికే రేషన్‌కు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ►వైయస్సార్ జిల్లా రాయచోటిలో తెల్లవారుజామున ఆరు గంటల నుంచి విపత్తు పరిహారం క్రింద ఎపి సర్కార్ అందిస్తున్న ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం కోనసాగుతుంది. సచివాలయ, రెవిన్యూ సిబ్బంది పర్యవేక్షణలో పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. గుంపులు గుంపులుగా లబ్ధిదారులు రాకుండా ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ ద్వారా టైమింగ్ స్లాట్ ఇవ్వడంతో లబ్ధిదారులు సమయపాలన పాటిస్తూ, భౌతిక దూరం వహిస్తూ రేషన్ తీసుకోంటున్నారు. ►తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 16.5 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. 600 కార్డులు దాటితే అదనపు కేంద్రాలను ఏర్పాటు చేసి రేషన్ సరుకులను అందిస్తున్నారు. ►కృష్ణా జిల్లా నందిగామ నియోజవర్గంలో ఉదయం 6 గంటలకే రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. కేటాయించిన సమయంలో కార్డు దారులను వాలంటీర్లు రేషన్ షాపుకు తీసుకొస్తున్నారు. ►శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 8.29 లక్షల కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు లేని అర్హులైన 14677 మందిని గుర్తించి వారికి కూడా సరుకులు అందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 13,300 టన్నుల బియ్యం, 824 టన్నుల శనగలు పంపిణీ చేయనున్నారు. ►అనంతపురం జిల్లా కదిరిలో రేషన్ సరుకులను వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డా.సిద్దారెడ్డి ప్రారంభించారు. ►కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని రేషన్ దుకాణం షాప్ నెం 1,2,4,5,13,14, 114 లలో ఎమ్మెల్యే ఆర్థర్ అకస్మిక తనిఖీలు నిర్వహించారు. చౌక దుకాణం వద్ద సామాజిక దూరం పాటించాలని లబ్దిదారులకు అవగాహన కల్పించారు. రేషన్ కోసం క్యూలైన్లలో ఉన్న వారికి మాస్కలు,శానటైజర్లు పంపిణీ చేశారు. 4వ చౌక దుకాణం వద్ద రేషన్ పంపిణీ సరిగ్గా జరగడం లేదని డీలర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా, సామాజిక దూరం పాటిస్తూ సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. -
ఏపీ: నేటి నుంచి ఉచిత రేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ప్రభుత్వం రెండో విడత ఉచితంగా పంపిణీ చేయనున్న రేషన్ సరుకులను నేటి నుంచి అందించనున్నారు. రేషన్ షాపులకు సరుకులు ఇప్పటికే చేరుకున్నాయి. మొదటి విడతగా మార్చి 29వ తేదీ నుంచి కార్డులో పేరు ఉన్న ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. గురువారం నుంచి ∙రెండో విడత సరుకులను లబ్దిదారులకు పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 1,47,24,017 కుటుంబాలకు బియ్యంతో పాటు కిలో శనగలు ఉచితంగా అందించనున్నారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 29 వరకు మూడు విడతలు రేషన్ సరుకులు ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. –ఈసారి రేషన్ షాపుల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా లబ్ధిదారులకు టైం స్లాట్‌తో కూడిన కూపన్లు జారీ చేశారు. –వలంటీర్ల ద్వారా కూపన్లను కార్డుదారులకు అందిస్తున్నారు. –కూపన్లపై రేషన్ షాపు, తేదీ, సరుకులు తీసుకునే సమయం వివరాలు ముద్రించి ఉంటాయి. –లబ్దిదారులు వేలిముద్ర వేయకుండా వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారా రేషన్ సరుకులు ఇస్తారు. –రాష్ట్రంలోని 14,315 రేషన్ షాపుల్లో ఎక్కువ కార్డులు ఉన్న చోట్ల రద్దీని నియంత్రించేందుకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. –8 వేల రేషన్ షాపుల్లో సింగిల్ కౌంటర్, 3,800 షాపుల్లో రెండు కౌంటర్లు, 2,500 షాపుల్లో అదనంగా 3 కౌంటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. –రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉంటే 92 లక్షల కార్డులకే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోంది. మిగిలిన 55 లక్షల కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించి ఉచితంగా బియ్యం, కేజీ శనగలను అందిస్తోంది. –బియ్యం కార్డులు పొందేందుకు అన్ని అర్హతలు ఉండి దరఖాస్తు చేసుకున్న పేదలకు కూడా ఉచిత సరుకులు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. –లాక్డౌన్ వల్ల పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్న లక్షల మంది కార్డుదారులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోని రేషన్ దుకాణం ద్వారా సరుకులు పొందేందుకు కూపన్లు జారీ చేశారు. –కరోనా వైరస్ వల్ల రెడ్ జోన్‌గా ప్రకటించిన చోట్ల సురక్షిత ప్రాంతంలో సరుకులు అందించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వీలైతే ఇంటింటికీ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. –రేషన్ అందకపోవడం, ఇతర ఇబ్బందులు ఎదురైతే 1902 నంబర్‌కి కాల్ చేస్తే అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారు. -
పేద కుటుంబానికి ఉచిత రేషన్
గాజువాక: ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో ఓ పేద కుటుంబానికి ఉచిత రేషన్ సరుకులు అందాయి. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులే ఆ పేద కుటుంబం ఇంటికెళ్లి మరీ సోమవారం సరుకులను అందించారు. వివరాల్లోకెళ్తే.. విశాఖపట్నం జిల్లా గాజువాక కొండ ప్రాంతంలో ముగ్గురు పిల్లలతో తాను పేదరికంలో మగ్గుతున్నానని పెంటయ్యనగర్‌కు చెందిన బొడ్డటి పూజ కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. తాపీ మేస్త్రి వద్ద కూలీగా పనిచేస్తున్న తన భర్తకు లాక్డౌన్ కారణంగా పనులు దొరకడం లేదని, దీంతో ఆకలిబాధలు తప్పడం లేదని లేఖలో పేర్కొంది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం కార్యాలయ అధికారులు ఆ కుటుంబానికి ఉచిత రేషన్ సరుకులు అందజేయాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)ని ఆదేశించారు. జేసీ ఆదేశాలతో తక్షణం స్పందించిన పౌర సరఫరాల శాఖ సహాయ పంపిణీ అధికారి పి.వి.రమణ, గాజువాక తహసీల్దార్ చిన్నికృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది స్వయంగా ఉచిత రేషన్ సరుకులను ఆమె ఇంటికి తీసుకెళ్లి అందజేశారు. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అర కిలో పంచదారను అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పూజ సీఎం కార్యాలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. -
అందరికీ రేషన్ అందిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చివరి రేషన్‌కార్డుదారుడికి కూడా సరుకులు అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రెండు మూడు రోజుల్లోనే వంద శాతం పంపిణీ పూర్తి చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేషన్ డిపోల వద్ద భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. కరోనా నియంత్రణపై వలంటీర్లు సైనికుల్లా పని చేస్తున్నారని అభినందించారు. చోడవరంలో వృద్ధురాలి మృతిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లో వైరస్ కోరలు పెకిలించే మందు తమ దగ్గర ఉందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌కు భయపడి ఇంట్లో దాక్కున్న చంద్రబాబు విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మంగళవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ► వలంటీర్లతో సరుకులు ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు గతంలో వారిపై చేసిన విమర్శలు గుర్తు చేసుకోవాలి. ఇప్పటికైనా వలంటీర్ల సేవలను గుర్తించడం అభినందనీయం. ► రేషన్ సరుకులు కొలిచి ఇవ్వాల్సి ఉన్నందున కొన్నిచోట్ల క్యూలలో నిలుచుంటున్నారు. ► దేశవ్యాప్తంగా లాక్డౌన్, కరోనా నేపథ్యంలో రెండు నెలల పాటు పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించాం. -
ఎక్కడ నుంచైనా రేషన్..వలసదారులకు వరం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ సరుకులను ఎక్కడి నుంచైనా తీసుకునే విధానం (పోర్టబిలిటీ) వలసదారులకు వరంలా మారింది. ఉపాధి నిమిత్తం రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం పరిపాటి. ఇటువంటి వారికి పోర్టబిలిటీ విధానం ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. అలాగే, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుండి లక్షలాది మంది వలస వెళ్తున్నారు. ఇలాంటి వారికి కూడా ఆయా రాష్ట్రాల్లోనే సబ్సిడీ సరుకులు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పోర్టబిలిటీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో తెల్లరేషన్ కార్డులు కల్గి ఉండి తెలంగాణలో ఉంటున్న వారు ఈ–పాస్ ద్వారా సరుకులు తీసుకునే విధానాన్ని ఇటీవల ప్రయోగాత్మకంగా అమలుచేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రేషన్ తీసుకునే విధానం విజయవంతమైతే ఈ విధానాన్ని దేశమంతటా అమలుచేయనున్నారు. కాగా, ఏపీలోనే పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్న వారి సంఖ్య దాదాపు 30 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలైతే రాష్ట్రానికి చెందిన మరికొందరికి లబ్ధి చేకూరుతుంది. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. వచ్చే నెల నుంచి ఇంటికే రేషన్ ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ నుంచి ప్రజా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానం అమల్లోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా.. 5, 10, 20 కిలోల బ్యాగుల ద్వారా బియ్యాన్ని లబ్ధిదారుల ఇళ్లకే గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. నూతన విధానం అమల్లోకి వచ్చినా వలస కూలీలు పోర్టబిలిటీ ద్వారా రేషన్ డీలర్ (స్టాకు పాయింట్లు) వద్దే సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఆ మేరకు ఈ–పాస్ మిషన్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేశారు. దీని ద్వారా ఎక్కడ, ఏ రేషన్ దుకాణంలో ఎంతమంది లబ్ధిదారులు సరుకులు తీసుకెళ్లారో ఆన్లైన్లో నమోదవుతుంది. కాగా, ఏదేని రేషన్ షాపులో 50 శాతం సరుకు పూర్తికాగానే సంబంధిత జిల్లా డీఎస్‌ఓలను అప్రమత్తం చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి మెసేజ్ వెళ్తుంది. తద్వారా సంబంధిత షాపులకు అదనంగా కోటాను అందుబాటులోకి తెస్తారు. -
పౌరసరఫరాల ఐటీ సేవలపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పౌర సరఫరాలశాఖలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, అమలుతీరుపై అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియాన్) దేశాల అధికారుల బృందం అధ్యయనం చేసింది. రాష్ట్రంలో కోట్లాది మంది పేదప్రజలకు సేవలందిస్తున్న పౌరసరఫరాల శాఖ సాంకేతికతను ఉపయోగించుకుంటున్న విధానం బాగుందని కొనియాడింది. శుక్రవారం ఇండోనేసియా, కంబో డియా, మయన్మార్, థాయ్‌లాండ్, వియత్నాం, మలేసియా దేశాల నుంచి గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమాభివృద్ధి తదితర విభాగాలకు చెందిన 13 మంది అధికారులు పౌర సరఫరాల భవన్లో కమిషనర్ అకున్ సబర్వాల్‌తో సమావేశమయ్యారు. శాఖలో చేపట్టిన వినూత్న చర్యలు, సంస్కరణలు, విధానాలపై 18 దేశాల ప్రతినిధులు అధ్యయనం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు, ఈ–పాస్, ఐరిస్ విధానం, టి–రేషన్ యాప్, గోదాముల్లో సీసీ కెమెరాలు, రేషన్ సరుకులు తరలించే వాహనాలకు జీపీఎస్, ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పనితీరును పరిశీలించారు. సరుకుల పంపిణీ విధానం, రేషన్‌షాపులు, రేషన్ కార్డుల సంఖ్య, అక్రమాలకు తావులేకుండా లబ్ధిదారులకు ఏ విధంగా సరుకులు చేరుతున్నాయనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాఖలో చేపట్టిన చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్ వివరించారు. -
ఐరిస్‌తోనూ రేషన్ సరుకులు
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ ద్వారా రేషన్ సరుకులు తీసుకునే లబ్ధిదారులకు సులువుగా, ప్రయోజనం కలిగించేలా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. వేలిముద్రలతోపాటు కనుపాపల (ఐరిస్) ఆధారంగా లబ్ధిదారులకు సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈనెల 1 నుంచి మొదటి విడతలో 16 జిల్లాల్లో 5,186 దుకాణాల్లో ఈ విధానం ప్రారంభించింది. దాదాపు ఏడాది నుంచి పౌరసరఫరాల శాఖ ఈపాస్ (బయోమెట్రిక్) విధానం ద్వారా సరుకుల పంపిణీ చేస్తోంది. అయితే ఈ విధానంలో వృద్ధులు, మహిళల వేలిముద్రలు అరిగిపోవడం వల్ల ఈపాస్ మెషీన్లు ధ్రువీకరించడం లేదు. దీంతో ప్రతినెలా రేషన్ సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లబ్ధిదారులు అసౌకర్యానికి గురికావద్దనే ఉద్దేశంతో వేలిముద్రలు సరిపడని చోట ఆయా ప్రాంతాల్లో వీఆర్వో, వీఏవో, పౌరసరఫరాల శాఖ ఇన్స్పెక్టర్లకు లబ్ధిదారులను ప్రామాణీకరించే సౌకర్యం కల్పించింది. అయితే ఈ విధానం కొన్ని చోట్ల దుర్వినియోగమవుతున్న విషయం పౌరసరఫరాల అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈ సమస్యలను అధిగమించడానికి ఐరిస్ విధానం పరిష్కారమని భావించిన ఆ శాఖ అధికారులు రాష్ట్రంలోని 17,200 రేషన్ షాపుల్లో దశల వారీగా ఐరిస్ విధానం అమలుకు చర్యలు చేపట్టారు. శుక్రవారం సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలోని రేషన్ షాపుల్లో ఐరిస్ విధానం అమలు తీరును పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సభర్వాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్వరలో అన్ని షాపుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా, అర్హులైన పేదలకు మరింత సులువుగా నిత్యావసర సరుకులు అందించడానికి ఐరిస్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 5,186 దుకాణాల్లో ఈనెల ఒకటవ తేదీ నుండి ఐరిస్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని, ఈ నాలుగు రోజు ల్లో 15.20 లక్షల మంది రేషన్ సరుకులు తీసుకున్నారని తెలిపారు. -
15రోజులే
సాక్షి, రంగారెడ్డి జిల్లా : చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు ఇకపై నెలలో 15 రోజులు మాత్రమే సరుకులు అందజేయనున్నారు. వచ్చేనెల నుంచి ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. అప్పటినుంచి ప్రతినెలా ఒకటి నుంచి 15వ తేదీలోపే కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీలర్లకు ఆదేశాలు అందాయి. జిల్లావ్యాప్తంగా 919 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులు కలిపి మొత్తం 5.18 లక్షల మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా సుమారు 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేస్తున్నారు. దీనికి తోడు ప్రతి కార్డుదారుడికి రెండు కిలోల గోధుమలు, ఒక లీటరు నీలి కిరోసిన్ చొప్పున పంపిణీ అవుతోంది. మొన్నటి వరకు ప్రతినెలా 25వ తేదీ వరకు చౌక ధరల దుకాణాలు తెరిచి ఉండేవి. తమ సౌలభ్యాన్ని బట్టి వీలైన రోజు కార్డుదారులు సరుకులను తీసుకెళ్లేవారు. తాజాగా రేషన్‌దుకాణాల పనిదినాలను కుదించడంతో కాస్త ఇబ్బంది కలగవచ్చు. పని వేళలను మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే వచ్చేనెల నుంచి కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచే ఉంటాయని అధికారులు పౌర సరఫరాల శాఖాధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈనెలలోనే ఒకటి నుంచి 15వ తేదీ వరకు నిత్యావసర వస్తువుల పంపిణీ అమలు కావాల్సి ఉంది. అయితే అధికంగా సెలవులు రావడంతో 17వ తేదీ వరకు సరుకులను పంపిణీ చేశారు. వచ్చేనెల పని దినాల్లో ఎలాంటి సడలింపు ఉండబోదని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. డీడీల చెల్లింపుల్లోనూ! రేషన్ దుకాణాల పని దినాలను కుదించిన ప్రభుత్వం.. డీలర్లు డీడీలు చెల్లించే రోజులను సైతం తగ్గింది. మొన్నటి వరకు ప్రతినెలా 27వ తేదీలోపు డీడీలు చెల్లించేవారు. ఆ నెలాఖరులోగా సరుకులు డీలర్ల వద్దకు చేరేవి. ఇకపై ఈ పరిస్థితి ఉండదు. ప్రతినెలా తప్పనిసరిగా 16 నుంచి 18వ తేదీలోపే డీడీలు చెల్లించాలని పౌర సరఫరాల శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చెల్లించినదాన్ని బట్టి స్టాక్ రిలీజ్ ఆర్డర్లను మండల స్థాయి స్టాక్ గోదాం (ఎంఎల్ఎస్)లకు పంపిస్తారు. అక్కడి నుంచి నెలాఖరులోగా డీలర్ల వద్దకు వస్తువులను పంపించాల్సి ఉంటుంది. తదుపరిగా వచ్చే ఒకటో తేదీ నుంచి విధిగా రేషన్ దుకాణాల ద్వారా డీలర్లు కార్డుదారులకు సరుకులను పంపిణీ చేస్తారు. వేతనం ఇవ్వాల్సి వస్తుందనే! రేషన్ దుకాణాల పనిదినాలను కుదించడం వెనుక కుట్ర ఉందని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రతి నెలలో 25 రోజులపాటు సరుకులు పంపిణీ చేసేవారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు మొదలు పెట్టడం డీలర్లకు కాస్త ఇబ్బందిగా మారింది. సరుకుల సంఖ్య కుదించడం, ఈ–పోస్ మిషన్లు తీసుకురావడం వల్ల తమకు ఏమీ మిగలడంలేదని డీలర్లు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా నెలంతా కష్టపడితే దుకాణాల అద్దె కూడా వెళ్లడంలేదని లబోదిబోమంటున్నారు. ప్రత్యామ్నాయంగా తమకు ప్రతినెలా వేతనాలను చెల్లించాలని డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సరుకుల అమ్మకం ద్వారా వచ్చే కమీషన్లు లేకున్నా.. వేతనం ఇస్తే చాలన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. దీన్ని సాధించుకునేందుకు నిరవధికంగా దుకాణాలను బంద్ చేయాలని కూడా నిర్ణయించారు. ఇలాంటి సమయంలో నెలలో 15 రోజులే దుకాణాలు పనిచేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. తమకు వేతనాలు అందించాలన్న డిమాండ్‌ను నీరుగార్చడంలో భాగంగానే ఈ చర్యలకు ఉపక్రమించారని విమర్శిస్తున్నారు. పనిదినాల కుదింపు వల్ల తమకు వచ్చే నష్టం ఏమీలేదని చెబుతున్నారు. -
ప్రతి పథకమూ పారదర్శకం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ప్రతి పథకం వివరాలు అందుబాటులో ఉంచి పథకాల అమలులో పారదర్శకతను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్రం పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలను బహిరంగపరిచేందుకు ‘డీబీటీ భారత్’పేరుతో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పద్ధతిలో అమలు చేస్తున్న పథకాల్లో ఎంత మేర లబ్ధిదారులకు చేరింది, ప్రభుత్వానికి ఎంత ఆదా అయింది తదితర వివరాలను అందులో పొందుపరిచింది. సమాచారాన్ని పక్కాగా అందుబాటులో ఉంచేందుకు అన్ని రాష్ట్రాల్లో డీబీటీ సెల్లు ఏర్పాటు చేసింది. వివిధ పథకాల సబ్సిడీ నిధులను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసే నగదు బదిలీ విధా నాన్ని కేంద్రం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. గ్యాస్ సబ్సిడీతో మొదలైన విధానాన్ని మెల్లగా ఇతర పథకాలకూ విస్తరిస్తోంది. ఎల్పీజీ.. రూ.29 వేల కోట్లు ఆదా.. నాలుగేళ్లుగా ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీలను నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న కేంద్రం.. దాని ద్వారా తొలి ఏడాదిలోనే రూ.29 వేల కోట్లు ఆదా అయినట్లు లెక్క తేల్చింది. దీంతో మిగతా పథకాల సబ్సిడీలనూ నేరుగా లబ్ధిదారులకే చేరవేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కూలీ ల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తోంది. జాతీయ సామాజిక భద్రతలో భాగంగా వృద్ధులకు చెల్లించే పెన్షన్లనూ నేరుగానే పంపిణీ చేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా సరఫరా చేసే రేషన్ సరుకుల సబ్సిడీనీ నేరుగా అందించే కార్యాచరణను కూడా చేపట్టింది. డీబీటీ చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ధనం భారీగా ఆదా అవుతోందని, దీని ద్వారా నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయగలిగామని వెబ్సైట్లో కేంద్రం వెల్లడించింది. డీబీటీతో 2016–17లో రూ.57,029 కోట్లు ఆదా అయినట్లు లెక్క తే ల్చిన కేంద్రం.. ఆ వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. అన్ని పథకాలు డీబీటీ పరిధిలోకి..! దేశంలో 395 పథకాలు అమలు చేస్తున్న కేంద్రం.. ప్రజా పంపిణీ వ్యవస్థ, వ్యవసాయ శాఖలో అమలులో ఉన్న విత్తన పంపిణీ మొదలు డ్రిప్ ఇరిగేషన్ వరకు, వృద్ధాప్య పింఛన్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉపాధి శిక్షణ, ఉపాధి హామీ నిధులు, అంగన్ వాడీ పథకాలు.. ఇలా అన్నింటికీ సబ్సిడీలు చెల్లిస్తోంది. వీటిలో కొన్నింటి సొమ్ము ఇప్పటికే నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరుతోంది. అయితే కొన్ని పథకాలకు సంబంధించిన సబ్సిడీలు ముందుగా ఆయా శాఖలకు చేరుతుండటంతో సబ్సిడీ సొమ్ము వివిధ రకాలుగా దుర్వినియోగమవుతున్నట్లు తెలిసింది. దీంతో ఉపాధి హామీ, గ్యాస్, కిరోసిన్, రేషన్ బియ్యం, స్కాలర్షిప్, పెన్షన్లు నేరుగా లబ్ధిదారులకే అందేలా డీబీటీ విధానం తీసుకొచ్చింది. నిధుల దుర్వినియోగం జరగకపోవడం, భారీగా ప్రభుత్వ ధనం ఆదా అవుతుండటంతో సబ్సిడీతో ముడిపడి ఉన్న మిగతా పథకాలనూ డీబీటీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. రాష్ట్రాలకు బంపర్ ఆఫర్.. ప్రస్తుతం ప్రజా పంపిణీ ద్వారా సరఫరా చేసే రేషన్ సరుకులపై కేంద్ర సబ్సిడీ నేరుగా రాష్ట్ర ఖాతాలో జమవుతుంది. అయితే సబ్సిడీని లబ్ధిదారుడి ఖాతాలో నేరుగా జమ చేస్తే దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని భావించిన కేంద్రం.. గతేడాది నుంచి అన్ని రాష్ట్రాలను ఆ దిశగా అప్రమత్తం చేసింది. డీబీటీతో ఆదా చేసిన సొమ్మును రాష్ట్రాలకే పంపిణీ చేస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం పంపించాలని, కేంద్ర పథకాలను అందుకుంటున్న లబ్ధిదారుల వివరాలను డీబీటీ వెబ్సైట్లో పొందుపరచాలని కోరింది. అయితే ఒక్కో కుటుంబానికి ఎంత మేలు జరిగింది, ప్రభుత్వ పథకాలేమేం అందాయి, లబ్ధి పొందని కుటుంబాలెన్ని అనే కోణంలో ఈ డేటాను కేంద్రం సమీకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల వారీగా ఆధార్ లింకేజీ పూర్తయినందున ఏయే పథకాల్లో ఎవరు, ఎంతమేర లబ్ధి పొందారో క్షణాల్లో వివరాలు తెలుసుకోవచ్చని.. ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వాలకూ అది ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు. -
చెట్టెక్కితేనే.. రేషన్ బియ్యం!
ప్రజా పంపిణీకి సెల్ సిగ్నల్స్‌తో షాక్ - సిగ్నల్స్ సరిగా అందక పనిచేయని ఈ–పాస్ యంత్రాలు - వేలిముద్ర వెరిఫై అయ్యాకే సరుకులు ఇవ్వాల్సిన పరిస్థితి - సిగ్నల్ కోసం గుట్టలు, చెట్లు ఎక్కుతున్న డీలర్లు సాక్షి, హైదరాబాద్: రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా అమల్లోకి తెచ్చిన ఆధునిక టెక్నాలజీ రేషన్ డీలర్లను చెట్లు, గుట్టలు ఎక్కిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఈ–పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్) యంత్రాలకు సెల్ సిగ్నల్స్ అందక తీవ్ర ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. సిగ్నల్ కోసం చెట్లు, పుట్టలు పట్టుకుని తిరగడం, ఇళ్లు, భవనాలపైకి ఎక్కడం, గ్రామాల సమీపంలోని గుట్టలపైకి వెళ్లాల్సి రావడం వంటి వాటితో.. అటు రేషన్ డీలర్లకు, ఇటు లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ–పాస్‌కు సెల్ సిగ్నల్ షాక్ ఈ–పాస్ యంత్రాలు సెల్‌ఫోన్ టెక్నాలజీ (సిమ్‌కార్డు) ఆధారంగా పనిచేస్తున్నాయి. అన్ని లావాదేవీలను ఆన్లైన్లో నమోదు చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి.. రేషన్ దుకాణాలను దానికి అనుసంధానం చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో సెల్ సిగ్నల్ సరిగా లేకపోవడం కారణంగా ఈ–పాస్ యంత్రాల వినియోగం సమస్యాత్మకంగా మారింది. మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో పరిశీలించినప్పుడు... గండేడు, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సిపాయిగూడెం, బండలేమూరు, చెన్నారెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మండలంలో సిగ్నల్ సమస్య తలెత్తింది. దీంతో బయోమెట్రిక్ వివరాలు వెరిఫై చేయలేక.. రేషన్ డీలర్లు లబ్ధిదారులకు సరిగా సరుకులు పంపిణీ చేయలేకపోతున్నారు. సరుకులు, యంత్రాలు తీసుకుని.. సెల్ సిగ్నల్ కోసం ఎత్తయిన చోట్లకు వెళుతున్నారు. ఇళ్లపైకి, చెట్లపైకి ఎక్కడం, కొన్ని చోట్ల సమీపంలోని గుట్టలు ఎక్కడం వంటివి చేయాల్సి వస్తోంది. అటు లబ్ధిదారులు కూడా సరుకుల కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఇక ఈ–పాస్ యంత్రాలు తరచూ స్విచాఫ్ కావడం, సిగ్నల్స్ సరిగా లేక సాంకేతిక లోపంతో తూనికల యంత్రాలు సరిగా పనిచేయక ఇబ్బందులు వస్తున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట పడుతున్నా.. అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, బినామీ లబ్ధిదారులను ఏరివేయడం లక్ష్యంగా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రేషన్ షాపుల్లో ఈ–పాస్ యంత్రాలను ఏర్పాటు చేస్తోంది. వాటితో అర్హులైన లబ్ధిదారుల వేలిముద్రను సరిచూసుకుని మాత్రమే సరుకులను అందజేయాల్సి ఉంటుంది. తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 1,545 రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేసి.. ఈ–పాస్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. కేవలం 15 నెలల కాలంలో ప్రభుత్వానికి ఏకంగా రూ.320 కోట్లు ఆదా అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 800 రేషన్ షాపుల్లో అమలు చేయగా.. నెల రోజుల్లోనే రూ.3.3 కోట్లు భారం తగ్గింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 17,200 రేషన్ షాపుల్లో ఈ–పాస్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బయోమెట్రిక్‌తోపాటు ఐరిస్ స్కానింగ్ సౌలభ్యం కూడా ఉండేలా అధునాతన యంత్రాలను తెప్పించి.. దశలవారీగా ఏర్పాటు చేస్తోంది. టెలికాం కంపెనీల దృష్టికి సమస్య పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు సెల్ సిగ్నల్ సమస్యను సంబంధిత కంపెనీల దృష్టికి తీసుకెళ్లారు. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా తదితర ఆపరేటర్ల ప్రతినిధులను పిలిపించి నెట్వర్క్ విషయంలో జాగ్ర త్తలు తీసుకోవాలని కోరినట్లు తెలిపాయి. అయితే సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికే రాష్ట్రవ్యాప్తంగా 10 వేల రేషన్ షాపుల్లో ఈ–పాస్ అమల్లోకి రానుంది. మిగతా 7,200 షాపుల్లో దశల వారీగా ఏర్పాటు చేయనున్నారు. పని మానుకుని తిరుగుతున్నం.. రేషన్ సరుకులు తీసుకోవడానికి కూలీ పనులు, వ్యవసాయ పనులు మానుకుని తిరగాల్సి వస్తోంది. వారం రోజుల నుంచి వచ్చి పోతున్నా వేలిముద్రలు రాక సరుకులు ఇవ్వడం లేదు. – నీలి గంగమ్మ, గాధిర్యాల్ రోజుల కొద్దీ మిషన్లు పనిచేయడం లేదు రేషన్ సరుకులు తీసుకోవడానికి మిషన్లు పెట్టడంతో దూర ప్రాంతాల్లో పనులకు వెళ్లినవారు కూడా నెలకోసారి ఊరికి వచ్చిపోవాల్సి వస్తోంది. ముంబై, పుణెలకు వలస పోయినోళ్లూ వచ్చిపోతున్నరు. ఇక్కడ గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల కొద్దీ మిషన్లు పనిచేయక.. సరుకులు తీసుకోవడం కష్టమవుతోంది. – లక్ష్మీబాయి, మొకర్లాబాద్ తండా సరుకుల పంపిణీ కష్టంగా మారింది రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఈ–పాస్ మిషన్లు పెట్టడం మంచిదే అయినా.. మారుమూల ప్రాంతాల్లో సెల్ సిగ్నల్ రాక సమస్యలు వస్తున్నాయి. నా రేషన్ షాపు పరిధిలో 460 కార్డులుండగా.. ఇదివరకు వారంలో సరుకుల పంపిణీ పూర్తయ్యేది. ఈ–పాస్ మిషన్లు వచ్చాక.. 20 రోజుల పాటు పనిచేయాల్సి వస్తోంది. ఈ విషయమై సర్కార్ దృష్టి పెట్టాలి’’ – గోపాల్‌నాయక్, మంగంపేట రేషన్ డీలర్ -
గివ్ ఇట్ అప్
బియ్యం వద్దనుకుంటే తహసీల్దార్‌కు లేఖ ఇస్తే చాలు.. ఆ మేరకు డీలర్ కోటాలో కోత మిగతా రేషన్ సరుకులు యథావిధిగా పొందొచ్చు కేంద్రం నుంచి వెలువడిన ఉత్తర్వులు వరంగల్ రూరల్ : గ్యాస్ సిలిండర్‌పై రాయితీ వద్దనుకునే సంపన్నుల కోసం గతంలో కేంద్రప్రభుత్వం ‘గివ్ ఇట్ అప్’ సౌకర్యాన్ని కల్పించింది. దీని ద్వారా నమో దు చేసుకున్న సెల్ నంబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్యాస్ సిలిండర్‌ను ఉత్పత్తి ధరకే అందిస్తున్నారు. ఇదే రీతిలో దొడ్డు బియ్యం వద్దనుకునే రేషన్ కార్డుదారులకు కూడా ‘గివ్ ఇట్ అప్’ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దొడ్డు బియ్యం తినలేం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పలువురికి నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఈ కార్డులోని పేర్ల ఆధారంగా ఒక్కొక్కరికి రూ.1కి కిలో చొప్పున ఆరు కిలోల బియ్యం అందజేస్తున్నారు. దీనికి తోడు చక్కెర, గోధుమలు, నూనె ఇత్యాది సరుకులు అందజేస్తున్నారు. అయితే, పలువురు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం తినలేక బయట అమ్ముకుంటుండగా.. మరికొందరు షాపుల నుంచే తీసుకోవడం లేదు. ఇలా మిగిలిపోయిన బియ్యాన్ని డీలర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో బియ్యం పక్క దారి పడుతోందని గుర్తించిన ప్రభుత్వం ‘గివ్ ఇట్ అప్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తమకు బియ్యం అవసరం లేదని తహసీల్దార్ లేఖ ఇస్తే ఆ లబ్ధిదారుడు సరుకులు తీసుకునే డీలర్ కోటా నుంచి మినహాయించి సరఫరా చేస్తారు. అయితే, రేషన్ కార్డుపై ఇచ్చే మిగతా సరుకులను మాత్రం యథావిధిగా తీసుకోవచ్చు. అంతేకాకుండా మిగతా అవసరాలకు కూడా కార్డు పనికొస్తుంది. కాగా, వరంగల్ రూరల్ జిల్లాలో 3,42,084 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 2,17,422 మందికి ఆహార భద్రత కార్డులు, 12,865 మందికి అంత్యోదయ కార్డులు ఉండగా, 15మంది అన్నపూర్ణ కార్డులు పొందారు. ఖర్చు ఎక్కువ ఉపయోగం తక్కువ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి రుపాయి కి కిలో బియ్యం అందించడానికి అధిక మొత్తంలో ప్రభుత్వాలు నిధులు వెచ్చిస్తున్నాయి. రూ.23 నుంచి రూ.24కు కేజీ చొప్పున ప్రభుత్వం రైసు మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి, రూ.1కే కిలో చొప్పున లబ్ధిదారులకు అందజేస్తోంది. తద్వారా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున నిధులు వెచ్చించాల్సి వస్తోంది. అయితే, పలువురు దొడ్డు బియ్యం తినేందుకు ఆసక్తి చూపకపోవడంతో వివిధ మార్గాల ద్వారా పక్కదారి పడుతోంది. తెల్ల కాగితంపై రాసి ఇవ్వాలి.. ఎస్డబ్ల్యూ.పీటర్, డీఎస్ఓ (07 డబ్ల్యూజీఎల్ 301 లేదా 302 – ఎస్డబ్ల్యూ.పీటర్, డీఎస్ఓ)కార్డుదారుల్లో రూ.1కి కిలో బియ్యం వద్దనుకునేవారు తహసీల్దార్‌కు ‘గివ్ ఇట్ అప్’ వర్తింపజేయాలని తెల్లకాగితంపై రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అలా నెలనెలా ఎంత బియ్యం వద్దనుకుంటున్నారో లెక్క వేసి వారి రేషన్ షాపులకు ఇచ్చే నుంచి మినహాయిస్తాం. అయితే, బియ్యం వద్దని రాసిస్తే మిగతా సరుకులు కూడా ఇవ్వరని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగతావన్నీ యథావిధిగా ఇస్తారు. దీనికి సంబంధించి మాకు కేంద్రప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయి. -
అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు
► జేసీ రాంకిషన్ ► సివిల్ సప్లయ్ రవాణా టెండర్ల ఖరారు మహబూబ్‌నగర్ న్యూటౌన్ : పేద ప్రజల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ సరుకులను లారీల ద్వారా టెండర్‌దారులు ఎమ్మెల్‌ఎస్ గోదాంల నుంచి నేరుగా చౌకధర దుఖానాలకు తరలించాలని, అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఎం రాంకిషన్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ పరిధిలోని 24 ఎంఎల్ఎస్ పాయింట్లకు సంబంధించి దాఖలైన టెండర్ దరఖాస్తులను పరిశీలించగా శుక్ర వారం వాయిదా పడిన 18 టెండర్లను శనివారం ఖరారు చేశారు. ఈ సందర్భంగా జేసీ రాంకిషన్ మాట్లాడుతూ ఎమ్మెల్‌ఎస్ గోదాం నుంచి లారీలు సరుకుల లోడ్‌తో నేరుగా కేటాయించిన గ్రామాలలోని చౌకధర దుఖానాలకు చేరుకోవాలని సూచించారు. ఎమ్మెల్‌ఎస్ గోదాముల నుంచి సరకులు రవాణా చేసే ప్రతీ లారీని జీపీఎస్‌తో అనుసంధానించనున్నట్లు తెలిపారు. ఈ సారి కొత్తగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ సారి మంచి రేటును నిర్ణయించిందని, క్వింటాలుకు రూ. 12 నుంచి రూ.17ల వరకు ఇస్తోందన్నారు. టెండర్‌దారులు ఈ విషయాన్ని గమనించి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాఖలైన టెండర్లలో నిరే ్ధశించిన రేటు ప్రకారం ఎవరు తక్కువ ధరకు దాఖలు చేస్తే వారికి టెండర్లను అప్పగించారు. ఒకే రేటుకు దాఖలు చేసిన టెండరుదారుల పేర్లను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేశారు. కార్యక్రమంలో సివిల్సప్లై డీఎం బిక్షపతి, డిఎస్వో రాజారావు, మాజీ డీఎం ప్రసాదరావు, టెండర్‌దారులు పాల్గొన్నారు. జిల్లాలోని 24 ఎమ్మెల్‌ఎస్ పాయింట్ల వారీగా రవాణా టెండర్లు దక్కించుకున్న వివరాలిలా ఉన్నాయి. -
రేషన్.. ‘వేలిముద్రల’ పరేషాన్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సర్వీస్ (ఈ-పాస్) అమలుతో రేషన్ సరుకులు మిగులు బాటు దేవుడెరుగు కానీ... లబ్ధిదారులైన నిరుపేదలకు మాత్రం వేలిముద్రల పరేషాన్ పట్టుకుంది. ఈ-పాస్ మిషన్ లోని ఆధార్ డేటా తో వేలి ముద్రలు సరిపోక నానా ఇబ్బందులు కలుగుతున్నాయి. సరుకుల కోసం చక్కర్లు తప్పడం లేదు. మరోవైపు చౌకధరల దుకాణాల డీలర్లకు ఈ-పాస్ ద్వారా సరుకుల పంపిణీ ప్రక్రియ తలనొప్పిగా తయారవుతోంది. ఫలితంగా మొదటి రెండు వారాల్లో కనీసం 25 శాతానికి మించి సరుకులు పంపిణీ చేయలేక పోయామని డీలర్లు పేర్కొంటున్నారు. ప్రజా పంపిణిలో సంస్కరణల్లో భాగంగా సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చౌక ధరల దుకాణాల్లో ఈ-పాస్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 12 సర్కిల్స్ పరిధిలో గల సుమారు 1543 షాపుల్లో ఈ- పాస్ ద్వారా సరుకులు పంపిణీ కొనసాగుతోంది. ఈ విధానం సరుకులు పక్కదారి పట్టకుండా కట్టడి చేస్తున్నప్పటికీ సరుకులు కొనుగోలు కోసం రేషన్ షాపులకు వచ్చే అసలైన లబ్ధిదారులకు మాత్రం తిప్పలు తప్పడం లేద న్న ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. వేలిముద్రల ఆధారంగానే... ఈ-పాస్ విధానంలో వేలిముద్రల ఆధారంగానే సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్ యం త్రాన్నిఆధార్ డేటాతో అనుసంధానం చేయడంతో లబ్ధిదారుడి వేలిముద్రలు సరి పోల్చుతున్నారు. చౌకధరల దుకాణానికి సరుకుల కొనుగోలు కోసం లబ్ధిదారుడు ఆహార భద్రత రేషన్ కార్డు డేటా స్లిప్ తీసుకొస్తే డీలర్ ఈ-పాస్ యంత్రం పై కార్డు నెంబర్ నమోదు చేస్తున్నారు. కార్డులోని లబ్ధిదారులు వివరాలు డిస్ప్లే అనంతరం సరుకులు కొనుగోలు కోసం వచ్చిన వ్యక్తి పేరు ఉంటే దానిని టిక్ చేసి వేలి ముద్ర తీసుకోవాల్సి ఉంటుంది. ఈ-పాస్ యంత్రానికి ఆధార్ అనుసంధానం ఉన్న కారణంగా లబ్ధిదారుడి వేలిముద్ర సరిపోతే అమోదం అని డిస్ప్లే అవుతుంది. ఒక వేళ కా కుంటే బయోమెట్రిక్ మ్యాచ్ కావడం లేదని డిస్ ప్లే అవుతోంది, సదరు లబ్ధిదారుల మిగిలిన వేళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. ఒక వేళ లబ్ధిదారుడి పది వేలిముద్రలు కూడా సరి పోకుంటే అదే కుటుంబంలోని మిగతా సభ్యులు వేలిముద్రలను సేకరించి సరి పోల్చాల్సి ఉంటుంది. సదరు కుటుంబంలో ఒకరి వేలి ముద్ర మ్యాచ్ అయినా సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. సరిపోతేనే సరుకుల మెనూలో వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత సరుకులు గుర్తింపు, బిల్లింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాతనే సరుకులు పంపిణీ జరుగుతుంది. ఒక లబ్ధిదారుడికి సరుకులు పంపిణీ చేసేందుకు కనీసం 20 నిమిషాల వరకు అవుతోంది. కష్టజీవుల వేలిముద్రల్లో.. నిరుపేదలైన కష్ట జీవులకు కష్టం వచ్చి పడింది. ఈ-పాస్ పై వేలిముద్రలు సరిపోలడం లేదు. అధిక శాతం కూలీలు, రిక్షా కార్మికులు, వృద్దులు, చిన్నారుల వేలిముద్రలు ఈ-పాస్ ఆధార్‌తో సరిపోవడం లేదు. గతంలో ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలుముద్రలు ప్రస్తుత వేలుముద్రల్లో కొద్ది మార్పులు జరగడం తో ఈ- పాస్‌లో సరిపోలడం లేదు. ముద్రలు ఎర్రర్ చూపిస్తున్న కారణంగా డీలర్లు వారికి రేషన్ సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో వారు తిరిగి ఆధార్ కేంద్రాలకు వెళ్లి తమ ఆధార్‌ను అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు సింగిల్ లబ్ధిదారులైన కార్డుదారులు సరుకుల కొనుగోలు కోసం రేషన్ షాపులకు రాక తప్పడం లేదు. మరోవైపు సర్వర్ డౌన్ కూడా పెద్ద సమస్యగా తయారైంది. సరుకులు వస్తాయన్న నమ్మకం లేదు రేషన్ సరుకుల కోసం దుకాణానికి వెళితే సరుకులు వస్తాయన్న నమ్మకం లేకుండా పోతుంది. మిషన్‌పై వేలి ముద్రలు త్వరగా పడడం లేదు. ఒక్కోసారి దుకాణం నుంచి ఖాళీ చేతులతో రావాల్సి వస్తుంది. ఈ విధానాన్ని ఎత్తివేయాలి. రేషన్ దుకాణం వద్ద కూడా సరుకుల కోసం చాలా ఆలస్యమవుతోంది. -శోభ, ఉప్పుగూడ. వేలిముద్రలు సరిపోవడం లేదు సరుకులకు వేలిముద్రలకు లింక్ పెట్టారు. సరుకులు తీసుకోవడం కష్టతరమవుతోంది. ఎప్పుడో ఐదారేళ్ల క్రితం తీసుకున్న వేలి ముద్రలకు ఇప్పుడు ఆమోదించడం లేదు. చిన్నారులను పంపించడం కుదరదు. మా లాంటి వారు వెళ్లి అవస్థలు పడుతున్నాం. వేలి ముద్రలు ఆమోదించని సమయంలో ఏఎస్‌వోను కలవాలని రేషన్ డీలర్...రేషన్ డీలర్‌ను కలవాలని అధికారులు తిప్పుతున్నారు. - కె.రాజ్లింగం, జంగమ్మెట్