వికారాబాద్, న్యూస్‌లైన్ : చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందేలా అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వెంకట్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, పౌరసరఫరాలు, ఎన్నికలు తదితర అంశాలపై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిం చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రేషన్ డీలర్లు సరుకులను బ్లాక్‌మార్కెట్ తరలిస్తున్నారన్న ఫిర్యాదులు తరచూ తన దృష్టికి వస్తున్నాయని, అధికారులు ఎప్పటికప్పుడు దుకాణాలను తనిఖీ చేస్తూ సరుకులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిత్యావసర సరుకులు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. కొందరు డీలర్లు బియ్యం, పంచదార, పామాయిల్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని, సంబంధిత అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టాలని సూచించారు.
స్టాక్ పాయింట్‌లో అక్రమాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తనిఖీలకు అధికారులు ఉపక్రమించకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తుందని, తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని జేసీ హెచ్చరించారు. వికారాబాద్‌లో వంట గ్యాస్ కనెక్షన్ల మంజూరు, సిలిండర్ల సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డీలర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్నికలకు సిద్ధం కండి..
త్వరలో ఎన్నికలు జరుగనున్నందున అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేసి అధికారులు సిద్ధంగా ఉండాలని జేసీ సూచించారు. ఓటరు జాబితాలు సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, అవసరమైన సిబ్బంది నియామకంపై దృష్టి సారించాలన్నారు. వికారాబాద్‌లో సబ్ కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల కొత్త భవనాల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సబ్‌కలెక్టర్ ఆమ్రపాలిని జేసీ ఆదేశించారు.
అల్ట్రా మోడల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి 30 ఎకరాలు..
వికారాబాద్ మండలం కామారెడ్డిగూడలో ఆర్టీసీ ఏర్పాటు చేయదలచిన అల్ట్రా మోడల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి 30ఎకరాల ప్రభుత్వ భూమిని త్వరలోనే అందజేయనున్నట్టు జేసీ ఎంవీరెడ్డి తెలిపారు. ఈ భూమిలో కొందరు ప్రైవేట్ పట్టాదారులకు 4.35 ఎకరాలు ఉన్నందున వారికి పరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోనున్నట్టు వివరించారు.
సమీక్ష సమావేశంలో సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, డీఎస్‌వో నర్సింహారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ అరుణకుమారి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ప్రభుదాస్, భూ సర్వే అసిస్టెంట్ డెరైక్టర్ అనంతరెడ్డి, తహసీల్దార్‌లు గౌతంకుమార్, రాములు, డిప్యూటీ తహసీల్దార్ అమరలింగం గౌడ్, ఆర్‌ఐలు పాల్గొన్నారు.
రేషన్ సరుకులు పక్కదారి పట్టొద్దు
Published Thu, Jan 23 2014 3:46 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement