తాండూరు రూరల్: గ్రామాల్లో రేషన్ సరుకులు అందాలంటే లబ్ధిదారుల నుంచి డీలర్లు ఆధార్ కార్డులు సేకరించి సీడింగ్ చేస్తేనే సరుకులు వస్తాయని వికారాబాద్ సబ్ కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలోని ఠాగూర్‌హాల్లో నియోజకవర్గ స్థాయి ఆహార సలహా సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్డు ఉన్న లబ్ధిదారుల నుంచి రేషన్ డీలర్లు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోవాలన్నారు. గతంలో అనేకసార్లు ఆధార్ జిరాక్స్‌లు సేకరించాలని డీలర్లకు చెప్పినా పట్టించుకోలేదని, పది రోజుల్లో డీలర్లు లబ్ధిదారుల నుంచి సేకరించాలన్నారు.
అవసరమైతే ఇంటింటింకి వెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్‌లను తీసుకోవాలన్నారు. దీని ద్వారా గ్రామాల్లో బోగస్ కార్డులను కూడా గుర్తించవచ్చన్నారు. బోగస్‌కార్డుల ఏరివేత వేగిరం చేయాలన్నారు. చనిపోయిన, పెళ్లి చేసుకొని వెళ్లిన వారి పేర్లను త్వరగా తొలగించాలన్నారు. గత ప్రభుత్వ రచ్చబండ కార్యక్రమంలో కూపన్లు ఇచ్చిన వారికి కూడా ఆధార్ కార్డుల జిరాక్స్ ఇస్తే త్వరలో బియ్యం ఇస్తామని ఆమె చెప్పారు. రేషన్ డీలర్లు ప్రతి నెలా 18వ తేదీలోపు డీడీలు కట్టాలన్నారు.
సీడింగ్ చేయకపోతే డీలర్‌ను తొలగిస్తాం..
గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి ఆధార్ కార్డుల జిరాక్స్‌లు సేకరించి సీడింగ్ చేయకపోతే సదరు రేషన్ డీలర్‌ను తొలగిస్తామని సబ్‌కలెక్టర్ హెచ్చరించారు. పూర్తిస్థాయిలో కార్డులు సేకరించాలన్నారు. పెద్దేముల్ మండలం గొట్లపల్లి, పాషాపూర్ గ్రామాల్లో డీలర్లు ఆధార్ కార్డుల సీడింగ్ తక్కువ శాతం నమోదు చేశారన్నారు. వారం రోజుల్లో ఎక్కువ మొత్తంలో సీడింగ్ చేయకపోతే డీలర్‌ను తొలగిస్తామని హెచ్చరించారు.
ఇప్పట్లో కొత్త కార్డులు లేవు..
ఇప్పట్లో కొత్త కార్డులు వచ్చే పరిస్థితి లేదని సబ్ కలెక్టర్ వెల్లడించారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో గ్రామానికి ఎన్ని రేషన్‌కార్డులు అవసరం ఉంన్నాయనే విషయాలను డీలర్ నుంచి నివేదిక తెప్పిస్తున్నామన్నారు.
ప్రజాప్రతినిధులు డుమ్మా..
ఆహార సలహా సంఘం సమావేశానికి నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులు హాజరుకలేదు. ఆయా మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీ, పార్టీల ప్రతినిధులు హాజరు కవాల్సి ఉన్నా ఎవరూ కూడా హాజరు కాలేదు. యాలాల ఎంపీపీ సాయిలుగౌడ్ మాత్రమే కార్యక్రమానికి వచ్చారు. దీంతో ప్రజల సమస్యలు అధికారులకు విన్నవించే నాయకుడు కానరాలేదు.కార్యక్రమంలో పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్ తహసీల్దార్లు, పౌరసరఫరశాఖ అధికారులు, రేషన్ డీలర్లు, ఆహార సలహా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఆధార్ సీడింగ్ చేస్తేనే రేషన్ సరుకులు
Published Thu, Jul 17 2014 11:54 PM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement